అగ్ని మహా పురాణము

Table of Contents

దేవాలయ నిర్మాణ ఫలము

అగ్ని దేవుడు చెప్పెను: మునీశ్వరా! వాసుదేవాదుల కొరకు దేవాలయమును చేయించుటచే కలుగు ఫలమును చెప్పుచున్నాను. దేవాలయములు కట్టవలెననియు, తటాకాదులు నిర్మింపవలెను అనియు కలిగిన శుభ సంకల్పము! అట్టి సంకల్పము కలవాని వేల కొలది జన్మల పాపములను నశింపచేయును. భావన చేతనైన దేవాలయ నిర్మాణము చేసినవాని అనేక జన్మల పాపములు తొలగిపోవును. ఎవరైన దేవమందిరాదులు కట్టుచున్నప్పుడు దానిని ఆమోదించినవారు కూడ సమస్త పాపములు తొలగి విష్ణు లోకమును పొందుదురు. శ్రీమహావిష్ణువునకు ఆలయము నిర్మించినవారు భూతకాలము నందలి వేయి తరములవారిని, భవిష్యత్తులోని వేయి తరములవారిని విష్ణులోక నివాసార్హులనుగ చేయును. శ్రీకృష్ణుని ఆలయమును నిర్మించినవాని పితరులు వెంటనే నరకదుఃఖము నుండి విముక్తులై, దివ్యవస్త్రాభరణాదులు ధరించి ఆనందముతో విష్ణులోకమున నివసింతురు. దేవాలయ నిర్మాణము బ్రహ్మహత్యాది పాపములను తొలగించును. యజ్ఞము చేయుటవలన కలుగని ఫలములు గూడ దేవాలయ నిర్మాణముచే కలుగును. దేవాలయ నిర్మాణము వలన సమస్త తీర్థములందును స్నానము చేసిన ఫలము కలుగును.

దేవతా బ్రాహ్మణాదుల రక్షణము నిమిత్తము రణభూమిలో ప్రాణత్యాగము చేసిన వీరునకు ఏ ఫలము లభించునో ఆ ఫలము దేవాలయ నిర్మాణము చేయువానికి లభించును. లోభముచే మట్టితో దేవాలయము కట్టించినవానికి గూడ స్వర్గముగాని దివ్యలోకముగాని లభించును. ఏకాయ తన దేవాలయము (ఒకే దేవతా విగ్రహమునకై ఒకగదిగల ఆలయము) నిర్మించినవాడు స్వర్గమును పొందును. త్యాయతన దేవాలయమును నిర్మించినవాడు బ్రహ్మలోకములో నివసించును. పంచాయ తన దేవాలయమును నిర్మించినవాడు శివలోకమును చేరును. అష్టాయతన మందిరము నిర్మించిన వాడు శ్రీహరి సాన్నిధ్యము నందుండును. షోడశాయతన దేవాలయ నిర్మాణము చేసినవాడు భోగమును, మోక్షమును కూడా పొందును. శ్రీహరి దేవాలయములలో కనిష్ఠము, మధ్యమము, శ్రేష్ఠము అను మూడు శ్రేణులున్నవి. వీటి నిర్మాణము వలన క్రమముగ స్వర్గలోక, విష్ణులోక, మోక్షములు ప్రాప్తించును. ధనవంతుడు శ్రేష్ఠ శ్రేణికి చెందిన విష్ణ్వాలయమును నిర్మించుటచే ఎట్టి ఫలితమును పొందునో ఆ ఫలితమునే కనిష్ఠ శ్రేణికి చెందిన దేవాలయమును నిర్మించిన నిర్ధనుడు పొందును. తాను సంపాదించిన ధనములో స్వల్ప ధనమును మాత్రమే వెచ్చించి దేవాలయమును నిర్మించినను భక్తుడు అధికమగు పుణ్యమును, భగవంతుని అనుగ్రహమును పొందును. ఒక లక్షగాని, ఒక వెయ్యిగాని, నూరు గాని, దానిలో సగముగాని ముద్రలను ఖర్చుచేసి విష్ణు మందిరమును నిర్మించు వ్యక్తి శ్రీ మహావిష్ణు లోకమును తప్పకచేరును.

బాల్యమునందు ఆటలు ఆడుచు మట్టితో విష్ణువు ఆలయమును నిర్మించినవారు కూడ విష్ణు లోకమును చేరుదురు, తీర్థములందు, పవిత్ర స్థానములందు, సిద్ధ క్షేత్రములందు, ఆశ్రమములందు విష్ణ్వాలయము నిర్మించు వారికి ఇతర ప్రదేశములందు నిర్మించువారి కంటె మూడు రెట్లు ఎక్కువ ఫలము లభించును. విష్ణువు ఆలయమునకు వెల్లవేసిన వారును, దానిపై బంధూక పుష్పముల చిత్రములు వేసినవారును విష్ణు లోకమును పొందుదురు. కూలిపోయిన లేదా కూలిపోవుచున్న లేదా సగము కూలిపోయిన దేవాలయమును జీర్ణోద్ధారణము చేసినవానికి క్రొత్తదేవాలయము నిర్మించిన వానికంటె రెట్టింపు ఫలము లభించును. కూలిపోయిన విష్ణువు ఆలయమును మరల నిర్మించి రక్షించినవాడు సాక్షాత్ భగవత్స్వరూపుడు. భగవంతుని ఆలయమునందు ఇటుకలు ఎంత కాలము ఉండునో అంతవరకును, వాటిని నిర్మించినవాడు, తన కులముతో కూడ, విష్ణు లోకములో ఉండును. ఇహలోకమునందును, పరలోకమునందును కూడ ఆతడే పూజనీయుడు; ఆతడే పుణ్యవంతుడు.

శ్రీకృష్ణునకు ఆలయము కట్టించిన పుణ్యాత్ముడే పుట్టినవారిలో లెక్క. అతడే తన వంశమును రక్షించువాడు. విష్ణు, శివ, సూర్య, దేవ్యాదులకు ఆలయమును నిర్మించు వాడే ఈ లోకమునందు కీర్తి పొందును. ఎంతో శ్రమపడి సంపాదించిన ధనమును, శ్రీకృష్ణాలయమును నిర్మించుటకు వినియోగింపక, కేవలము దానిని రక్షించుచుండు మూర్ఖునకు దానివల్ల ఏమి ప్రయోజనము కలుగును? పితరులు, బ్రాహ్మణులు, దేవతలు- వీరికై తన ధనమును వినియోగించనివాని ధనము, బంధువులకు ఉపకరించని వాని ధనము వ్యర్థము. దానమునకుగాని, భోగమునకు గాని, ధర్మాచరణమునకుగాని, కీర్తి కొరకు గాని ఉపకరించని ధనమునకు స్వామి అయి ఏమి ప్రయోజనము? అందుచే పూర్వ జన్మ అదృష్టముచేత గాని, పురుష ప్రయత్నముచేత గాని, మరి ఏ ఉపాయాంతరముచేత గాని లభించిన ధనమును ఉత్తమ బ్రాహ్మణులకు దానము చేయవలెను; స్థిర కీర్తి లభించుటకు ఉపయోగించవలెను. దాన కీర్త్యాదుల కంటె గూడ దేవాలయ నిర్మాణము ఉత్తమమైనది కాన బుద్ధిమంతుడు విష్ణాది దేవతలకు ఆలయములు కట్టించవలెను. భక్తి మంతుడు అగు పురుషుడు దేవాలయమును నిర్మించి, దానిలో దేవతా ప్రతిష్ఠ చేసినాడనగా, ఆతడు చరాచర రూపములగు ముల్లోకములకును భవనము నిర్మించినాడని అర్థము. భూత వర్తమాన భవిష్యత్కాలములకు చెందిన, స్థూల-సూక్ష్మరూపము. తద్భిన్నము అయిన బ్రహ్మాది స్తంభాంతమగు ప్రపంచమంతయు మహావిష్ణువు నుండియే జనించినది. దేవాది దేవుడును, సర్వవ్యాపకుడును, మహాత్ముడును అగు అట్టి విష్ణువునకు ఆలయమును నిర్మించినవాడు మరల ఈ సంసారమునందు జనింపడు. శివ, బ్రహ్మ, సూర్య, గణేశ, దుర్గా, లక్ష్యాది దేవతలకు ఆలయమును నిర్మించినవారికి గూడ విష్ణ్వాలయమును నిర్మించినవారికి లభించు ఫలము లభించును. దేవతాప్రతిమను నిర్మింపచేసిన వారికి ఆలయ నిర్మాణము చేయించినవారికంటె గూడ అధిక ఫలము లభించును. దేవతా ప్రతిమా స్థాపన రూపమగు యజ్ఞము వలన లభించు ఫలము అనంతము. మట్టితో చేసిన ప్రతిమకంటె కఱ్ఱతో చేసిన ప్రతిమ ఉత్తమమైనది. దానికంటె ఇటుకలతో నిర్మించినది, దానికంటె ఱాయితో నిర్మించినది, దానికంటె సువర్ణాది లోహములతో నిర్మించినది శ్రేష్ఠమైనది, దేవాలయ ప్రారంభము చేసినంత మాత్రముననే ఏడు జన్మల పాపము నశించును. నిర్మించువాడు స్వర్గలోక ప్రాప్తికి అధికారియగును. అతడు నరకమునకు వెళ్ళడు. అంతే కాదు ఆతడు తన వంశములోని నూరు తరముల వారిని విష్ణులోకమునకు పంపును. యమధర్మరాజు తన దూతలతో, దేవాలయములు నిర్మించువారిని గూర్చి ఇట్లు చెప్పెను.

యమధర్మరాజు ఇట్లు చెప్పెను: “దేవ ప్రతిమానిర్మాణము చేసిన వారిని, దానికి పూజలు సలిపిన వారిని మీరు నరకమునకు తీసికొని రాకూడదు. దేవాలయాదులను నిర్మింపనివారిని మాత్రమే తీసికొని రావలెను. మీరందరు లోకములలో సంచరించుచు నా ఆజ్ఞను పాలింపుడు. ప్రపంచమునందలి ఏ ప్రాణియు మీ ఆజ్ఞను ధిక్కరింపజాలడు. జగత్పితయైన అనంతుని శరణు జొచ్చిన వారిని మాత్రము మీరు విడచివేయవలెను. వారికి ఈ లోకములో నివాసముండదు. భగవంతునిపై చిత్తము లగ్నముచేసి, భగవంతుని శరణుజొచ్చిన భగవద్భక్తులగు మహాత్ములను, సదా విష్ణుపూజ చేయువారిని మీరు విడిచి వేయవలెను. నిలచినపుడుగాని, నిద్రించినపుడు గాని, నడచునపుడుగాని, అన్ని నేల లందును శ్రీకృష్ణ నామస్మరణము చేయువారి దరికిపోవలదు. నిత్య నైమిత్తిక కర్మల ద్వారా జనార్దనుని పూజ చేయువారి వైపు కన్నెత్తియైనను చూడవలదు. అట్టి భగవద్ర్వత శీలులు భగవంతునే చేరుదురు.

పుష్పములు, ధూపము, వస్త్రములు మొదలగు అలంకారములను సమర్పించి భగవంతుని పూజచేయువారి జాడలకు పోవలదు. వారు శ్రీకృష్ణుని చేరినవారు. దేవాలయములందు అలికి ముగ్గులు వేయువారి పుత్రులను, వంశీయులను కూడ విడచివేయవలెను. విష్ణ్వాలయమును నిర్మించినవారి వంశములో నూరు తరముల వరకును మీరు ఎవ్వరిని దుష్టభావముతో చూడరాదు. కఱ్ఱతో గాని, మట్టితోగాని, ఱాతితోగాని విష్ణువునకు ఆలయము కట్టించినవాడు సమస్త పాప నిర్ముక్తుడు అగును. ప్రతిదినము యజ్ఞములు చేసి భగవదారాధన చేయువానికి లభించు ఫలమే విష్ణ్వాలయము నిర్మించినవానికి గూడ కలుగును. విష్ణ్వాలయము కట్టించినవాడు తన వంశమునందలి వెనుకటి నూరుగురిని, రాబోవు నూరుగురిని విష్ణు లోకమునకు పంపును. మహావిష్ణువు సప్తలోకమయుడు. అట్టి విష్ణుమూర్తికి ఆలయము కట్టించువాడు తన వంశమును తరింపచేయును. తన వంశీయులకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలుగునట్లు చేయును. తాను కూడ అక్షయ లోకములను పొందును. దేవాలయములోని ఇటుకల కట్టుబడి ఎన్ని సంవత్సరములు ఉండునో అన్ని వేల సంవత్సరములపాటు ఆ దేవాలయ నిర్మాత స్వర్గలోకములో నుండును. భగవత్ప్రతిమ నిర్మించువాడు విష్ణులోకము చేరును. దానిని స్థాపించినవాడు భగవంతునిలో లీనమగును. దేవాలయము నిర్మించి దానిలో ప్రతిమా స్థాపన చేసిన వాడు సర్వదా విష్ణు లోకములో నివసించును.”

అగ్నిదేవుడు పలికెను: యమధర్మరాజు ఇచ్చిన ఈ ఆజ్ఞ ప్రకారము, యమదూతలు విష్ణు స్థాపనాది పుణ్య కార్యములు చేసినవారిని యమలోకమునకు తీసికొని వెళ్ళరు. దేవాలయాది ప్రతిష్ఠాది విధానమును గూర్చి హయగ్రీవుడు బ్రహ్మతో వర్ణించి చెప్పెను. (38)