అగ్ని మహా పురాణము

Table of Contents

త్రయోదశీ వ్రతములు

అగ్ని దేవుడు చెప్పెను:

ఇపుడు అన్నింటిని ఇచ్చు త్రయోదశీ తిథి వ్రతములను గూర్చి చెప్పెదను. మొదట అనంగ త్రయోదశీ వ్రతమునుగూర్చి చెప్పెదను. పూర్వము అనంగుడు (మన్మథుడు) ఈ వ్రతము చేసెను. మార్గశీర్ష శుక్ల త్రయోదశినాడు కామదేవ స్వరూపుడగు హరుని పూజించ వలెను. రాత్రి మధువు భుజించి తిలాక్షత మిశ్రఘృతము హోమము చేయవలెను. పౌష్య మాసమున యోగేశ్వరుని పూజించి మౌక్తిక జలాహారము చేయవలెను. ఇట్లు చేసినవాడు స్వర్గము పొందును. ఫాల్గుణమున వీరభద్రుని పూజించి కంకోలమును భుజించవలెను.

చైత్రమున సురూపుని పూజించి, కర్పూరాహారము తీసికొనువాడు సౌభాగ్య యుక్తుడగును. వైశాఖమున మహారూపుని పూజించి జాయఫలము భుజించవలెను. జ్యేష్ఠ మున ప్రద్యుమ్నుని పూజించి, లవంగము భక్షించవలెను. ఆషాఢమున ఉమాపతిని పూజించి తిలమిశ్ర జలము త్రాగవలెను. శ్రావణమున శూలపాణిని పూజించి సుగంధితమగు జలము త్రాగవలెను. భాద్రపదమున అగురు భక్షించి సద్యోజాతుని పూజించవలెను. ఆశ్వయుజమున త్రిదశాధిపుడగు శంకరుని పూజించి స్వర్ణజలము త్రాగవలెను. కార్తికమున విశ్వేశ్వరుని అర్చించి లవణము భక్షించవలెను. ఈ విధముగ సంవత్సరము పూర్తియైన పిమ్మట సువర్ణ నిర్మిత శివలింగమును మామిడాకులు, వస్త్రములు కప్పి, గోవు, శయ్య, ఛత్రము, కలశము, పాదుకలు, రసపూర్ణ పాత్రములుగూడ దానము చేయవలెను. చైత్ర శుక్ల త్రయోదశినాడు అశోక వృక్షమునకు సింధూరము, కాటుక పూసి, దాని మూలమున రతి-ప్రీతి సమేతుడగు కామదేవుని స్మరించవలెను. కామ్యములు కోరువాడు ఈ విధముగ ఒక సంవత్సరము కామదేవుని పూజించవలెను. ఇదియే ‘కామత్రయోదశీ వ్రతము’. (191)