అగ్ని మహా పురాణము

Table of Contents

వాసుదేవాది మంత్ర లక్షణము

నారదుడు పలికెను:

పూజ్యములైన వాసుదేవాది మంత్రముల లక్షణము చెప్పెదను. ఆదియందు “నమో భగవతే” అనుపదములో కలవి, అ, ఆ, అం, అః అను బీజాక్షరములతో కూడినవి ఓంకారము ఆది యందుకలవి, ‘నమః’ అనునది అంతమందు కలవి అయిన “వాసుదేవ” “సంకర్షణ” “ప్రద్యుమ్న” “అనిరుద్ధ” అను పదములచే “ఓం అ నమో భగవతే వాసుదేవాయ” “ఓం ఆ నమో భగవతే సంకర్షణాయ” “ఓం అం నమో భగవతే ప్రద్యుమ్నాయ” “ఓం అః నమో భగవతే అనిరుద్ధయ” అను మంత్రములు ఏర్పడును. పిమ్మట “ఓం నమో నారాయణాయ” అను మంత్రము. “ఓం తత్సద్బ్రహ్మణే నమః” “ఓం నమో విష్ణవే నమః” “ఓం క్షౌం ఓం నమో భగవతే నరసింహాయ నమః”. “ఓం భూర్భగవతే వరాహాయ నమః” (ఇవి మంత్రములు). జపా పుష్పమువలె అరుణమైన రంగు పసుపువంటి రంగు నీల, శ్యామల, లోహిత వర్ణములు, మేఘ, అగ్ని, మధువుల వంటి రంగులు, పింగవర్ణము గల తొమ్మండుగురు నరాధిపులు వీటికి నాయకులు. తంత్రవేత్తలు విభజించిన విధముగ స్వర రూపములైన బీజాక్షరములకు ఆ యా మంత్రములందలి నామములను చివరచేర్చి హృదయాద్యంగములను కల్పించవలెను. వ్యంజనాది బీజాక్షరముల లక్షణము వేరుగా ఉండును.

“నమః” అనునది అంతమునందుగల మంత్రముల మధ్య దీర్ఘ స్వరములతో కూడి ఉన్న వ్యంజనములు అంగములనియు, హ్రస్వ స్వరములతో కూడినవి ఉపాంగములు అనియు చెప్పబడును. దీర్ఘ హ్రస్వములతో కూడినదియు, సాంగోపాంగ స్వరములతో కూడినదియు, విభజింపబడిన నామాక్షరముల అంతమునందు ఉన్నదియు అగు బీజాక్షరము ఉత్తమమైనది. హృదయాది కల్పనమునకు వ్యంజనముల క్రమమిది-తన నామము అంతము నందుగల అంగ నామములచే విభక్తములై స్వ బీజాక్షరముతో కూడిన, ఐదు మొదలు పండ్రెండు వరకును ఉన్న హృదయాదులను కల్పించి సిద్ధికి అనుగుణముగా ఉండునట్లు జపించవలెను. హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అస్త్రము అను ఈ ఆరును బీజముల అంగములు. హృదయము, శిరస్సు, శిఖ, హస్తములు, నేత్రములు, ఉదరము, పృష్టభాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్ళు, పిక్కలు, పాదములు ఈ పండ్రెండును మూలమునకు అంగములు. క్రమముగా వీటి అన్నింటి పై న్యాసము చేయవలెను.

“కం టం పం శం వైనతేయాయ నమః” “ఖం ఠం ఫం, షం గదానుజాయ నమః” “గండం బం సం పుష్టి మన్త్రాయ నమః”. “ఘం ఢం భం హం శ్రియై నమః” “వం శం మం క్షం పాఞ్చజన్యాయ నమః” “ఛం తం పం కౌస్తుభాయ నమః” “జం ఖం వం సుదర్శనాయ నమః” “సం వం దం చం లం శ్రీవత్సాయ నమః”.

ఓం ధం వం వనమాలాయై నమః “మహానన్తాయ నమః” బీజరహితములైన పదములు గల మంత్రములకు పదములచేతనే అంగములను కల్పింపవలెను.

నామ సంయుక్తములును, జాత్యంతములును అగు పదములచే హృదయాది పంచకన్యాసమును చేయవలెను. ప్రణవము, పిమ్మట ఐదు హృదయాదులును చెప్పబడినవి. ముందుగా ప్రణవముచే హృదయమును, ‘పరాయ’ అని శిరస్సును, పేరుతో శిఖను, ఆత్మచేత కవచమును, నామాన్తముతో అస్త్రమును విన్యసించవలెను.

ఓంకారము ఆదియందుగల నామాత్మక పదమునకు చివర నమః చేర్చి నామాత్మక పదమును చతుర్థ్యంతము చేసి చెప్పవలెను. ఏక వ్యూహము మొదలు ఇరువదియారవ వ్యూహము వరకును ఇది సమానము. కనిష్ఠిక మొదలైన కరాగ్రములందు దేహముపై ప్రకృతిని అర్చించవలెను. పరమ పురుషాత్మయే పరుడు. ప్రకృత్యాత్మ ద్విరూపము. “ఓం పరాయాగ్న్యాత్మనే నమః” ఇది వ్యాపక మంత్రము. వసు, అర్క అగ్నులు త్రివ్యూహాత్మక మూర్తులు. ఈ మూడింటిపై అగ్ని న్యాసముచేసి కరదేహములపై వ్యాపకమును విన్యసించి, అంగుళులయందును, సవ్యాపసవ్య హస్తములయందును, హృదయమునందును, మూర్తియందును, తుర్య రూపమగు త్రివ్యూహమైన తనువునందును వాయ్వర్కులను విన్యసించవలెను. వ్యాపకమైన ఋగ్వేదమును హస్తమునందును, అంగుళులపై యజుర్వేదమును, రెండు అరచేతులలో అధర్వమును శిరోహృదయ చరణములయందు సామ వేదమును పంచ వ్యూహమునందు ఆకాశమును విన్యసించి కరములందును, దేహమునందును అంగుళీ, శిరో, హృదయ, గుహ్య, పాదములందును వాయ్వాదికమును పూర్వము చెప్పినట్లు న్యసించవలెను.

వాయువు, అగ్ని, జలము, భూమి (ఆకాశము) వీటి సముదాయము పంచ వ్యూహము. మనస్సు, శ్రోత్రము, త్వక్కు, నేత్రము, జిహ్వ, ఋణము వీటి సముదాయము షడ్వ్యూహము. వ్యాపకమైన మానసమును విన్యసించి పిమ్మట క్రమముగా అంగుష్ఠాదులందును, శిరస్సు, ముఖము, హృదయము, గుహ్య ప్రదేశము, పాదములు-వీటియందును న్యాసము చేయవలెను. ఇది “పరమాత్మక వ్యూహన్యాసము”. ఆది మూర్తి అగు జీవుడు సర్వవ్యా పకుడు. భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అను ఈ ఏడింటిని ముందుగా కరమునందును, దేహము నందును అంగుష్ఠాది క్రమమున విన్యసించవలెను. ఏడవది తలములందు ఉండును. లోకేశుడైన దేవుడు దేహము నందు క్రమముగా శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు- వీటియందు ఉండును.

అగ్నిష్టోమము, ఉక్థము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము అని యజ్ఞాత్మ సప్తరూపములు కలది. ధీ, అహంకారము, మనస్సు, శబ్దము, స్పర్శ, రూప, రసములు, గంధము, వ్యాపకమైన బుద్ధి వీటిని క్రమముగా కరమునందును, దేహమునందును విన్యసించవలెను. పాదములు, తలములు, శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్య ప్రదేశము, పాదము వీటిపై విన్యసించవలెను. జీవుడు అష్టవ్యూహుడని చెప్పబడినాడు. జీవుడు, బుద్ధి, అహంకారము, మనస్సు, శబ్దము, గుణము, వాయువు, రూపము, రసము అని జీవుడు నవాత్మకుడు. అంగుష్ఠద్వయమునందు జీవుని, మిగిలిన వాటిని తర్జనిమొదలు వామప్రదేశిని వరకును విన్యసించవలెను. దేహముపై, శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాళ్ళు, పాదములు వీటిపై విన్యసించవలెను. దశాత్మకుడగు ఈ జీవుడు వ్యాపకుడుగా చెప్పబడుచున్నాడు. అంగుష్ఠద్వయమునందును, తర్జన్యాదులయందును, శిరో, లలాట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, జాను, పాదములందును విన్యసించవలెను. మనః, శ్రోత్ర, చక్షుర్, జిహ్వా, ఘ్రాణ, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ రూపమున ఏకాదశాత్మకుడగు ఈ జీవుని శ్రోత్రమునందును, అంగుష్ఠద్వయమునందును, తర్జని మొదలు ఎనిమిదింటియందును, మిగిలిన తలద్వయము నందును విన్యసించవలెను. మనస్సు వ్యాపకము. అట్లే దేహముపై క్రమముగా శిరో, లలాట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, ఊరుద్వయ, జంఘా (పిక్కలు), గుల్ఫ (చీలమండలు), పాదములపై విన్యసించవలెను, విష్ణువు, మధుహరుడు, త్రివిక్రముడు, వామనుడు, శ్రీధరుడు, హృషీకేశుడు, పద్మనాభుడు, దామోదరుడు, కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుడు అని ద్వాదశాత్ముడు. వీటిలో విష్ణువును వ్యాపకునిగా విన్యసించి, మిగిలిన వారిని అంగుష్ఠాదులందును, తలాదులందును, పాదమునందును, జానువునందును, కటియందును, శిరస్సు, శిఖ, ఉరస్సు, కటి, ముఖము, జానువు, పాదము మొదలైనవాటి యందును విన్యసించవలెను. పంచవింశ వ్యూహములు కలవాడును, షడ్వింశ వ్యూహములు కలవాడును, ఎట్లనగా:

పురుష, ధీ, అహంకార, మనసు, చిత్త, శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ, శ్రోత్ర, త్వక్, చక్షుర్, జిహ్వా, నాసికా, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ, భూ, జల, తేజస్, వాయు, ఆకాశములు పంచవింశతి వ్యూహము. పురుషుని వ్యాపకునిగా విన్యసించి, పదింటిని అంగుష్ఠాదులందును, మిగిలిన వాటిని హస్త తలమునందును విన్యసించవలెను. పిమ్మట శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, ఊరువులు, జానువులు, పాదములు, దశేంద్రియములు, పాదములు, జానువులు, ఉపస్థ, హృదయము, శిరస్సు- వీటిపై క్రమముగా విన్యసించవలెను. షడ్వింశ వ్యూహము నందు పురుషాత్మకు ముందు పరరూపము ఉండును. మిగిలినదంతయు వెనుక చెప్పినట్లే.

పండితుడు ఒక మండలముపై ప్రకృతిని ధ్యానించి పూజింపవలెను. పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిశలందు హృదయాదులను పూజింపవలెను. అగ్న్యాది కోణములందు అస్త్రమును, వైనతేయాదులను, దిక్పాలులను పూర్వమునందు వలెనే పూజింపవలెను. త్రి వ్యూహమునందు అగ్ని మధ్యమందు ఉండును. పూర్వాది దిక్కులందుదలములందు ఉన్న దేవతలతో కూడ రాజ్యాద్యలంకృతుడై కమల కర్ణికయందు నభోరూపుడగు, మానసాత్మ (అంతరాత్మ) ఉండును. ఈ విధముగ సర్వ వ్యూహములతోను, గరుడాది పంచాంగములతోను, ఇంద్రాదులతోను కూడిన విశ్వరూపుని లోకస్థితి నిమిత్తము, రాజ్యజయము కొరకును పూజింపవలెను. సమస్త కామములను పొందును. ఆకాశమునందు ఉన్న బీజమును స్మరించుచు విష్వక్సేనుని పేరుతో పూజించవలెను. (25)