అగ్ని మహా పురాణము

Table of Contents

వరాహ, వామన, పరశురామావతార కథలు

అగ్ని దేవుడు ఇట్లు పలికెను: ఇప్పుడు పాపములను నశింపచేయు వరాహ అవతారమును గూర్చి చెప్పెదను. హిరణ్యాక్షుడు అనెడు రాక్షసరాజు ఉండెను. అతడు దేవతలను జయించి స్వర్గ లోకములో నివసించెను.

యజ్ఞ స్వరూపుడగు విష్ణువును దేవతలు అందరును వచ్చి స్తుతింపగా ఆ హరి వరాహరూపము ధరించి, లోకకంటకుడైన ఆ దానవుని దైత్యులకు కూడ ఆశ్చర్యకరము అగు విధమున సంహరించి, ధర్మమును దేవతలు మొదలగువారిని రక్షించి అంతర్థానము చెందెను.

హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు దేవతల యజ్ఞభాగములను అపహరించి దేవతలందరి పైనను అధికారమును జరిపెను. విష్ణువు దేవతా సమేతుడై (వెళ్లి) నరసింహ రూపము దాల్చి ఆ హిరణ్యకశిపుని సంహరించెను. దేవతలచే స్తుతింపబడిన ఆ నరసింహుడు దేవతలను తమతమ స్థానములలో నిలిపెను. పూర్వము దేవాసుర యుద్ధమునందు బలి మొదలగు వారిచే సురలు పరాజితులై, స్వర్గమును కోల్పోయిరి. వారు అపుడు హరిని శరణువేడిరి. విష్ణువు దేవతలకు అభయము ఇచ్చి, అదితి కశ్యపులు తనను స్తుతింపగా అదితి యందు వామనుడుగ జన్మించెను. ఆ వామనుడు శోభాయుక్తముగ యజ్ఞము చేయుచున్న బలిచక్రవర్తి యజ్ఞమునకు వెళ్లి అచట రాజద్వారము నందు వేదమును పఠించెను.

బలి వేదములను పఠించుచున్న ఆ వామనుని చూచి, అతడు కోరువరముల నీయవలెనని నిశ్చయించుకొని, శుక్రాచార్యుడు నివారించుచున్నను, ఆతనితో-‘నీకేమి కావలెనో కోరుకొనుము; ఇచ్చెదను’ అని పలికెను. వామనుడు బలితో ‘మూడు అడుగుల నేలను ఇమ్ము; నా గురువునకు కావలెను’ అనెను. బలి ‘అట్లే ఇచ్చెదను’ అని పలికెను.

దానజలము చేతిలో పడగానే వామనుడు ఆవామనుడు (పెద్ద శరీరము కలవాడు) ఆయెను. భూలోక, భువర్లోక, స్వర్లోకములను మూడు అడుగులుగా గ్రహించి బలిని సుతలమునకు త్రొక్కి వేసెను. వామనరూపుడైన హరి ఆ లోకత్రయమును దేవేంద్రునకు ఇచ్చెను. దేవతాసహితుడు అగు ఇంద్రుడు హరిని స్తుతించి, త్రిభువనాధీశుడై సుఖముగా ఉండెను.

ఓ బ్రాహ్మణా! పరశురాముని అవతారమును గూర్చి చెప్పెదను వినుము, ఆ శ్రీమహావిష్ణువు, క్షత్రియులు ఉద్ధతులుగా ఉన్నారని తలచి, భూ భారమును హరించుటకై, దేవతలను, విప్రాదులను పాలింపనున్నవాడై, శాంతి నెలకొల్పుటకై, జమదగ్నినుండి రేణుకయందు సర్వశాస్త్ర విద్యాపారంగతుడైన భార్గవుడుగా (పరశురాముడుగా) అవతరించినాడు.

కార్తవీర్యుడు అను రాజు దత్తాత్రేయుని అనుగ్రహముచే వేయి బాహువులు కలవాడుగను, సకల భూమండలమునకును రాజుగను ఆయెను. ఆతడు వేటకు వెళ్లెను.

అరణ్యములో అలసిన, సేనాసమేతుడైన ఆ రాజును జమదగ్ని మహర్షి తన కుటీరమునకు ఆహ్వానించి కామధేనువు ప్రభావముచేత భోజనము పెట్టెను.

కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువును తనకు ఇమ్మని కోరెను. జమదగ్ని ఇచ్చుటకు నిరాకరించెను. అపుడు ఆతడు దానిని అపహరించెను. పిదప పరశురాముడు యుద్ధములో పరశువుచే ఆతని శిరస్సు ఖండించి ధేనువుతో ఆశ్రమమునకు తిరిగి వెళ్లెను.

పరశురాముడు వనమునకు వెళ్ళియుండగా కార్తవీర్యుని పుత్రులు పూర్వవైరము వలన జమదగ్నిని చంపిరి. అంత తిరిగి వచ్చిన ప్రభావశాలియగు పరశురాముడు చంపబడిన తండ్రిని చూచి, తండ్రిని ఆ విధముగ చంపుటచే కోపించి, ఇరువది యొక్క పర్యాయములు పృథివిని క్షత్రియులు లేనిదానినిగాచేసి, కురుక్షేత్రమునందు ఐదుకుండలములనుచేసి, వాటితో పితృ దేవతలను తృప్తిపరచి, భూమినంతను కశ్యపునకు దానముచేసి, మహేంద్ర పర్వతముపై నివసించెను. కూర్మ, వరాహ, నరసింహ, పరశురామ అవతార గాథలు విన్న మానవుడు స్వర్గమునకు వెళ్లును. (4)