అగ్ని మహా పురాణము
సిద్ధౌషదాది కథనము
అగ్నిదేవుడు పలికెను:
ధన్వంతరిచే సుశ్రుతునకు చెప్పబడినదియు మృత సంజీవనమును శ్రేష్ఠమును అగు ఆయుర్వేద మును గూర్చి చెప్పెదను అని అగ్ని పలుకగా సుశ్రుతుడు మనుష్య, అశ్వ, గజ రోగములను తొలగించు ఆయుర్వేదమును మృతసంజీవన కరములగు సిద్ధ యోగములను సిద్ధ మంత్రములను నాకు చెప్పుము అని అడిగెను. అప్పుడు ధన్వంతరి అతడితో ఇట్లు పలికెను. జ్వరము వచ్చినవాని బలము చూచుకొని వైద్యుడు లంఘనమును చేయించవలెను. పిదప శుంఠితో కూడినదియు, దాహమును జ్వరమును తగ్గించు, లాజలగంజిని కాచిన జలమును ముస్త, పర్పట, కోశరి, చందన, ఉదీచ్య, నాగరములు వేసి కాచి ఇవ్వవలెను. ఆరుదినములు గడచిన తరువాత, తిక్తకషాయమును తప్పక త్రాగించవలెను. జ్వరము తగ్గిన తరవాత, చెమట పట్టునట్లు చేసి, విరేచనమునకు మందు ఇవ్వవలెను. షష్టికనీవారములు రక్తశాలులు ప్రమోదకములు. ఇట్టి పాత ధాన్యములు జ్వరమునందు మంచివి. యవలతో చేసిన పదార్థములు మంచివి. ముద్గ, మసూర, చణక, కులుత్థ, కుష్ఠక, అఢకి, నారకాదులును కర్కోటక, కట, ఉల్చకములును ఫలములతో కూడిన పటోలము, వేప, దాడిమము ఇవి జ్వరమునందు హితకరములు. రక్తపిత్థము అధోగతి గలదియైనచో, వమనము ఊర్థ్వగతి కలదియైనచో విరేచనము ప్రశస్తము. శుంఠి చేర్చక తయారుచేసిన షడంగ క్వాథము ఇవ్వవలెను. ఈ రోగమున సక్తు, గోధూమ, లాజయవ, గాలి, మసూర, మకుష్ట, చణక, ముద్గములు, హితకరములు. పాలు నెయ్యి చేర్చి చేసిన గోధుమ పదార్థములు బలవర్థకములగు రసము తేనె, శ్రేష్టమైనది. అతిసార రోగము నందు పాత బియ్యమును భక్షించుట హితకరము.
గుల్మ రోగమునందు కఫకరము కానిదియు, లోధ్ర వృక్షపు బెరడుతో చేసిన క్వాథము కలిసినదియు అగు అన్నము మంచిది, వాయుకరములగు అన్నమును త్యజించ వలయును. ఉదర రోగమున క్షీరముతో కలిపి ఘృతసాధితమగు వాట్యమును తినవలెను. గోధుమలు, బియ్యము, తిక్తఔషధములు వీరికి మంచివి. గోధుమలు, బియ్యము, ముద్గములు, పలాశ బీజములు, ఖదిరము, అభయ పంచకోణము, జాంగలము నింబ పటోలకములు, ఉసిరి, మాతులుంగ రసము, జాజి, శుష్కమూలకము, సైంధవము, ఇవి కుష్ఠు రోగములకు హితకరములు. త్రాగుటకు ఖదిరోదకము మంచిది. పేయమునకు మసూర ముద్గములు ఉపయోగించవలెను. తినుటకు పాత బియ్యము హితకరము! నింబ పర్చటక శాకములు జాంగల రసము, విడంగ, మరిచ, ముస్త, కుష్ఠ, లోధ్ర, సువర్చికా, మనశ్శిలా, వచలు, గోమూత్రమున నూరినవి కుష్ఠమును తొలగించును. మేహవ్యాధి కలవారికి అపూప కుష్ఠ కుల్మాష యవాదులు హితకరములు. యవలతో చేసిన పదార్థములు పెసలు ఉలవలు, పాత బియ్యము, తిక్తరూక్ష, శాకములు, తిక్తములు, హరితములగు శాకములు, తిలసిగ్రుక, విభీతక, ఇంగుదీ తైలములు హితకరములు. రాజయక్ష్మరోగులకు ముద్గయవ గోధూమములు ఒక సంవత్సరము నిల్వ ఉన్న ధాన్యము జాంగల రసము భోజనమునందు ప్రశస్తము. శ్వాసకాస రోగులకు కులుత్థ, ముద్గ, కోల, శుష్కమూలక జాంగల అపూప, దధులు దాడిమరస సాధితములగు విష్కిల జాంగల రసమాతులుంగ రస, క్షౌద్ర, ద్రాక్షాదులు, వ్యోష సంస్కృతములగు యవలు, గోధూమ, శాల్యన్నములు హితకరములు. దశమూల, బల, రాస్నలు, కుళుత్థ నిర్మితములగు పేయములు పూపరసక్వాథములు శ్వాసను ఎక్కిళ్ళను తొలగించును.
శుష్కమూల కుళుత్థ-మూల జాంగల జరసములు, పాతయవలు, గోధుమలు, పాతవరి-ఉశీరముతో కలిపి తీసుకొన్నచో శ్వాసకాసములు తొలగును. శోథరోగి గుడ సహిత పథ్యనుకాని. గుడ నాగరమునుగాని తినవలెను. తక్రము, చిత్రకము, ఈ రెండును గ్రహణీ రోగమును తొలగించును. సర్వదా వాతరోగముతో బాధపడువారికి పాత యవలు, గోధూమలు వరి, జాంగల రసము, ముద్గ అమలక, ఖర్జూర మృద్వీకా బదరములు, మధువు, నెయ్యి, పాలు, శక్రము, నింబము, పర్పటకము, బలకారక ద్రవ్యములు, తక్రారిష్టములు హితకరములు హృదయ రోగము కలవారికి విరేచనము చేయించవలెను. ఎక్కిళ్ళకు పిప్పలి మంచిది. మజ్జిగ ఆరణాలము, సీధువులను చల్లటి నీటితో తీసుకొనవలెను. ఎక్కిళ్ళకు మంచిది. మదాత్యయ రోగమున ముత్యములు, సౌవర్చలా జాదికము మద్యము హితకరమైనది. గాయపడినవాడు క్షేత్రము పాలు కలిపిన లాక్షను త్రాగవలెను. మాంస రసాహారము అగ్ని సంరక్షమై క్షయ రోగమును జయించును. క్షయ రోగికి భోజనమున ఎర్రవరి నీవారములు కలవములు మొదలగునవి హితకరములు, హర్షరోగమున యవాన్న వికృతులు మాంసము, శాకము, సౌవర్చలము, శటి, మండపము జలము కలిపిన తక్రము మంచివి. మూత్ర కృచ్ఛ్ర రోగమున ముస్తాభ్యాసము, హరిద్రా చిత్రకలేపము, యవాన్న వికృతులు, వరి వాస్తూకము, సువర్చలము త్రప్పు, క్షీరేక్షుఘృత మిశ్రితములగు గోధుమలు తినుటకు మంచివి. మండసురాదులు తాగుటకు మంచివి. వమన రోగమునకు లాజలు, సక్తువులు, మధువు శూన్యమాంసము, పరూషకము, వార్తాకము, నెమలి రెక్కలు కొన్ని పానకములు మంచివి. వరి అన్నము కాచిన నీరు, పాలు, దాహమును కట్టును. ముస్తా గుడములతో చేసిన గుటికను ముఖమునందు ఉంచుకున్నను దాహము తొలుగును. యవాన్న వికృతులు పూపము, శుష్కమూలకము, శాకము, వేత్రాగ్రము, ఇవి మోకాలు పట్టుకొనుటను తొలగించును. విసర్ఫరోగము కలవాడు ముద్గ ఆడక, మసూరముల గంజి తిలయు జాంగలరసము, సైంధవ యుక్త ఘృతము, ద్రాక్ష, శుంఠి, ఉసిరి, కోలము వీటి యూషములతో పాత గోధుమలు, యవలు వరి వీటి అన్నమును తినవలెను. విసర్పి మధు ద్రాక్షా దాడిమములతో చేసిన జలమును పంచదార కలిపి త్రాగవలెను.
వాత రక్త రోగి ఎర్రవరి, గోధుమలు, ముద్గములు మొదలగు అన్నములు, లఘువుగా తినవలెను. కాకమారి, వేత్రాగ్రము, వాస్తుకము, సువర్చలా, మొదలగు శాకములు, మధుశర్కరా మిశ్రితమగు జలము తీసుకొనవలెను. నాసికా రోగమునకు దూర్వా సిద్ధమగు ఘృతము హితము. భృంగరాజ రసముతోగాని, ఆమలక రసముతో కాని శోధితమైన తైలమును నశ్యముగా, ఇచ్చినచో సమస్త శిరోరోగములకు హితకరములు, శీతల జల అన్నపానములు తిలభక్షణము దంతములను దృఢము చేసి గొప్ప తృప్తిని కలిగించును. తిల తైలముతో గండూషము దంతములకు దార్ఢ్యము నిచ్చును. విడంగ చూర్ణము, గోమూత్రము అన్ని విధముల క్రిమి నాశనమునకు ఉపయోగించును. ఉసిరి పండ్లు నూరి, నేతిలో కలిపి శిరస్సుకు మర్దించినచో శిరోరోగములు నశించును.స్నిగ్ధము, ఉష్ణము అయిన భోజనము కూడ శిరోరోగమునకు మంచిది. కర్ణశూలము తొలగించుటకు చెవులలో తైలముగాని, మేక మూత్రముగాని నింపవలెను. ఇది సకల శిరోరోగములకు మంచిది. గిరి మృత్తిక, లాక్ష, చందనము, మాలతీకలిక, వీటిని కలిపి నూరి చేసిన వర్తి క్షతమును శుక్ర దోషమును హరించును. వ్యోషము త్రిఫలమును, తుచ్ఛకమును జలమును కలిపి కంటిలోవేసినచో సర్వనేత్ర రోగ నాశకము, రసాంజనము కూడ ఇందుకు మంచిది. లోధ్రకాంజిక సైంధములను నేతిలో వేయించి శిలపై నూరి నేత్రమునకు లేపము చేసినచో అన్ని నేత్ర రోగములు తొలగును. నీళ్ళు కారుట తగ్గును. గిరి మృత్తికా చందనము వీటిని పైన రాసినచో కండ్లకు మంచిది. నేత్ర రోగ నాశనమునకైన సర్వదా త్రిఫలము సేవించవలెను.
దీర్ఘాయుర్దాయము కోరువాడు త్రిఫలను మధుఘృతములతో సేవించవలెను. శతావరి రససోదితములగు క్షీర ఘృతములు బలవర్ధకములు. మాషములు పాలు నెయ్యి ఇవి కూడ బలవర్ధకములు. వెనుక చెప్పినట్లు మధుకామిశ్రితమగు త్రిఫల ఆయుర్వర్ధకము. మధుకాది రసమిశ్రితమగు త్రిఫల బళులను ఫలితమును నశింపచేయును. వచాసిద్ధమగు ఘృతము భూతదోషమును నివారించును. దానితోచేసిన కవ్యము బుద్ధి ప్రదము. సర్వమనో రథసాధకము. బలాకల్క కషాయముతో చేసినది అభ్యంజనమునకు మంచిది. రాస్నతోగాని, సహచరితోగాని సిద్ధమైన తైలము వాతరోగులకు మంచిది. వ్రణములకు శ్లేష్మ చేయని ఆహారము మంచిది. జీర్ణమునకు సక్తుపిండి ఆమ్ల ప్రశస్తములు. వేప చూర్ణము వ్రణము పక్వమైనపుడు దానిని చితికించుటకును, మాన్పుటకును మంచిది. అట్లే సూదితో చికిత్స కూడ వ్రణమునకు మంచిది. బలికర్మ విశేషముచే సూతికకు లాభమగును. రక్షాకర్మ ప్రాణులకు సర్వదా హితకరము. సర్పదష్టునకు నింబపత్ర భక్షణము ఔషధము. తాళనింబ పత్రములు పురాణ తైలము లేదా పురాణ ఘృతము కేశములకు మంచిది. తేలుకుట్టినవానికి నెమలి పింఛము, ఘృతము, వీటితో ధూపము మంచిది. లేదా జిల్లేడు పాలతో నూరిన పలాశ బీజముల లేపము తేలు విషమును దింపివేయును. తేలుకుట్టిన వానికి కృష్ణా ఫలములుకాని శివా ఫలములుకాని తినిపించవలెను, జిల్లేడు పాలు తిలలు తైలము పలలము గుడము వీటిని సమాన మాత్రలో వేసి త్రాగించినచో భయంకరమగు కుక్క విషము శీఘ్రముగ నశించును. మూలమును, త్రివృత్తును సమాన మాత్రలో నేతితో త్రాగినచో మనుష్యుడు బలవంతుడై సర్వ కీట విషములను జయించును. చందనము, పద్మము, కుష్ఠము, లతాంబు, ఉషీరము, పాటల, నిర్గుండి, శారిబ సేలు, ఇవి సాలెపురుగు విషమును తొలగించును. గుడ సహితమగు శుంఠి శీరో విరేచనమునకు మంచిది, స్నేహపానమునకు బస్తి క్రీపును తైలఘృతములు అత్యుత్తమములు. అధికాగ్నికి స్వేదనము, (చెమట పట్టించుట) స్తంభనమునకు చల్లటి నీరు శ్రేష్ఠము. రేచనమునకు త్రివృద్ధియు, వమనమునకు మదనమును శ్రేష్ఠము. నస్తి విరేచన వమనములు తైలఘృత మధువులు క్రమముగ వాత పిత్థ కఫములకు పరమౌషధములు. (279)
