అగ్ని మహా పురాణము
వేద పారాయణ విధానము
ముందుగ భుక్తిముక్తి ప్రదమగు ఋగ్విధానమును వినుము. జలమధ్యమునందు కాని హోమ సమయమునగాని గాయత్రీ జపము చేయువానికి సకల మనోవాంఛితములు లభించును. ప్రాణాయామ పూర్వకముగా చేసినచో విశేషముగా లభించును. రాత్రి మాత్రమే భుజించుచు అనేక పర్యాయములు స్నానము చేసి దశసహస్ర గాయత్రీ జపము చేయువాని పాపములన్నియు నశించును. హవిస్సును భుజించుచు లక్షగాయత్రీ జపము చేసినవానికి ముక్తి లభించును. ప్రణవము పరబ్రహ్మ స్వరూపము. దాని జపము సర్వపాప వినాశకము. బొడ్డులోతు నీటిలో నిలచి ఓంకారమును నూరు పర్యాయములు జపించి అభిమంత్రించిన జలమును త్రాగినవాడు ముక్తుడగును. ఓం కారములో వున్న ‘ఆ ఉమ్’ అను మూడు మాత్రలు మూడు వేదములు, ముగ్గురు దేవతలు, మూడు అగ్నులు, భూః మొదలైన మహా వ్యాహృతులే ఏడులోకములు. వీటితో కలిసిన గాయత్రితో చేసిన హోమము సర్వ ఫలదాయకము. గాయత్రి మంత్రము మహావ్యాహృతులు. ఇవన్నియు జప యోగ్యమైన మహామంత్రములు. ఓ రామ! జలములో మునిగి అఘమర్షణ మంత్రమును జపించినచో సర్వపాపములు తొలగును. ‘అగ్ని మీళే పురోహితం’ (ఋ-వే-1-I-1) అను సూక్తము అగ్ని దేవతాకము. శిరస్సుపై అగ్నిని ధరించి ఒక సంవత్సరము పాటు ఈ సూక్తమును జపించుచు హోమము త్రికాల స్నానము హోమము చేయుచు భిక్షాన్నము తినవలెను. ఈ ఋక్కునకు తరవాత ఉన్న వాయ్వాది దేవతాసూక్తములను ఏడింటిని నిత్యము నియమ పూర్వకముగా జపించువాడు మనోవాంఛితములను పొందును. మేధాకాముడు “సదసస్పతి (ఋ-1-18-6) ఇత్యాది ఋక్షయమును ప్రతిదినము జపించవలెను.
‘అంబయో యంత్యధ్యభిః’ (ఋ. 1-23-18) ఇత్యాది తొమ్మిది ఋక్కులు అకాల మృత్యువును తొలగించును. బద్ధుడుగాని, అడ్డుకొనబడినవాడుగాని, ‘శునశ్శేపోయ మహ్వద్గృ భీతః’ (ఋ. 1-24-12) ఇత్యాది ఋక్త్రయమును జపించవలెను. వీటి జపముచే సర్వపాప విముక్తుడగును. రోగి రోగ విముక్తుడగును. శాశ్వత కామముల సిద్ధిని, బుద్ధిమంతుడగు మిత్రుని కోరువాడు ‘ఇందస్య’ ఇత్యాదికములగు పదునారు ఋక్కులను ప్రతి దినము జపించవలెను. ‘హిరణ్య స్తూపః (10-149-5) ఇత్యాది మంత్రమును జపించువాడు శత్రువులను బాధించును. ‘ఏతే పంథాః (1-35-11) అను మంత్రమును జపించువాడు మార్గమున క్షేమవంతుడగును. రుద్ర సంబద్ధములగు ఆరు ఋక్కులతో ప్రతిదినము ఈశ్వరుని స్తుతించువాడును రౌద్ర చెరువును సమర్పించువాడును పరమ శాంతిని పొందును. ‘ఉద్వయన్త మసః’ (1-50-10) ‘ఉదుత్యంజాత వేదసం’ (1-50-1) అను ఋక్కులచే ప్రతిదినం ఆదిత్యుని ఉపస్థానము చెప్పువాడును సూర్యునుద్దేశించి ఏడు జలాంజలులను ఇచ్చువాడును మానసిక దుఃఖ విముక్తుడగును. ‘ద్విషంతం’ ఇత్యాది ఋక్కు మొదలు ‘యద్విప్రాః’ అను మంత్రమువరకు జప ధ్యానములు చేయవలెను. ఇట్లు చేయుటచే అపరాధి ఏడు రాత్రులలో ఇతరుల ద్వేషమునకు పాత్రుడు అగును. ఆరోగ్యము కోరువాడు ‘పురీష్యాసోఽగ్నయః’ (3-22-4) అను ఋక్కును జపించవలెను. శత్రుబాధ నివారణార్థమై ఈ ఋక్కులోని అర్థ భాగమును జపించవలెను. దీనిని సూర్యోదయ సమయమున జపించినచో దీర్ఘాయువు మధ్యాహ్నమున జపించినచో తేజస్సు సూర్యాస్తమయ సమయమున జపించినచో శత్రువినాశము కలుగును. ‘నవయః’ (ఋ. 8-93-2) ఇత్యాది సూక్తములను జపించువాడు శత్రువిజేత అగును. పదకొండు సువర్ణ సూక్తములను జపించువాడు సర్వకామములను పొందును. ఆధ్యాత్మికములగు ‘క’ అను మొదలగు ఋక్కులను జపించువాడు మోక్షమును పొందును.
‘అనోభద్రాః’ (1-89-1) అను ఋక్కును జపించుటచే దీర్ఘాయువు లభించును. హస్తములో సమిధలు గ్రహించి ‘త్వంసోమ’ (9-86-24) అను ఋక్కు చదువుచు శుక్లపక్ష ద్వీతీయ చంద్రుని దర్శనము చేయవలెను. ఇట్లు చేయుటచే నిస్సంశయముగ వస్త్రములను పొందును. దీర్ఘాయుర్దాయము కోరువాడు ‘ఇమం’ (1-94) ఇత్యాది కౌత్స సూక్తమును సర్వదా జపించవలెను. మధ్యాహ్న సమయమున అపనః శుచమం’ (1-97-1) ఇత్యాది ఋక్కుతో సూర్యస్తుతి చేయువాడు గడ్డినుండి ఇషీకను వేరుచేసినట్లు (ఒక జాతిగడ్డి) తనను పాపమునుండి వేరుచేసుకొనును. యాత్రికుడు ‘జాతవేదసే’ (1-19-1) అను మంగళమయమగు ఋక్కును మార్గమునందు జపించవలెను. సర్వభయ విముక్తుడై క్షేమముగ ఇంటికి తిరిగివచ్చును. ప్రభాత కాలమున వీనిని జపించినచో దుఃస్వప్నములు నశించును. ‘ప్రమందినే’ (1-101-1) అను ఋక్కును జపించుటచే స్త్రీ సుఖముగా ప్రసవించును. ‘ఇంద్రం’ (1-106-1) ఇత్యాది ఋక్కు జపించుచు ఏడు పర్యాయములు వైశ్వ దేవముచేసి ఆజ్యహోమం చేసినవాడు సమస్త పాపవిముక్తు డగును. ‘ఇమాం’ (10-85-45) అను ఋక్కును జపించువాడు సర్వదా అన్ని కామములను పొందును, మూడు దినములు ఉపవాసముచేసి పవిత్రుడై ‘మానసిక్తే’ (1-114-8, 9) ఇత్యాది ఋగ్ద్వయమును పఠించుచు నేతిచే సంస్కృతములగు ఉదుంబర సమిధలను హోమము చేసినవాడు మృత్యుపాశములు అన్నింటిని ఛేదించి రోగ విహీనుడు అగును. రెండుచేతులు ఎత్తి ఈ ఋక్కులతో శివుని స్తుతించి శిఖ ముడివేసుకొనిన వాడు నిస్సంశయముగా సకల ప్రాణులకు అజేయుడగును. హస్తమున సమిధలు గ్రహించి ప్రతిదినము మూడు సంధ్యల్కయందును ‘చిత్రం దేవానాం’ (1-115-1) ఇత్యాది మంత్రముచే సూర్యోపస్థానము చేయువాడు మనోవాంఛిత ధనమును పొందును. ‘స్వప్నే నాభ్యుష్యా’ (2-15-9) అను ఋక్కును ప్రాతఃకాల మధ్యాహ్న అపరాహ్నములందు జపించుటచే సర్వ దుఃస్వప్నములు నశించును. మంచి భోజనము లభించును. ‘ఉభేపునామి రోదసి’ (1-133-1) అను మంత్రము రాక్షస వినాశకము, ‘ఉభయా సోజాత వేదః’ (2-2-12-13) ఆదిఋక్కులను జపించువాడు మనోవాంఛిత ఫలములను పొందును. ‘తమాగమ న్మసో మరయః’ (8-19-32) అను మంత్రమును జపించువాడు ఆతతాయి భయము నుండి విముక్తుడగును.
‘కయాశుభాసవయసః’ (1-165-1) అను ఋక్కును జపించువాడు తన జాతిలో శ్రేష్ఠత్వమును పొందును ‘ఇమంను సోమం’ (1-179-5) అను ఋక్కును జపించువాడు సర్వ కామములను పొందును. ‘పితుంనుస్తోషం’ (1-187-1) అను ఋక్కుతో నిత్యము ఉపస్థానము చేయువానికి అన్నము లభించును. ‘ఆగ్నేనయ సుపథా’ (1-189-1) అను సూక్తముతో ఆజ్య హోమము చేసినచో పరలోకమున ఉత్తమ మార్గము లభించును. సుశ్లోకమును సర్వదా జపించువాడు వీర మార్గమును పొందును. ‘కంకతోన కంకతో (1-191-1) అను సూక్తము విషములను పోగొట్టును. ‘యోజాతః ఏవ ప్రథమో’, (2-12) అను సూక్తమును జపించువానికి సమస్త కామములు లభించును. గణానాంత్వా’ (2-23-1) అను సూక్తమును జపించుటచే శ్రేష్ఠమైన స్నిగ్ధ పదార్థములు లభించును. ‘యోమే రాజన్’ (2-28-10) అను ఋక్కు దుఃస్వప్నములను శమింపచేయును. మార్గములో ప్రయాణమై వెళ్లుచున్నవాడు ప్రశస్తుడుగాని అప్రశస్తుడుగాని అగు శత్రువు కనబడినపుడు ‘కువిదంగ’ ఇత్యాది మంత్రములు జపించినచో ఆత్మరక్షణ కలుగును. ఇరువది రెండు ఆధ్యాత్మిక సూక్తములను పర్వములందు నియమ పూర్వకముగ జపించువానికి సమస్త మనోరథములు సిద్ధించును. ‘కృణు ష్వపాజః’ (4-4-1) అను సూక్తము జపించుచు ఏకాగ్ర చిత్తముతో ఆజ్యహోమము చేసినవాడు శత్రువులను సంహరించును. రాక్షసులను కూడ నశింపచేయును ‘పరి’ ఇత్యాది సూక్తముతో ప్రతిదినము అగ్న్యుపస్థానము చేయువానిని విశ్వతోముఖుడగు అగ్ని స్వయముగ అన్నివైపుల నుండియు రక్షించును. ‘హంసశ్ళు చిషత్’ (4-40-5) ఇత్యాది మంత్రము చదువుచు సూర్యుని చూచినచో పవిత్రుడగును.
కృషిచేయనున్నవాడు క్షేత్రమధ్యమగమును యథావిధిగా స్థాలీపాక హోమము చేయవలెను. ఇంద్ర, మరుత్, పర్జన్య, భగులకు, స్వాహాంతముగ హోమము చేయవలెను. కృషీవలుడు నాగలిని లింగమును విహరింపచేసినట్లు విహరింపచేయవలెను. ఆ సమయమున శునాసీరావిమాం’ (4-57-5) అను మంత్రమును కూడ జపించవలెను. పిమ్మట గంధమాల్య నమస్కారాదులతో అచట ఉన్న అధిష్ఠాన దేవతలను పూజించవలెను. ఇట్లు చేయుటచే విత్తనములు చల్లుట, పంటకోయుట, కళ్లములోనికి తీసుకువచ్చుట మొదలగు కర్మలన్నియు అమోఘముగ జరిగిపోవును. కృషి సర్వదా వృద్ధిపొందును. ‘సముద్రా దూర్మిర్మధుమాన్’ (4-58-1) అను సూక్తమును జపించుటచే అగ్ని నుండి సమస్త కామములను పొందును. ‘విశ్వానినోదుర్గః’ (5-4-9-10) ఇత్యాది ఋగర్ధ్వయమును జపించుచు అగ్నిని పూజించువాడు సమస్త ఆపదలును తొలగి అక్షయ మగు కీర్తి పొందును. అత్యధికమగు లక్ష్మియు విజయముకూడ ఆతనికి లభించును. ‘అగ్నేత్వం (5-24-1) అను ఋక్కుచే అగ్నిని స్తుతించువానికి మనోవాంఛిత ధనము లభించును. సంతానము కోరువాడు మూడు వరుణ దేవతా ఋక్కులను నిత్యము జపించవలెను. ‘స్వస్తిన ఇంద్రః’ (1-89-6-8)
మొదలగు మూడు ఋక్కులను సర్వదా ప్రాతః కాలమున జపించినచో అది గొప్ప స్వస్త్యయనము. ‘స్వస్తిపంథామనుచరేమ’ (5-51-15) అను ఋక్కును చదువుటచే మార్గమున యాత్ర సుఖముగా జరుగును. ‘విజిహీష్యవనస్పతే’ (5-78-5) అను మంత్రము జపించుటచే శత్రువులు రోగగ్రస్తు లగుదురు. గర్భవేదనతో బాధపడు స్త్రీకి గర్భమోక్షణము కలుగును. వర్షము కోరువాడు ఉపవాసముండి తడిబట్టలు ధరించి ‘అచ్ఛావద’ (5-83) ఇత్యాది సూక్తమును ప్రయోగించినచో వెంటనే వర్షము వచ్చును. పశుధనము కోరువాడు ‘మనసఃకామం’ శ్రీసూక్తం (10) ఇత్యాది మంత్రమును జపించవలెను. సంతానము కోరువాడు పవిత్ర వ్రతమును అవలంబించి ‘కర్దమేన’ (శ్రీ సూక్తం 11) అను మంత్రముతో స్నానము చేయవలయును. రాజ్యము కోరువాడు “అశ్వపూర్వం” (శ్రీ సూక్తం 3) అను మంత్రమును జపించుచు స్నానము చేయవలయును. బ్రాహ్మణుడు యథావిధిగా రోహిత చర్మముపైనను క్షత్రియుడు వ్యాఘ్రచర్మముపైనను వైశ్యుడు ఛాగ (మేక) చర్మముపైనను స్నానము చేయవలయును. ఒక్కొక్క మంత్రమునకు పదివేల చొప్పున హోమములు చేయవలెను. అక్షయ గోధనము కోరువాడు గోశాలలో ‘ఆగావః (6-28-21) అను ఋక్కును జపించుచు లోకమాతయైన గోవునకు నమస్కరించి గోచర భూమివరకు దాని వెనుక వెళ్లవలెను. రాజు ‘ఉప’ ఇత్యాది ఋక్త్రయముతో తన దుందుభులను అభిమంత్రించినచో తేజోబలసంపన్నుడై శత్రువును వశముచేసుకొనును. దస్యువులు చుట్టుముట్టినప్పుడు చేతిలో తృణము గ్రహించి రక్షష్ను సూక్తమును (10-87) జపించవలెను. ‘యేకేచజ్మా’ (6-52-15) అను ఋక్కును జపించుటచే దీర్ఘాయువు లభించును. రాజు జీమూతసూక్తముతో సేనాంగములన్నింటిని వాటివాటి చిహ్నములను అనుసరించి అభిమంత్రించినచో యుద్ధమునందు శత్రువులను నశింపచేయ కలుగును. ‘ప్రాగ్నయే’ (7-5) ఇత్యాది సూక్తత్రయమును జపించుటచే అక్షయ ధనము లభించును. ‘అమీవహా’ (7-55) అను సూక్తము పఠించి రాత్రి భూతముల స్థాపన చేయవలెను. సంకటము లందును విషమమునందును దుర్గమ స్థలములందును బంధనమునందును బంధయుక్తావస్థ యందును పారిపోవునపుడును, పట్టుబడినపుడు సహాయము కోరువాడు ఈ సూక్తమును జపించవలెను. మూడు దినములు నియమపూర్వకముగ ఉపవాసముచేసి పాయసము వండించి ‘త్ర్యంబకం యజామహే (7-59-12) అను మంత్రముతో మహా దేవుని ఉద్దేశించి అగ్నిలో నూరు హోమములుచేసి దానితోనే పూర్ణాహుతి ఇచ్చినచో నూరు సంవత్సరములు సుఖముగ జీవించును. దీర్ఘాయువు కోరువాడు స్నానముచేసి ‘తచ్చక్షుర్దేవహితం’ (7-66-16) అను సూక్తముతో సూర్యుని ఉదయించునపుడును ఆకాశ మధ్యమునందు ఉన్నపుడును ఉపస్థానము చేయవలెను. హిఇత్యాది ఋక్చతుష్టయమును పఠించువాడు భయ విముక్తుడగును. ‘ఇంద్రాసోమాతపతం’ (7-104) మొదలగు సూక్తము శత్రు వినాశకరము. అజ్ఞానముచే వ్రతభంగమైనను వ్రాత్యుల సంసర్గముచే పతితుడైనను ఉపవాసము చేసి ‘త్వమగ్నే వ్రతపా’(8-11-1) అను ఋక్కుతో ఆజ్యహోమము చేయవలెను. ‘ఆదిత్య సమ్రాజా’ అను రెండు ఋక్కులను జపించువాడు వాదమునందు విజయము పొందును. మహీ ఇత్యాది ఋక్చతుష్టయమును జపించుటచే మహాభయ విముక్తుడగును. ‘యది’ ఇత్యాది ఋక్కును జపించుటచే సర్వకామసిద్ధి కలుగును. ఇంద్రునికి సంబంధించిన నలుబది రెండు ఋక్కులను జపించుటచే శత్రువులు నశింతురు. ‘వాచం మహి’ అను ఋక్కును జపించుటచే ఆరోగ్యము లభించును. పవిత్రుడిగా వుండి శంనోభవ’ (8-48-4-5) అను రెండు ఋక్కులను జపించుచు భోజనముచేసి హృదయమును హస్తముతో స్పృశించువాడు ఎన్నడును వ్యాధిగ్రస్తుడుకాడు. స్నానముచేసి ‘ఉతమేదం’ అను మంత్రముతో హోమము చేయువాడు శత్రువులను సంహరించును. ‘శంనో అగ్ని’ (7-35) అను సూక్తముతో హోమముచేసినవాడు ధనవంతుడగును. ‘కన్యా వాఖాయతి’ (8-91) అను సూక్తము జపించుటచే దిగ్భ్రమ దోషము తొలగిపోవును.
సూర్యోదయ సమయమున ‘యదద్యకచ్చ’ (8-93-4) అను ఋక్కును జపించుటచే సకల జగత్తు వశమగును. ‘యద్వాక్’ (8-100-10) ఇత్యాది ఋక్కును జపించుటచే వాక్కు సంస్కృత మగును. ‘వాచోవిదాం’ (8-01-16) అను మంత్రమును జపించువాడు వాక్శుక్తిని పొందును. పావమానీ ఋక్కులును వైఖానస ఋక్కులు ముప్పదియు అతి పవిత్రమైనవి. ఓ ఋషి శ్రేష్ఠా! ‘పరస్య’ మొదలగు అరువది రెండు ఋక్కులు కూడ అతి పవిత్రమైనవి ‘స్వాదిష్ట్యా మొదలగు అరువది ఏడు సూక్తములు సర్వ కల్మషములను నశింపచేయును, పవిత్రింపచేయును మంగలము కల్గించును. ‘పావవానీ’ ఋక్కులు ఆరువందల పది వున్నవి. వీటిని జపించువాడును, హోమము చేయువాడును మృత్యు భయమును జయించును. పాపభయ వినాశము కోరువాడు ‘అపోహిష్ఠా! (10-9-1-3) ఇత్యాది ఋక్కులను నీటిలో నిలబడి జపించవలెను. ఎడారిలో ప్రాణాంతక భయము ఏర్పడినపుడు నియమపూర్వకముగ ‘ప్రదేవతా బ్రహ్మణే’ (101-30-1) అను మంత్రమును జపించువాడు భయవిముక్తుడై దీర్ఘాయువును పొందును. ‘ప్రావేపా’ (10-34-1) అను ఋక్కును సూర్యోదయ సమయమున మనసా జపించవలెను. దీనివలన ద్యూతమున విజయము లభించును. ‘మా ప్రగామ’ (10-57-1) అను ఋక్కును జపించుటచే దారి తప్పినవాడు సరియైన దారిని పొందును. తన ప్రియమిత్రుని ఆయుర్దాయము క్షీణమైనచో ‘యత్తేయమం’ (10-58-1) అను మంత్రమును జపించుచు వాని శిరస్సును స్పృశించవలెను. ఐదుదినములు 1000 పర్యాయములు ఈవిధముగ చేయుటచే అతనికి దీర్ఘాయువు లభించును. ‘ఇదమిత్థా రౌద్రం’ (10-61-1) అను ఋక్కుతో వెయ్యి ఆజ్య హోమములు చేయవలెను. పశుకాముడు గోశాలయందును, ధనకాముడు చతుష్పథమునందును చేయవలెను. ‘వయఃసుపర్ణా’ (10-73-11) అను ఋక్కు జపించువానికి లక్ష్మి లభించును. ‘హవిష్యన్తం’ (10-88-1) అను మంత్రమును జపించువాడు పాప విముక్తుడగును. ఆతని రోగములు నశించును. జఠరాగ్ని వృద్ధి పొందును. స్వన్త్యయన కరమగు ‘యా ఓషధయః’ అను మంత్రము సర్వవ్యాధి వినాశకము. వృష్టి కాముడు ‘బృహస్పతే అతి’ (2-23-15) అను మంత్రము. ప్రయోగించవలెను. ‘సర్వత్ర’ ఇత్యాది మంత్రముచే గొప్ప శాంతి లభించును. సంతానకామునకు సాంకాశ్య సూక్తజపము మంచిది. ‘అహం రుద్రేభిః వసుభిః’ (10-125-1) అను ఋక్కు జపించువాడు ప్రవచనమునందు సమర్థుడగును. ‘రాత్రీవ్యఖ్యదాయతి’ (10-127-1) అను మంత్రమును జపించువానికి పునర్జన్మ వుండదు. రాత్రియందు ‘రాత్రిసూక్తము’ ను జపించువాడు రాత్రిని సుఖముగా గడుపును. ‘కల్పయంతీ’ ఇత్యాది మంత్రమును జపించువాడు శత్రు వినాశకుడగును. ‘దాక్షాయణ’ సూక్తము గొప్ప ఆయుర్దాయమును, తేజస్సును ఇచ్చును. ‘ఉతదేవాః’ (10-137-1) అను మంత్రము రోగనాశకము. దీనిని వ్రతధారణ పూర్వకముగ జపించవలెను. అగ్ని భయము కలిగినపుడు ‘అయమగ్నే జరితా’ (10-142-1) ఇత్యాది మంత్రమును జపించవలెను. అరణ్యములలో ‘అరణ్యాన్యరణ్యాని’ (10-146–1) అను మంత్రము జపించుటచే భయము తొలగును. బ్రాహ్మిణి’ తీసుకొని బ్రహ్మ సంబంధమైన రెండు సూక్తములను జపించవలెను. బ్రాహ్మీలతను, శతావరీలతను, వేరు వేరుగ ఉదకముతోగాని, ఘృతముతో గాని తీసుకున్నచో మేధాలక్ష్ములు లభించును. శాశఇతా’ (10-152-1) అను ఋక్కు శత్రు వినాశకము. యుద్ధమున విజయము కోరువాడు దీనిని జపించవలెను. ‘బ్రహ్మణాగ్నిః’ (10-162-1) అను ఋక్కు గర్భ మృత్యు నివారకము.
పవిత్రుడై ‘అపేహి’ (10-164) అను సూక్తమును జపించినచో దుస్వప్నములు నశిం5చును. ‘యేనేదం’ ఇత్యాది ఋక్కును జపించుటచే సమాధిస్థుడగును. ‘మయో ర్భూర్వాతః’ (10-169-1) అను గోవునకు మంగళకరమగు ఋక్కుచే ఇంద్రజాల మాయను కాని, శాంబరీ మాయనుకాని జయించవచ్చును. ‘మహిత్రీణాం’ (10-185-1) అను కళ్యాణ కరమగు ఋక్కును మార్గము నందు జపించవలెను. ప్రాగ్నయే’ (10-187-1) అను మంత్రమును జపించుటచే ద్వేష పాత్రుడగు శత్రువు నశించును. ‘వాస్తో ష్పతే’ మొదలైన నాలుగు మంత్రములతో గృహ దేవతలను పూజించవలెను. ఇంతవరకు జపవిధానము చెప్పబడినది. ఇప్పుడు హోమవిధానమును తెలుసుకొనవలెను. హోమాంతమున దక్షిణ ఇవ్వవలెను, హోమముచే పాప శాంతి, అన్నముచే హోమ శాంతి, సువర్ణదానముచే అన్న శాంతి కలుగును. బ్రాహ్మణ ఆశీస్సులు ఎన్నడును వ్యర్థముకావు. యజమానుడు అన్ని వైపుల బయటస్నానము చేయవలయును, తెల్ల ఆవాలు, యవలు, ధాన్యము, పాలు, నెయ్యి, పెరుగు, పాలచెట్ల సమిధలు, వీటితో హోమము చేయుట సర్వకామప్రదము. హోమ సమయమున శిలోంఛ వృత్తులచే లభించిన అన్నమును, సక్తువులు పాలు, పెరుగు, ఫల మూలములు భుజించవలెను. ఇంతవరకు ఋగ్విధానము చెప్పబడినది. (259)
