అగ్ని మహా పురాణము

Table of Contents

స్నపనోత్సవ విధానము

అగ్ని దేవుడు పలికెను: “బ్రహ్మదేవా! ఇపుడు నేను స్నానోత్సవమును గూర్చి సవిస్తరముగ చెప్పెదను. ప్రాసాదము ఎదుట మండపము క్రింద మండలముపై కలశములు ఉంచవలెను. ప్రారంభమునందు అన్ని కర్మలు చేయునపుడును శ్రీహరి ధ్యానము, పూజాహోమములు చేయవలెను. పూర్ణాహుతితోపాటు వెయ్యి లేక నూట ఎనిమిది హోమములు చేయవలెను. స్నాన ద్రవ్యములు తీసికొని వచ్చి కలశ విన్యాసము చేయవలెను. కంఠసూత్రయుక్త కుంభములను అధివాసనము చేసి మండలముపై ఉంచవలెను.

చతురస్ర మండలము నిర్మించి దానిని పండ్రెండు రేఖలచే విభజించవలెను. ప్రక్క నున్న రేఖను తుడిచివేయవవలెను. ఈ విధముగ ఆ మండలముపై నాలుగు దిక్కులందును తొమ్మిదేసి కోష్ఠకములు స్థాపించి వాటిని పూర్వాది క్రమమున వరిపిండి మొదలైన వాటితో నింపవలెను. పిమ్మట విద్వాంసుడు కుంభముద్రతో పూర్వాది దిక్కులందున్న నవకమునందు కలశలు ఉంచవలెను. పుండరీకాక్ష మంత్రముతో వాటిలో దర్భలు ఉంచవలెను. సర్వరత్నములును ఉంచి నుదకపూర్ణ కుంభమును మధ్య భాగమునందు ఉంచి మిగిలిన ఎనిమిది కుంభములలో క్రమముగ యవ, వ్రీహి, తిల, నీవార, శ్యామాక, కులత్థ, ముద్గ, శ్వేత సర్షపములు వేసి ఎనిమిది దిక్కులందును స్థాపింపవలెను. పూర్వదిక్కునందున్న నవకమునందు మధ్య ఘృతపూర్ణకుంభము ఉంచవలెను. మిగిలిన ఎనిమిది కుంభములలో పలాశ, అశ్వత్థ, వట, బిల్వ, ఉదుంబర, ప్లక్ష, జంబూ, శమీ, కపిత్థ వృక్షముల బెరడు నుండి తీసిన రసము పోయవలెను. ఆగ్నేయమునందున్న నవకమునందు మధ్య మధుపూర్ణ ఘటము నుంచవలెను. మిగిలిన ఎనిమిది కుంభములలో గోశృంగ, పర్వత, గంగాజుల, గజశాలా, తీర్థ, క్షేత్ర(పొలము), ఖల(కళ్ళము) ములమట్టి ఉంచవలెను.

దక్షిణమున నున్న నవకమున మధ్యయందు తైలపూర్ణ ఘటము స్థాపింపవలెను. మిగిలిన ఘటములలో నారంగ జంబీర, నింబ, ఖర్జూర, మృత్తికా, నారికేళ, పూగ, దాడిమ, పనస ఫలములు ఉంచవలెను. నైరృతిదిక్కున నవకమునందు మధ్య క్షీర పూర్ణ కుంభము ఉంచి మిగిలిన ఎనిమిదింటిలో కుంకుమ, నాగపుష్ప, చంపక, మాలతీ మల్లికా, పున్నాగ, కరవీర, కమల కుసుమములు ఉంచవలెను. పశ్చిమ నవక మధ్యమున నారికేళ జలపూర్ణ కలశముంచి, మిగిలిన ఎనిమిదింటిలో నదీ, సముద్ర, సరోవర, కూప, వర్షా, హిమ, నిర్ఝుర, దేవనదుల జలములు ఉంచవలెను.

వాయవ్య నవకమునందు మధ్య కదళీ జలపూరిత కుంభముంచి, మిగిలిన ఎనిమిది కుంభములందును సహదేవీ కుమారీ, సింహీ, వ్యాఘ్రీ, అమృతా, విష్ణుపర్ణీ, దుర్వా, వచా అను దివ్యౌషధులను ఉంచవలెను. పూర్వాది సౌమ్య నవకమునందు మధ్య దధికలశము నుంచి, మిగిలిన కలశములందు పత్ర, ఏలా, త్వక్, కూట, బాలకచందన ద్వయలతా, కస్తూరీ, కృష్ణాగురు, సిద్ధ ద్రవ్యములను ఉంచవలెను. ఈశాన్య నవక మధ్యమున శాంతి జలపూర్ణ కుంభముంచవలెను. మిగిలిన కలశములలో క్రమముగ చంద్ర, తార, రజత, లోహ, త్రపు, కాంస్య, సీసక, రత్నములను ఉంచవలెను. ప్రతిమకు ఘృతము పూసి, ఉద్వర్తనముచేసి, మూలమంత్రముతో స్నానము చేయించవలెను. మరల దానికి గంధాదులతో పూజచేయవలెను. అగ్నిలో హోమము చేసి పూర్ణాహుతి ఇవ్వవలెను. సకలభూతములకు బలిప్రదానముచేసి, బ్రాహ్మణునకు, దక్షిణా పూర్వకముగ భోజనము చేయించవలెను. దేవతలు, మునులు, అనేకులు రాజులు కూడ భగవద్విగ్రహమునకు అభిషేకము చేయుట చేతనే ఐశ్వర్యాదులను పొందిరి.

ఈ విధముగ ఒక వెయ్యి ఎనిమిది కలశములతో స్నాపనోత్సవము చేయవలెను. ఇట్లు చేయుటచే మానవుడు అన్ని కామములను పొందగలడు. యజ్ఞా అవభృథ స్నానము నందు కూడ పూర్ణ స్నాన సిద్ధి కలుగును. పార్వతీ లక్ష్యాదుల వివాహాదులలో కూడ స్నపనోత్సవము చేయబడును. (69)