అగ్ని మహా పురాణము

Table of Contents

మత్స్యావతార కథ

వశిష్ఠుడు పలికెను: మత్స్యాది రూపములను ధరించినవాడును, సృష్ట్యాదులకు కారణమైన వాడును అగు విష్ణువును గూర్చి చెప్పుము. పూర్వము విష్ణువు నుండి వినిన విధమున ఆగ్నేయ పురాణమును గూర్చియు, బ్రహ్మను గూర్చియు (లేదా ఆగ్నేయపురాణ రూపమగు వేదమును) చెప్పుము.

అగ్ని పలికెను: వశిష్ఠా! విష్ణువు ధరించిన మత్స్యావతారమును గూర్చి చెప్పెదను వినుము. అవతారములు ధరించుట దుష్టనాశము కొరకును, శిష్టపాలనము కొరకును జరుగుచుండును కదా?

ఓ మునీ! గడచిన కల్పము చివర బ్రహ్మ నిద్రించుట అను నిమిత్తముచే ప్రళయమేర్పడెను. అపుడు భూలోకాదులన్నియు సముద్రములో మునిగిపోయినవి.

వైవస్వతమనువు భుక్తిముక్తులను అపేక్షించి తపస్సు చేసెను. ఒకనాడు ఆతడు కృతమాలానదిలో జలతర్పణము చేయుచుండగా ఆతని దోసిలిలోని జలములో ఒక చిన్న చేపపిల్ల కనబడెను.

ఆ రాజు దానిని నీటిలో పడవేయదలచుచుండగా అది ఆతనితో-“మహారాజా! నాకు ఈ జలములో మొసళ్ళు మొదలగు వాటి నుండి భయమున్నది. అందుచే నన్ను నీటిలో పడవేయకుము’ అని పలికెను. అది విని ఆతడు దానిని కలశములో ఉంచెను.

ఆ మత్స్యము పెద్దదిగా అయి రాజుతో “నాకొక పెద్ద స్థానమును ఇమ్ము” అని పలికెను. రాజు ఆ మాట విని దానిని చేదలో ఉంచెను.

అచట పెద్దదై “ఓ! మను చక్రవర్తీ! నాకు విశాలమైన స్థానము నిమ్ము” అని రాజుతో అనెను. పిమ్మట దానిని రాజు సరస్సులో విడువగా అది ఆ సరస్సు ప్రమాణము వంటి ప్రమాణము గలదిగ పెరిగెను. “నాకు ఇంకను పెద్దదైన స్థానము ఇమ్ము” అని ఆ మత్స్యము పలుకగా దానిని అతడు సముద్రములోనికి విడచెను.

అది క్షణ మాత్రమున లక్ష యోజనముల ప్రమాణము గలదిగా పెరిగెను. అద్భుతమైన ఆ మత్స్యమును చూచి, మనువు ఆశ్చర్యము చెంది “నీ వెవరవు? నీవు నిజముగ విష్ణుమూర్తివే. నారాయణా! నీకు నమస్కారము. జనార్థనా! మాయచేత నీవు నన్ను ఈ విధముగ ఏల మోహపెట్టు చున్నావు?” అని పలికెను.

మనువు ఈ విధముగా పలుకగా ఆ మత్స్యము “ఈ జగత్తును నిలుపుటకును, దుష్టులను నశింపజేయుటకును అవతరించినాను” అని ప్రజలను పాలించుటయందు (లేదా తనను రక్షించుటయందు) ఆసక్తిగల ఆతనితో అనెను-

ఇంకను ఆ మత్స్యము (నేటి నుండి) ఏడవ దినమున సముద్రము ఈ జగత్తును ముంచి వేయును. అప్పుడు నీ దగ్గరకు వచ్చిన నావలో బీజములు మొదలగువాటిని ఉంచుకొని, సప్తర్షి సమేతుడవై బ్రహ్మ నిద్రించు రాత్రి అంతయు సంచరింపగలవు. నేను నీ దగ్గరకు వచ్చినపుడు ఆ నావను పెద్ద సర్పముతో నా కొమ్మునకు కట్టివేయుము” అని పలికి మత్స్యము అంతర్ధానము చెందెను. మనువు ఆ కాలమునకై నిరీక్షించుచు ఉండెను. సముద్రము గట్టు దాటి పొంగగా రాజు అప్పుడు నావను ఎక్కెను.

ఒక కొమ్ముగల, పదివేల కోట్ల యోజనములుగల బంగారు మత్స్యము అచ్చటకు రాగా దాని కొమ్మునకు రాజు నావను కట్టెను. ఆ మత్స్యమును స్తోత్రములచే స్తుతించుచు, పాపములను తొలగించు మత్స్యపురాణమును ఆ మత్స్యము చెప్పగా వినెను.

కేశవుడు బ్రహ్మ నుండి వేదములను అపహరించిన హయగ్రీవుడు అను దానవుని సంహరించి వేదమంత్రాదులను రక్షించెను. పిమ్మట వారాహకల్పము రాగా హరి కూర్మావతారము ధరించెను. (2)