అగ్ని మహా పురాణము

Table of Contents

ప్రాసాద ప్రతిష్ఠా విధి విధానము

పరమేశ్వరుడు పలికెను: స్కందా! నేను ఇప్పుడు ప్రాసాద (దేవాలయ) ప్రతిష్ఠావిధి చెప్పెదను, దానియందు చైతన్య సంబంధమును చూపుచున్నాను. దేవాలయము నందలి శుకనాసము సమాప్తియగు చోట పూర్వవేది మధ్యభాగమునందు ఆధార శక్తిని భావించి ప్రణవ మంత్రముతో కమలమును న్యాసము చేయవలెను. దాని పైన సువర్ణాది దాతువులలో ఏదైన ఒక దానితో చేసిన కలశను స్థాపించవలెను. దానిలో పంచగవ్యములు, మధువు, పాలు, రత్నములు, మొదలగు ఐదు వస్తువులు ఉంచవలెను. కలశపై గంధము పూసి, వస్త్రముచే కప్పి, సుగంధ పుష్పములతో వాసితముచేసి, చూతాది పంచ వృక్షముల పల్లవములచే దాని ముఖమును ఆచ్ఛాదించవలెను. హృదయమంత్రముతో హృదయకమల భావన చేయుచు ఆ కలశను అచట స్థాపించవలెను. పిదప గురువు పూరక ప్రాణాయామముతో శ్వాసను లోనికి గ్రహించి, శరీరముతో సకలీకరణక్రియ చేయవలెను. స్వమంత్రముతో కుంభక ప్రాణాయామము ద్వారా ప్రాణవాయువును లోపల అవరుద్ధము చేయవలెను. ఈశ్వరుని అనుమతితో సర్వాత్మాభిన్నమైన జీవచైతన్యమును జాగృతము చేయవలెను. రేచక ప్రాణాయామముతో ప్రజ్వలించుచున్న అగ్నికణమువలె ఉండు జీవచైతన్యమును ద్వాదశాంశ స్థానమునుండి గ్రహించి, కలశములో స్థాపించి, దానియందు అతి వాహిక శారీర న్యాసముచేసి, దాని గుణములను బోధించు కాలాదికమును, ఈశ్వర సహితములగు పృథ్వీ పర్యంతతత్త్వ సముదాయమును దానియందు నివేశింపచేయవలెను. పదమూడు ఇంద్రియములను, తదధిపతులను నామమంత్రముతో కలశపై స్థాపించి, ప్రణవము మొదట చేర్చిన నామమంత్రములతో పూజించవలెను. తమతమ కార్యములు చేయించు మాయాపాశ నియామికలను ప్రేరకులగు విద్యేశ్వరులను, సర్వవ్యాపియగు శివుని తమ మంత్రములతో న్యాసముచేసి పూజించవలెను. సకల అంగముల న్యాసముచేసి అవరోధినీముద్రతో వాటినన్నింటిని నిరోధించవలెను. లేదా సువర్ణాది ధాతువులతో ఒక మానవాకృతి నిర్మించి, దానిని పంచ గవ్యములతోను, కషాయ ద్రవ్యములతోను శుద్ధిచేసి శయ్యపై కూర్చుండబెట్టి ఉమాపతియైన రుద్రుని ధ్యానించుచు, శివమంత్రముతో ఆ పురుష శరీరమునందు వ్యాపకరూపమున ఆ శివుని న్యాసము చేయవలెను. శివసాన్నిధ్యము కొరకై హోమ, ప్రోక్షణ, స్పర్శ, జపములు చేయవలెను. సన్నిధాపనము రోధకము మొదలగు సకల కార్యములను భాగత్రయ విభాగ పూర్వకముగ చేయవలెను. ఈ విధముగ ప్రకృతి పర్యంత న్యాసమునకు సంబంధించిన న్యాస విధానము పూర్తిచేసి ఆ పురుషుని కలశములో స్థాపించవలెను. (101)