అగ్ని మహా పురాణము
భువనకోశ వర్ణన
అగ్నిదేవుడు చెప్పెను:
వసిష్ఠా! భూమి విస్తారము డెబ్బది వేల యోజనములని చెప్పబడినది. రవి ఎత్తు పదివేల యోజనములు. భూమి క్రింద ఏడు పాతాళములు ఉన్నవి. ఒక్కొక్క పాతాళము పదేసి వేల విస్తారము గలది. అతలము, వితలము, నితలము, ప్రకాశమానమగు మహాతలము, సుతలము, తలాతలము, రసాతలము అని వాటి పేర్లు, ఈ పాతాళముల భూములు క్రమముగా నలుపు, పసుపు, ఎరుపు, తెలుపు, శర్కరామయము, శిలామయము, సువర్ణమయము అయి ఉండును. ఈ పాతాళములు అన్నియు చాల సుందరములైనవి. వాటిలో దైత్యదానవాదులు సుఖముగా నివసించుచుందురు. ఈ పాతాళముల క్రింద శ్రీమహావిష్ణువు యొక్క తమోగుణ ప్రధాన విగ్రహమైన ఆదిశేషుడు ఉండును. ఇతనికి ఆనంతగుణములుండుటచే అనంతుడని పేరు. ఇతడు తన శిరముపై భూమిని ధరించుచుండును. భూమి క్రింద అనేక నరకములున్నవి. కాని విష్ణు భక్తులు నరకములకు వెళ్ళరు. సూర్యునిచే ప్రకాశింప చేయబడుచున్న పృథ్వి ఎంత విస్తృతమైనదో నభోలోకము గూడ అంత విస్తృతమైనది. వసిష్ఠా! సూర్యుడు పృథివికి ఒక లక్ష యోజనముల దూరము నందుండును. సూర్యునకు లక్ష యోజనముల దూరమున చంద్రుడు ఉండును. చంద్రునకు లక్షయోజనముల దూరమున నక్షత్రమండలమున్నది. నక్షత్రమండలమునకు రెండు లక్షల యోజనముల దూరమున బుధుడు, అచటికి రెండు లక్షల యోజనముల దూరమున శుక్రుడు, అచటికి రెండు లక్షల యోజనముల దూరమున కుజుడు, అచటికి రెండు లక్షల యోజనముల దూరమున గురుడు, అచటకు రెండు లక్షల యోజనముల దూరమున శనియు ఉన్నారు. అక్కడికి లక్ష యోజనముల దూరమున సప్తర్షి మండలమున్నది. సప్తర్షి మండలమునకు లక్ష యోజనముల దూరమున ధ్రువుడు ఉన్నాడు. త్రిలోకముల ఎత్తు ఇదియే. ధ్రువునకు కోటి యోజనముల దూరమున మహర్లోకమున్నది. కల్పాంత జీవులగు భృగ్వాదులు ఆ లోకమునందు ఉందురు. మహర్లోకము నుండి రెండు కోట్ల యోజనముల దూరమున జనలోకమున్నది. సనక-సనందనాది సిద్ధపురుషులు అచట నివసింతురు. జనలోకము నుండి ఎనిమిది కోట్ల యోజనముల దూరమున తపోలోకము ఉన్నది. అచట వైరాజులు అను దేవతలు నివసించుచుందురు. తపోలోకము నుండి తొంబది ఆరుకోట్ల యోజనముల దూరమున సత్యలోకమున్నది. మృత్యురహితులగు పుణ్యాత్ములు, దేవతలు, ఋషులు ఆ సత్యలోకమునందు నివసింతురు. దానికి బ్రహ్మలోకమని పేరు.
పాదములతో నడచి వెళ్లునంతవరకు ఉన్నది భూలోకము. భూలోకము-సూర్య మండలముల మధ్యన ఉన్న లోకము భువర్లోకము. సూర్యలోకమునుండి ధ్రువలోకము వరకును ఉన్నది స్వర్గలోకము. దాని విస్తారము పదునాలుగు లక్షల యోజనములు. ఇదే త్రైలోక్యము. అండకటాహముచే చుట్టబడి ఉన్న విస్తృత బ్రహ్మాండమిదియే; ఈ బ్రహ్మాండమును క్రమముగ జల, అగ్ని, వాయు, ఆకాశరూపములగు ఆవరణములు బైట ఆవరించి ఉన్నవి. వీటి అన్నింటి పైన అహంకారావరణ మున్నది. ఈ జలాద్యావరణములు ఉత్తరోత్తరము పది రెట్లు చొప్పున ఉండును. అహంకార రూపావరణమును మహత్తత్వ రూపావరణము చుట్టియున్నది. మహామునీ! ఈ ఆవరణములన్నియు ఒకదానికంటె ఒకటి క్రమముగ పదిరెట్లు పెద్దవి. ప్రధానము మహత్తత్వమును కూడ ఆవరించి యున్నది. దాని కెన్నడును అంతము లేదు కాన అనంతము. అందుచేతనే దానికి సంఖ్యగాని, ప్రమాణముగాని లేదు. మునీ! అది సకల జగత్కారణము. దానికే అపరా ప్రకృతి అని పేరు. దానినుండి అసంఖ్యాకములగు బ్రహ్మాండములు పుట్టినవి. కాష్ఠము నందు అగ్ని, తిలయందు తైలము ఉన్నట్లు ప్రధానమునందు స్వయంప్రకాశ చేతనాత్మకుడగు వ్యాపకుడైన పురుషుడున్నాడు. ఓ మహాప్రాజ్ఞా! పరస్పర సంయుక్తులైన ప్రకృతి పురుషులు సకల భూతముల ఆత్మయగు విష్ణుశక్తిచే ఆవరింపబడి ఉన్నారు. మహామునీ! శ్రీమహావిష్ణు స్వరూపమగు ఆ శక్తియే ప్రకృతి పురుషుల సంయోగ వియోగములకు హేతువు. సృష్టి సమయమున వాటియందు క్షోభ కలుగుటకు హేతువు అదియే. జలసంపర్కముచే ఎట్లు వాయువు జలకణములందున్న శీతలత్వమును ధరించునో అట్లే మహావిష్ణుశక్తి ప్రకృతి పురుషమయ జగత్తును ధరించుచున్నది. విష్ణు శక్తి ఆశ్రయము వలననే దేవతాదులు ప్రకటమగుచున్నారు. ఆ విష్ణువే బ్రహ్మ. సకల జగత్కారణము.
మునిశ్రేష్ఠా! సూర్యుని రథము విస్తారము తొమ్మిదివేల యోజనములు. దాని ఈషా దండము దీనికి రెట్టింపు. పద్దెనిమిదివేల యోజనముల పొడవైనది. దాని ఇరుసు ఒకటిన్నర కోట్ల ఏడు లక్షల పొడవుగలది. దానిపై చక్రము తగిల్చియున్నది. దానికి పూర్వాహ్న మధ్యాహ్న, అపరాహ్నములను మూడు నాభులున్నవి. సంవత్సర, పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, వత్సరములు అను ఐదు ఆకులు, ఆరు ఋతువులు, ఆరునేములు, రెండు అయనములు దాని శరీరము. ఈ సంవత్సరమయ రథచక్రమున కాలచక్ర మంతయు ప్రతిష్ఠితమైనది. మహామతీ! సూర్య రథము ధుర నలుబది యైదువేల పొడవైనది. దాని యుగము (కాడి)లో సగము భాగము రెండుధురల పరిమాణముతో తుల్యము. ఆ రథము నందలి చిన్న ధురయు, దాని యుగార్ధము ధ్రువాధారముపై ఉన్నవి. ఉత్తమవ్రతపాలకా! గాయత్ర్యాది ఛందఃసప్తకము సూర్యుని ఏడు గుఱ్ఱములు. సూర్యుడు కనబడుట ఉదయము, కనపడకుండుట అస్తమయము, వసిష్ఠా! పృథివి మొదలు ధ్రువుని వరకును ఉన్న ప్రదేశము ప్రళయకాలమునందు నశించిపోవును. సప్తర్షుల పైన ఉత్తరముగ ధ్రువుడున్న ప్రదేశము విరాడ్రూపుడగు శ్రీమహావిష్ణువు మూడవ పదము. పుణ్యపాపములు క్షీణింపగా దోషరూప పంక విముక్తులగు సంయతచిత్తులైన మహాత్ములకు అది నివాస స్థానము. ఈ విష్ణు పదము నుండియే గంగ ఆవిర్భవించినది. గంగ సంస్మరణ మాత్రము చేతనే సకల పాపములను నశింప చేయును. ఆకాశమునందు శింశుమార ఆకృతితో ఉన్న నక్షత్ర సముదాయము విష్ణు స్వరూపమైనది.
దాని పుచ్ఛభాగము ధ్రువుని స్థానము. ధ్రువుడు తాను తిరుగుచు, చంద్ర సూర్యాదులను తిప్పుచున్నాడు. సూర్యుని రథమును ప్రతి మాసమునందును, వేరు వేరు దేవతలు, శ్రేష్ఠులైన ఋషులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, సర్పములు, రాక్షసులు అధిష్ఠించి ఉందురు. సూర్యుడే చలి, వేడి, వర్షము మొదలగు వాటికి కారణము. ఋగ్యజుఃసామ వేదాత్మకుడగు శ్రీమహావిష్ణువు ఈ సూర్యుడే. ఇతడే శుభాశుభములను ఇచ్చువాడు. మూడు చక్రములుగల చంద్రుని రథమునకు కుడి ఎడమవైపుల కుంద కుసుమము వలె తెల్లగా ఉండు పది గుఱ్ఱములు కట్టబడి ఉండును. ఆ రథముపై చంద్రుడు సంచరించును. ముప్పది మూడు వేల ముప్పదిమూడు వందల ముప్పది ముగ్గురు (36,383) దేవతలు చంద్రుని అమృతమయ కళలను పానము చేయుచుందురు. అమావాస్యయందు, పితృ దేవతలు, ‘అమా’ అను కళను ఆశ్రయించి, చంద్రుని మిగిలిన రెండు కళలలో ఒక అమృత కళను త్రాగుదురు.
చంద్రుని కుమారుడైన బుధుని రథము వాయువు అగ్నిమయ పదార్థ నిర్మితము. ఎనిమిది గుఱ్ఱములు ఉండును. ఆ రథముపై బుధుడు సంచరించు చుండును. శుక్ర, కుజ, గురు, శని, రాహు, కేతువుల రథములకు గూడ ఎనిమిదేసి గుఱ్ఱములుండును. విప్రవరా! శ్రీమహావిష్ణు స్వరూపమగు జలమునుండి పర్వత, సముద్రాదిసహితము, కమల సదృశము అగు పృథివి ఉత్పన్నమైనది. గ్రహ, నక్షత్ర, త్రిలోక, నదీ, పర్వత, సముద్ర, వనాదులన్నియు విష్ణు స్వరూపములే. విజ్ఞాన విస్తారముకూడ విష్ణు స్వరూపమే. ‘విజ్ఞానము కంటె అతిరిక్తమగు వస్తు వేదియును లేదు’. శ్రీమహావిష్ణువు జ్ఞానస్వరూపుడు. ఆతడే పరమపదము. చిత్తశుద్ధి ద్వారా విశుద్ధ జ్ఞానమును పొంది విష్ణు స్వరూపుడు అగుటకు తగు ఉపాయములను మానవుడు అవలంబించవలెను. సత్యము, అనంత జ్ఞానస్వరూపము అగు బ్రహ్మమే విష్ణువు.
ఈ భువనకోశమును పఠించువాడు పరమాత్మ పదమును పొందును. ఇపుడు నేను జ్యోతిశ్శాస్త్రాది విద్యలను గూర్చి చెప్పెదను. వాటిలో చెప్పిన శుభాశుభ ఫలములకు అధిపతి శ్రీమహావిష్ణువే. (120)
