అగ్ని మహా పురాణము

Table of Contents

కుండ నిర్మాణ అగ్ని కార్యాది విధి

నారడు ఇట్లు పలికెను:

అన్ని కోరికలను తీర్చు అగ్ని కార్యమును చెప్పెదను. ఇరవైనాలుగు అంగుళముల చతురస్ర క్షేత్రమును సూత్రముతో కొలచి అంతటను సమముగా త్రవ్వవలెను. ఆ విధముగా త్రవ్వినదానికి రెండంగుళములు విడచి, మేఖలలు (ఒడ్డాణమువంటి కట్లు) చేయవలెను. సత్త్వము మొదలగు పేర్లుగల ఆ మేఖలలు పూర్వాభిముఖములుగాను, పండ్రెండు అంగుళములు ఎత్తు కలవిగ ఉండవలెను. ఒకటి ఎనిమిది అంగుళముల విస్తారము కలది, రెండవది రెండు అంగుళముల విస్తారము కలది, మూడవది నాలుగు అంగుళముల విస్తారము కలది అయి ఉండవలెను.

పది అంగుళముల రమ్యమైన యోని ముందువైపు వరుసగా ఆరు, నాలుగు, రెండు అంగుళములు ఎత్తు ఉండవలెను. పడమట నున్న దానిని క్రమముగా లోతుగా నుండునట్లు చేయవలెను. రావి ఆకు ఆకారములో ఉన్న దానిని కొద్దిగా కుండములోనికి చేర్చి నిర్మింపవలెను. దాని నాళము నాలుగు, ఐదు, పది అంగుళాల పొడవు ఉండవలెను. ఆ యోని యొక్క మూలము మూడు అంగుళములు, దాని అగ్రము ఆరు అంగుళములు ఉండవలెను. ఏకహస్తకుండ లక్షణము ద్విహస్త కుండాదుల విషయమున రెట్టింపు అగుచుండును.

ఒక మేఖల, మూడు మేఖలలు గల వర్తులాది కుండములను గూర్చి చెప్పెదను. కుండము యొక్క అర్ధమునందు సూత్రమును ఉంచగా కోణమునందు మిగిలిన ఆ సూత్రములోని అర్ధమును దిక్కునందుంచి త్రిప్పినచో అది వర్తులమగును.

కుండార్ధమును మించిన కోణభాగార్ధమును బయట ఉత్తరభాగమున పెంచి పూర్వ పశ్చిమముల వైపు బైటకు చాపి మధ్యము నందు ఉంచి సూత్రము త్రిప్పినచో అర్ధచంద్రాకారమైన శుభకరమైన కుండము ఏర్పడును. పద్మాకారమైన వర్తుల కుండము నందు మేఖలయందు దళములు ఉండును.

హోమము చేయుటకై చేయి ప్రమాణము లేదా పండ్రెండు అంగుళముల ప్రమాణముగల సృక్కును చేయించవలెను. దాని మూలభాగము చతురస్రముగా ఏడు లేదా ఐదు అంగుళములు ఉండవలెను. దాని మధ్యయందు త్రిభాగమున అందమైన, వర్తులాకారమైన గరము (గొయ్యి) ఉండవలెను. అడ్డముగా, పైభాగమున సమముగా ఆ గరము నిర్మించి పైన అర్ధాంగుళ భాగమును శోధించవలెను. (చెక్కి నున్నగా చేయవలెను). నాల్గవవంతు అంగుళమును, మిగిలిన అర్ధములో అర్ధమును కూడ శోధించవలెను. మిగిలిన అర్ధముచే గరమునకు రమ్యమైన మేఖలను ఏర్పరుపవలెను. త్రిభాగవిస్తారము కలదియు, అంగుష్ఠమంత ఆయతమైనదియు అగు కంఠమును చేయవలెను. దాని అగ్రమునందు నాలుగు లేదా ఐదు అంగుళముల ప్రమాణముగల ముఖము ఉండవలెను. దాని మధ్యము ఆరు అంగుళముల ప్రమాణము ఉండవలెను. దాని ఆయమము కూడ అంతయేఉండి మధ్యమున పల్లమై అందముగా ఉండవలెను. దాని కంఠ దేశమునందు చిటికెన వ్రేలు ప్రవేశించునంత రంధ్రము ఉండవలెను. మిగిలిన కుండము (స్రుక్కు / ముఖము) అభిరుచిని అనుసరించి విచిత్రముగ చేయవలెను.

స్రువము దండముతో సహా చేయి పొడవు ఉండవలెను. కొంచెము పంకమునందు ఆవు పాదము దిగినలోతు ఎట్లుండునో ఆ విధముగా అందమైన, రెండు అంగుళముల వృత్తము చేయవలెను.

అగ్ని కుండమును అలికి, అంగుళము ప్రమాణము గల వజ్రనాసికా లేఖను గీయవలెను. అది ఉత్తరాగ్రమగు మొదటి రేఖ, దానిపై పూర్వాభిముఖములైన రెండు రేఖలు గీయవలెను. వాటి మధ్య దక్షిణాదిక్రమమున మూడు రేఖలు గీయవలెను.

మంత్రవేత్త ఈ విధముగా రేఖలు గీసి, ప్రణవ ముచ్చరించుచు, నీళ్ళు చల్లి, ఓం కారమును ఉచ్చరించుచు పీఠమును కల్పించి దానిపై మూర్తిమతియగు వైష్ణవీ శక్తిని అలంకరించి, విష్ణువును స్మరించుచు అగ్నిని ఉంచవలెను.

జానెడు పొడవుగల సమిధల నుంచి ఆ అగ్నిని ప్రజ్వలింపచేసి పూర్వాది దిక్కులందు దర్భలు మూడు విధములుగా(చుట్టూ) పరచి, వాటిపై పాత్రను, ఇధ్మమును వహ్నిని సమీపమున నుండునట్లు చేసి స్రుక్కును, స్రువమును భూమిపై ఉంచవలెను.

ఆజ్యస్థాలిని, చరుస్థాలిని, కుశాజ్యమును ప్రణీతచే ప్రోక్షించి, ప్రోక్షణిని గ్రహించి దానిని నీటితోనింపి, ఆ నీటిని పవిత్రముచే కప్పబడిన హస్తమునందు జారవిడచి, ప్రోక్షణీ పాత్రమును తూర్పుగా తీసికొని వెళ్ళి, దానిని అగ్నికి ఎదురుగా ఉంచి, దానిని ఉదకముచే మూడు సార్లు ప్రోక్షించి, ఎదుట నుంచి, ఉత్తరమున పుష్పములతో కూడిన ప్రణీతపై విష్ణువును ధ్యానించి ఆజ్యపాత్రను ఆజ్యముతో నింపి ఎదుట ఉంచి, తెగని చిగుళ్లుగల, గర్భములేని జానెడు పొడవైన రెండు కుశములను వెల్లకితల చేయబడిన హస్తములచే బొటన వ్రేలితోను అనామికతోను పట్టుకొని, వాటిని నేతిలో ఇటునటు త్రిప్పి నేతిని సంస్కరించవలెను.

వాటి ఆజ్యమును సంగ్రహించి, రెండు పర్యాయములు తీసి, మూడు పర్యాయములు క్రిందికి చిమ్మవలెను. వాటితో స్రుక్స్రువములను గ్రహించి, నీటిచే తడిపి, వెచ్చచేసి, దర్భలచేత తుడిచి, మరల కడిగి, వెచ్చచేసి, ఓంకారము నుచ్చరించుచు వాటిని క్రింద ఉంచి, సాధకుడు, పిమ్మట ఓంకారము ఉచ్చరించుచు, చివర “నమః” అని అనుచు పిమ్మట హోమము చేయవలెను.

గర్భాధానాది కర్మలను ఆయా అంశముల వ్యవస్థ చక్కగా పాటించుచు, అంగములను అనుసరించి, నామాంతముగాగాని, సమావర్తాంతముగాని, అధికారాంతముగాని చేయవలెను. సాధకుడు అన్నింటను ఓంకారముతో ఉపచారము చేయవలెను. ధనలోభము చేయకుండగా అంగ హోమములు చేయవలెను. గర్భాధానము, పుంసవనము, సీమన్తోన్నయనము, జాతకర్మ నామకరణము, అన్నప్రాశనము, చౌలము, వ్రతబంధము (ఉపనయనము), సమస్తమైన వేదవ్రతాలు (నాలుగు), స్నాతకము, వివాహము, అధికారకము అను సంస్కారములను వరుసగా చేయవలెను.

 ప్రతికర్మ యందును హృదయాది క్రమముచే ధ్యానించి, ఒక్కొక్క కర్మను పూజించి, మరల ఎనిమిదేసి ఆహుతులను హోమము చేయవలెను. సాధకుడు వౌషట్ చివరగల మంత్రమును చక్కగా ప్లుతస్వరముతో ఉచ్చరించుచు స్రుక్కు మొదటి భాగముతో పూర్ణాహుతి ఇవ్వవలెను.

విష్ణువునకై వహ్నిని సంస్కరించి వైష్ణవమైన చరువును అర్పించవలెను. స్థండిలము మీద విష్ణువును పూజించి, మంత్రములను స్మరించుచు ఆశ్రయించవలెను. ఉత్తమమైన సాంగావరణమును ఆసనాది క్రమముచే గంధ పుష్పములతో పూజించి, దేవతాశ్రేష్ఠుడైన ఆ విష్ణువును ధ్యానించి, సమిధను ఉంచి, పిమ్మట ఆగ్నేయ ఈశాన్య దిక్కులందు ఆజ్యా ఘారములను, వాయవ్య నైరృతి దిక్కులందు ఆజ్య భాగములను క్రమానుసారముగా సమర్పించి, పిమ్మట దక్షిణోత్తర చక్షుర్హోమములు చేసి, పిమ్మట అర్చాక్రమానుసారముగా మధ్యయందు, సర్వ మంత్రములతోడను హోమము చేయవలెను. ఆజ్యముచేత మూర్తిని తృప్తి పరచవలెను. పదవ అంశము అంగహోమము చేయవలెను. ఆజ్యము మొదలైన వాటితో లేదా తిలలతో గూడిన సమిధలతో నూరు లేదా వేయి హోమములు చేయవలెను. హోమము అంతమునందుగల పూజను సమాప్తి చేసి ఉపవాసమున్న పవిత్రులైన శిష్యులను పిలిచి, తన ఎదుట ఉంచుకొని, ఆ పశువులను అస్త్రమంత్రముచే ప్రోక్షించవలెను.

శిష్యులను విద్యాకర్మ నిబంధనములచే తనలో కలుపుకొని, లింగ శరీరమును అనుసరించి ఉన్నదియు, లింగశరీరముతో కూడా పాలింపబడినదియు అగు చైతన్యమును ధ్యానమార్గమున సంప్రోక్షించి, వాయు బీజముచే శుష్కింప చేయవలెను. పిమ్మట బ్రహ్మాండమను పేరుగల ఈ సృష్టి అంతయు అగ్ని బీజముచే కాల్చివేయబడి భస్మరాశివలె ఉన్నట్లుగా ధ్యానము చేయవలెను. ఆ భస్మము నీటితో ముంచెత్తవలెను. ప్రపంచమంతయు జలమయముగా ఉన్నట్లు స్మరించవలెను. పిమ్మట దానియందు పృథివీ వికారమైనదియు, బీజమను పేరు గలదియు అగు శక్తిని ఉంచవలెను. సమస్తమైన తన్మాత్రలచే ఏర్పడినది, పృథివీ వికారము, శుభమైనదియు, అఖండము, దాని (శక్తి) నుండి పుట్టినది. తత్స్వ రూపమును అగు దాని ఆధారమును ధ్యానించవలెను. దాని మధ్యమందు ప్రణవరూపమైన పురుష మూర్తిని ధ్యానించవలెను. పిమ్మట, పూర్వము సంస్కరింపబడిన, తనలో నున్న లింగశరీరమును దానిమీదికి సంక్రమింప చేయవలెను. అది క్రమముగా విభక్తమైన ఇంద్రియ ములు, అవయవ స్థితికలదై వృద్ధిపొందినట్లు చింతించవలెను.

పిమ్మట అండము ఒక సంవత్సరముపాటు ఉండి బ్రద్దలైనట్లును అ ముక్కలు ద్యులోక పృథివీలోకములైనట్లును, వాటి మధ్య ప్రజాపతి జనించినట్లును ధ్యానించవలెను. మరల చూచి, ఆ శిశువును ప్రణవముచే, పూర్వము చెప్పినట్లుగా న్యాసములుచేసి మంత్రాత్మకమగు శరీరము కలవానిగా చేయవలెను. పిమ్మట శిరస్సుపై విష్ణు హస్తమునుంచి, వైష్ణవ మంత్రమును ధ్యానించవలెను. ఈ విధముగా ధ్యాన యోగముతో ఒకటిగాని, అనేకము గాని జపించి, హస్తములను మొదళ్ళ యందు పట్టుకొని, మాంత్రికుడు నేత్ర మంత్రము చదువుచు అంచుతో (జాలుతో) కూడిన చినగ కుండా ఉన్న వస్త్రముచే ఆ శిష్యుల నేత్రములు బంధించవలెను. తత్త్వము నెరిగిన గురువు బాగుగా దేవదేవుని పూజించి, దోసిళ్లలో పుష్పములు ధరించియున్న ఆ శిష్యులను పూర్వాభి ముఖులుగా కూర్చుండబెట్టవలెను. ఆ శిష్యులుకూడ గుర్వనుజ్ఞ పొంది, అచట పుష్పాంజలిని చల్లి హరిని పూజింపవలెను. పిమ్మట పుష్పాదులతో వాసుదేవార్చనముచేసి, తరువాత గురుపాదార్చనము చేసి సర్వస్వమును గాని, దానిలో సగముగాని గురుదక్షిణగా ఇవ్వవలెను. గురువు శిష్యులకు బోధించవలెను. వారు నామములతో హరిని పూజించవలెను. శంఖచక్ర గదాధారియై, తర్జనితో జళిపించుచున్న ప్రభువైన విష్వక్సేనుని పూజించి మండలమునందున్న హరికి ఉద్వాసన చెప్పవలెను. విష్ణు నిర్మాల్యమునంతను విష్వక్సేనునకు సమర్పింవలెను.

ప్రణీతలతో తనపై జలము చల్లుకొని, కుండములో ఉన్న అగ్నిని తనలో చేర్చికొని విష్వక్సేనుని విసర్జన చేయవలెను. ఈ విధముగ చేసినచో భోగములు అనుభవింప కోరిక గలవాడు సకల భోగములను పొందును. మోక్షేచ్ఛగలవాడు హరియందు లీనుడగును. (24)