అగ్ని మహా పురాణము

Table of Contents

పిండికా లక్షణము

హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! నేను ఇప్పుడు ప్రతిమల పిండికల లక్షణమును చెప్పెదను. పిండిక పొడవు ప్రతిమ పొడవుతో సమానముగా ఉండవలెను; వెడల్పు దానిలో సగముండవలెను. దాని ఎత్తు ప్రతిమ ఎత్తులో సగముండవలెను. లేదా దాని విస్తారము పొడవులో తృతీయాంశము ఉండవలెను. దాని మూడవ వంతుచే మేఖల నిర్మింపవలెను. నీరు ప్రవహించుటకై ఉన్న గర్తము కొలత మేఖల కొలతతో సమానముగా ఉండవలెను. ఆ గర్తము ఉత్తరమువైపు కొంచెము పల్లముగా నుండవలెను. పిండిక విస్తారములో నాల్గవవంతుతో జలము బైటకు పోవుటకై ప్రణాలము (కాలువ) నిర్మించవలెను. మూల భాగమున దాని విస్తారము మూలముతో సమముగా నుండవలెను. పైకి పోయిన కొలది సగముండవలెను. ఆ జలమార్గము పిండికా విస్తారములో మూడవ వంతుగాని, సగముగాని ఉండవలెను. దాని పొడవు ప్రతిమ పొడవెంతయో అంతే ఉండవలెనని చెప్పబడినది. లేదా ప్రతిమ పొడవు పిండిక పొడవులో సగముండవలెను. ఈ విషయము బాగుగా అర్ధముచేసికొని దానికి సూత్రపాతము చేయవలెను.

వెనుక చెప్పినట్లు, ప్రతిమ ఎత్తు షోడశభాగ సంఖ్యానుసారముగ చేయవలెను. ఎనిమిదవ భాగము క్రిందనున్న అర్ధాంగముగా చేయవలెను. దీనిపైన ఉన్న మూడు భాగములు గ్రహించి కంఠమును నిర్మింపవలెను. మిగిలిన భాగములను ఒక్కొక్కదానిని ప్రతిష్ఠ, నిర్గమము, పట్టిక మొదలగువాటి రూపమున విభజింపవలెను. ఇది ప్రతిమా పిండికల సామాన్య లక్షణము. ప్రాసాద ద్వార దైర్ఘ్య విస్తారములను పట్టి ప్రతిమా గృహద్వారము ఉండవలెను. ప్రతిమల ప్రభలపై ఏనుగులు, సర్పములు మొదలగు వాటి మూర్తులను నిర్మింపవలెను. అన్ని దేవప్రతిమల ప్రమాణము విష్ణు ప్రతిమకు చెప్పిన ప్రమాణమువలె ఉండవలెను. దేవీప్రతిమల ప్రమాణము లక్ష్మీ ప్రతిమకు చెప్పిన విధముననే ఉండవలెను. (55)