అగ్ని మహా పురాణము

Table of Contents

ధారణా యోగ నిరూపణ

అగ్నిదేవుడు ఇట్లు పలికెను:

ధ్యేయముపై మనస్సును నిలుపుడు. ధారణ ధ్యానమువలె ఇదికూడ సాకారము నిరాకారము అని రెండు విధములు. భగవంతునిపై మనస్సు నిలుపుడు. క్రమముగా మూర్తధారణ, అమూర్తధారణ అని చెప్పబడును. దీనివలన భగవత్ర్పాప్తి కలుగును. బాహ్య లక్ష్యముపై మనస్సు కదలకుండా ఎంత కాలము నిలచునో అట్టి స్థితికి ధారణ అని పేరు. దేహములోపల కూడ నియత సమయము వరకు మనస్సును లక్షముపై నిలిపి ఉంచుటకు కూడ ధారణ అని పేరు. పండ్రెండు ఆయామములు కల ధారణ ఉండును. పండ్రెండు ధారణములు ధ్యానమగును. పండ్రెండు ధ్యానముల పాటు మనస్సు ఏకాగ్రమైనచో దానికి సమాధియని పేరు. ధారణాభ్యాస సమయమున ప్రాణములు విడుచువాడు ఇరువది యొక్క తరముల వారిని ఉద్ధరించిపరమ పదమగు స్వర్గమును పొందును. యేయే అంగమునందు వ్యాధి కలుగునో ఆ అంగమును బుద్ధిచే వ్యాప్తముచేసి తత్త్వమున ధారణ చేయవలెను. ఆగ్నేయా వారుణి ఐశాని, అమృతాత్మికా అను విష్ణువు యొక్క నాలుగు విధముల ధారణ చేయవలెను. ఆ సమయమున అగ్నియుక్త శిఖా మంత్రమునకు ఫట్ చేర్చి జపము చేయవలెను. నాడుల ద్వారా వికటము దివ్యము శుభము అగు శూలాగ్రమును వేధ చేయవలెను. పాదాంగుష్టము మొదలు కపోలము వరకు కిరణ సముదాయము వ్యాప్తమై వున్నది. అది మహా వేగముతో క్రింది నుండి పైకి, పైనుండి క్రిందికి తిరుగు చున్నట్లు భావన చేయవలెను. సాధకుడు తన శరీరము పూర్తిగా, లోపల భస్మమయినట్లు కనబడు నంతవరకు రశ్మీ మండలమును ధ్యానించవలెను. పిదప ఆధారణను, ఉపసంహరించవలెను. ఈ విధముగా చేయుటచే ద్విజులు శీత శ్లేష్మాది రోగములను తమ పాపములను నశింప చేయుదురు.

పిదప ధైర్యముతో విచారణ చేయుచు ముఖము క్రిందనున్న కంఠమును ధ్యానించవలెను. చిత్తము నష్టముకాకూడదు. తన అంతఃకరణ ద్వారా ధ్యానలగ్నుడై అనంత జలకణములు ఆవిర్భవించి, ఒక దానితో ఒకటి కలసి హిమరాశిని పుట్టించుచున్నట్లును, దానిచే భూమిపై జల ధారలు ప్రవహించుచు సకల విశ్వమును ముంచెత్తుచున్నట్లును భావించ వలెను. ఈ విధముగ హిమస్పర్శచే శీతలమైన అమృత స్వరూప జలముచే బ్రహ్మ రంధ్రము మొదలు మూలాధారము వరకును వున్న చక్రమండలమును ఆప్లావితము చేసి, సుషుమ్నా నాడి మధ్య ఇందు మండలమును ధ్యానించవలెను. ఆకలి దప్పికలచే క్రమముగా వచ్చిన క్లేశములచే మిక్కిలి పీడితుడై తన తుష్టికొరకై వారుణీ ధారణా చింతనచేసి ఆలస్యము విడచి విష్ణుమంత్ర జపమును చేయవలెను. ఈ విధముగా వారుణీ ధారణ చెప్పబడినది. ఐశాలీ ధారణను చెప్పెదను.

ప్రాణా పానములు క్షయమును పొందగ హృదయాకాశమున బ్రహ్మమయ పద్మము నందు విష్ణు ప్రసాదమును, చింత నశించువరకు ధ్యానము చేయవలెను. పిదప వ్యాపకమగు ఈశ్వర రూపముతో ఉండి శాంతము నిరంజనము, నిరాభాసము, అర్ధ చంద్ర స్వరూపము అగు సంపూర్ణ మహాభావము యొక్క జపధ్యానములు చేయవలెను. జీవాత్మ బ్రహ్మ స్వరూపుడే అను విషయమును గురుముఖతః తెలియనంతవరకు ఈ చరాచర జగత్తు అసత్యమైనను సత్యముగా భాసించును. ఆ పరతత్వము తెలిసిన పిమ్మట బ్రహ్మ మొదలు, సకల చరాచర జగత్తు ప్రమాత, మానము, మేయము, సర్వముకూడ హృదయ కమలమునందు లీనమై పోవును. జపహోమ పూజనాదులు తల్లి ఇచ్చిన మోదకములవలె మధురమైనవని తెలిసికొని విష్ణుమంత్రముతో అనుష్టించవలెను. ఇప్పుడు అమృతమయీ ధారణను చెప్పెదను,

శిరస్సుయొక్క నాడియందు కేంద్రస్థానమున పూర్ణ చంద్ర సమానమగు కమలములను ధ్యానించవలెను. ఆకాశమునందు పదివేల చంద్రులతో సమానమగు ఒక చంద్ర మండలము ఉదయించినది. అది కల్యాణమయములగు కల్లోలములతో నిండి ఉన్నది అని భావన చేయవలెను. అట్టి భావన తన హృదయ కమలమునందు కూడచేసి దాని మధ్యభాగమున తన శరీరమున్నట్లు భావించవలెను. ధారణాదుల ద్వారా సాధకుని క్లేశములన్నియు నశించును. (375)