అగ్ని మహా పురాణము

Table of Contents

శ్రవణ ద్వాదశీ వ్రతము

అగ్ని దేవుడు చెప్పెను:

ఇప్పుడు భాద్రపద శుక్ల పక్షమున చేయబడు ‘శ్రవణ ద్వాదశీ’ వ్రతమును గూర్చి చెప్పెదను. శ్రవణ నక్షత్రయుక్తమైనచో ఈ ద్వాదశి శ్రేష్టమైనది. ఉపవాసము చేసినచో గొప్ప ఫలమును ఇచ్చును. శ్రవణ ద్వాదశినాడు నదీ సంగమస్నానము విశేష ఫలప్రదము. బుధవారశ్రవణ నక్షత్రములు కలిసిన ద్వాదశినాడు చేయు దానాదులు గొప్ప ఫలములను ఇచ్చును. త్రయోదశినాడు నిషిద్ధమైనను ఈ వ్రతము యొక్క పారణము త్రయోదశినాడు చేయవలెను. ‘నేను ద్వాదశినాడు ఉపవాసము ఉండి జలపూర్ణ కలశముపై నున్న సువర్ణ నిర్మిత వామనమూర్తిని పూజించి వ్రత పారణము త్రయోదశినాడు చేసెదను’ అని సంకల్పించవలెను. ‘రెండు శ్వేతవస్త్రములు ధరించినవాడును, ఛత్రపాదుకాధారియు, శంఖచక్రములు ధరించినవాడును అగు వామనుని కలశముపై ఆవాహనము చేయుచున్నాను’, ‘ఛత్రదండ అలంకృతుడగు విష్ణువును పంచామృతములతోను, శుద్ధజలములతోను స్నానము చేయించుచున్నాను. వామనునకు నమస్కారము. ‘అర్ఘ్యమునకు తగువారి చేతను, ఇతరుల చేతను పూజితుడవగు ఓ దేవేశా! నీకు అర్ఘ్యము సమర్పించుచున్నాను. నాకు భోగ, మోక్ష, సంతాన, యశః, పరమైశ్వర్యాదులను ఇమ్ము’ ‘వామనాయ నమః’ అను మంత్రముతో గంధ ద్రవ్యములు సమర్పించి ఈ మంత్రముతోనే నూట ఎనిమిది హోమములు చేయవలెను. ఈ క్రింది విధముగ సర్వాంగ పూజచేయవలెను. ఓం నమో వాసు దేవాయ శిరః పూజయామి, శ్రీధరాయ నమః ముఖం పూజయామి. కృష్ణాయ నమః కణ్ఠం పూజయామి. శ్రీపతయే నమః వక్షస్థలం పూజయామి. సర్వాస్త్ర ధారిణే నమః భుజౌ పూజయామి. వ్యాపకాయ నమః నాభిం పూజయామి. వామనాయ నమః కటిం పూజయామి. త్రైలోక్యజననాయ నమః మేఢ్రం పూజయామి. సర్వాధిపతయే నమః జంఘే పూజయామి సర్వాత్మనే నమః పాదౌ పూజయామి’, పిదప వామనునకు ఘృతపక్వ పదార్థముల నైవేద్యము దధ్యోదన పూర్ణ పాత్రమును సమర్పించవలెను. రాత్రి యందు జాగరముచేసి ప్రాతఃకాలమున సంగమమునందు స్నానము చేయవలెను. పిదప గంధ పుష్పాదులతో పూజించి ఈ విధముగా ప్రార్థించుచు పుష్పాంజలి సమర్పించవలెను-‘బుధుడు, శ్రవణుడు అను పేర్లుగల గోవిందా! నీకు నమస్కారము, నమస్కారము. నా పాపములన్నీ తొలగించి సమస్త సౌఖ్యములను ఇమ్ము, దేవదేవేశ్వరా! జనార్దనా! నేను ఇచ్చిన ఈ పుష్పాంజలిచే సర్వదా ప్రసన్నుడవు కమ్ము’. పిదప పూజా ద్రవ్యములు అన్నియు ఈ క్రింది విధముగా చెప్పుచు బ్రాహ్మణునకు దానము చేయవలెను. ‘వామనుడే బుద్ధి నిచ్చువాడు. వామనుడే దాత. ఈ ద్రవ్యములలో ఉన్నవాడు వామనుడే. వామనుడే దీనిని గ్రహించుచున్నాడు. వామనుడే ఇచ్చుచున్నాడు. వామనుడు అన్ని ద్రవ్యములందును ఉన్నాడు. వామన రూపుడగు విష్ణువునకు నమస్కారము’. పిదప బ్రాహ్మణులకు భోజనము పెట్టి తాను భోజనము చేయవలెను. (189)