అగ్ని మహా పురాణము

Table of Contents

సూతునికి శౌనకాది మునుల ప్రశ్న

శ్రియం సరస్వతీం గౌరీం గణేశ స్కన్దమీశ్వరమ్

బ్రహ్మాణం వహ్ని మిన్ద్రాదీన్వాసుదేవం నమామ్యహమ్

శ్రీ మహాలక్ష్మికిని, సరస్వతికిని, పార్వతికిని, గణపతికిని, కుమారస్వామికిని, మహేశ్వరునకును, అగ్నిదేవునకును, ఇంద్రాదులకును, శ్రీమహావిష్ణువునకును నమస్కరించుచున్నాను.

నైమిశారణ్యము నందు హరిని ఉద్దేశించి యజ్ఞము చేయుచున్న శౌనకాది మహర్షులు తీర్థయాత్రా సందర్శనమున అచ్చటికి వచ్చిన సూతునితో ఇట్లు అనిరి.

“ఓ సూతుడా! నీవు మాకు పూజ్యుడవు (మాచేత పూజింపబడినావు). దేనిని తెలిసికొని నంత మాత్రముచే (మానవునకు) సర్వజ్ఞత్వము కలుగునో అట్టి సారములలో కెల్ల సారమైన దానిని మాకు చెప్పుము.

నారాయణం నమస్కృత్యనరంచైవ నరోత్తమమ్

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్

శ్రీమన్నారాయణునికి, మనుష్యులలో ఉత్తముడైన నరునికి నమస్కరించి, సరస్వతీ దేవికి సన్నుతులు చేసి వ్యాసునికి వందనముచేసి జయము అను ఈ పురాణమును చెప్పుదును.

సూతుడు పలికెను-సృష్ట్యాదులను చేసిన ప్రభువును, భగవంతుడును అయిన శ్రీ మహావిష్ణువే సారములలో కెల్ల సారమైనవాడు, “నేనే ఆ పరబ్రహ్మ స్వరూపుడను” అని ఆ విష్ణువును గూర్చి తెలిసికొన్నచో సర్వజ్ఞత్వము కలుగును.

శబ్దములకు గోచరమగు సగుణబ్రహ్మయు, పరమగు నిర్గుణబ్రహ్మయు తెలుసుకొనవలసినవి. అధర్వ వేదమునకు సంబంధించిన ముండకోపనిషత్తు గూడ- “రెండు విద్యలు తెలిసికొనవలెను” అని చెప్పుచున్నది.

నేనును, శుకుడును, పైలుడు మొదలగువారును బదరిక ఆశ్రమమునకు వెళ్లి వ్యాసునికి నమస్కరించి ప్రశ్నింపగా అపుడు ఆతడు మాకు సారమును ఉపదేశించెను.

వ్యాసుడు పలికెను: నేను మునులతో కలిసివెళ్ళి, పరముకంటె పరమును, సార భూతము అగు బ్రహ్మను గూర్చి ప్రశ్నింపగా వసిష్ఠుడు ఏమని చెప్పెనో, ఓ! సూతా! నీవును శుకాదులును వినుడు.

వసిష్ఠుడు పలికెను: ఓ వ్యాసా! పూర్వము అగ్నిదేవుడు మునులకును, దేవతలకును, నాకును ఏ విధముగా చెప్పెనో ఆ విధముగ సర్వవ్యాప్తమగు, ద్వివిధమైన బ్రహ్మను గూర్చి చెప్పెదను వినుము.

బ్రహ్మవిద్య నాశనరహితమగు పరవిద్య. అందుచే తత్ప్రతిపాదకమగు ఆగ్నేయ పురాణము పరము. సర్వ దేవతలకును సుఖమును కలిగించు ఋగ్వేదాదికము అపర బ్రహ్మ. అపర బ్రహ్మను ప్రతిపాదించునది అగుటచే దానికి ఆ పేరు.

అగ్ని చెప్పిన పురాణము ఆగ్నేయ పురాణము. ఇది వేదముతో సమానమైనది. చదువు వారికిని, వినువారికిని భక్తిముక్తుల నొసగునది. కాలాగ్ని స్వరూపుడును, జ్యోతిః స్వరూపుడును, పరాత్పరమైన బ్రహ్మయు, జ్ఞాన కర్మలచే పూజింపబడువాడును అగు విష్ణుదేవుని మునిసమేతుడై (వసిష్ఠుడు) ప్రశ్నించెను.

వసిష్ఠుడు పలికెను: సకల విద్యల సారమగు ఏ బ్రహ్మను గూర్చి తెలిసికొని నరుడు సర్వజ్ఞత్వమును పొందునో అట్టిదియు, సంసార సాగరమును దాటించుటలో నావయు, సర్వ శక్తమును అగు బ్రహ్మను గూర్చి చెప్పుము.

అగ్ని పలికెను: విష్ణువు నైన నేనే కాలాగ్ని రుద్రుడను. సర్వ స్వరూపమును, సర్వ కారణమును, అతి ప్రాచీనమును అగు విద్యాసారమును గూర్చి నీకు చెప్పెదను.

మత్స్య కూర్మాది రూపములను ధరించిన నేను సృష్టికిని, ప్రళయమునకును, వంశములకును, మన్వంతరములకును, వంశానుచరితము మొదలగు దానికిని కారణమైన వాడను. (ముని ఋష్యాదుల వంశముల వర్ణనము వంశము. ప్రధాన రాజవంశముల వర్ణనము వంశాను చరితము)

పర, అపర అను ఈ రెండు విద్యలును విష్ణు స్వరూపములే. ఓ బ్రాహ్మణా! ఋగ్యజు స్సామాథర్వ వేదములును; శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు అను వేదాంగములు ఆరును; కోశము, మీమాంస, ధర్మశాస్త్రము, పురాణము, న్యాయ శాస్త్రము, ఆయుర్వేదము, సంగీతశాస్త్రము, ధనుర్వేదము, అర్థశాస్త్రము-ఇవన్నియు అపర విద్య. చూడ శక్యముకానిదియు, పట్టుకొన శక్యముకానిదియు, గోత్రముగాని, శాఖగాని లేనిదియు, నిత్యమును అగు బ్రహ్మను బోధించు విద్య పరవిద్య.

పూర్వము బ్రహ్మ దేవతలకు ఎట్లు చెప్పెనో, విష్ణువు నాకు ఎట్లు చెప్పెనో ఆ విధముగ మత్స్యాది రూపములను ధరించిన జగత్కారణ భూతుడగు విష్ణువును గూర్చి నీకు చెప్పెదను. (1)