అగ్ని మహా పురాణము

Table of Contents

కురు పాండవ యుద్ధము

యుధిష్ఠిరుని సేనయు, దుర్యోధనుని సేనయు కురుక్షేత్రమును చేరినవి. అర్జునుడు భీష్మద్రోణాదులను చూచి యుద్ధము చేయడని తెలిసికొని, భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆతనితో భీష్మాదులను గూర్చి శోకింప పనిలేదు. శరీరములు నశించును గాని ఆత్మనశించదు. ఈ జీవాత్మ పరమాత్మయే. “నేనే పరబ్రహ్మను” అని తెలిసికొనుము. ప్రయత్నము సిద్ధించినను, సిద్ధింపకున్నను సమబుద్ధి కలవాడవై, యోగివై, రాజధర్మమును పాలించుము అని అనెను.

ఈ విధముగా కృష్ణుడు ఉపదేశించగా అర్జునుడు రథముపై నెక్కి, వాద్య శబ్దములు చేయుచు, యుద్ధము చేసెను. మొదట దుర్యోధన సైన్యమునకు భీష్ముడు సేనాపతి అయ్యెను. పాండవులకు శిఖండి సేనాపతి అయ్యెను. ఆ రెండు సైన్యములకును యుద్ధము జరిగెను. భీష్మునితో కూడిన కౌరవులు యుద్ధమునందు పాండవులను కొట్టిరి. శిఖండి మొదలగు పాండవ పక్షీయులు యుద్ధమునందు కౌరవులను కొట్టిరి. కురుపాండవ సేనల మధ్య యుద్ధము, ఆకాశము నుండి చూచుచున్న దేవతలకు ప్రీతిని వృద్ధిపొందించుచు, దేవాసుర యుద్ధమువలె జరిగెను.

భీష్ముడు పది దివసములలో, అస్త్రములచే పాండవ సైన్యమును ధ్వంసము చేసెను. పదవ రోజున, అర్జునుడు వీరుడైన భీష్మునిపై బాణవర్షము కురిపించెను. ద్రుపదుడు ప్రేరేపించగా శిఖండి కూడ మేఘమువలె అస్త్రములను వర్షించెను. పరస్పరము ప్రయోగించిన అస్త్రజాలముచే ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, కాలిబంటులు నేలపై కూలెను. స్వేచ్చామరణముగల భీష్ముడు తనతో ఎట్లు యుద్ధము చేయవలెనో పాండవులకు చెప్పి వసువులచేత ప్రేరితుడై, వసులోకమునకు తిరిగి వెళ్ళదలచి, శరశయ్యాగతుడై, విష్ణువును ధ్యానించుచు, స్తుతించుచు, ఉత్తరాయణమునకై వేచి యుండెను. దుర్యోధనుడు శోకార్తుడయ్యెను. అపుడు ద్రోణుడు సేనాధిపత్యము వహించెను. సంతసించిన పాండవ సైన్యమున ధృష్టద్యుమ్నుడు సేనాపతి అయ్యెను.

వారిరువురికిని యముని రాష్ట్రమును పెంచు యుద్ధము జరిగెను. ద్రోణుడను మహాసముద్రము నందు విరాట ద్రుపదాదులు మునిగిపోయిరి.

హస్త్యశ్వరథపదాతులుగల దుర్యోధన సేనకూడ పాండవ సేనాపతియైన ధృష్ట ద్యుమ్నుని చేత (చంపబడెను). ద్రోణుడు యుద్ధమునందు యమునివలె కన్పట్టెను. అశ్వత్థామ మరణించెను అనుమాటవిని ద్రోణుడు ఆయుధములను విసర్జించెను. ఎదిరింప శక్యము కాని ఆతడు సర్వక్షత్రియులను సంహరించి ఐదవ దినమున ధృష్టద్యుమ్నునిచేత బాణములచే కొట్టబడి మరణించెను.

దుర్యోధనుడు శోకార్తుడయ్యెను. అప్పుడు కర్ణుడు సేనాపతి ఆయెను. అర్జునుడు పాండవుల సేనాపతి ఆయెను. వారిరువురును శస్త్రములతో ఒకరినొకరు కొట్టుకొనగా భయంకరమైన, దేవాసుర యుద్ధ తుల్యమగు యుద్ధము జరిగెను.

ఈ సంగ్రామమునందు కర్ణుడు బాణములతో శత్రువులను సంహరించెను. రెండవ రోజున కర్ణుని అర్జునుడు సంహరించెను.

శల్యుడు సేనాధిపత్యమును వహించి అర్ధదివసము యుద్ధముచేసెను. యుధిష్ఠిరుడు ఆతనిని సంహరించెను. సైన్యము నశించగా సుయోధనుడు భీమసేనునితో యుద్ధము చేసెను. చాలమంది. సైనికులు మొదలగువారిని చంపి, అతడు భీమసేనుని మీదకు వెళ్ళెను. భీమసేనుడు గదతో యుద్ధము చేయుచున్న ఆతనిని ఆతని తమ్ములను పదునెనిమిదవ దివసమున పడగొట్టెను.

మహాబలశాలియైన అశ్వత్థామ, రాత్రియందు నిద్రించుచున్న పాండవులయొక్క అక్షౌహిణీ ప్రమాణముగల సేనను, ద్రౌపదీపుత్రులను, పాంచాలులను, ధృష్టద్యుమ్నుని చంపెను.

పిమ్మట అర్జునుడు పుత్రహీనురాలై విలపించుచున్న ద్రౌపదిని చూచి ఆమెను ఓదార్చుటకై, ఐషీకాస్త్రముచే అశ్వత్థామ శిరోమణిని గ్రహించెను.

శ్రీకృష్ణుడు అశ్వత్థామ అస్త్రముచే దహింపబడుచున్న ఉత్తరాగర్భమును రక్షించెను. పిమ్మట ఆ గర్భస్థ శిశువు పరీక్షిన్మహారాజు ఆయెను. ఆ యుద్ధము నుండి కృతవర్మ, కృపాచార్యులు, అశ్వత్థామ అను ఈ ముగ్గురు మాత్రమే ప్రాణములతో బయటపడిరి. పాండవ పక్షమున పంచ పాండవులు, సాత్యకి, కృష్ణుడు ఈ ఏడుగురు మాత్రమే మిగిలిరి. మరెవ్వరును మిగలలేదు.

యుధిష్ఠిరుడు దుఃఖార్తులైన స్త్రీలను ఓదార్చి, భీమాది సమేతుడై, మరణించిన వీరులందరికిని ప్రేత సంస్కారములను చేసి, వారికై ఉదక ధనాది దానములు చేసి, శంతను కుమారుడైన భీష్ముని నుండి శాంతిని కలిగించు సమస్త ధర్మములను, రాజ ధర్మములను, మోక్ష ధర్మములను, దాన ధర్మములను విని, రాజయ్యెను. శత్రుసంహారియైన ఆతడు అశ్వమేధ మాచరించి, బ్రాహ్మణులకు దానములు ఇచ్చెను.

ముసలము పుట్టి యాదవులు అందరును నశించిరను విషయమును అర్జునుని నుండి తెలిసికొని పరీక్షిత్తును రాజ్యాభిషిక్తునిచేసి, సోదరసహితుడై స్వర్గము చేరెను. (14)