అగ్ని మహా పురాణము
ప్రతిష్ఠాకళాశోధన విధానము
ఈశ్వరుడు చెప్పెను: శాంతము, నాదాంతకము అను హ్రస్వ దీర్ఘముల ప్రయోగముచే శుద్ధ, అశుద్ధ కళల సంధానము చేయవలెను. ‘ఓం హాం హ్రాం హ్రీం హాం’ అనునది సంధాన మంత్రము. పిమ్మట ప్రతిష్ఠాకళలో నున్న జల, తేజో, వాయు, ఆకాశ, పంచతన్మాత్ర, దశేంద్రియ, బుద్ధి, గుణత్రయ, అహంకార, పురుషులను ఇరువదియైదు తత్త్వములను, ‘క’ మొదలు ‘య’ వరకును ఉన్న ఇరువదియైదు అక్షరములను చింతన చేయవలెను. ప్రతిష్ఠాకళలో ఏబదియారు భువనములు ఉన్నవి. వాటిలో అవే పేరులుగల రుద్రులు అంతమంది ఉన్నారు. వారి పేర్లు ఈ విధముగ ఉన్నవి: అమరేశ, ప్రభాస, నైమిశ, పుష్కర, ఆషాఢి, డిండి, భావభూతి, లకులీశులు (ఇది మొదటి అష్టకము); హరిశ్చంద్ర, శ్రీశైలం జల్ప, ఆమ్రాతకేశ్వర, మహాకాల, మధ్యమ, కేదార, భైరవులు (ద్వితీయాష్టకము); గయా, కురుక్షేత్ర, నాల కనఖల, విమల, అట్టహాస, మహేంద్ర, భీములు (తృతీయాష్టకము); వస్త్రపద, రుద్రకోటి, అవిముక్త, మహాలయ, గోకర్ణ, భద్రకర్ణ, స్వర్ణాక్ష, స్థాణువులు (చతుర్థాష్టకము); అజేశ, స్వర్వజ్ఞ, భాస్వర, తదనంతర, సుబాహు, మంత్రరూపి, విశాల, జటిల, రౌద్రులు (ఐదవ అష్టకము); పింగలాక్ష, కాలదంష్ట్రి, విధుర, ఘోర, ప్రాజాపత్య, హుతాశన, కాలరూపి, కాలకర్ణులు (ఆరవ అష్టకము); భయానక, పతంగ, పింగల, హర, ధాతృ, శంకుకర్ణ, శ్రీకంఠ, చంద్రమౌళులు (ఏడవ అష్టకము) ఈ ఏబది ఆరుగురు రుద్రులు ఏబది ఆరు భువనములలో వ్యాపించి యున్నారు. ఇపుడు ముప్పది రెండు పదములు చెప్పబడుచున్నవి.
త్యాపిన్, అరూపిన్, ప్రథమ, తేజః, జ్యోతిః, అరూప, పురుష, అగ్నే, అధూమ, అభస్మన్, అనాదే, నానానానా, ధూధూధూధూ, ఓం భూః, ఓం భువః, ఓం స్వః, అనిధన, నిధన, నిధవోద్భవ, శివ, శర్వ, పరమాత్మన్, మహేశ్వర, మహాదేవ, సద్భావ, ఈశ్వర, మహాతేజః, యోగాధిపతే, ముంచ, ప్రమథసర్వ, సర్వసర్వ అనునవి ముప్పదిమూడు పదములు. రెండు బీజములు, వాసుదేవ, శిరస్, శిఖలను మూడు మంత్రములు. గాంధారీ సుషుమ్నా నాడులు, సమాన ఉదానములను రెండు ప్రాణవాయువులు, రసనా పాయువులను రెండు ఇంద్రియములు. రసమను విషయము. రూప, శబ్ద, స్పర్శ, రసములను నాలుగు గుణములు, కమలాంకితమైన అర్థచంద్రాకర శ్వేత మండలము, సుషుప్త్యవస్థ, ప్రతిష్ఠాకారణభూతుడైన విష్ణువు-ఈవిధముగ భువనాది సకల తత్త్వములను ప్రతిష్ఠలోపల భావనచేసి, ప్రతిష్ఠాకళా మంత్రముతో శిష్యశరీరమున ప్రవేశించినట్లు భావనచేసి, దానిని ఆ కళా పాశమునుండి విముక్తుని చేయవలెను. ఓంహాం హీం హాం ప్రతిష్ఠా కలాపాశాయ హుం ఫట్ స్వాహా” అను మంత్రముతో, పూరక ప్రాణాయామాంకుశ ముద్రలతో కళాపాశాకర్షణము చేయవలెను. పిమ్మట ‘ఓం హూం హాం హీం హాం ప్రతిష్ఠా కలాపా శాయ హుం ఫట్’ అనుమంత్రముతో, సంహార ముద్రా కుంభక ప్రాణాయామములతో హృదయము క్రింద నాడీ సూత్రము గ్రహించి, ‘ఓం హూం హీం హాం ప్రతిష్ఠా కలాపాశాయ నమః’ అను మంత్రముతో, ఉద్భవముద్రా-రేచక ప్రాణాయామములతో కుండమునందు ఉంచవలెను. పిదప ‘ఓం హాం హాం హీం మాం ప్రతిష్ఠా కాలాద్వారాయ నమః’ అను మంత్రముతో అర్ఘ్యము ఇచ్చి, పూజించి, స్వాహావిత మంత్రముతో మూడేసి హోమములు చేసి, సంతర్పణ సంవిధాపనములు చేయవలెను. ‘ఓం హాం విష్ణవే నమః’ అను మంత్రముతో విష్ణువును ఆవాహనచేసి, పూజా తర్పణములు చేసి-ఓ విష్ణూ! నీ అధికారమునందు ముముక్షువగు శిష్యునకు దీక్ష ఇచ్చుచున్నాను. నీవు అనుకూలుడవు అగుము’ అని ప్రార్థించవలెను.
పిమ్మట వాగీశ్వరీ, వాగీశ్వరులను వెనుకటి వలెనే ఆవాహనచేసి పూజనతర్పణములు చేసి, శిష్యుని వక్షమున తాడనము చేయవలెను. ‘ఓం హాం హం హః హూం ఫట్’ అనునది తాడన మంత్రము. ఈ మంత్రముతోడనే శిష్యుని హృదయమున ప్రవేశించి పాశబద్ధమగు ఆతని చైతన్యమును అస్త్రమంత్ర-జ్యేష్ఠాంకుశ ముద్రలతో పాశవిముక్తము చేయవలెను. ఎట్లనగా ‘ఓం హాం హం హః ఫట్’ ఈ మంత్రమునకే ‘స్వాహా’ చేర్చి తత్సంప్రుటితమైన మంత్రముతో జీవ చైతన్యము ఆకర్షించి, నమస్కారాంతమగు ‘ఓం హాం హాం హాం ఆత్మనే నమః’ అను ఆత్మ మంత్రముతో తన ఆత్మతో కలపవలెను. పిదప, ఆ జీవచైతన్యము పితృసంయుక్తమను భావన చేసి, దానిని వామ ఉద్భవముద్రతో దేవీ గర్భమునందు స్థాపించవలెను. ఆ సమయమున ‘ఓం హాం హం హామాత్మనే నమః’ అను మంత్రము పఠించవలెను. దేహోత్పత్తి కొరకై హృదయ మంత్రముతో ఐదు హోమములును, జీవాత్మ స్థితికొరకై శిరోమంత్రముతో ఐదు హోమములు చేయవలెను. అధికారప్రాప్తి కొరకు శిఖామంత్రముతోను, భోగసిద్ధి కొరకు కవచమంత్రముతోను, లయకొరకు అస్త్రమంత్రముతోను, ప్రోతః సిద్ధికొరకు శివమంత్రముతోను తత్త్వశుద్ధి కొరకు హృదయ మంత్రముతోను ఐదేసి హోమములు చేయవలెను. పిమ్మట వెనుకటివలె గర్భాధానాది సంస్కారములుచేసి, పాశశైథిల్య-ప్రాయశ్చిత్తముల కొరకు శిరోమంత్రముతో నూరు హోమములు చేయవలెను. మలశక్తి నివారణము కొరకై స్వాహాంతమగు అస్త్ర మంత్రముతో ఐదు హోమములు చేయవలెను. ఈ విధముగ పాశములు తొలగిన పిమ్మట అస్త్రమంత్రమును ఏడు పర్యాయములు జపించి, ‘ఓం హీం ప్రతిష్ఠా కలాపాశాయ హూం ఫట్’ అను కమలాబీజ యుక్తమగు అస్త్రమంత్ర రూప ఖడ్గముతో కలాపాశమును ఛేదించ వలెను. పాశశస్త్రముతో ఆ పాశమును నలిపి, వర్తులాకారము చేసి, వెనుకటి వలెనే ఘృతపూర్ణమగు స్రువమునందుంచి, దానిని కలాశస్త్రముతో హోమము చేయవలెను. పిమ్మట పాశాంకుర నివృత్తి కొరకై అస్త్రమంత్రముతో ఐదు హోమములు చేసి ప్రాయశ్చిత్త నివారణార్థమై మరల ఎనిమిది హోమములు చేయవలెను. ‘ఓం హః అస్త్రాయ హూం ఫట్’ అనునది హోమమునకు ఉపయోగించు అస్త్రమంత్రము.
హృదయ మంత్రముచే విష్ణువును ఆవాహనచేసి, పూజన తర్పణాద్యనంతరము ‘ఓం హాం విష్ణో రసంశుల్కం గృహాణ స్వాహా’ అను మంత్రముతో అధికార సమర్పణము చేయవలెను, పిదప ఈ విధముగ శివాజ్ఞ వినిపింపవలెను. ‘ఓ విష్ణూ! ఈ పశువు పాశములు పూర్తిగా దగ్ధమైనవి. ఇక నీవు వీనికి బంధన కారకుడవు కాకూడదు.” పిదప రౌద్రీనాడితో విష్ణువును విసర్జించి రాహుముక్తమైన అర్థభాగముగల చంద్రమండలముతో సమానమైన ఆత్మను నియుక్తము చేయవలెను. సంహార ముద్రతో దానిని తనలోనుండి, ఉద్భవ ముద్రతో దానిని సూత్రముతో కలుపవలెను. పిదప వెనుకటివలెనే, జలబిందు సదృశమగు ఆ ఆత్మను శిష్యుని శిరముపై ఉంచవలెను. దీనివలన ఆతనికి ఆప్యాయనము కలుగును. పిదప పుష్పాదులతో అగ్నియొక్క మాతాపితరులను పూజించి, విసర్జనముచేసి, విధిపూర్తి కొరకై యథాశాస్త్రముగ పూర్ణాహుతి ఈయవలెను. ఇట్లు చేయుటచే ప్రతిష్ఠాకళ కూడ శోధితమగును. (85)
