అగ్ని మహా పురాణము
మృతసంజీవన సిద్ధయోగము
ధన్వంతరి చెప్పెను:
ఆత్రేయుడు చెప్పినవియు, దివ్యములును సర్వవ్యాధి నివారకములును మృత సంజీవనకరములును అగు సిద్ధ యోగములను మరల చెప్పెదను. ఆత్రేయుడు చెప్పెను. వాతజ్వరమున బిల్వాది పంచమూల క్వాథము శ్రేష్టము. జీర్ణ శక్తికి పిప్పలీమూల గుడూచి శుంఠీ క్వాథము ఇవ్వవలెను. ఆమలక అభయా కృష్ణ చిత్రకక్వాథము సర్వ జ్వర నాశకము. బిల్వమూల అగ్ని మంథశ్యోనాక, కాశ్మరులు పాటలా, స్థిర, త్రికంటక, పృప్లిపర్ణి, బృహతీ, కంటకారికలు వీటికి దశ మూలములని పేరు. వీటి క్వాథము కుశమూల, క్వాథము జ్వరమును అజీర్ణమును పార్శ్వశూలను, దగ్గును నశింపచేయును. గుడూచి, పర్పటి, ముస్త, కిరాత, విశ్వ భేషజములతో చేసిన పంచ భద్ర క్యాథము వాత పిత్త జ్వరమున ఇవ్వవలెను. త్రివృత్, విశాల, కటుక, త్రిఫల, ఆరగ్వధములతో చేసిన క్వాథమును, యవక్షారము కలిపి త్రాగించినచో అది విరేచకమై, సంపూర్ణ జ్వరములను నశింప చేయును. దేవదారు, బల, వాస, త్రిఫల, వ్యోష, పద్మక, వాయు, విడంగ, సితలను సమాన భాగములో చూర్ణముచేసి సేవించినచో పంచవిధ కాసములను తొలగించును. హృదయ రోగ గ్రహణి పార్శ్వరోగ హిక్కా శ్వాస, కాస రోగములను పోగొట్టుటకు దశమూల శరీరాన్న పిప్పలీ, బిల్వ, పౌష్కర శృంగీ, ఆమలకీ, బార్జి, గుడూచి, నాగవల్లులతో యథాశాస్త్రముగ చేసిన క్వాథమును గంజిని త్రాగవలెను. మధు యుక్తమగు మధుకమును శర్కరా సహిత మగు పిప్పలిని గుడ యుక్త నాగరమును లవణ త్రయమును సేవించిన ఎక్కిళ్ళు పోవును. కారవి, అజాజి, మరిచ, ద్రాక్ష, వృక్షామ్ల దాడిమ, సౌవర్చల, గుడములను సమాన భాగములుగ గ్రహించి చేసిన చూర్ణముతో తేనె కలిపి తయారుచేసిన కారవ్యాధి వటి సర్వవిధములగు అరుచి రోగములను నశింపచేయును. అల్లపురసమును తేనె కలిపి త్రాగించినచో అరుచి, శ్వాసకాసలు, జలుబు, కఫము నశించును.
వట, శృంగి, శిల, లోధ్ర, దాడిమ, మధుకములను చూర్ణముచేసి, ఆ చూర్ణముతో సమానముగ పటిక బెల్లము కలిపి తేనెతో సేవించవలెను. ఈ వటశృంగాది అవలేహమును జలముతో త్రాగినచో వమనమును దాహమును తొలగించును. గుడూచి, వాసక, లోధ్ర పిప్పలి చూర్ణమును తేనెలో కలిపి సేవించినచో కఫయుక్తమగు రక్తము, దాహము, దగ్గు జ్వరము నశించును. తేనె కలిపిన వాసకరసము, తామర భస్మము కాసమును పోగొట్టును. శిరీష పుష్పరసముచే భావన చేసిన మరిచ చూర్ణము హితకరము. మసూరము అన్ని బాధలను పోగొట్టును. తండులీయకము పిత్త దోషమును తొలగించును. నిర్గుండి, శారిబశేలు అంకోలములు విషనాశకములు, శుంఠి, అమృత, క్షుద్ర, పుష్కర గ్రంథి, పిప్పల మూలములతో చేసిన క్వాథము, మూర్ఛను, మదమును తొలగించును. హింగు, సౌవర్చల, వ్యోషములను రెండేసి పలములు నాలుగు శేర్ల ఘృతము కలిపి నాలుగురెట్ల గోమూత్రముతో సిద్ధము చేసినచో ఉన్మాద నాశకము శంఖ పుష్పివచా, కుష్ఠ సిద్ధ, బ్రాహ్మీ రసములను కలిపి గుటికలుచేసి, ఇచ్చినచో పాత ఉన్మాదమును అపస్మారమును తొలిగించి మంచి మేధాశక్తిని ఇచ్చును. అభయముతో పంచగవ్యమును ఘృతమును కలిపి సేవించిన కుష్ఠము నశించును. పటోల త్రిఫల, నింబ, గుడూచి, ధావని, వృష, కరంజములతో తయారుచేసిన ఘృతము కుష్ఠ రోగమును తొలగించును ‘వజ్రకము’ నింబ, పటోల, వ్యాఘ్రీ, గుడూచి, వాసకములను పదేసి పలములు తీసుకుని బాగుగా నూరవలెను. పదునారుశేరుల జలముతో క్వాథముచేసి దానిలో ఒకశేరు ఘృతము త్రిఫలా చూర్ణ కల్కము వేసి నాల్గవవంతు మిగులు వరకు ఉండవలెను. ఈ పంచ తిక్త ఘృతము కుష్ఠరోగమును ఎనుబది విధములగు వాత రోగములను, నలుబది విధములగు పిత్తరోగములను, ఇరువది విధములగు కఫరోగములను పీనస, అర్శో, వ్రణాదులను నశింప చేయును. ఈ యోగరాజము సూర్యుడు అంధకారము నశింపచేసినట్లు ఇతర రోగములను కూడ నిస్సంశయముగ నశింపచేయును.
ఉపదంశము శమించుటకై త్రిఫలాకషాయ భృంగరాజ రసములతో వ్రణమును కడిగివేసి పటోలపత్ర చూర్ణముతో గాని, దాడిమ చూర్ణముతో గాని, గజచూర్ణముతో గాని, త్రిఫలాచూర్ణముతో గాని, ఆ వ్రణమును కప్పవలెను. త్రిఫలా, లోహచూర్ణ, యష్టిక, ఆర్కవ, నీలకమల, మరిచ, సైంధవములు వేసి వండిన తైలమును మర్దించినచో వమనములు శాంతించును. క్షీర మార్కవరస, మధుక, ఉత్పలములను రెండు పేర్లు తీసుకొని తైలము నాల్గవవంతు మిగులు వరకు వండి దానిని నశ్యముగ ఉపయోగించి నచో ఫలితము తగ్గును. నింబపటోల, త్రిఫలా, గుడూచి, ఖదిర, వృష, భూనింబ, పాఠాత్రిఫలా, గుడూచి రక్త చందనములు అను ఈ రెండు యోగములు జ్వరమును తొలగించును. కుష్ఠ విస్పోట కాదులను నశింపచేయును. వటోల, అమృత, భూనింబ, వాస, అరిష్టక, పర్పట, ఖదిరల క్వాథము, విస్ఫోట జ్వరములను తొలగించును. దశమూలీ, ఛిన్నరుహా, పథ్యాదారు, పునర్నవ, శిగ్రు, విశ్వజిత్ లతో చేసిన క్వాథము జ్వర, విద్రథి, శోథములందు హితకరములు, మధూకము, నింబ పత్రములు నూరి చేసిన లేపము వ్రణములను తొలగించును. త్రిఫలా, ఖదిర, దార్వీ, న్యగ్రోధ, అతిబల, కుశ, నింబ, పత్రములు నూరి చేసిన లేపము వ్రణములను తొలగించును. త్రిఫలా, ఖదిర, దార్వీ, న్యగ్రోధ, అతిబల, కుశ, నింబ, మూలక పత్రములతో చేసిన కషాయములు శరీర బాహ్య శోధనమునకు మంచివి. కరంజు, అరిష్ట, నిర్గుండీ రసములు, గాయము నందలి క్రుములను నశింప చేయును. ధాతకీ, చందన, బలాస, మంగా మధుక, ఉత్పల, దారు, మేదలను నేతితో కలిపి లేపముగ వ్రాసినచో వ్రణములను మాన్పును.
గుగ్గులు, త్రిఫలా, వ్యోషములను సమాంశమున గ్రహించి ఘృతము కలిపి పూసినచో నాడీ వ్రణములు దుష్ట వ్రణములు శూలభగందరము మొదలగునవి నశించును. గో మూత్రమునందు శుద్ధము చేయబడిన హరీతకిని తైలము నందు వేయించి ప్రతిదినము లవణముతో ప్రాతఃకాలమున సేవించినచో కఫ వాత రోగములు తొలగును. త్రికటు, త్రిఫలా క్వాథమును క్షారలవణము కలిపి త్రాగినచో కఫ వాత ప్రకృతిగల వారికి విరేచన మగును. కఫ వృద్ధి తగ్గును. పిప్పలీ, పిప్పలీమూల, వచా, చిత్రక, నాగరములతో చేసిన క్వాథమునుగాని, పేయమునుగాని త్రాగినచో ఆమవాతము తొలగును. రాస్నా గుడూచి, హేరండ, దేవదారు శుంఠుల క్వాథము సర్వాంగ వాతమును సంధి వాతమును, అస్తి మజ్జా గత ఆమవాతమును తొలగించును. దశ మూల కషాయమును నాగర జలముతో కలిపి త్రాగినను పై రోగములు శాంతించును. శుంఠి గోక్షుర క్వాథమును ప్రతిదినమున ప్రాతః కాలమున సేవించినచో ఆమవాత సహితమగు కటిశూలము పాండు రోగము నశించును. శాఖా పత్ర సహితమగు ప్రసారిణి తైలము కూడ పై రోగములు తగ్గించును. గుడూచి స్వరసము కల్కము, చూర్ణము, లేదా క్వాథము చాలకాలము సేవించినచో వాత రోగము పోవును. పిప్పలి, కాని, వర్ధమానముగాని, గుడముతోగాని, పథ్యతోగాని సేవించ వలెను. పటోల, త్రిఫలా, తీవ్ర కుటకి, అమృతముల పాకము తయారుచేసి, సేవించినచో దాహయుక్త వాత రక్త రోగము శీఘ్రముగ నశించును. గుగ్గులును గోరువెచ్చటి నీటితో త్రిఫలను సమశీతోష్ణ జలముతోను లేదా బలా, పునర్నవ, హేరండమూల, బృహతీద్వయ, గోక్షుర, హింగు, లవణములతోను తీసుకొనినచో వెంటనే వాత రోగము నశించును. ఒక కర్షము పిప్పలీ మూలము పంచలవణములు పిప్పలీ, చిత్రక, శుంఠి, త్రిఫలా, త్రివృత్, వచా, క్షారద్వయ, శాద్వల, దంతీ స్వర్ణక్షీరి, విపాశికలను కలిపి రేగిపండు ప్రమాణముగల గుటికలుచేసి, గంజితో త్రాగవలెను. శోధమునందును దాని వలన కలిగిన ఆమపాకమునందును దీనిని సేవించవచ్చును. ఉదర వృద్ధి యందు కూడ దీనిని సేవించవచ్చును. దారువర్షాభూ, శుంఠి క్షీరములు శోధ నాశకములు. అర్క, వర్షాభూ, నింబ, క్వాథ కూడ శోధను తొలగించును. వ్యోషముతో గూడిన ఘృతమును మూడు రెట్లు పలాశ భస్మజలముతో సిద్ధము చేసి త్రాగినచో వాని అర్షో రోగము తప్పక నశించును. విశ్వక్సేన అబ్జ నిర్గుండులతో సాధితమైన లవణముకూడ విడంగ అవల సైంధవ, రాన్న దుర్థ దేవదారు వచలతో నాలుగు రెట్ల కటు ద్రవ్యములు కలిపిన తైలము మర్దించుటచే గండమాలగల గండ రోగములు నశించును.
శటీ, కొనాగ, వలయ, క్వాథమును క్షీర రస పయస్యా, పిప్పలి వాసా కల్కమును క్షీరముతో సేవించినచో క్షయ రోగము నశించును. వచా, విట్ల వణ, అభయా, శుంఠి, హింగు, కుష్ఠ, అగ్ని, దీభ్యకములను రెండు, మూడు, ఆరు, నాలుగు, ఒకటి, ఏడు, భాగముల చొప్పున, వరుసగ గ్రహించి చూర్ణముచేసి సేవించినచో గుల్మ రోగమును, ఉదర రోగమును, శూలరోగమును, కాసరోగమును తొలగించును. పాఠ, నికుంబ, త్రికటు త్రిఫల, చిత్రకముల చూర్ణమును గోమూత్రముచే సాధించి గుటికలు చేసి సేవించినచో గుల్మ ప్లీహాదికములు నశింపచేయును. వాసా, నింబ పటోల త్రిఫలములు, వాత పిత్తములను తొలగించును. వాయువిడంగ చూర్ణమును తేనెతో సేవించినచో క్రుమి వినాశకరము. విడంగ సైంధవ, యవక్షారములు, గోమూత్రముతో కలిపి సేవించిన హరీతకీ, క్రుమిఘ్నములు. శల్లకీ, బదరీ, జంబూ, ప్రియాల, ఆమ్ర, అర్జున వృక్షముల బెరడు తేనెతో కలిపి, పాలతో సేవించినచో రక్తాతి సారము నశించును. బిల్వ ఆమ్ర ధాతకీ, పాఠా శుంఠి మోచ రసములు సమములుగా గ్రహించి చేసిన చూర్ణమును గుడ మిశ్ర తక్రముతో సేవించినచో దుర్జయమగు అతిసారమును జయించును. చాంగేరీ, కోల, దధ్యంబు, శుంఠి యవ క్షారముల క్వాథమును ఘృతముతో సేవించినచో గుదభ్రంశ రోగము తొలుగును. విడంగ, అతివిషా, ముస్త, దేవదారు పాఠా కలింగకములు క్వాథము మిర్చ చూర్ణముతో కలిపి సేవించినచో శోధ అతిసారములు నశించును.
శర్కరా సైంధవ శుంఠులతో కాని కృషా, మధు గుడములతో గాని ప్రతిదినము రెండేసి కర్కాయలు తినువాడు సూరు సంవత్సరములు సుఖముగ జీవించును. పిప్పలి యుక్తమగు త్రిఫలనుకూడ మధుఘృతములతో సేవించిన ఆ విధముగనే ఫలము నిచ్చును. ఆమలక సురస భావితమగు ఆమలకమును మధుఘృత, శర్కరులతో కలిపి దుగ్ధ పానము చేసినవాడు స్త్రీలకు ప్రభువగును. మాష, పిప్పల, శాలి, యవగోధూమల చూర్ణమును సమాన ప్రమాణములో గ్రహించి, పిప్పలికను వండి దానిని భక్షించి, శర్కరాయుక్తమగు, మధుర దుగ్ధమును చేసినవాడు, చటక పక్షివలె నిస్సంశయముగ పది పర్యాయములు స్త్రీ సంగమము చేయ సమర్థుడగును. సమంగ, ధాతకీ పుష్ప, లోధ్ర నీలోత్పలములను పాలతో ఇచ్చినచో స్త్రీల ప్రదర రోగమును నశించును. కరంటక బీజము, మధుకము, శ్వేతచందనము, పద్మోత్సల మూలములు, మధుకము, శల్కరతిలలు, వీటి చూర్ణమును గర్భపాతశంక కలుగునపుడు సేవించిన గర్భమును స్థిరముగ ఉంచును. దేవదారు, నభఃకుష్ఠ, నలద, విశ్వభేషజములను గంజిలో నూరి తైలము కలిపి పూసినచో శీరో రోగములు పోవును. సైంధవ లవణమును వస్త్రముతో శుద్ధముచేసి, కొంచెము వేడి తైలములో కలిపి, కర్ణములో పోసినచో కర్ణశూల రోగము తగ్గును. బలా, శతావరీ, రాస్నా, అమృతా సైరీయక త్రిఫలలతో సిద్ధము చేసిన ఘృతము తిమిర రోగమును తొలగించును. త్రిఫలా, వ్యోష, సైంధవములు కలిపిన ఘృతము త్రాగినచో కండ్లకు హితము విరేచనకరము. హృదయమునకు హితము జఠరాగ్ని దీపనము, కఫరోగనాశకము. నీలోత్పల కింజల్కము. గోమయ రసముతో కలిపి గుటికాంజనముచేసి, ఉపయోగించినచో అది దివాంధ (పుట్టుగ్రుడ్డివారికి) రాత్ర్యంధులకు (రేచీకటిగలవారికి) హితకరము. యష్ఠి, మధువచ, పిప్పలీబీజ కుటజముల బెరడుతో కల్కమును నింబక్వాథమును కలిపి ఇచ్చినచో అది వమనకారకము, తడిసిన యవలనీరు విరోచనకరము. పథ్యా సైంథవ ప్పిలములను సమాన భాగములుగ గ్రహించి చూర్ణముచేసి, ఉషోదకముతో త్రాగినచో నారాచ సంజ్ఞకమగు ఈ చూర్ణము విరేచనకరము. సర్వరోగ వినాశకము. ఆత్రేయుడు మునులకు చెప్పిన సిద్ధయోగములలో శ్రేష్ఠములైన సర్వ రోగనాశక యోగములను సుశ్రుతుడు తెలుసుకొనెను. (285)
