అగ్ని మహా పురాణము

Table of Contents

ప్రస్తార నిరూపణము

అగ్నిదేవుడు పలికెను:

పేరు చెప్పని ఛందస్సులన్నియు గాథా ఛందస్సులో అంతర్గతములు. ఇప్పుడు ప్రస్తారము చెప్పబడుచున్నది. అన్ని అక్షరములును గురువులైన పాదములో ఆది గురువు నకు క్రింద లఘువు వ్రాయవలెను. దాని పిమ్మట అదే క్రమమున వర్ణములను కూర్చవలెను. నష్ట సంఖ్యను సగము చేయగా ఒక లఘువు వ్రాయవలెను. సగము చేసినపుడు అది విషమమైనచో దానికి ఒకటి చేర్చి సమముచేసి మరల దానిని సగము చేయవలెను. ఇపుడు ఒక గుర్వక్షరము లభించును. ఎన్ని అక్షరముల ఛందస్సు యొక్క భేదము తెలియ వలెనో అన్ని అక్షరములు పూర్తియగు వరకు గురు లఘువులను వ్రాయుచు పోవలెను. ఉద్దిష్ట సంఖ్యను చెప్పుటకు గురు, లఘువర్ణములను క్రమముగ, ఒక పంక్తిలో వ్రాసి వాటిపైన క్రమముగ ఒకటినుండి రెట్టించుచు, అంకములు ఉంచవలెను. ఎన్ని అక్షరముల ఛందస్సు యొక్క సంఖ్య తెలియవలెనో దాని అర్ధ భాగము తీసివేయబడును. అపుడు రెండు లభించును. దానిని వేరుగా ఉంచవలెను. విషమ సంఖ్య నుండి ఒకటి తగ్గించగ, శూన్యము లభించును. దానిని రెండుకు క్రింద వ్రాయవలెను. శూన్య స్థానమున రెట్టింపు చేయవలెను. అట్లు చేయవచ్చిన అంకమును పైనున్న అర్ధస్థానమునందు ఉంచి దానిచేత గుణించ వలెను. మేరు ప్రస్తారముచే ఒక ఛందస్సులో ఎన్ని లఘువులు ఎన్నిగురువులు ఉండునో, ఎన్ని వృత్తములు ఏర్పడునో తెలియును. మేరు ప్రస్తారమున క్రిందినుండి పైకి, అర్ధాంగుళము చొప్పున విస్తారము తగ్గుచుండును. ఛందస్సంఖ్యను రెట్టించి, ఒక్కొక్కటి తగ్గించి నచో అన్ని అంగుళముల ప్రస్తార దేశము ఏర్పడును. ఈ విధముగా ఛంద స్సారము చెప్పబడినది. (335)