అగ్ని మహా పురాణము

Table of Contents

మహాద్వీపాది వర్ణన

అగ్నిదేవుడు చెప్పెను:

జంబూ ద్వీపము ఒక లక్ష యోజనముల విస్తారము కలది. అది నలుమూల లందును ఒక  లక్ష యోజనముల విస్తారముగల క్షీర సముద్రముచే పరివేష్టితమైనది. ఆ క్షీర సముద్రమును చుట్టి ప్లక్షద్వీపమున్నది. మేధాతిథి పుత్రులు ఏడుగురు ఆ ప్లక్ష ద్వీపమునకు అధిపతులు, శాంత, భయ, శిశిర, సుఖోదయ, ఆనంద, శివ, క్షేమ, ధ్రువులను పేరుగల ఆ ఏడుగురి పేర్లతో ఏడు వర్షములున్నవి. గోమేధ, చంద్ర, నారద, దుందుభి, సోమక, సుమనస్, శైలములను పర్వతములు ఈ వర్షముల మర్యాదా పర్వతములు. అచట వైభ్రాజులను సుందరులు నివసించుచుందురు. ఈ ద్వీపము నందు ఏడు ప్రధాన నదులున్నవి. ప్లక్ష ద్వీపమునుండి శాకద్వీపము వరకును ఉండు ప్రదేశమున నివసించువారి ఆయుర్దాయము ఐదువేల సంవత్సరములు. అచట వర్ణాశ్రమ ధర్మములు పాలింప బడుచుండును. ఆర్య, కురు, వివింశ, భావి అనునవి అచట ఉండు బ్రాహ్మణాదుల పేర్లు. ఆరాధ్య దేవత చంద్రుడు. ప్లక్ష ద్వీప విస్తారము రెండు లక్షల యోజనములు. అంతయే ప్రమాణముగల ఇక్షురస సముద్రము దానిని చుట్టియున్నది. దీని తరువాత నున్నది. శాల్మలి ద్వీపము. ఇది ప్లక్ష ద్వీపము కంటె రెట్టింపు ఉండును. వపుష్మంతుని ఏడుగురు కుమారులు, శ్వేత, హరిత, జీమూత, లోహిత, వైద్యుత మానససుప్రభ నామధేయులు ఈ ద్వీపమునకు అధిపతులు. అచట వీరిపేర్లతో ఏడు వరములు ఏర్పడినవి. దానికంటె రెట్టింపు వైశాల్యముగల సురోద సముద్రము దానిని చుట్టియున్నది. కుముద, అనల, బాలాహక, ద్రోణ, కంక, మహిష, కకుద్మ పర్వతములు దీని మర్యాదా పర్వతములు. ఏడు ప్రధాన నదులున్నవి. అచటి బ్రాహ్మణాది వర్ణములకు కపిల, అరుణ, పీత, కృష్ణులని పేరు. అచటివారు వాయు దేవతారాధకులు. దీని తర్వాత కుశద్వీపము జ్యోతిష్మంతుని ఏడుగురు కుమారులు ఉద్భిదుడు, ధేనుయుతుడు, ధ్వైరథుడు, లంబనుడు, ధైర్యుడు, కపిలుడు, ప్రభాకరుడు అనువారు దీని అధిపతులు. వీరి పేర్లతోడనే ఏడు వర్షములు ఏర్పడినవి. దధి మొదలగువారు ఇచట ఉండు బ్రాహ్మణాదులు. వీరు బ్రహ్మరూపధారియగు విష్ణువును పూజింతురు. విద్రుమ, హేమశైల, ద్యుతిమత్, పుష్పవత్, కుశేశయ, హరి, మందరాచలములు ఇచటి వర్ష పర్వతములు. ఈ కుశ ద్వీపము చుట్టి, దానితో సమానమైన వైశాల్యముగల ఘృత సముద్రమున్నది. ఈ ఘృత సముద్రమును క్రౌంచ ద్వీపము పరివేష్టించి యున్నది. ద్యుతిమంతుని కుమారులు ఈ ద్వీపమునకు అధిపతులు. వారి పేర్లతోడనే ఇచటి వర్షములు ప్రసిద్ధములైనవి.

కుశలుడు, మనోనుగుడు, ఉష్ణుడు ప్రధానుడు, అంధకారకుడు, మతి దుందుభి అనువారు ద్యుతిమంతుని ఏడుగురు కుమారులు. ఆ ద్వీపమున ఏడు మర్యాదా పర్వతములు, ఏడునదులు ఉన్నవి. క్రౌంచ, వామన, అంధకారక, రత్నశైల, దేవావృత, పుండరీక, దుందుభులు పర్వతములు, ఈ ద్వీపములు క్రమముగ రెట్టింపు విస్తారము గలవి. పూర్వ పూర్వ ద్వీపముల ప్రమాణము కంటె ఉత్తరోత్తర ద్వీప పర్వతముల ప్రమాణము రెట్టింపు ఉండును. అచటి బ్రాహ్మణాది వర్ణములకు వరుసగ పుష్కర, పుష్కల, ధన్య, తిష్యులని పేర్లు. వారు శ్రీమహావిష్ణువును ఆరాధించుచుందురు. క్రౌంచ ద్వీపమును చుట్టి తక్ర (మజ్జిగ) సముద్రమున్నది. ఆ సముద్రమును శాకద్వీపము పరివేష్టించి ఉన్నది. అచటి రాజైన భవ్యుని ఏడుగురు కుమారులు, జలద, కుమార, సుకుమార, మణీవక, కుశోత్తర, మోదాకి, ద్రుములనువారు, శాక ద్వీపపాలకులు. ఇచటి వర్షములు గూడ వీరి పేర్లతో ప్రసిద్ధి పొందినవి. ఉదయగిరి, జలధర, రైవత, శ్యామ, కోద్రక, అంబికేయ, కేసరి, అను ఏడు పర్వతములు, ఏడు నదులు ఉన్నవి. అచట నున్న బ్రాహ్మణాదులకు మగ, మగధ, మానస్య, మందగులని పేర్లు. వారు సూర్య రూపధారియగు నారాయణుని ఆరాధించుచుందురు, శాకద్వీపమును చుట్టి క్షీరసాగరము ఉన్నది. దానిని పుష్కర ద్వీపము పరివేష్టించి యున్నది. అచటి ప్రభువగు సవన మహారాజునకు మహాదాతుడు. ధాతకి అను ఇద్దరు పుత్రులుండిరి. అచటి రెండు వర్షములు వారి పేర్లతో ప్రసిద్ధి చెందినవి. మానసోత్తరమను ఒకే వర్షపర్వతము వర్షమధ్యమున వలయాకారమున నున్నది. దాని విస్తారము కొన్నివేల యోజనములు. ఎత్తు విస్తారముతో సమానము. ఆనాటి జనులు పదివేల సంవత్సరములు జీవింతురు. అచట దేవతలు బ్రహ్మను పూజింతురు. పుష్కర ద్వీపము చుట్టు మధురజల సముద్రము ఉన్నది. దాని విస్తారము ద్వీప విస్తారముతో సమానము. మహామునీ! అచట సముద్రజలము పెరుగుటగాని, తరుగుటగాని ఉండదు. శుక్లపక్షములందు చంద్రోదయ అస్తమయములందు సముద్ర జలమున కేవలము ఐదువేల పది అంగుళముల జలము పెరుగుట తరుగుట కనబడును. తియ్యని నీరుగల ఆ సముద్రము నలువైపుల రెట్టింపు ప్రమాణముగల సువర్ణమయ భూమి ఉండును. కాని అచట ప్రాణులు ఏవియు ఉండవు. దాని తరువాత లోకాలోకపర్వతమున్నది. దాని వైశాల్యము పదివేల యోజనములు. లోకాలోక పర్వతము ఒక వైపున అంధకారావృతమై యుండును. ఆ అంధకారము అండ కటాహముచే ఆవరింపబడి ఉన్నది. అండకటాహ సహితమగు మొత్తము భూమీ వైశాల్యము ఏబది కోట్ల యోజనములు. (119)