అగ్ని మహా పురాణము

Table of Contents

ఘోర అస్త్రాది శాంతికల్ప నిరూపణము

పరమేశ్వరుడు చెప్పెను:

సమస్త కర్మలయందును ముందుగా సర్వసిద్ధి ప్రదమగు అస్త్రయాగము చేయ వలెను. మధ్యభాగమున శివాది అస్త్రమును, పూర్వాది దిక్కులందు క్రమముగ ఇంద్రాది దిక్పాలకుల అస్త్రములను పూజించవలెను. శంకరునకు ఐదు ముఖములు పది హస్తములు ఉన్నవి. అట్టి శంకరుని యుద్ధ ప్రారంభమున పూజించినచో జయము కలుగును. మధ్య యందు రవిని పూర్వాది దిక్కులందు చంద్రాదులను ఉంచి గ్రహపూజ చేయవలెను. గ్రహపూజ చేయుటచే గ్రహములన్నియు ఏకాదశ స్థానమునందున్న లాభరూప ఫలమును ఇచ్చును. సమస్త ఉత్పాతములను నశింపచేయు అస్త్ర శాంతిని చెప్పెదను. ఇది గ్రహ రోగాదులను, మారిశత్రు భయాదులను తొలగించును. వినాయకుల వలన కల్గిన బాధలను తొలగించును. నరుడు లక్ష పర్యాయములు అఘోరాస్త్రము జపించినచో గ్రహములు నశించును. దివ్య ఉత్పాతములు కలిగినపుడు అర్ధ లక్ష హోమములు చేయవలెను. లక్ష ఆజ్యాహుతులు చేసినచో భూమి జోత్పాతములు నశించును. గుగ్గులు మిశ్ర ఘృతమును హోమము చేసినచో అన్ని ఉత్పాతములు నశించును. దూర్వలు అక్షతలు ఆజ్యము, హోమము చేసిన సర్వ రోగములు నశించును. ఘృతముతో సహస్ర హోమము చేసినచో దుస్స్వప్నములు నశించును. ఇందు సంశయము లేదు. పదివేలు హోమము చేసినచో గ్రహ దోషములు తొలగును. యవఘృత హోమముచే వినాయక బాధలు తొలగును. పదివేల ఆజ్య హోమములు, పదివేల గుగ్గులు హోమములు చేసినచో భూతభేతాళ శాంతి కలుగును. ఏదైన మహా వృక్షము పడిపోయినను, ఇంటిలోనికి సర్పశవము వచ్చినను, ఘృత, అక్షతల హోమములచే విఘ్నశాంతి కలుగును. అరణ్య ప్రవేశము చేయవలసినపుడు కూడ ఇట్లు చేయవలెను. ఉల్కాపాతముగాని, భూకంపముగాని కల్గినపుడు తిలఘృత హోమములు చేసిన మంగళమగును వృక్షము నుండి రక్తము కారినను అకాలమున పుష్ప ఫలములు పుట్టినను రాష్ట్ర భంగము కల్గినను, తిలమిశ్ర ఘృతముతో అర్ధ లక్షహోమములు చేయవలెను. ఏనుగులకు మహామారి వచ్చినపుడు ఆడ ఏనుగులకు దంతములు వచ్చినను లేదా వాటికి గండస్థలమునుండి మదము కారినను పదివేల హోమము చేసినచో శాంతి కలుగును. అకాలమున గర్భపాతమైనను, పుట్టిన వెంటనే శిశువు మరణించినను, వికృతాంగములుగల శిశువు జన్మించినను, సమయమునకు పూర్వమే శిశువు జన్మించినను పదివేల హోమములు చేసిన దోషము శమించును. సిద్ధిని సాధించుటకు తిల మిశ్రమములగు ఘృతముతో ఒక లక్ష హోమములు చేయుట ఉత్తమము. అర్ధ లక్ష హోమములు చేసినచో మధ్యమ సిద్ధియు ఇరువది ఐదువేల హోమము చేసినచో అధమ సిద్ధియు కల్గును. జపానుసారముగ హోమముచేసినచో యుద్ధమునందు విజయము లభించును. తేజశ్శాలియగు పంచముఖుని ధ్యానించుచు న్యాస పూర్వకముగ అఘోరాస్త్ర జపము చేయవలెను. (321)