అగ్ని మహా పురాణము

Table of Contents

దశ దికృతి యాగ కథనము

 హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా, ఇప్పుడు ఐదు ప్రతిష్ఠాంగములను చెప్పెదను. ప్రతిమ పురుషునికి ప్రతీకయైనచో పిండిక ప్రకృతికి ప్రతీకము. లేదా ప్రతిమ నారాయణ స్వరూపము, పిండిక లక్ష్మీ స్వరూపము. ఈ రెండింటి యోగమునే ప్రతిష్ఠ అందురు. అందుచే ఆయా ఫలములు కోరువారు ఆయా దేవతల ప్రతిష్ఠ చేయుదురు. ఆచార్యుడు దేవాలయము ఎదుట గర్భసూత్రము తొలగించి ఎనిమిది, లేదా పదునారు లేదా ఇరువది హస్తముల మండపము నిర్మింపవలెను. ఎనిమిది హస్తముల మండపము ‘నిమ్నము’, పదునారు హస్తములది ‘మధ్యమము’, ఇరువది హస్తములది ‘ఉత్తమము’. మండపములో సగము భాగమును దేవతా స్నానమునకు, కలశ స్థాపన కొరకు, యాగమునకు సంబంధించిన ద్రవ్యములను ఉంచుటకును కేటాయించవలెను. మిగిలిన సగము మండపములో, లేదా మూడవవంతు మండపములో సుందరమైన వేది ఏర్పరుపవలెను. దానిని పెద్దపెద్ద కలశములతోడను, చిన్నచిన్న కలశములతోడను, చాందనీలు మొదలైన వాటి తోడను అలంకరింపవలెను. మండపములోపల పంచగవ్యములు చల్లి, శుద్ధిచేసి, అచట సామగ్రి అంతయు ఉంచవలెను. పిమ్మట ఆచార్యుడు వస్త్రమాలాద్యలంకృతుడై, విష్ణువును ధ్యానించి పూజింపవలెను.

ఉంగరములు మొదలగు ఆభరణములు ఇచ్చి, ప్రార్థించి, మూర్తిపాలకులగు విద్వాంసులను సత్కరించి, వారిని చతురస్రములు, అర్ధచంద్రాకారములు, గోళాకారములు లేదా పద్మ సదృశములు అగు కుండములపై కూర్చుండ పెట్టవలెను. పూర్వాది దిక్కుల తోరణములకు అశ్వత్థ, ఉదుంబర, వట, ప్లక్షదారువులను ఉపయోగింపవలెను. తూర్పు ద్వారమునకు ‘సుశోభన’ మని పేరు. దక్షిణ ద్వారము ‘సుభద్రము’, పశ్చిమద్వారము ‘సుకర్మ’, ఉత్తర ద్వారము ‘సుహోత్రము’. ఆ తోరణ స్తంభములన్నియు ఐదు హస్తముల ఎత్తు ఉండవలెను. వీటిని స్థాపించి “స్యోనా పృథివీనో” అనే మంత్రముచే పూజించవలెను. తోరణస్తంభముల మూల భాగములందు మంగళకరమైన చూత పల్లవ, యవాంకురము ఆది అంకరములు ఉన్న కలశములు స్థాపింపవలెను. తోరణ స్తంభముపైన సుదర్శన చక్రము స్థాపింపవలెను. నేర్పుగల విద్వాంసుడు ఐదు అడుగుల ఐదు హస్తముల ధ్వజము కూడ స్థాపింపవలెను. దీని వెడల్పు పదునారు అంగుళములు ఉండవలెను. ఓ సురశ్రేష్ఠా! ఆ ధ్వజ దండము ఏడు హస్తముల ఎత్తు ఉండవలెను. పూర్వాది దిశలందు ధ్వజములపై అరుణవర్ణము, అగ్ని (ధూమ్ర వర్ణము), కృష్ణ, శుక్ల, పీత, రక్త, శ్వేత వర్ణములు ఉండవలెను.

పూర్వాది దిక్కులలో ఉన్న ధ్వజములపై కుముద, కుముదాక్ష, పుండరీక, వామన, శంకుకర్ణ, సర్వనేత్ర, సుముఖ, సుప్రతిష్ఠితులను దేవతలను పూజింపవలెను. వీరందరును కోట్లకొలది సద్గుణములు కలవారు. ఎఱ్ఱని దొండపండువలె ఎఱ్ఱగా కాలిన నూట ఇరువది ఎనిమిది కలశములను నాలుగుశేర్ల నీళ్ళతో నింపి ‘కాలదండ’మను యోగములేని సమయమున స్థాపింపవలెను. వీటి అన్నింటికి కంఠభాగమునందు వస్త్రములుకట్టి. వాటిలో సువర్ణము ఉంచి, తోరణముల వెలుపల ఉంచవలెను. వేదికి తూర్పు మొదలైన నాలుగు దిక్కులందును, కోణములందును గూడ కలశములు స్థాపింపవలెను. మొదట నాలుగు కలశములను పూర్వాది దిక్కులు నాల్గింటియందు “ఆజిఘ్ర కలశమ్” ఇత్యాది మంత్రము చదువుచు స్థాపింపవలెను. ఆ కలశములపై, పూర్వాది దిక్కులందు దిక్పాలకులను ఆవాహనచేసి పూజింపవలెను. “ఐరావతముపై ఎక్కి హస్తమున వజ్రము ధరించిన దేవరాజువైన ఇంద్రా! ఇతరదేవతలతో కూడ ఇచటికి రమ్ము; ఈ తూర్పు ద్వారమును రక్షింపుము; దేవతా సమేతుడవైన నీకు నమస్కారము” అని ప్రార్థించుచు ఇంద్రుని ఆవాహనచేసి, “త్రాతార మిన్ద్రమ్” ఇత్యాది మంత్రము పఠించుచు పూజింపవలెను. “మేషమునెక్కి శక్తిని ధరించియున్న బలిశాలివైన ఓ అగ్నిదేవా! దేవతలతోకూడ వచ్చి, ఈ ఆగ్నేయ దిక్కును రక్షింపుము. నా పూజ గ్రహింపుము; నీకు నమస్కారము” అని ప్రార్థించుచు అగ్నిని ఆవాహనముచేసి “అగ్నిర్మూర్ధా” లేదా “అగ్నియే నమః” అను మంత్రముచే పూజింపవలెను. “మహిషారూఢుడవై దండము ధరించి యున్న మహాబలశాలియైన సూర్యపుత్రా! యమదేవా! నీవు వచ్చి దక్షిణద్వారమును రక్షింపుము; నీకు నమస్కారము” అని ప్రార్థించి యముని ఆవాహనముచేసి, “వైవస్వతం సంగమనమ్” ఇత్యాది మంత్రముచే పూజింపవలెను. “బలవాహన సంపన్నుడవైన, ఖడ్గధారియైన ఓ నిర్మతీ! రమ్ము. ఈ అర్ఘ్య పాద్యములను గ్రహింపుము; నైరృతిదిక్కును రక్షించుము” అని ప్రార్థించి నిరృతిని ఆవాహనము చేసి “ఏషతే నిరృతే” ఇత్యాది మంత్రముచే ఆర్యాది ఉపచారములనిచ్చి పూజింపవలెను. “మకరమును ఎక్కినవాడా! పాశధారీ! మహాబలశాలియైన ఓ వరుణదేవా! రమ్ము! పశ్చిమద్వారమును రక్షింపుము; నీకు నమస్కారము” అని ప్రార్థించుచు వరుణుని ఆవాహనముచేసి “ఉరుంహి రాజావరుణః” ఇత్యాది మంత్రములతో ఆచార్యుడు వరుణ దేవతకు అర్ఘ్యము సమర్పించి పూజింపవలెను.

ధ్వజము ధరించిన, మహాబలశాలివైనవాయుదేవా, నీ వాహనమునెక్కి దేవతలతోను, మరుత్తులతోడను వచ్చి వాయవ్యదిక్కును రక్షించుము; నీకు నమస్కారము” అని ప్రార్థించుచు వాయువును ఆవాహనచేసి “వాత ఆవాతు” ఇత్యాది మంత్రముచేతగాని, “ఓం నమో వాయవే” అను  మంత్రముచేతగాని వాయుదేవుని పూజింపవలెను. “బల వాహన సంపన్నుడవు గదాధారివి అగు సోమా! నీవు వచ్చి ఉత్తరద్వారమును రక్షింపుము. కుబేర సహితుడవగు నీకు నమస్కారము” అని ప్రార్థించుచు సోముని ఆవాహనముచేసి, “సోమం రాజానమ్” ఇత్యాది మంత్రముచేతగాని, “సోమా యనమః” ఇత్యాది మంత్రము చేతగాని పూజింపవలెను. “వృషభారూఢుడవును, మహాబలశాలివి, శూలధారివి అగు ఈశానా! నీవు వచ్చి యజ్ఞ మండపము యొక్క ఈశాన్య దిక్కును రక్షింపుము, నీకు నమస్కారము” అని ప్రార్థించి, ఈశానుని ఆవాహనముచేసి “ఈశానమస్య” ఇత్యాది మంత్రముచేతగాని, “ఈశానాయనమః” అను మంత్రముచేతగాని పూజింపవలెను. “హస్తాగ్రము లందు స్రుక్, స్రువములను ధరించినవాడవును, హంసారూఢుడవును, జన్మ రహితుడవును అగు ఓ బ్రహ్మదేవా! ఊర్ధ్వదిక్కును రక్షించుము; నీకు నమస్కారము” అని ప్రార్థించి, బ్రహ్మదేవుని ఆవాహనముచేసి, “హిరణ్యగర్భః” ఇత్యాది మంత్రము చేతగాని “నమస్తే బ్రహ్మణే” ఇత్యాది మంత్రముచేతగాని పూజింపవలెను.” “తాబేలు వీపుపై కూర్చున్నవాడా! నాగ గణముల అధిపతీ ! చక్రధారీ! అనంతా! రమ్ము; అధర దిశను రక్షింపుము, అనంతేశ్వరా! నీకు నమస్కారము” అని ప్రార్థించుచు అనంతుని ఆవాహనముచేసి “నమోస్తు సర్పేభ్యం” అను మంత్రముచేగాని, “అనన్తాయనమః” అను మంత్రము చేతగాని పూజింపవలెను. (56)