అగ్ని మహా పురాణము

Table of Contents

సోమ (చంద్ర) వంశ వర్ణనము

అగ్నిదేవుడు చెప్పెను:

ఇపుడు పఠించినచో పాపములను నశింపచేయు చంద్రవంశమును గూర్చి చెప్పెదను. విష్ణు నాభి కమలము నుండి బ్రహ్మ పుట్టెను. బ్రహ్మపుత్రుడు అత్రి, ఆతనికి సోముడు పుత్రుడు. అతడు రాజసూయయాగము చేసి త్రిలోక రాజ్యమును దక్షిణగా ఇచ్చివేసెను. అవభృథస్నానము సమాప్తమైన పిమ్మట అతని రూపమును చూడగోరి తొమ్మండుగురు దేవతా స్త్రీలు ఆతని దగ్గరకు వచ్చి కామబాణ సంతప్తలై ఆతనిని సేవించిరి. నారాయణుని విడిచి లక్ష్మియు, కర్దముని విడిచి సినీవాలి, అగ్నిని విడిచి ద్యుతి, అవ్యయుడగు ధాతను విడిచి పుష్టి, ప్రభాకరురుని విడచి ప్రభ, హవిష్మంతుని విడచి కుహు, వీరందరు స్వయముగ సోముని దగ్గరకు వచ్చిరి. భర్తయగు జయంతుని విడిచి కీర్తి, మరీచి పుత్రుడగు కశ్యపుని విడిచి వసువు, పతియైన నందిని విడిచి ధృతియు వచ్చి సోముని సేవించిరి. చంద్రుడుకూడ వారలను స్వకీయ స్త్రీలనువలె కామించెను. ఈ విధముగా అపచారము చేసిన ఆతని విషయమున ఆ స్త్రీల భర్తలు శాపములచేతగాని, శస్త్రారులచేతగాని శిక్షించుటకు సమర్థులు కాకపోయిరి. సోముడు తన తపోబలముచే సప్తలోకములకు ఏకమాత్రాధిపతి యయ్యెను. ఈ దుర్వినీతిచే కలుషితమైన ఆతని బుద్ధి వినయ విహీనమై భ్రాంతిచెందెను. ఆతడు అంగిరానందనుడగు బృహస్పతిని అవమానించి అతని భార్యయగు యశస్వినియైన తారను బలాత్కారముగ అపహరించెను. అందుచే దేవదానవుల మధ్య తారకామయము అను ప్రసిద్ధిగల లోక క్షయకరమగు గొప్పయుద్ధము జరిగెను. అంతమున బ్రహ్మ శుక్రుని అడ్డగించి తారను బృహస్పతికి ఇప్పించెను. ఆమె గర్భవతి అని తెలిసి బృహస్పతి ఈ గర్భమును విడువుముయని ఆజ్ఞాపించగ ఆమె ఆ గర్భమును విడిచెను. అపుడు తేజశ్శాలి యగు కుమారుడు ఆవిర్భవించి నేను సోముని పుత్రుడను అని చెప్పెను. ఈ విధముగ సోమునకు బుధుడను పుత్రుడు కలిగెను. ఆతనికి పురూరవుడు పుత్రుడు. ఊర్వశి అను అప్సరస స్వర్గము విడచి పురూరవుని వరించెను.

పురూరవుడు ఊర్వశీతో ఏబది తొమ్మిది సంవత్సరములు విహరించెను. పూర్వము ఒకే అగ్ని వుండెడిది. పురూరవుడు ఆ అగ్నిని మూడుగా విభజించెను. మహాయోగియగు ఆతడు గంధర్వ లోకము చేరెను. పురూరవునకు ఊర్వశియందు ఆయు, దృఢాయు, అశ్వాయు, ధనాయు, ధృతిమత్, వసు, దివిజాత, శతాయు అను ఎనమండుగురు పుత్రులు పుట్టిరి. ఆయువునకు నహుషుడు, వృద్ధశర్మ, రజి, దంభుడు, విపాప్మ అను ఐదుగురు పుత్రులు పుట్టిరి. రజికి రాజేయులని ప్రసిద్ధిచెందిన నూర్గురు పుత్రులు జనించిరి. రజికి విష్ణువు వరములను ఇచ్చెను. దేవతలు ప్రార్థింపగ, ఆతడు దేవాసుర యుద్ధమునందు దైత్యులను చంపెను. తనకు పుత్రుడుగా జన్మించిన ఇంద్రునకు రాజ్యము ఇచ్చి రజి స్వర్గము చేరెను. కొంతకాలము తరవాత రజి కుమారులు ఇంద్రుని రాజ్యమునులాగు కొనగ అతడు దుఃఖితుడయ్యెను. పిదప బృహస్పతి గ్రహశాంత్యాది విధులచే రజిపుత్రులను మోహింప చేసి రాజ్యము తీసుకొని మరల యింద్రునకు ఇచ్చెను. అపుడు రజికుమారులు ధర్మ భ్రష్టులైరి. నహుషునకు, యతి, యయాతి, ఉత్తమ, ఉద్ధవ, పంచక, శర్యాతి, మేఘపాలకులను ఏడుగురు కుమారులు జనించిరి. యతి బాల్యమునందే విష్ణు ధ్యానము చేసి విష్ణు పదమును పొందెను. శుక్రుని కుమార్తెయైన దేవయానియు, వృషపర్వుని కుమార్తెయైన శర్మిష్ఠయు యయాతి భార్యలైరి. వీరియందు యయాతికి ఐదుగురు కుమారులు జనించిరి. దేవయాని, యదు, తుర్వసు అనువారిని కనెను. శర్మిష్ఠ ధృహ్యుడు అను, పూరుడు అను ముగ్గురు పుత్రులను కనెను. వీరిలో యదు-పూరువులు సోమవంశ వర్ధకులైరి. (274)