అగ్ని మహా పురాణము

Table of Contents

పంచాంగ రుద్ర దష్ట చికిత్స

అగ్నిదేవుడు చెప్పెను:

ఇపుడు అత్యుత్తమము సర్వ కామప్రదమగు పంచాంగ రుద్ర విధానమును చెప్పెదను. దీనికి శివ సంకల్పము హృదయము. పురుష సూక్తము శిరస్సు. ‘అద్భ్యః సంభూతః’ (యజు 31-17) ఇత్యాది సూక్తము ‘ఆశుః శిషానః’ ఇత్యాది అధ్యాయము కవచము. శతరుద్రీయము అను రుద్రమునకు ఈ యైదును అంగములు. రుద్ర దేవత ధ్యానముచేసి పంచాంగ భూత రుద్రుల జపము క్రమముగ చేయవలయును. ‘యజ్జాగ్రతో మొదలగు ఆరు ఋక్కులుగల శివసంకల్ప సూక్తము (యజు 34-1-6) దీని హృదయము. దీని ఋషీ శివ సంకల్పుడు. ఛందస్సు త్రిష్టుప్ ‘సహస్రశీర్షా’ యను ప్రారంభముగల పురుష సూక్తము దీనికి శీర్ష స్థానీయము. దీని ఋషి నారాయణుడు. పురుషుడు దేవత, అనుష్టుప్ త్రిష్టులు ఛందస్సులు. ‘అద్భ్యః సంభూతః’ ఇత్యాది సూక్తమునకు ఉత్తరగామి నరులు ఋషులు. వీటిలో క్రమముగా మొదటి మూడు మంత్రములకు త్రిష్టుప్ తరువాత రెండు మంత్రములపై అనుష్టుప్ చివర మంత్రములకు త్రిష్టుప్ ఛందస్సులు. పురుషుడు దేవత ‘ఆశుః శిషానః’ (యజు 17-33) ఇత్యాది సూక్తమున పన్నెండు మంత్రములకు ఇంద్రుడు దేవత. ఛందస్సు త్రిష్టుప్. పదునేడు ఋక్కులుగల ఈ సూక్తమునకు ఋషి ప్రతిరథుడు. దేవతలు మాత్రము వేరువేరుగ ఉందురు. కొన్ని మంత్రములకు పురువిత్ అంగదేవత. మిగిలిన దేవతా మంత్రములకు ఛందస్సు అనుష్టుప్. ‘అసౌయస్తామ్రః’ (యజు 16-6) మంత్రములకు పురులింగోక్త దేవత. పంక్తి ఛందస్సు. ‘మర్మాణితే’ (యజు 17-19) మంత్రమునకు త్రిష్టుప్ ఛందస్సు, దేవత లింగోక్తము. రుద్రాధ్యాయమునంతకును ఋషి పరమేష్టి. దేవానామిత్యాది మంత్రములకు ఋషి ప్రజాపతి. మూడు ఋక్కులకు మాత్రము ఋషికుత్సుడు. ‘మానోమహాంతం’ (యజు 10-15) ‘మానస్తోకే’ (యజు 16-16) అను రెండు మంత్రములకు ఉమయు అన్యమంత్రములకు రుద్రుడును రుద్ర గణములును దేవతలు. పదునారు ఋక్కులుగల మొదటి అనువాకమునకు దేవత రుద్రుడు. మొదటి మంత్రమునకు ఛందస్సు గాయత్రి. మూడు ఋక్కులకు అనుష్టుప్. మూడు ఋక్కులకు పంక్తి. ఏడు ఋక్కులకు అనుష్టుప్, రెండు మంత్రములకు జగతి. ‘నమోహిరణ్య బాహవే (యజు 16-17) మొదలు ‘నమో వః కిరికేభ్యః’ వరకు రుద్రగణము యొక్క మూడు ఆశీతులు ఉన్నవి. రుద్రానువాకము నందలి ఐదు ఋక్కులకు రుద్రుడు దేవత. ఇరువదవ ఋక్కునకు కూడ దేవత రుద్రుడు. మొదట ఋక్కు యొక్క ఛందస్సు బృహతి, రెండవదాని ఛందస్సు త్రిజగతి. మూడవదాని ఛందస్సు త్రిష్టుప్. మిగిలిన మూడును అనుష్టుప్. వీటి జ్ఞానము కలవాడు మంచి సిద్ధిని పొందును. త్రైలోక్య, మోహన మంత్రము కూడ విషమును తొలగించును. ‘ఐం శ్రీం, హీం హ్రూం త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః’ అనునది మంత్రము. ‘ఓం హం మొదలు నమామ్యహమ్ వరకును వున్న మూలోక అనుష్టుభ నృసింహ మంత్రముచేత కూడ విషవ్యాధి తొలగును, ఈ పంచాంగమంత్రము సర్వార్థ సాధకము. ద్వాదశాక్షరి, అష్టాక్షరిలు కూడ విషవ్యాధిని తొలగించును. ‘కుబ్జికా, త్రిపురా, గౌరి, చంద్రికా విషహారిణీ’ అను ప్రసాద మంత్రము విషమును తొలగించి ఆయురారోగ్యమును వృద్ధిపొందించును. సూర్య వినాయక మంత్రములు రుద్ర మంత్రములన్నియు కూడ విషము తొలగించును. (296)