అగ్ని మహా పురాణము
గ్రయాయాత్రా విధి
అగ్ని పలికెను: గయ వెళ్ళవలెను అనుకొన్నవాడు విధిపూర్వకముగ శ్రాద్ధము చేసి, తీర్థయాత్ర వేషము ధరించి, గ్రామ ప్రదక్షిణము చేసి, ప్రతిదినము పాదచారియై యాత్ర చేయవలెను. ఇంద్రియములను మనస్సును వశములో నుంచుకొనవలెను. ఎవరి నుండియు దానము గ్రహింపరాదు. గయ వెళ్ళుటకు ఇంటినుండి బయలుదేరగనే, అడుగడుగునను పితృ దేవతలకు స్వర్గ సోపానములు ఏర్పడును. పితరుల శ్రాద్ధముకొరకై గయకు వెళ్ళుట వలన కలుగు పుణ్యము ముందు బ్రహ్మ జ్ఞానము ఎంత? గోవులను సంకటము నుండి రక్షించుటవలన కూడ అంత పుణ్యము కలుగదు. అట్టివాడు కురుక్షేత్రములో నివసించ వలసిన ఆవశ్యకతయే యుండదు. పుత్రుడు గయకు చేరగనే పితరులు ఉత్సవము చేసి కొందురు. ‘ఈతడు పాదాలతోడనైనా జలస్పర్శ చేసి తర్పణము చేయడా?’ అని వారు అనుకొచుందురు. బ్రహ్మజ్ఞానము, గయలో చేసిన శ్రాద్ధము, గోశాలలో మరణము, కురుక్షేత్రములో నివాసము-ఇవి మనుష్యుని ముక్తికి నాలుగు సాధనములు. నరకము నుండి భయపడిన పితరులు పుత్రుడు కావలెనని కోరుకొందురు. గయకు వెళ్ళి మన కుమారుడు మనలను ఉద్ధరింపగలడు అని వారు ఆలోచించుచుందురు. ముండనోప వాసములు సర్వ తీర్థములందును ఆచరించవలసిన సామాన్యవిధులు. గయా తీర్థమునందు కాలాదినియమ మేదియు లేదు.
అచట ప్రతి దినము పిండదానము చేయవలెను. అచట మూడు పక్షములు నివసించువాడు ఏడు తరముల వరకు పితరులను ఉద్ధరించును. అష్టకాతిథులందును, అభ్యుదయక కర్మలయందును, పిత్రాదుల క్షయాహ తిథియందును, గయలో తల్లి కొరకై వేరుగ శ్రాద్ధవిధానము ఉన్నది. అన్య తీర్ధములలో స్త్రీ శ్రాద్ధమును ఆమె భర్తతో కలిపి మాత్రమే చేయవలెను. గయలో పిత్రాది క్రమమున నవ దేవతాకముగ గాని, ద్వాదశ దేవతాకముగ గాని శ్రాద్ధము చేయవలెను. మొదటి రోజున ఉత్తరమానస తీర్థమునందు స్నానము చేయవలెను. పరమ పవిత్రమగు ఉత్తర మానస తీర్థమునందు చేసిన స్నానము ఆయురారోగ్య వృద్ధి కలిగించి, పాపరాశులను నశింపజేసి, మోక్షము నిచ్చును. శ్రాద్ధకర్త దేవతా పిత్రాదులకు తర్పణము లిచ్చునప్పుడు- ‘నేను స్వర్గ అంతరిక్ష భూములపై నున్న సంపూర్ణ దేవతలను తృప్తి పరచుచున్నాను’ అని భావన చేయుచు, పిదప పిండ ప్రదానము చేయవలెను.
స్వర్గ-అంతరిక్ష, భూ దేవతాదులకును, మాతా పిత్రాదులకును తర్పణములు ఈయవలెను. పితృ పితామహ ప్రపితామహుల ఉద్ధారము కొరకును, మాతృ, పితామహీ, ప్రపితామహుల ఉద్ధారము కొరకును మాతామహ, ప్రమాతామహ, వృద్ధప్రమాతామహుల ఉద్ధారము కొరకును, అన్యపితరుల ఉద్ధారము కొరకును నే నీ పిండ ప్రదానము చేయుచున్నాను. సోమ, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతురూపుడగు సూర్యునకు నమస్కారము’ అని చెప్పవలెను. ఉత్తర మానసతీర్థమునందు స్నానము చేయువాడు తన కులము నంతను ఉద్ధరించును. సూర్యునకు నమస్కరించి మౌనముగా దక్షిణమానస తీర్థమునకు వెళ్ళి- నేను పితరుల తృప్తి కొరకై దక్షిణ మానస తీర్థమునందు స్నానము చేయు చున్నాను. పూర్వ పురుషులు అందరును స్వర్గ లోకమునకు వెళ్ళుదురు గాక అను ఉద్దేశ్యముతో నేను గయకు వచ్చినాను’ అని భావన చేయవలెను. పిమ్మట శ్రాద్ధ పిండ దానములు చేసి, సూర్యునకు నమస్కరించి ‘సర్వ ప్రాణులను పోషించు సూర్యునకు నమస్కారము, ప్రభూ! నీవు నాకు అభ్యుదయము నిచ్చువాడవు, నిన్ను ధ్యానించుచున్నాను. నీవు నా పూర్వీకులందరికిని భుక్తి ముక్తులను ఇచ్చువాడవు. కవ్యవాట్, అనల, సోమ, తమ, ఆర్యమన్, అగ్నిష్వాత్త, బర్హిషద, ఆజ్యపులను మహానుభావులగు పితృదేవతలు ఇచటకు వచ్చెదరు గాక! మీచే సురక్షితులగు నా పితృ మాతృ-పితా మహాదులకు పిండ దానము చేయవలెనను ఉద్దేశ్యముతో నేనిచటకు వచ్చితిని’ అని ప్రార్థించవలెను. ముండ పృష్ఠమునకు ఉత్తర భాగము నందు ఋషి-దేవాది పూజితమగు కనఖలక్షేత్రము మూడు లోకములందును విఖ్యాతమైనది. సిద్ధులకు ఆనంద దాయకములును, పాపాత్ములకు భయంకరములును అగు పెద్ద పెద్ద నాగములు, కదలుచున్న నాలుకలతో, ప్రతిదినము ఈ తీర్థమును రక్షించుచున్నవి. అచట స్నానముచేసి మనుష్యులు ఈ భూతలముపై సుఖముగా క్రీడించి, అంతమున స్వర్గమునకు పోవుదురు. పిదప మహానదిపై నున్న ఉత్తమ క్షేత్రమగు ఫల్గుణీ తీర్థమునకు వెళ్ళవలెను. ఇది నాగ, జనార్దన, కూప, వట, ఉత్తర మానసములకంటె గూడ శ్రేష్ఠమైనది. దీనికి ‘గయా శిరోభాగము’ అని పేరు. ఇది ముండవృష్ఠ, నగాది తీర్థములకంటె సారవత్తరమైనది. దీనికి ‘ఆభ్యంతర తీర్థము’ అని పేరు. ఈ తీర్థమున లక్ష్మీ, కామధేను, జల, పృథ్వులు ఫలదాయకములు. దీని దృష్టి రమణీయములగు మనోహర వస్తువులు ఫలించును. ఇది సామాన్య తీర్థము కాదు. ఫల్గు తీర్థమునందు స్నానముచేసి, గదాధర దర్శనము చేసికొనిన పుణ్యాత్మునకు లభ్యముకానిదేది? భూతలమున సముద్ర పర్యంతము ఉన్న తీర్థములును, సరోవరములును, దినమునకొక పర్యాయము ఫల్గుణీ తీర్థమునకు వచ్చుచుండును. శ్రద్ధావంతుడు ఫల్గుణీ తీర్థమునందు చేయు స్నానము ఆతని పితరులకు బ్రహ్మ లోకమును ఇచ్చును. ఆతనికి భుక్తిముక్తులను ప్రసాదించును. శ్రాద్ధకర్త స్నానానంతరము బ్రహ్మకు నమస్కరించి ఇట్లు ప్రార్థించవలెను. ‘కలియుగమున అందరును మహేశ్వ రోపాసకులు, కాని ఈ గయా క్షేత్రమున ఉపాస్యుడు గదాధరుడు. ఇచట బ్రహ్మ లింగ రూపమున నివసించుచున్నాడు. ఆయనకు నమస్కరించు చున్నాను. గదాధర, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణ, బ్రహ్మ, విష్ణు, నృసింహ వరాహాదులకు నమస్కరించుచున్నాను.’ పిదప గదాధరుని దర్శనము చేసికొనినవాడు నూరు తరములవారిని ఉద్ధరించును. మరునాడు ధర్మారణ్య తీర్థ సందర్శనము చేసికొనవలెను. అచట మతంగ ఆశ్రమము నందలి మతంగవాపిలో స్నానముచేసి పిండదానము చేయవలెను. అచట మతంగేశ్వర, సుసిద్ధేశ్వరులకు నమస్కరించి ‘సకలదేవతలు సాక్షిగా సమస్త లోకపాలులు సాక్షిగా, నేను మతంగ తీర్థమునకు వచ్చి పితరుల ఉద్ధారము చేసితిని’ అని పలుకవలెను. పిదప బ్రాహ్మ తీర్థమను కూపము నందు స్నాన, తర్పణ, శ్రాద్ధములు చేయవలెను. ఆ కూపమునకును, యూపమునకును మధ్య చేసిన శ్రాద్ధము నూరుతరముల వారిని ఉద్ధరించును. మహాబోధివృక్షమునకు నమస్కారముచేసిన పుణ్యాత్ముడు స్వర్గలోకమును పొందును. మూడవ రోజున వ్రతపాలనము చేయుచు బ్రహ్మ సరోవర తీర్థమునందు పితరుల బ్రహ్మలోక ప్రాప్తికై స్నానము చేయుచున్నాను’ అని చెప్పుచు స్నానముచేసి, తర్పణములు చేసి, పిండదానము చేయవలెను. పిదప వృక్షమును తడుపవలెను. వాజపేయ యజ్ఞఫలమును పొందగోరువాడు బ్రహ్మ స్థాపించిన యూపమునకు ప్రదక్షిణము చేయవలెను.
అచట ఒకముని జలకుంభమును, కుశాగ్రమును హస్తమునందు గ్రహించి చూత వృక్షములకు నీళ్ళు పోయుచుండెడివాడు. దానితో మామిడిచెట్లకు నీళ్లుపోసినట్లు అయినది; పితృదేవతలకు తృప్తి కలిగినది. ఈ విధముగ ఒక పని రెండు లాభములను చేకూర్చినది. బ్రహ్మకు నమస్కారము చేయుటచే నూరు తరములవారిని ఉద్ధరించును. నాల్గవ దివసమున ఫల్గు తీర్థమునందు స్నానము చేసి దేవతాది తర్పణము చేయవలెను. గయా క్షేత్రము ఐదు క్రోసుల క్షేత్రము. దానిలో ఒక క్రోసు గయా శీర్షము. అచట పిండదానము చేసిన వాడు సూరు తరములవారిని ఉద్ధరించును. మహాదేవుడు ముండ పృష్ఠముపై తన పాదముంచెను. గయాసురుని శిరస్సు సరిగా ఆ ముండ పృష్ఠము నందే ఉన్నది. అందు చేతనే దానికి ‘గయా శిరస్సు’ అని పేరు. గయాశీర్షము ఉన్న స్థానము ఫల్గు తీర్థము. ఫల్గునందు అమృతధార ప్రవహించును. పితరులను ఉద్దేశించి అచట చేసిన దానము అక్షయమగును. దశాశ్వమేధ తీర్థమున స్నానము చేసి, బ్రహ్మ దర్శనము చేసికొని, రుద్ర పాదస్పర్శ చేసినవానికి మరల ఈ లోకమున జన్మము ఉండదు. గయా శీర్షమున శమీపత్ర ప్రమాణముగల పిండములను ఇచ్చినచో నరకములో నున్న పితరులు స్వర్గమునకు పోవుదురు. స్వరములో ఉన్నవారు మోక్షము పొందుదురు. అచట పిండ ప్రదానము క్షీరము, పిండి, చరువు, బియ్యము వీటితో చేయవలెను. తిల మిశ్రములగు గోధుమలతో గూడ రుద్ర పాదమునందు పిండదానము చేయుటచే మానవుడు నూరు తరములవారిని ఉద్ధరించును. విష్ణుపదిపై పిండ ప్రదానము చేయువాడు పితృ ఋణ విముక్తుడై, తండ్రి మొదలు నూరు తరములపై వారిని, తననుకూడ తరింపచేయును.
బ్రహ్మ పదమున శ్రాద్ధము చేసినవాడు పితరులను బ్రహ్మ లోకమునకు పంపును. దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్నుల స్థానములందు శ్రాద్ధము చేసినవాడు యజ్ఞ ఫలమును పొందును. ఆవపథ్యాగ్ని, చంద్ర, సూర్య, గణేశ, అగస్త్య, కార్తికేయుల స్థానములందు శ్రాద్ధము చేసినవాడు తన కులములు ఉద్ధరించును. సూర్యుని రథమునకు నమస్కరించి కర్ణాదిత్యునికి శిరము వంచవలెను. కనకేశ్వరుని పదమునకు నమస్కరించి గయా కేదార తీర్థమునకు నమస్కరించవలెను. దానిచే అన్ని పాపములనుండియు విముక్తుడై తన పితరులను బ్రహ్మ లోకమునకు పంపును. గయాశీర్షము నందు పిండ దానము చేయుటచే విశాలుడు పుత్రవంతుడాయెను.
విశాల నగరము నందు విశాలుడను రాజ పుత్రుడు ఉండెను. ‘నాకు పుత్రోత్పత్తి ఎట్లు కలుగును’ అని అతడు బ్రాహ్మణులను ప్రశ్నించెను. ‘గయలో పిండదానము చేసినచో పుత్రులు కలుగుదురు’ అని వారు చెప్పగా అతడు గయా తీర్థమునందు పితరులకు పిండ ప్రదానము చేసెను. అపుడు ఆయనకు ఆకాశమునందు తెల్లగాను, ఎర్రగాను, (నల్లగాను) ఉన్న పురుషులు కనపడిరి. మీరుఎవరని విశాలుడు అడుగగ వారిలో తెల్లని పురుషుడు పలికెను-’తెల్లగా నున్న నేను నీ తండ్రిని. నేను చేసిన పుణ్య కర్మలచే ఇంద్ర లోకమునకు వెళ్ళితిని. ఎఱ్ఱగా నున్నవాడు నా తండ్రి; నల్లనివాడు నా పితామహుడు. వీరు నరకములో పడియుండిరి. నీవు మమ్ములందరిని ముక్తులను చేసితివి. నీవు పిండదానము చేయుటచే మేము బ్రహ్మ లోకమునకు పోవుచున్నాము’ అట్లు పలికి వారు ముగ్గురును వెళ్ళిపోయిరి. విశాలునకు పుత్ర పౌత్రాదులు కలిగిరి. అతడు రాజ్యము అనుభవించి మరణానంతరము విష్ణులోకమును పొందెను.
ఒక ప్రేతరాజు, ఇతర ప్రేతములతో చాల కష్టపడుచుండెను. ఇతడొకనాడు తన కథ వినకోరుచున్న వర్తకునితో ఇట్లు చెప్పెను-’మేము ఒకే పుణ్యము చేసితిమి. తత్ఫలితముగనే ఇపుడు అనుభవించుచున్నాము. ఒకమారు శ్రావణ, ద్వాదశీయోగమునందు మేము అన్న జలసహిత కుంభదానము చేసితిమి. ప్రతి దినము మధ్యాహ్నమున అంటే మా జీవన రక్షకొరకై వచ్చుచున్నది. నీవు మా నుండి ధనము తీసికొని వెళ్ళి మా నిమిత్తమై గయలో పిండదానము చేయుము. ఆ వర్తకుడు ధనము గ్రహించి గయలో పిండదానము చేసెను. తత్ఫలితముగా ఆ ప్రేతరాజు విముక్తి చెంది విష్ణులోకమును పొందెను. గయా శీర్షమునందు పిండదానము చేయుటచే మనుష్యుడు తనను, తన పితరులను గూడ ఉద్ధరించును. అచట పిండదానము చేయునపుడు ఇట్లు చెప్పవలెను ‘నా పితృమాతృ వంశములకు సంబంధించినవారును, గురుశ్వశుర బంధువుల వంశములకు సంబంధించినవారును తదితర బంధువులును భార్యాపుత్రాదులు లేకపోవుటచే శ్రాద్ధ కర్మలుప్తమైపోయిన నా కులమునకు సంబంధించినవారును, పుట్టుకనుండియు గ్రుడ్డివారును, కుంటివారును, వికృతరూపము గలవారును, గర్భస్రావముచే మరణించిన వారును, ఈ విధముగ నా కులమునకు సంబంధించిన జ్ఞాతాజ్ఞాతులగు పితరులందరును, నేను చేయుచున్న ఈ పిండ ప్రదానమున శాశ్వత తృప్తిని పొందుదురు గాక. ప్రేతరూపమున ఉన్న నా పితరులు ఈ పిండ ప్రదానముచే సర్వదా తృప్తులగుదురుగాక. తమ వంశమును తరింపజేయదలచినవారు తమ తమ పితరుల నందరిని ఉద్దేశించి అచట పిండ ప్రదానము చేయవలెను. అక్షయ పుణ్యలోక ప్రాప్తికొరకై తప్పక తనకు తాను పిండ ప్రదానము చేయవలెను. బుద్ధిమంతుడు, ఐదవ దివసమున ‘గదాలోలము’ అను తీర్థము నందు స్నానము చేయవలెను. ఆ సమయమున జనార్ధనా! నీవు గదా ప్రక్షాళనము చేసిన అత్యంత పావనమగు గదాలోల క్షేత్రమునందు సంసార రోగ నివృత్తి కొరకై స్నానము చేయుచున్నాను’ అను అర్థముగల మంత్రమును చదువవలెను, ‘అక్షయ స్వర్గము నిచ్చు అక్షయ వటమునకు నమస్కారము, పితృపితామహాదులకు అక్షయాశ్రయము, సర్వపాప వినాశకము అగు అక్షయ వటమునకు నమస్కారము’ అని ప్రార్థించి అక్షయ వటము క్రింద శ్రాద్ధము చేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. అచట ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినచో కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన ఫలము లభించును. అనేక బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో ఇక చెప్పవలెనా? పితరులను ఉద్దేశించి అచట ఏమి చేసినను అది అక్షయమగును. గయకు వెళ్లి అన్నదానము చేసిన పుత్రుడుండిన యెడలనే తమకు పుత్రుడున్నట్లు పితరులు భావింతురు. వట, వటేశ్వరులకు నమస్కారము చేసి ప్రపితామహుని పూజించవలెను. ఇట్లు చేయువాడు తనను తాను ఉద్దరించు కొనుటయే కాక నూరు తరములవారిని కూడ ఉద్ధరించును. సక్రమముగనైనను అక్రమముగనైనను చేసిన గయా యాత్ర గొప్ప ఫలము నిచ్చును. (115)
