అగ్ని మహా పురాణము

Table of Contents

త్వరితా పూజలు-ధ్యానాదిక విధులు

అగ్నిదేవుడు పలికెను:

త్వరితా విద్య యొక్క అంగములు భుక్తిముక్తి ప్రదాయకములు వాటిని చెప్పెదను. ‘ఓం ఆధారశక్యై నమః’ మొదలు ‘అస్త్రాయ ఫట్ నమః’ వరకును చెప్పినవి అంగన్యాస మంత్రములు. ‘ఓం త్వరితా విద్యాం’ మొదలు ‘ప్రచోదయాత్’ వరకు త్వరితా గాయత్రి, పిదప పీఠము నందలి కమల కర్ణిక యొక్క కేసరమునందు ఈ క్రింది అంగదేవతలను పూజించవలెను. ‘ప్రణీతాయై నమః’ మొదలు ‘క్షేమంకర్యై నమః’ వరకు మంత్రములతో ఆయా అంగదేవతలను పూజించవలెను. త్వరితా విద్యకు తోశలా, త్వరితా తూర్ణాయని మూడు పేర్లు. దీని అక్షరములను శిరోభ్రూలలాట కంఠ హృదయ, నాభి, గుహ్య ఊరు, జాను, జంఘా చరణములపై న్యాసముచేసి సమస్త విద్యతో వ్యాపకన్యాసము చేయవలెను. ఈమెను పార్వతీ, శబరి, ఈశ, వరదా భయహస్తికా, మయూర వలయా, పిచ్చమౌళి, కిసల యాంశుక, సింహాసనస్థ మయూరబర్హచ్ఛత్ర, సమన్విత, త్రినేత్ర శ్యామల, దేవి, వనమూల విభూషణ, విప్రాహి కర్ణాభరణ, క్షత్ర కేయూర భూషణ, వైశ్యనాగకటిబంధ, వృషలాహికృత నూపుర అను రూపమున ధ్యానించి పదివేలు జపము చేయవలెను. ఈశ్వరుడు కిరాత రూపుడైనపుడు గౌరి ఆ రూపమును ధరించినది. ఈ దేవిని జపించి ధ్యానముచేసి పూజించినచో సర్వ సిద్ధులు లభించును. విషాదులు తొలగిపోవును. పూర్వాది దళముల లోపల కర్ణికయందు ఎనిమిది సింహాసనములపై ఈ దేవతలను క్రమముగా పూజించవలెను. హృదయాది అంగషట్కముతో కూడిన గాయత్రి ప్రణీతలను పూజించవలెను. పూర్వాది దళములందు హుంకారాదులను పూజించవలెను. దళాగ్రభాగమున దేవీ సమ్ముఖమున ఫట్కారిని పూజించవలెను. శ్రీ బీజముతో పూజించవలెను. హుంకారి మొదలగువారి ఆయుధ వర్ణాదులు ఆయాదిక్కుల దిక్పాలకుల ఆయుధ వర్ణాదులతో సమానములు. ఫట్కారిమాత్రము ధనుర్భాణములను ధరించి యుండును. మండ ద్వారమున జయావిజయలను పూజించవలెను. వారు సువర్ణయష్టి ధరించి ఉందురు. వారికి బయట బర్బరి; అను కింకరిని పూజించవలెను. ఆమె ముండితమస్తకయై, కర్ర ధరించి యుండును. పిదప హోమద్రవ్యముతో యోన్యాకృతి యగు కుండమున హోమము చేయవలయును. తెల్లని ధాన్యమును హోమము చేసినచో సువర్ణము గోధూమలచేత పుష్టిసంపదలు యవ ధాన్యతిలలచే సర్వసిద్ధి ఈ తినాశనములు కల్గును. అక్షములతో హోమము చేసినచో శత్రువుకు ఉన్మాదము, శాల్మలీ బీజములచే మారణము, జంబూ ఫలములచే ధన ధాన్య ప్రాప్తి, నీలోత్పలములచే తుష్టి రక్తోత్పలములచే మహాపుష్టి, కుంద ములచే అభ్యుదయము కలుగును. మల్లికాపుష్పములు హోమము చేసినచో నగరమున క్షోభ కలుగును. కుముదములచే జనప్రియత్వము లభించును. అశోక కుసుమములచే పుత్రప్రాప్తి, పాటలా పుష్పములచే ఉత్తమాంగనా ప్రాప్తి, ఆమ్ర ఫలములచే ఆయుర్దాయము, తిలలచే లక్ష్మి, బిల్వలచే ఐశ్వర్యము, చంపకములచే ధనము కలుగును. మధుక పుష్ప బిల్వ ఫలములు కలిపి హోమము చేసినచో సర్వజ్ఞత్వము లభించును. త్వరితా మంత్రము మూడు లక్షలు జపము, హోమధ్యాన పూజలు చేసినచో అభిలషిత ఫలము లభించును. మండలములపై త్వరితా దేవిని అర్చించి త్వరితా గాయత్రితో ఏబది హోమములు ఇవ్వవలెను. పిదప మూల మంత్రముతో పల్లవములు మూడువందలు హోమములు చేసి దీక్షాగ్రహణము చేయవలయును. దీక్షకు పూర్వము పంచగవ్య ప్రాశన చేయవలెను. దీక్షా సమయమున చరువు మాత్రమే భుజించవలయును. (309)