అగ్ని మహా పురాణము
నానా బలవర్ణనము
పరమేశ్వరుడు చెప్పెను:
సూర్యాది గ్రహముల రాశులందు జన్మించిన శిశువునకు క్షేత్రాధిపతిని బట్టి కలుగు ఫలము చెప్పెదను. సింహ లగ్నమునందు పుట్టినవాడు సమకాయుడు, ఒకప్పుడు కృశాంగుడు, ఒకప్పుడు స్థూలశరీరము కలవాడు, గౌరవర్ణుడు, పిత్త ప్రకృతి, రక్త నేత్రుడు, గుణవంతుడు, వీర్యవంతుడు అగును. కర్కట లగ్నమున పుట్టినవాడు భాగ్యవంతుడు, కోమల శరీరముకలవాడు అగును. మేష-వృశ్చిక జాతుడు వాతరోగి, అత్యంతలుబ్ధుడు అగును. మిథున-కన్యాలగ్న జాతుడు బుద్ధిమంతుడు, సుందరుడు అగును. ధను-ర్మీన లగ్న జాతుడు సుందరుడు, అధిక కోపవంతుడును అగును. మకర-కుంభ లగ్న జాతుడు బుద్ధిమంతుడు, సుందరుడు, మానవంతుడు అగును, సౌమ్యలగ్నమందు పుట్టిన వాడు సౌమ్య స్వభావవంతుడగును. క్రూరలగ్న జాతుడు క్రూర స్వభావుడగును. గౌరీ! ఇప్పుడు నామ రాశులనుబట్టి సూర్యాది గ్రహదశా ఫలము చెప్పెదను-సూర్య దశయందు గజములు, అశ్వములు, ప్రబల రాజ్యలక్ష్మి లభించును. ధనవ్యాప్తి కలుగును. చంద్రదశలో దివ్యస్త్రీ ప్రాప్తి, కుజదశలో భూమి లాభము, సుఖము కలుగును. బుధదశలో భూమి లాభముతో పాటు ధన ధాన్య ప్రాప్తి కూడ కలుగును. గురుదశలో గజాశ్వధన ప్రాప్తి కలుగును. శుక్రదశలో ఖాద్యాన్నము, గోదుగ్ధాది పానము ధనలాభము ఉండును. శని దశలో నానావిధములగు రోగములు కలుగును. రాహు దర్శనమున, అనగా గ్రహణ సమయమున స్నానాదులాచరించి ధ్యానము చేయవలెను. వాణిజ్యము చేయవలెను. ఎడమ శ్వాస ఉన్నపుడు నామాక్షరము సంఖ్య విషయమైనచో ఆ సమయము కుజ, శని, రాహువులకు సంబంధించినది. అపుడు యుద్ధము చేయుటచే విజయము లభించును. కుడి శ్వాస ఆడునపుడు నామాక్షర సంఖ్య సమసంఖ్యయైనచో అది సూర్యుని సమయము. ఆ సమయమున వర్తకముచేయుట నిష్పలము. కాని ఆ సమయమున పదాతియై యుద్ధము చేసినచో విజయము లభించును. ఏదైన వాహనముపై ఎక్కి యుద్ధము చేసినచో మృత్యువు కలుగును.
‘ఓం హూం.....’ ఇత్యాది మూలోక మంత్రమును ఏడు పర్యాయములు న్యాసముచేసి, నాలుగు, పది, ఇరువది భుజములు కలవాడును, కటారమును ధరించిన వాడును, తన సేవకు విముఖుడై శత్రుసేనను భక్షించుచున్నవాడును అగు భైరవుని హృదయమునందు ధ్యానించుచు, శత్రుసేన ఎదుటపై మంత్రమును నూట ఎనిమిది పర్యాయములు జపించవలెను. పిదప డమరు శబ్దము చేయగా శత్రుసేన శస్త్రములు విడచి పారిపోవును. శత్రు పరాజయము కొరకై మరొక ప్రయోగము చెప్పెదను. శ్మశానము నందలి బొగ్గులను కాకి-గుడ్లగూబ రెట్టలతో కలిపి దానితో బట్టపై శత్రువు చిత్రము వ్రాసి, వాని శిరస్సు, ముఖము, లలాటము, హృదయము, గుహ్యము, పాదములు, పృష్ఠము, బాహువులు నడుము-వాటిపై వాని పేరు తొమ్మిది పర్యాయములు వ్రాయవలెను. ఆ బట్ట మడచి యుద్ధమునందు తన దగ్గర ఉంచుకొని పూర్వోక్త మంత్రమును జపించుటచే జయము లభించును.
ఇప్పుడు, విజయ ప్రాప్తి సాధనమగు త్రిముఖాక్షర మహాతార్క్ష్య చక్రమును చెప్పెదను. ‘క్షిప ఓం స్వాహా తార్క్షత్మా శత్రురోగ విషాదినుత్’ ఈ మంత్రము తార్క్ష్య చక్రము. ఈ మంత్రమును అనుష్టించుటచే దుష్టబాధ, భూతబాధ, గ్రహబాధ, అనేక విధములగు రోగములును తొలగును. ఈ గరుడ మంత్రముచే ఏ కార్యమైనను సిద్ధించును. ఈ మంత్ర సాధకుని దృష్టి ప్రసరించుటచే స్థావర జంగమ విషములు, లూతా (సాలె పురుగు) విషము, కృత్రిమ విషములన్నియు నశించును. మహాతార్క్ష్యుని ఈ విధముగా ధ్యానించవలెను, మనుష్యాకృతితో రెండు భుజములు, రెండు రెక్కలు కలిగి యుండును. ముక్కు వంకరగా ఉండును. మహాబలము గల హస్తములతో ఏనుగును, తాబేలును ధరించి యుండును, పాదములందు అసంఖ్యాకములగు సర్పములు చుట్టుకొని ఉండును. ఆకాశమార్గమున వచ్చి రణరంగమున శత్రువులను పొడిచి పొడిచి తినుచుందును. కొందరు శత్రువులు ఆతని ముట్టెచే చంపబడి యుందురు. కొందరు పంజాదెబ్బచే మరణింతురు. కొందరు రెక్కల దెబ్బకు చూర్ణము చేయబడుదురు. కొందరు పది దిక్కులకు పారిపోవుచుందురు. ఈ విధముగా ధ్యాననిష్ఠుడగు సాధకుడు మూడు లోకములందును అజేయుడగును.
ఇపుడు మంత్ర సాధనచే సిద్ధించు పిచ్ఛికా క్రియను గూర్చి చెప్పెదను. ‘ఓం హూం పక్షిన్ ..... స్వాహా’ అను పిచ్ఛికా మంత్రమును చంద్రగ్రహణము నందు జపించి సిద్ధింప చేసికొనిన సాధకుడు యుద్ధమునందు గజమును, సింహమును గూడ ఎదిరించగలడు. మంత్రధ్యానముచే శత్రువులను లేళ్ళను, మేకలనువలె చంపగలడు. దూరమునుండియే కేవల మంత్రోచ్చారణముచే శత్రువినాశము చేయు ఉపాయము చెప్పబడుచున్నది. కాలరాత్రి యందు(అశ్విన శుక్లాష్టమినాడు) మాతృకలకు చరు ప్రదానము చేసి శ్మశాన భస్మము, మాలతీపుష్పములు, చామరి, పత్తి చెట్టు వేరు వాటితో దూరము నుండియే శత్రువును సంబోధించవలెను. ఓం అహే హుంఫట్’ అనునది సంబోధించు మంత్రము.
ఈ భంగవిద్యను జపించుటచేతను, దూరమునుండియే ధ్వని చేయుట చేతను, అపరాజిత, ధత్తూరము వీటి రసము కలిపి తిలకము ధరించుట చేతను శత్రువులు నశింతురు. ‘ఓం కిలి కిలి ...... కురుస్వాహా’ అను (మూలోక్తమగు) సర్వకార్యార్థ సాధక మంత్రమును భూర్జ పత్రముపై వృత్తాకారముగ వ్రాసి, బహిర్భాగమున మాతృకలను వ్రాయవలెను. ఈ విద్యను మొదట బ్రహ్మ విష్ణు మహేంద్రాదులు హస్తాదులందు ధరించిరి. ఈ విద్య ద్వారా బృహస్పతి దేవాసుర సంగ్రామమునందు దేవతలను రక్షించెను. రక్షారూపిణియు, నారసింహియు, శక్తి రూపిణియు, భైరవియు, త్రైలోక్య మోహినియు అగు గౌరి కూడ దేవాసుర సంగ్రామము నందు దేవతలను రక్షించెను.
అష్టదళ కమలము కర్ణికయందును, దళములందును గౌరీబీజముతో (హ్రీం) సంపుటితమైన తన పేరు వ్రాయవలెను. పూర్వదిక్కునందున్న ప్రథమాది దళములపై పూజానుసారము గౌరి అంగదేవతల న్యాసము చేయవలెను. ఈ విధముగా వ్రాయగా రక్షా మంత్రము ఏర్పడును. ఈ సంస్కారముల మధ్య సకలకళా పరివేష్టితము, సకారముచే ప్రబోధితము అగు మృత్యుంజయ మంత్రమును చెప్పెదను. ముందుగా ఓంకారము వ్రాసి, పిదప బిందుయుక్త మగు జకారము, వ్రాయవలెను. పిదప గర్భమున వకారము వ్రాసి దానిని చంద్రబిందువుచే అంకితము చేయవలెను. అనగా ‘ఓం జం ధ్వం’ అను మంత్రము దుష్టులందరిని నశింపచేయును. గోరోచనా-కుంకుమలతో గాని, మలయగిరి చందన, కర్పూరములతో గాని భూర్జ పత్రముపై గీసిన చతుర్దళ కమల కర్ణికయందు తన పేరు వ్రాసి, నాలుగు దళములపై ఓంకారము వ్రాయవలెను.
ఆగ్నేయాది కోణములందు హూంకారము వ్రాయవలెను. దానిపై పదునారు దళముల కమలము వ్రాయవలెను. దాని దళములపై అకారాది షోడశ స్వరములు వ్రాయవలెను. దాని దళములపై ముప్పది నాల్గు దళముల కమలము నిర్మించవలెను.
దాని దళములపై ‘క’ నుండి ‘క్ష’ వరకు అక్షరములు వ్రాసి, ఆ యంత్రమును శ్వేత సూత్రముచే చుట్టబెట్టి, పట్టుబట్టతో కప్పి, కలశముపై స్థాపించి పూజించవలెను. ఈ యంత్రమును ధరించుటచే సకల రోగములు శాంతించును. శత్రువులు నశింతురు. ఇప్పుడు వియోగమునందు కలుగు మృత్యువును నివారించు ‘ఖేలఖీ’ విద్యను చెప్పెదను. ‘ఓం వాతరే ...... ఓం స్వాహా’ అను (మూలోక్త) మంత్రమును నవరాత్రులందు జపించి, సిద్ధిపొంది, యుద్ధమునందు ఏడు పర్యాయములు జపము చేయగా శత్రువులకు ముఖస్తంభనమగును. ‘ఓం చండి, ఓం హూంఫట్ స్వాహా’ అను మంత్రమును యుద్ధ సమయమునందు ఏడు పర్యాయములు జపించుటచే ఖడ్గ యుద్ధమున విజయము కలుగును. (133)
