అగ్ని మహా పురాణము

Table of Contents

పుష్పాది పూజాఫల కథనము

అగ్నిదేవుడు పలికెను: వశిష్ఠా! పుష్పములతో పూజించినచో శ్రీమహావిష్ణువు అన్ని కార్యములను సిద్ధింప చేయును. మాలతి, మల్లిక, గిలిమల్లిక, గులాబి, కనేరము, పాపంతి, అతిముక్తకము, కర్ణికారము, కురంటకము, తగరము, నీపము, బాణము, యూథిక, అశోకము, తిలకము, కుందము, తమాలము -ఈ పూవులతో పూజ శ్రేష్ఠము. బిల్వపత్రము, శమీపత్రము, భృంగరాజ పత్రము, తులసి, కృష్ణతులసి, వాసక పత్రము-ఇవి కూడ పూజకు తగినవి. కేతకీపత్ర-పుష్పములు, పద్మములు, రక్త కమలములుకూడ పూజలో గ్రాహ్యములు. జిల్లేడు, ధత్తూరము, గులివెంత, పర్వత మల్లిక, కుటజము, శాల్మలి, కటోర పుష్పము-ఇవి పూజానర్హములు. ప్రస్థము (నాలుగు పేర్లు) నెయ్యితో శ్రీమహావిష్ణువు నకు అభిషేకము చేసినచో కోటి గోవుల దానముచేసిన ఫలము లభించును. ఒక ఆడకము ఘృతముతో అభిషేకము చేసినవాడు రాజ్యమును పొందును. ఘృతమిశ్ర దుగ్ధముతో అభిషేకము చేసినవాడు స్వర్గమును పొందును. (248)