అగ్ని మహా పురాణము
సర్వవిధి
నారదుడు పలికెను:
అన్ని ఫలములను ఇచ్చు దీక్షను చెప్పెదను. మండలమునందలి పద్మమునందు హరిని పూజించవలెను. దశమియందు సమస్తమైన యాగద్రవ్యములను సమకూర్చుకొని, అచట ఉంచి, ‘ఫట్’ అనునది అంతమునందుగల నారసింహ మంత్రముచేత, ఆవాలను నూరు పర్యాయములు అభిమంత్రించి, వాటిని నలుమూలల చల్లవలెను.
అచట సర్వాత్మికయు, ప్రాసాద రూపిణియు అగు శక్తిని నిలుపవలెను. సాధకుడు శుభమైన పాత్రయందు సమస్త ఓషధులను ఉంచి నూరు పర్యాయములు వాసుదేవ మంత్రముచే వికిరములను అభిమంత్రించవలెను. పంచగవ్యమును నారాయణాంతములైన ఐదు మూలమూరులచే సంపాదించుకొని, దానిచే ఆ భూమిని కుశాగ్రములతో సంప్రోక్షించి, వాసుదేవ మంత్రముచే చిమ్ముచు, వెల్లికిల ఉంచబడిన హస్తముతో మూడు పర్యాయములు విసిరివేయవలెను. తూర్పుగా తిరిగి విష్ణువును మనస్సులో ధ్యానించవలెను. వర్ధనితో కూడిన కుంభమునందు అంగసహితుడగు విష్ణువును పూజింపవలెను. వర్ధనిని అస్త్రముచేతనే నూరు పర్యాయములు అభిమంత్రించి, భిన్నము కాని ధారతో తడుపుచు ఈశాన్యదిక్కు వరకును తీసికొని వెళ్ళవలెను. కలశమును వెనుకనుంచి తీసికొని వెళ్ళి వికిరములపై స్థాపించవలెను. వికిరములను దర్భలచేత పోగుచేసి కుంభేశుని కర్కరిని పూజించవలెను.
వస్త్రములతోడను పంచరత్నములతోడను కూడిన విష్ణువును స్థండిలముపై పూజించ వలెను. అగ్నియందు కూడ పూజించి, పూర్వమునందువలె మంత్రములను జపించి, పాత్రను కడిగి, మంచి సువాసన గల పద్మముచే లోపల తుడిచి, నేతితోను, గో క్షీరముతోను నింపి, వాసుదేవ మంత్రముతో దానివైపు చూచి, పిమ్మట సంకర్షణ మంత్రముతో, సంస్కృతమైన క్షీరములో నెయ్యి పూసిన తండులములను పోయవలెను. ప్రద్యుమ్న మంత్రముతో కలిపి గరిటచేత మెల్లగా ఎనపవలెను. ఉడికిన తరువాత, గురువు అనిరుద్ద మంత్రముతో దింపవలెను. ఆ పాత్రను కడిగి, నారాయణ మంత్రముతో, భస్మము చేత పాత్రకు ఊర్ధ్వపుండ్రములు ఉంచవలెను. ఈ విధముగ ఆ చరువును చక్కగా సంస్కరించవలెను.
ఒక భాగము దేవునకు, రెండవ భాగము కలశమునకు సమర్పించి, మూడవ భాగముచే మూడు ఆహుతులు చేయవలెను. నాల్గవ భాగమును గురువు శిష్యులతో కూడ భుజించవలెను. క్షీరవృక్షము నుండి దంతకాష్ఠమును గ్రహించి, దానిని నారాయణ మంత్రముచే ఏడు సార్లు అభిమంత్రించి పవిత్రము చేసి, దానిని నమలి విడువవలెను. తన పాపము అంతయు ఈశాన్యాది అభిముఖముగా పడిపోయినట్లు భావనచేయవలెను. శుభమైన నరసింహ మంత్రముతో నూరుసార్లు హోమముచేసి, ఆచమనముచేసి, పూజా గృహము ప్రవేశించి, తూర్పున విష్ణువును స్థాపించి ప్రదక్షిణము చేయవలెను.
“భక్తవత్సలుడవైన ఓ దేవా! సంసార సముద్రమునందు మునిగియున్న పశువుల పాపములను తొలగించుటకు నీవు ఒక్కడవే శరణము. ఓ! దేవదేవా! ప్రాకృతములైన పాశబంధనములచే బద్ధులైన ఈ పశువులను, నీ అనుగ్రహము వలన విముక్తులను చేసెదను. అనుజ్ఞఇమ్ము” అని విష్ణువును ప్రార్థించవలెను.
విష్ణువునకు ఈ విధముగా విజ్ఞాపనచేసి, పిమ్మట పశువులను ప్రవేశించి, పూర్వము చెప్పినట్లు ధారణలచేతను, జ్వలనాదికముచేతను సంశోధనముచేసి, సంస్కరించి, మూర్తితో కలిపి, నేత్రములను బంధించి చూపవలెను. అచట పుష్పములతో నిండిన దోసిళ్ళను విసిరి, ఆపేర్లను చేర్చవలెను. అచట వెనుకటివలె క్రమముగా మంత్రరహితముగా అర్చన చేయవలెను. పుష్పము ఏ మూర్తిపై పడునో ఆ మూర్తి యొక్క పేరు అతనికి పెట్టవలెను. పాదాంగుష్ఠము మొదలు శిఖవరకు పొడవుగల ఆరు పేట్ల ఎఱ్ఱటి దారమును కన్యచేత భేదింపచేసి, మరల దానిని మూడు పేటలుచేసి, దానిపై, ఏ ప్రకృతిలో విశ్వము లీనమగునో, దేనినుండి జనించునో అట్టి ప్రకృతిని వివిధ ప్రక్రియలతో భావన చేయవలెను. ఆ సూత్రముతో, ఎన్ని తత్త్వములున్నవో అన్ని ప్రాకృతిక పాశములను ముడివేసి, దానిని మూకుడులో అగ్నికుండ పార్శ్వమునందు ఉంచి, గురువు, ప్రకృతి మొదలు పృథివి వరకును ఉన్న ఆ తత్త్వములను సృష్టి క్రమానుసారము ధ్యానించుచు శిష్యుని శరీరముపై న్యాసము చేయవలెను.
వికృతుల క్రమము ప్రకారము నిఖిలమార్గమును పంచాంగములతో, తన్మాత్రాత్మకమగు మాయా సూత్రమైన పశువు శరీరము నందు ఉపసంహరించి, తత్త్వ చింతకులు అచట ఐదు, పది లేదా పండ్రెండు విధములచేత ఆ గ్రథితమైన సూత్రమును పర్వ భేదముచే ఇవ్వవలెను.
తన ఇచ్ఛననుసరించి, సూత్రమునందును, దేహమునందును- ప్రకృతి, లింగశక్తి కర్త, బుద్ధి, మనస్సు, తన్మాత్రలు, జ్ఞానేంద్రియము, కర్మేంద్రియములు, పంచభూతములు- వీటి అన్నింటిని, ద్వాదశాత్మను ధ్యానించవలెను. సృష్టి అనులోమ విలోమ క్రమములచే ఒక్కొక్క శతము హోమములు చేసి, పిమ్మట పూర్ణాహుతి ఇచ్చి, మూకుడులో సంపుటముగా చేసి, కుంభీశునకు నివేదనము చేయవలెను. ఈ విధముగ, శాస్త్రానుసారముగా అధివాసితముచేసి; భక్తుడైన శిష్యునికి దీక్ష ఇవ్వవలెను. కరణి, కర్తరి, రజస్సులు. ఖటిక, ఇంకను ఉపయుక్తములైన వస్తువులు, వీటిని అన్నింటిని ఆతని ఎడమ ప్రక్క దగ్గరగా ఉంచి, మూలమంత్రముచే స్పృశించి, అధివాసితములు చేయవలెను. హరిని స్మరించుచు “నమో భూతేభ్యః” అని భూతబలిని కుశములపై ఇవ్వవలెను. పిదప వితానము (చాందినీ)చేత, ఘటముచేత, లడ్డులచేత మండలమును అలంకరించి, మండలముపై విష్ణువును పూజింపవలెను. పిమ్మట అగ్నిని పూజించి పద్మాసనము కట్టి కూర్చున్న శిష్యులను పిలచి వారికి దీక్ష ఇవ్వవలెను. విష్ణువును హస్తముచే ప్రోక్షించి, శిరస్సును స్పృశించి, క్రమముగా ప్రకృతి మొదలు వికృతుల వరకునుగల, అధిభూతాధి దైవతములతో కూడిన సృష్టినిగూర్చి మనస్సులో భావనచేసి మరల క్రమముగా ఉపసంహరించి, ఆ సృష్టి యంతయు తన్మాత్రలుగా అయి పోయినట్లును, జీవునితో సమానమైనట్లును భావన చేయవలెను. పిమ్మట గురువు కుంభేశుని ప్రార్థించి, సూత్రమును ప్రోగుచేసి, అగ్ని దగ్గరకు వచ్చి, దానిని అగ్ని పార్శ్వమునందు ఉంచి, సృష్టికి అధిపతియైన ఆ అగ్నిని మూల మంత్రముతో నూరు ఆహుతులతోను, పిమ్మట పూర్ణాహుతి తోను పూజించవలెను. మూలమంత్రముతో నూరుసార్లు అభిమంత్రించిన తెల్లని రజస్సుతో హృదయ తాడనము చేయవలెను, వియోగపద సంయుక్తములును, పాదాదీంద్రియ ఘటితములును, బీజయుక్తములును అగు వాక్యములతో క్రమముగా పృథివ్యాది తత్త్వ విశ్లేషణముచేసి హోమము చేయవలెను.
పండితుడు అఖిలతత్త్వములకును నిలయమైన వహ్నియందును, వ్యాహృతుడగు హరియందును సమస్తమైన అర్చనామార్గము క్రమముగ ఉంచబడుచున్నట్లు స్మరింపవలెను. తాడనముచే విడదీసి, గ్రహించి, శమింపచేసి ప్రకృతిచే స్వీకరించి, పూర్వోక్తమైన అగ్ని యందు హోమము చేయవలెను.
గర్భాధానమును, జాతకర్మను, భోగమును, లయమును, ఆ అగ్నియందే ఎనిమిది హోమములు చేసి, పిమ్మట శుద్ధహోమము చేయవలెను. గురువు శుద్ధతత్త్వమును గ్రహించి, దానిని అవ్యాకృతము వరకును క్రమముగ పూర్ణాహుతిచే పరతత్త్వమునందు హోమము చేయవలెను. పండితుడు, జ్ఞానయోగముచేత ఆ పరమును పరమాత్మయందు విలీనముచేసి, బంధ విముక్తుడై జీవుడు శుద్ధము, జ్ఞానస్వరూపము, నిర్వికారము, పరమానంద రూపము అగు పరమాత్మయందు ఆనందము పొందుచున్నట్లు భావింపవలెను. పిమ్మట పూర్ణాహుతి ఇవ్వవలెను. ఈ విధముగా దీక్ష పూర్తియగును.
దీక్షా, హోమ, విలయములకు ఉపయుక్తములగు ప్రయోగ మంత్రములను చెప్పెదను. “ఓం యం భూతాని విశుద్ధం హుం ఫట్” అను మంత్రముచే తాడనమును, వియోజనమును చేయవలెను. “ఓం యం భూతాన్యాపాతయేఽహమ్” అను మంత్రముచే ఆ దానము చేయవలెను. ప్రకృతితో యోజనముచేయు మంత్రమును వినుము. “ఓం యం భూతాని పుంశ్చాహో” అనునది ప్రయోజన మంత్రము.
హోమ మంత్రమును, పిమ్మట పూర్ణాహుతి మంత్రమును చెప్పెదను- “ఓం భూతాని సంహర స్వాహా” అనునది హోమ మంత్రము. “ఓం శ్రీం ఓం నమో భగవతే వాసుదేవాయ వౌషట్” అనునది పూర్ణాహుతి మంత్రము. పూర్ణాహుత్యనంతరము తత్త్వము నందు శిష్యుని సాధించవలెను. ఈ విధముగా బుధుడు క్రమముగ సర్వతత్త్వ సంశోధనము చేయవలెను. నమః అనునది అంతము నందుగల ఆయా తత్త్వముల బీజములతో తాడనాది పూర్వకముగా తత్త్వసంశోధనము చేయవలెను. “ఓం వాం కర్మేన్ద్రియాణి నమః” “ఓం దేం బుద్ధీన్ద్రియాణి నమః” ఇత్యాది విధమున చేయవలెను. తాడనాది ప్రయోగము ‘యం’ బీజముతో చేసినట్లే చేయవలెను. “ఓం సుగన్ధతన్మాత్రే వియుఙ్క్ష్వ హుం ఫట్ ఓం సంపాహి స్వాహా” అనునది గంధ తన్మాత్రా వియోజన మంత్రము. “ఓం స్వం స్వం యఙ్క్ష్వ ప్రకృత్యా” అనునది ప్రకృతి సంయోజన మంత్రము. “ఓం సుం హుం గన్ధ గూడ ఇట్లే చేయవలెను. “ఓం రస తన్మాత్రే” మొదలు “ఓం ఓం ప్రకృతౌ” అనునది దానివరకునున్న ఎనిమిదియు తత్తత్ప్రయోగాలలో ఉపయోగించు మంత్రములు. ఇది ఏకమూర్తి విషయమున సంపూర్ణముగ చెప్పబడిన దీక్షా విధానము. నవ వ్యూహాదికము నందు కూడ ప్రయోగము ఇట్లే అని చెప్పబడినది.
నరుడు ప్రకృతిని దహించి దానిని పరమ నిర్వాణమునందు చేర్చవలెను. నరుడు ప్రకృతిని అవికారుడగు ఈశ్వరునితో చేర్చవలెను. పిమ్మట భూతశుద్ది చేసి బుద్ధ్యాఖ్యములగు కర్మాంగములను, పిమ్మట తన్మాత్రలను, మనస్సును, జ్ఞానమును, అహంకారమును శోధించవలెను. అంతమునందు లింగాత్మశోధనము చేసి మరల ప్రకృతి శోధనము చేయవలెను. పరిశుద్ధుడును, ఈశ్వరధామమున నున్నవాడును, అన్ని భోగములను తన గోచరము చేసికొనినవాడును, ముక్తి యందు స్థితి సంపాదించిన వాడును అగు ప్రాకృత పురుషుని ధ్యానించుచు పూర్ణాహుతిని ఇవ్వవలెను. ఇది అధికారికి సంబంధించిన దీక్షా విధానము. మంత్రాంగములచే ఆరాధనచేసి తత్త్వముల సముదాయమును సమముగా ఉండు నట్లు చేసి ఈ విధముగ సక్రమముగా విశోధనముచేసి, అంతమునందు సర్వసిద్ధి సమన్వితుని ధ్యానించుచు పూర్ణాహుతి ఇవ్వవలెను. ఇది సాధకుడు చేయవలసిన దీక్షా పద్ధతి.
ద్రవ్యములను కూర్చుకొనుటకు సామర్ధ్యము లేకపోయినచో లేదా తనకు శక్తి లేకపోయినచో, దేశికోత్తముడు పూర్వము చెప్పినట్లు సర్వోపకరణసహితుడగు దేవుని ఆరాధించి వెంటనే శిష్యునకు ద్వాదశియందు దీక్ష ఇవ్వవలెను. భక్తుడును, వినయవంతుడును, సమస్తమైన శారీర గుణములు కలవాడును అగు శిష్యుడు అధిక ధనవంతుడు కానిచో ఆతనికి స్థండిలాభ్యర్చన చేయించి దీక్ష ఇవ్వవలెను. గురువు, సమస్తమైన దైవ మార్గమునుగాని, ఆధ్యాత్మికముగా భావన చేయబడిన భౌతిక మార్గమునుగాని, శిష్యుని దేహముపై ధ్యానించి, ముందుగా వాసుదేవాది దేవతలను, అగ్ని మొదలైనవారిని, క్రమముగ వారివారి మంత్రములతో ఎనిమిదేసి ఆహుతుల చేత తృప్తి పరచి, విసర్జనము చేయవలెను.
పిమ్మట సంహారక్రమమున హోమముచే శోధనము చేయవలెను. శిష్యుని దేహముపై కట్టిన కర్మరూప సూత్రములను విడిపించి, వాటిని ఒకచోట పోగుచేసి, తత్త్వ శోధనము చేయవలెను. ప్రాకృతికాగ్ని యందును, ఆధిదైవిక విష్ణువునందును లయము చేసి, అశుద్ధులతో కూడిన తత్త్వమును పూర్ణాహుతిచే శుద్ధము చేయవలెను. ప్రాకృతిక గుణములను దహించి శిష్యుడు ప్రకృతిస్థుడైన పిమ్మట గురువు ఆతనిని విముక్తుని చేయవలెను; లేదా శిశువులను (శిష్యులను) అధికారము నందు నియుక్తులను చేయవలెను. లేదా గురువు భావస్థితుడై మరియొక శక్తి దీక్షయైన చేయవలెను. యతులుగాని, నిర్ధనులుగాని భక్తి పూర్వకముగ తన నాశ్రయించినపుడు స్థండిలముపై విష్ణువును పూజించి, శిష్యుని పార్శ్వమునందే కూర్చుండబెట్టవలెను. శిష్యుడు దేవతాభిముఖుడుగా ఉండగా గురువు ముఖమును అడ్డముగా త్రిప్పి కూర్చుండవలెను. స్వీయపర్వములతో వికల్పితమైన సకలాధ్వమును శిష్యుని దేహముపై ధ్యానించి పిమ్మట ఆధిదైవిక పూజ చేయవలెను. ధ్యానయోగముచే చింతించి, వెనుక చెప్పిన విధమున తాడనాదికముచే క్రమముగ స్థండిలముపై నున్న హరియందు సకలతత్త్వ సంశోధనము చేయవలెను. పిమ్మట తాడనముచేత విడిపించి, తత్పరత్వముతో తనలో గ్రహించి, దేవునితో సంబంధింపచేసి, పరిశోధనముచేసి, దేవ స్వరూపమున గ్రహించి, శుద్ధ భావముతో తీసికొని వచ్చి, క్రమముగ సంధింపచేసి, ధ్యానయోగము నవలంబించి జ్ఞానముద్రతో శోధింపవలెను. సర్వతత్త్వములును శుద్ధములైన పిమ్మట ప్రధానుడగు ఈశ్వరుడు మాత్రము ఉండగా, శిష్యులను (పాశములను) దహించి నిర్వాసితులను చేయవలెను. ఈశ్వరస్థానమున వారిని నియుక్తులను చేయవలెను. లేదా దేశికోత్తముడు సాధకుని సిద్ధి మార్గమును పొందింపచేయవలెను.
అధికారముగల గృహస్థుడు ఈ విధముగ కర్మాచరణ విషయమున అలసత్వము లేనివాడై, రాగము క్షీణించు వరకును ఆత్మశోధనము చేసికొనుచు ఉండవలెను. తనకు ఉన్న రాగము క్షీణించినది అను విషయము గుర్తించి, పాపములు అన్నియు తొలగిన ఆతడు పుత్రునకుగాని, శిష్యునకు గాని అధికారము అప్పగించి, సంయమియై, మాయామయమగు పాశమును దహింపచేసికొని, సన్యాసము స్వీకరించి, ఆత్మచింతా పరాయణుడై, తన స్థితిని ఇతరులకు వ్యక్తముచేయక శరీర పాతమునకై (మరణమునకై) వేచి యుండవలెను. (27)
