అగ్ని మహా పురాణము

Table of Contents

కుబ్జికాపూజ

పరమేశ్వరుడు చెప్పెను:

సమస్త మనోరథములను సిద్ధింపచేయు కుబ్జికా క్రమపూజను గూర్చి చెప్పెదను. ‘కుబ్జికా’ శక్తి సహాయముచే రాజ్యమునందున్న దేవతలు అస్త్రశస్త్రాదులతో అసురులపై విజయము సాధించిరి. మాయా బీజమైన ‘హ్రీం’ను హృదయాది షణ్మంత్రములను క్రమముగా గుహ్యాంగము నందును, హస్తమునందును న్యాసము చేయవలెను. ‘కాలీ కాలీ’- ఇది హృదయమంత్రము. ‘దుష్టచాండాలికా’-ఇది శిరోమంత్రము. ‘హ్రీం స్ఫేం హ స ఖ క ఛ డ ఓం కారో భైరవః’ ఇది శిఖామంత్రము. ‘ఖేలఖీ దూతీ’ ఇది కవచ మంత్రము. ‘రక్తచణ్డికా’-ఇది నేత్రమంత్రము. ‘గుహ్యకుబ్జికా’ ఇది అస్త్రమంత్రము. వీటితో అంగన్యాస కరన్యాసములు చేసి, యథాస్థానముగ మండలముపై వీటిని పూజించవలెను. మండలమునందు ఆగ్నేయమున ‘హూం’, ఈశాన్యమున ‘స్వాహా’, నైరృతియందు ‘వషట్’, వాయవ్య మున ‘హమ్’, మధ్యభాగమున ‘వౌషట్’ మండలము సకల దిశలయందు ‘ఫట్’ లిఖించి పూజించ వలెను. ముప్పది రెండు అక్షరములతో గూడిన ముప్పది దళముల కమలము కర్ణికలో ‘స్రోం హ స క్ష మ ల న వ బ ష ట స చ’ లను, ఆత్మ బీజమంత్రమును (ఆమ్) న్యసించి పూజించవలెను. కమలము నలువైపుల పూర్వదిక్కుతో ప్రారంభించి క్రమముగ బ్రహ్మణీ మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, మాహేన్ద్రీ, చాముండా, చండికల న్యాసముచేసి పూజించవలెను. ఈశాన్య, పూర్వ, ఆగ్నేయ, దక్షిణ, నైరృతి, పశ్చిమములందు క్రమముగా ‘ర, వ, ల, క, స, హ’ లను న్యసించి పూజించవలెను. పిదప ఈ దిక్కులందే క్రమముగా కుసుకుమాలలు, పర్వతములు స్థాపించి పూజించవలెను. పిదప వాయవ్య, ఈశాన్య, ఆగ్నేయ, నైరృతుల యందును, మధ్య భాగమునందును వజ్ర కుబ్జికను పూజించవలెను. పిదప వాయవ్య, ఈశాన్య, నైరృతి, ఆగ్నేయ, ఉత్తర శిఖరములపై క్రమముగ అనాది విమల, సర్వజ్ఞ విమల, ప్రసిద్ధ విమల, సంయోగ విమల, సమయ విమలులను ఐదుగురు విమలులను పూజించవలెను. కుబ్జికా ప్రసాదము కొరకై ఈ శిఖరముల మీదనే క్రమముగ ఖింఖినీ-షష్ఠీ-సోపన్నా-సుస్థిరా-రత్న సుందరులను పూజించవలెను. ఈశాన్యమున నున్న శిఖరముపై ఎనమండుగురు అదినాథులను పూజించవలెను ఆగ్నేయ శిఖరముపై మిత్రుని, పశ్చిమ శిఖరముపై ఔడీశ వర్షమును, వాయవ్య శిఖరముపై షష్టి వర్షమును పూజించవలెను. పశ్చిమదిశలో నున్న శిఖరముపై గగనరత్న, కవచ రత్నములను, వాయవ్య, ఈశాన్య, ఆగ్నేయములందు ‘బ్రుం’ బీజసహితుడగు పంచనాముడను మర్త్యుని, దక్షిణ, ఆగ్నేయములందు ‘పంచరత్న’మును అదే దిక్కులందు జ్యేష్ఠ, రౌద్రి, అంతిక అను త్రిసంధ్యాధిష్ఠాన దేవతలను పూజించవలెను. వీరితో సంబంధించిన ఐదుగురు మహా వృద్ధులను ప్రణవోచ్చారణ పూర్వకముగ పూజించవలెను. వీరి పూజ ఇరువదియేడు లేదా ఇరువది ఎనిమిది భేదములచే ద్వివిధముగా చెప్పబడుచున్నది. చతుష్కోణ మండలమున కుడివైపున గణపతిని, ఎడమవైపున వటుకుని పూజించవలెను. క్రమ గణపతిని ‘ఓం ఏం గూం క్రమగణపతయే నమః’ అను మంత్రము చేతను, ‘ఓం వటుకాయ నమః’ అను మంత్రముచే వటుకుని పూజించవలెను. వాయవ్యము  మొదలైన దిక్కులందు నలుగురు గురువులను, పదునెనిమిది షట్కోణములందు పదునారుగురు నాధులను పూజించవలెను. మండలము నలువైపుల బ్రహ్మాది దేవతలు ఎనమండుగురిని, మధ్య భాగమున తొమ్మిదవ దేవతగా కుబ్జికను, కులటాదేవిని పూజించవలెను. సర్వదా ఈ క్రమముననే పూజచేయవలెను. (143)