అగ్ని మహా పురాణము

Table of Contents

బ్రహ్మ విజ్ఞానము, నిరూపణము-2

అగ్నిదేవుడు పలికెనుః

పరంజ్యోతి స్వరూపమును పృథివీ జల వాయు భిన్నమును అగు పరబ్రహ్మ నేనే. వాయువు ఆకాశ భిన్నమగు జ్యోతిర్మయమైన పరబ్రహ్మను నేనే. అగ్న్యాది కార్య భిన్నమగు పరబ్రహ్మ నేనే. విరాట్ భిన్నమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే. జాగ్రదవస్థా శూన్యమగు జ్యోతీరూప బ్రహ్మ నేనే. విశ్వ భిన్నమగు జ్యోతీరూప బ్రహ్మ నేనే. ఆకారాక్షర వర్ణితమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే. వాక్పాణిపాద శూన్యమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే. పాయూపస్థ రహితమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే. శ్రోతత్వక్ చక్షూ రహితమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే. రసరూప వివర్జితము. సర్వగంధ శూన్యము, జిహ్వా ఘ్రాణ రహితము, స్పర్శ శబ్ద రహితము, మనోబుద్ధి శూన్యము, చిత్తాని హంకార వర్జితము, ప్రాణాపాన, వ్యానోదాన సమానరహితము, జరామరణ శోక మోహక్షుత్పిపాసా వర్ణితము, శబ్రోద్భూతాది శూన్యము, హిరణ్యగర్భ భిన్నము, స్వప్నావ స్థారహితము. తైజసాది భిన్నము, అపకార, సభాజ్ఞాన, ఆధ్యాహృత, సత్త్వాది గుణ సదసద్భావ రహితము సర్వావయవ శూన్యము భేదాభేద శూన్యము సుషుప్తి స్థాన ప్రాతిభావము ఆకారాది రహితము, మానమేయ మితి మాతృత్వ రహితము సాక్షిత్వాది శూన్యము, కార్యకారణ వర్ణితము, దేహేంద్రియ మనో బుద్ధి ప్రాణా హంకార రహితము, జాగ్రత్స్నప్న సుషుప్త్యాది రహితము, తురీయము నిత్య శుద్ధ, బుద్ధ, ముక్త స్వరూపము, సత్యము ఆనందము, అద్వయము, సవిజ్ఞానమగు జ్యోతిరూప బ్రహ్మ నేనే. సమాధి రూపము మోక్ష ప్రదము అగు పరబ్రహ్మ నేనే. (378)