అగ్ని మహా పురాణము

Table of Contents

స్నాన విధి

యాగపూజాది క్రియలు చేయుటకు ముందు చేయదగిన స్నానమును గూర్చి చెప్పెదను. నృసింహ మంత్రము ఉచ్చరించుచు మృత్తికను గ్రహించి, దానిని రెండు భాగములు చేసి ఒకదానిచే మల స్నానము చేయవలెను. మునిగి ఆచమనముచేసి, నృసింహ మంత్రముచే న్యాసముచేసి, రక్ష చేసికొని పిమ్మట ప్రాణాయామ పూర్వకముగా విధి స్నానము చేయవలెను.

అష్ఠాక్షర మంత్రమును జపించుచు, శ్రీ మహావిష్ణువును హృదయములో ధ్యానించుచు అరచేతిలో మట్టిని మూడు భాగములుగా చేసి ఉంచుకొని తరువాత నృసింహ మంత్రము జపించుచు దిగ్బంధము చేయవలెను. వాసుదేవ మంత్రమును జపించుచు సంకల్పించి తీర్థమును స్పృశించవలెను. వేదాది మంత్రములచే గాత్రమును తుడిచికొని మూర్తిలో నున్న దేవుని ఆరాధించి, స్మరించుచు, వస్త్రము ధరించి అఘమర్షణము చేయవలెను. (అఘమర్షణ మంత్రములను పఠించవలెను). మంత్రములచే విన్యాసము చేసి, చేతిలోనున్న జలము నిర్మార్జనము చేసి, నారాయణ మంత్రముతో ప్రాణాయామము చేసి, జలమును వాసనచూచి విడిచిపెట్టవలెను. హరిని ధ్యానించుచు అర్ఘ్యమునిచ్చి, ద్వాదశాక్షరిని జపించి, యోగపీఠము మొదట క్రమముగ ఇతర దేవతలకు కూడ తర్పణము చేయవలెను. మంత్రములకును దిక్పాలుర వరకు దేవతలకును, ఉపవిష్టుడై అంగన్యాసము చేసి, మంత్రోప సంహారము చేసి, యాగగృహమును ప్రవేశించవలెను. ఇతర పూజలలో ఇట్లే మూల మంత్రాదులచే స్నానము చేయవలెను. (22)