అగ్ని మహా పురాణము

Table of Contents

జ్యోతిశ్శాస్త్ర సారము

అగ్ని పలికెను: మహామునీ! ఇప్పుడు శుభాశుభ వివేకమును ఇచ్చునదియు, మనుష్యుని సర్వజ్ఞునిగ చేయునదియు, నాలుగు లక్షల శ్లోకముల జ్యోతిశ్శాస్త్రము యొక్క సార భూతమును అగు జ్యోతిశ్శాస్త్రమును గూర్చి సంక్షిప్తముగా చెప్పెదను. కన్యయొక్క జన్మరాశి నుండి వరుని రాశి సంఖ్య ఆరు-ఎనిమిదిగాని, తొమ్మిది-అయిదుగాని, రెండు-పండ్రెండు గాని అయినచో వారి వివాహము శుభప్రదము కాదు; మిగిలిన పది-నాలుగు, పదకొండు-మూడు, సమసప్తకము అయినచో శుభప్రదము; వధూవరుల రాశ్యధిపతులు పరస్పర మిత్రులైనను, రెండు రాశుల అధిపతియు ఒక్కడే అయినను ఇరువురి జన్మనక్షత్రములకు మైత్రి ఉన్నను, పంచమ-నవమ, ద్వీర్ద్వాదశ దోషములు చూడక వివాహము చేయవచ్చును. షష్ఠాష్టకమున్నపుడు మాత్రము ఎన్నడును వివాహము చేయరాదు. గురు-శుక్రులు అస్తంగతులై యుండగా వివాహము చేయుటచే వరుడు మరణించును. గురు క్షేత్రమున సూర్యుడును, సూర్యక్షేత్రమున గురువును ఉన్నచో వివాహము మంచిది కాదు. కన్యకు వైధవ్యము కలుగును. బృహస్పతి వక్రమైనను అతిచారవంతుడైనను వివాహోప నయనములు చేయరాదు. తప్పనిసరియైనపుడు అతిచార సమయమున పక్షత్రయమును వక్రుడైనపుడు నాలుగు మాసములను విడచి ఉపనయనాదులు చేయవలెను. చైత్ర-పుష్య మాసములందును రిక్త తిథియందును, శ్రీమహావిష్ణువు నిద్రించు చున్నప్పుడును మంగల-రవివారము లందును, చంద్రుడు క్షీణించి యున్నపుడును వివాహము శుభకరము కాదు. సంధ్యాకాలము శుభము. రోహిణి, ఉత్తరాత్రయ, మూల, స్వాతీ, హస్త, రేవతి నక్షత్రములందు, తుల తప్ప మిగిలిన ద్వి స్వభావ రాశులందును, స్థిర రాశులందును వివాహము శుభప్రదము. వివాహ-కర్ణవేధ ఉపనయన-పుంసవన సంస్కారము లందును అన్నప్రాశన-చూడా కర్మలందును విద్ధ నక్షత్రమును పరిత్యజిం పవలెను. శ్రవణ-మూల-పుష్యనక్షత్రములందును రవి-మంగళ-బృహస్పతి వారములందును, కుంభ-సింహ-మిథున లగ్నములందును పుంసవనము చేయవలెను. హస్త-మూల-మృగశీర్ష-రేవతీ నక్షత్రములందును, బుధ శక్రవారము లందును, పిల్లలను ఇల్లు కదుపుట మంచిది. తొలి సారిగా తాంబూల భక్షణము చేయుటకు రవి, సోమ, గురు, శుక్రవారములును, మూల నక్షత్రము ఉత్తమమైనవి. శుక్ర, గురువారములందును మకర, మీన లగ్నములందును, హస్తాది నక్షత్ర పంచకము నందును, పుష్యమునందును, కృత్తికాది నక్షత్ర త్రయమునందును, అన్నప్రాశనము చేయవలెను. అశ్వినీ, రేవతీ, పుష్య, హస్త, జ్యేష్ఠా, రోహిణి, శ్రవణ నక్షత్రములందు నూతనాన్న ఫలభక్షణము శుభకరము. స్వాతీ, మృగశిరా నక్షత్రములందు ఔషధసేవ చేయవలెను. పూర్వాత్రయము నందును, మఘా, భరణి, స్వాతీ, శ్రవణ, ధనిష్ఠ, శత భిషక్కులందును, రవి, శని, మంగళవారములందును, రోగ విముక్తుడు స్నానము చేయవలెను.

మట్టితో చేసిన చతురస్ర పట్టము మీద ఎనిమిది దిక్కులందు ఎనిమిది హ్రీంలు వ్రాసి, మధ్య తన పేరు వ్రాయవలెను. లేదా మట్టితో చేసిన పట్టముపై గాని భూర్జపత్రముపై గాని ఎనిమిది దిక్కులందును హ్రీం వ్రాసి మధ్య తన పేరు గోరోచనా కుంకుమలతో వ్రాయవలెను. ఇట్టి యంత్రమునకు వస్త్రము చుట్టి కంఠమునందు ధరించుటచే తప్పక శత్రువులు వశమగుదురు. ఈ విధముగనే ‘శ్రీం’ హ్రీంలతో సంపుటితమైన పేరును గోరోచనముతోను కుంకుమతోను ఎనిమిది భూర్జపత్రములపై వ్రాసి భూమిలో పాతిపెట్టి నచో విదేశములకు వెళ్ళిన వ్యక్తి శీఘ్రముగ తిరిగివచ్చును. ఆ యంత్రమునే పసుపు రసముతో శిలాపట్టముపై వ్రాసి క్రిందికి ముఖముండునట్లు భూమిపై ఉంచినచో శత్రు స్తంభనమగును. ‘ఓం’ ‘హూం’ ‘సః’ మంత్రములచే సంపుటితమైన పేరును గోరోచనా కుంకుమలతో ఎనిమిది భూర్జ పత్రములపై వ్రాసి ఉంచినచో మృత్యునివారణము కలుగును. ఈ మంత్రమును ఒక మారు, ఏడుమార్లు, తొమ్మిదిమార్లు వ్రాసినచో పరస్పర ప్రేమ కలుగును. రెండుసార్లు, ఆరుసార్లు, లేదా పండ్రెండుసార్లు వ్రాసినచో వియోగమును పొందినవారు కలియుదురు. మూడు, ఏడు లేదా పదకొండు సార్లు వ్రాసినచో లాభము కలుగును. నాలుగు, ఎనిమిది, పండ్రెండు సార్లు వ్రాసినచో పరస్పర శత్రుత్వము కలుగును. మేషాది లగ్నముల వలన తను, ధన, సహజ, సుహృత్, సుత, రిపు, జాయా, నిధన, ధర్మ, కర్మ, ఆయ, వ్యయ భావములు ఏర్పడును. ఇపుడు నవతారాబలము చెప్పబడుచున్నది. జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యరి, సాధక, మైత్ర, అతిమైత్రములని తొమ్మిది తారలు.

బుధ, గురు, శుక్ర, రవి, సోమవారములందును. మాఘాది మాసషట్కము నందును, బాలకునకు ప్రథమ క్షౌరకర్మ చేయుట మంచిది. కర్ణవేధ సంస్కారమునకు బుధ, గురువారములు, పుష్య, శ్రవణ,చిత్రా నక్షత్రములును మంచివి. ఐదవ సంవత్సరము నందు, ప్రతిపత్, షష్ఠీ, రిక్తతిథి, పూర్ణిమలను, మంగళవారమును విడచి ఇతర తిథివారము లందు విష్ణువును, లక్ష్మిని పూజించి అక్షరారంభము చేయవలెను. మాఘమునుండి ఆరు మాసముల వరకును ఉపనయన సంస్కారమునకు శుభకరము. శ్రావణాది మాసషట్కము చూడా కరణాది సంస్కారములకు మంచివి కావు. గురు, శుక్రులు అస్తంగతు లైనపుడును, చంద్రుడు క్షీణుడై యున్నపుడును యజ్ఞోపవీత ధారణము చేయుటచే బాలుడు జడబుద్ధి యగును; లేదా మరణించును. క్షౌరమునకు చెప్పిన నక్షత్రములందును, శుభగ్రహ వారములందును, సమావర్తన సంస్కారము చేయుట మంచిది. లగ్నము శుభ గ్రహరాశి యైనను, శుభగ్రహము లగ్నమునందు ఉన్నపుడును లేదా చూచుచున్నను అశ్వినీ, మఘా, చిత్రా, స్వాతీ, భరణీ, ఉత్తరాత్రయ, పునర్వసు, పుష్య నక్షత్రములందును, ధనుర్వేదము ప్రారంభించవలెను. భరణి, ఆర్ద్ర, మఘ, ఆశ్లేష, కృత్తిక, పుబ్బ నక్షత్రములందు జీవింప గోరువాడు ఎవ్వడు నూతన వస్త్ర ధారణము చేయరాదు. బుధ, గురు, శుక్రవారములందు వస్త్ర ధారణము చేయవలెను. వివాహాది మంగళ కార్యములందు వస్త్రధారణము విషయమున నక్షత్రాది విచారము చేయపనిలేదు. రేవతి, అశ్వినీ, ధనిషా నక్షత్రములందు, హస్తాది నక్షత్ర పంచకమునందును; శంఖ, విద్రుమ, రత్నములను ధరించవలెను. భరణీ, ఆశ్లేషా, ధనిష్ఠా, పూర్వాత్రయ, కృత్తికా నక్షత్రములందు వస్తువులను కొన్నను, అమ్మినను హాని కలుగును. అశ్విని, స్వాతి, చిత్రా, రేవతి, శతభిషా, శ్రవణ నక్షత్రములందు కొనుట లాభదాయకము; అమ్ముట అశుభకరము. భరణీ, పూర్వాత్రయ, ఆర్ద్రా, ఆశ్లేషా, మఘా, స్వాతీ, కృత్తికా, విశాఖా నక్షత్రములందు స్వామి సేవా ప్రారంభము చేయరాదు. ఈ నక్షత్రములందు ఇతరులకు ద్రవ్యము ఇచ్చుటగాని, తాకట్టు పెట్టుటగాని చేయకూడదు. ఉత్తరాత్రయ, శ్రవణ, జ్యేష్ఠా నక్షత్రములందు రాజ్యాభిషేకము చేయవలెను.

చైత్ర, జ్యేష్ఠ, భాద్రపద, అశ్విని, పౌష, మాఘ మాసములు తప్ప ఇతర మాసములు గృహారంభమునకు మంచివి. అశ్వినీ, రోహిణీ, మూల, ఉత్తరాత్రయ, మృగశీర్ష, స్వాతీ, హస్త, అనురాధా నక్షత్రములును, రవి, మంగళవారములు తక్క ఇతర వారములును గృహ, తటాక, వాపీ, ప్రాసాదారంభములకు శుభప్రదములు. గురుడు సింహరాశిలో ఉన్నపుడును, గుర్వాదిత్యము నందును (అనగా గురుడు సింహము నందును, సూర్యుడు ధనుర్మీనము లందును ఉన్నపుడు, అధికమాసము నందును, శుక్రుడు బాలుడుగా గాని, వృద్ధుడుగాగాని, అస్తగతుడుగాగాని ఉన్నప్పుడును గృహమునకు సంబంధించిన కార్యములు ఏవియు చేయరాదు. శ్రవణాది నక్షత్రపంచకము నందు తృణకాష్ఠ సంచయము చేసినచో అగ్నిదాహము, భయము, రోగము, రాజపీడ, ధననాశము కలుగును. ధనిష్ఠ, ఉత్తరా త్రయము, శతభిషక్-ఈ నక్షత్రములందు గృహప్రవేశము చేయవలెను. ద్వితీయా, తృతీయా, పంచమి, సప్తమీ, త్రయోదశీ తిథులు నౌకా నిర్మాణమునకు మంచివి. ధనిష్ఠా, హస్త, రేవతీ, అశ్వినీ నక్షత్రములందు రాజదర్శనము చేయవలెను.

పూర్వాత్రయ, ధనిష్ఠా, ఆర్ద్రా, కృత్తికా, మృగశీర్ష, విశాఖా, ఆశ్లేషా, అశ్వినీ నక్షత్రములందు యుద్ధయాత్ర సంపత్తిని ఇచ్చును. సిద్ధిదాయకమగును. అష్టమీ, అమావాస్యా, చతుర్దశుల యందును, ఉత్తరాత్రయమునందును రోహిణీ, శ్రవణ, హస్త, చిత్ర నక్షత్రములందును పశువులను గోశాల నుండి బైటకు అమ్ముటకై తీసికొని రాగూడదు; కొన్నవాటిని లోనికి తీసికొని పోగూడదు. స్వాతీ, ఉత్తరాత్రయ, రోహిణీ, మృగశీర్ష, మూల, పునర్వసు, పుష్య, హస్త శ్రవణ నక్షత్రములందు సాధారణ వ్యవసాయ ప్రారంభము చేయవలెను. పునర్వసు, ఉత్తరాశ్రయ, స్వాతీ, పుబ్బ, మూల, జ్యేష్ఠా, శతభిషక్ నక్షత్రములందు రవి, సోమ, గురు, శుక్రవారము లందును, వృషభ, మిథున, కన్యా లగ్నములందును, ద్వితీయా, పంచమీ, దశమీ, సప్తమీ, తృతీయా, త్రయోదశులందును, దున్నుట మొదలగు వ్యవసాయపు పనులు చేయవలెను. రేవతీ, రోహిణీ, జ్యేష్ఠా, కృత్తిక, హస్త, అనూరాధా, ఉత్తరాత్రయములందును, శని, మంగళవారములు మినహా ఇతర వారములందును, విత్తనములు చల్లినచో సకల సంపదలు లభించును. సస్యచ్ఛే దనము(పంట కోయుట)నకు రేవతీ, హస్త, మూల, శ్రవణ, పూర్వఫల్గునీ, మఘా, మృగశీర్ష నక్షత్రములును, మకర లగ్నము మంచిది. హస్త, చిత్ర, పునర్వసు, స్వాతీ, రేవతీ, శ్రవణాది త్రయములందు ధాన్యము తీసి, స్థిర లగ్నము నందును, బుధ, గురు, శుక్రవారము లందును, భరణీ, పునర్వసు, మఘా, జ్యేష్ఠా, ఉత్తరాత్రయము నందును, ధాన్యమును గోదాములలో నిలవచేయవలెను.

‘ఓం ధనదాయ సర్వ ధనేశాయ దేహి మే ధనం స్వాహా ఓం నవే వర్షే ఇలాదేవి లోకసంవర్ధని కామరూపిణి దేహి ధనం స్వాహా’ ఈ మంత్రములను పత్రముపై వ్రాసి ధాన్యరాశిపై ఉంచినచో ధాన్యాభివృద్ధి కలుగును. పూర్వాత్రయ విశాఖా, ధనిష్ఠా, శతభిషక్ నక్షత్రములందు ధాన్యమును బైటకు తీయవలెను. సూర్యుడు ఉత్తరాయణ మందున్నపుడు దేవతా, ఆరామ, తటాక, వాప్యాదుల (బావి మొదలగువాని) ప్రతిష్ఠ చేయవలెను. సూర్యుడు మిథున రాశిలో నున్నపుడు అమావస్యానంతరము వచ్చు ద్వాదశులలో వరుసగా శ్రీమహావిష్ణు పరివర్తనోత్సవ -జాగరణోత్సవములు జరుపవలెను. సూర్యుడు కన్యారాశిలో ఉండగా, అమావాస్యానంతరము వచ్చు అష్టమినాడు దుర్గాజాగరణము. త్రిపాద నక్షత్రములందు భద్రా, ద్వితీయా, సప్తమి, ద్వాదశులు వచ్చినపుడు, రవి, శని మంగళవారములైనచో అది, త్రిపుష్కర యోగము. ప్రతికార్యమునకును చంద్ర, తారాబలము చూడవలెను. చంద్రుడు జన్మరాశియందు గాని తృతీయ, షష్ఠ, సప్తమ, దశమ, ఏకాదశ స్థానము లందు గాని ఉన్నచో శుభుడు. శుక్ల పక్షమునందు ద్వితీయ, పంచమ, నవమ చంద్రుడు కూడ శుభుడు. మిత్ర, అతిమిత్ర, సాధక, సంపత్, క్షేమాది తారలు శుభకరములు. జన్మతార యందు మృత్యువు, విపత్తారయందు ధననాశము, ప్రత్యరి-మృత్యు తారలయందు మరణము కలుగును. కృష్ణపక్ష అష్టమి మొదలు శుక్లపక్ష అష్టమి వరకును క్షీణ చంద్రుడు, తరువాత పూర్ణ చంద్రుడు, సూర్యుడు వృషభ-మిథున రాశులందుండి, గురుడు, మృగశిర లేదా జ్యేష్ఠా నక్షత్రమునందు ఉండి, గురువారము, పూర్ణిమ తిథియు అయినచో మహా జ్యేష్ఠ. జ్యేష్ఠలో గురు-చంద్రులు, రోహిణిలో సూర్యుడు ఉండగా జ్యేష్ఠ మాస పూర్ణిమయైనచో ఆ పూర్ణిమ మహాజ్యేష్ఠ. స్వాతి రాకుండగనే యంత్రముపై ఇంద్రుని పూజచేసి, ఇంద్ర ధ్వజారోపణము చేయవలెను. శ్రవణమునందుగాని అశ్వనియందు గాని, వారాంతమున గాని విసర్జన చేయవలెను.

సూర్యుడు రాహుగ్రస్తుడైన సమయమున చేసిన సకల దానములు సువర్ణ దానములే. బ్రాహ్మణులందరును బ్రహ్మ సదృశులు. సకల జలములు గంగా జల సమానములు. రవి వారము నుండి శనివారము వరకును జరుగు రవి సంక్రాంతులకు వరుసగా ఘోర, ధ్వాంక్ష, మహోదర, మంద, మందాకిని, యుత, రాక్షసి అని పేర్లు. సూర్య సంక్రమణము కౌలవ, శకుని, కింస్తుఘ్న కరణములనైనచో ప్రజలు సుఖవంతులగుదురు. గర, బవ, వణిక్, విష్టి, బాలవ కరణములందు అయినచో ప్రజలు రాజ దోషముచే పీడితులై, సంపదతో మాత్రముందురు. చతుష్పాత్, తైతిల, నాగకరణములందు అయినచో దేశమునందు దుర్భిక్షము రాజ యుద్ధములు కలుగును, భార్యాభర్తల జీవితము విషయమున గూడ సంశయ మేర్పడును. రోగ ప్రారంభము జన్మ నక్షత్రము నందు గాని ఆధానమునందు (జన్మ నక్షత్రము నుండి పందొమ్మిదవ నక్షత్రమునందు గాని) అయినచో అధిక క్లేశ దాయకము. కృత్తికా నక్షత్రమునందైనచో తొమ్మిది దినముల వరకును, రోహిణియందైనచో మూడు రాత్రుల వరకును మృగశిరయందు అయినచో ఐదు రాత్రుల వరకును రోగముండును. ఆర్ద్రయందు అయినచో, ప్రాణనాశకము. పునర్వసు, పుష్య నక్షత్రములందు అయినచో ఏడు రాత్రులును, ఆశ్లేషయందు తొమ్మిది రాత్రులును ఉండును. మఖయందు ప్రాణనాశకము. పూర్వ ఫల్గునియందు అయినది తొమ్మిది మాసములును, ఉత్తర ఫల్గునియందు కలిగినది మూడు దినములును, చిత్తయందు కలిగినది పదిహేను దినములును, స్వాతిరోగము ఒకమాసము, విశాఖయందు ఇరువది దివసములు, అనూరాధా రోగము పది దివసములు, జ్యేష్ఠా రోగము పదునైదు దివసములును ఉండును. మూలా నక్షత్రమున ప్రారంభించిన రోగము విడువదు. పూర్వాషాఢా రోగము ఐదు దినములు, ఉత్తరాషాఢా రోగము ఇరువది దినములు శ్రవణ రోగము రెండు మాసములు, ధనిష్ఠారోగము పదునైదు దినములు, శతభిషరోగము పది దినములు ఉండును. పూర్వాభాద్రా రోగము విడవదు. ఉత్తరాభాద్రా రోగము ఏడు దినములు రేవతీ రోగము పది రాత్రులు, అశ్వనీ  రోగము ఒక రాత్రి ఒక పగలు మాత్రము ఉండును. భరణీ రోగము ప్రాణ నాశకము. పంచ ధాన్యములు, తిలలు, ఘృతము మొదలగు హోమ ద్రవ్యములతో గాయత్రీ మంత్రముతో హోమము చేసినచో రోగము తొలగి శుభ ఫలప్రాప్తి కలుగును. పాలు ఇచ్చు గోవును బ్రాహ్మణులకు దానము చేసినను రోగశాంతి కలుగును. (అష్టోత్తరీ దశా పద్ధతిలో) సూర్యదశ ఆరు సంవత్సరములు చంద్రుని దశ పదునైదు సంవత్సరములు, కుజ దశ ఎనిమిది, బుధదశ పదునారు, శని దశ పది, బృహస్పతి దశ పందొమ్మిది, రాహు దశ పండ్రెండు, శుక్ర దశ ఇరువదియొక్క సంవత్సరములు. (121)