అగ్ని మహా పురాణము

Table of Contents

స్వాయంభువ వంశ వర్ణనము

స్వాయంభువమనువు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కుమారులను తపఃశాలినియగు శతరూప అను సుందరియగు కుమార్తెను జనింపచేసెను.

ఉత్తానపాదుని వలన సురుచియందు ఉత్తముడను పుత్రుడును, సునీతయందు ధ్రువుడను పుత్రుడును జనించిరి. ఓ మునీ! ధ్రువుడు, కీర్తి కొరకై, మూడువేల దివ్య వర్షముల పాటు తపస్సు చేసెను. ఆతని విషయమున సంతసించిన విష్ణువు, ఆతనికి సప్తర్షులకంటె ముందు స్థిరమైన స్థానమును ఇచ్చెను. ఆతని అభివృద్ధిని చూచి “ఈతని తపస్సుయొక్క ప్రభావము ఎంత గొప్పది! ఈతని శాస్త్రజ్ఞానము ఎంత అద్భుతమైనది. సప్తర్షులు కూడ ఈతని తమ ఎదుట నిలుపుకొని ఉన్నారు కదా!” అని ఉశనుడు ఒక శ్లోకమును (ప్రశంసా వాక్యమును) చదివెను.

ధ్రువునకు శిష్టి, భవ్యుడు, శంభువు అను కుమారులు జనించిరి. శిష్టికి సుచ్ఛాయవలన రిపువు, రిపుంజయుడు, రిప్రుడు, వృకలుడు, వృకతేజసుడు అను పుణ్యాత్ములైన కుమారులు జనించిరి. రిపువుకు బృహతి యందు చాక్షుషుడు, సర్వతేజసుడు అను పుత్రులు జనించిరి.

చాక్షుషుడు పుష్కరిణిలో, వీరణియందు మనువును జనింపచేసెను. మనువునకు, నడ్వలయందు ఊరుడు, పూరుడు, తపస్వి, సత్యవాక్కు, కవి, అగ్నిష్టుడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, అతిమన్యుకుడు అను పదిమంది సుతోత్తములు జనించిరి.

ఊరునివలన ఆగ్నేయ అను అతడి భార్య అంగుడు, సుమనసుడు, స్వాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అను కాంతిమంతులగు ఆరుగురు కుమారులను కనెను.

అంగునకు సునీథుని కుమార్తెయందు రేనుడను ఒక కుమారుడు జనించెను. పాపాసక్తుడై ప్రజారక్షణము చేయని ఆ వేనుని మునులు కుశములను ప్రయోగించి సంహరించిరి. పిమ్మట మునులు సంతానము కొరకై వేనుని కుడిచేతిని మధించగా దానినుండి పృథుచక్రవర్తి జనించెను.

మునులు అందరును ఆతనిని చూచి-“మహాతేజశ్శాలి అయిన ఇతడు ప్రజలను రంజింప చేయగలడు. గొప్ప కీర్తిని కూడ పొందగలడు” అని పలికిరి.

క్షత్రియుల పూర్వపురుషుడును, వైన్యుని కుమారుడును, తేజస్సుచే దహింపచేయు చున్నట్లు కనబడుచున్న వాడును అగు ఆ పృథువు ధనస్సును, కవచమును ధరించి ప్రజలు అందరిని రక్షించెను.

ఆ రాజు రాజసూయ యాగముచేసి అభిషేకము పొందినవారిలో మొదటివాడు. అతని నుండి పుట్టిన నేర్పరులైన వీరులైన సూతమాగధులు ఆతనిని స్తుతించిరి. ఆతడు ప్రజల జీవనమునకు ఉపయోగించు సస్యములను సంపాదించుటకై భూమిని పిదికెను.

దేవతలును, ముని గణములును, గంధర్వులును, అప్సరోగణములును, పితృ దేవతలును, దానవులును, సర్పములును, లతలును, పర్వతములును, జనులును ఆయా పాత్రలలో పిదుకగా భూమి వారివారికి కావలసిన క్షీరమును ఇచ్చెను. దానిచే వారందరును ప్రాణధారణము చేసిరి.

పృథుచక్రవర్తికి అంతర్ధి, పాలితుడు అను ధర్మవేత్తలైన ఇరువురు కుమారులు జనించిరి. శిఖండిని అంతర్ధి నుండి హవిర్ధానుడు అనెడు కుమారుని కనెను. అగ్ని పుత్రియగు ధిషణ హవిర్ధానుని వలన ప్రాచీనబర్హిస్సు, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, వ్రజుడు, అజినుడు అను ఆరుగురు కుమారులను కనెను.

యజ్ఞము చేయుచున్నప్పుడు కుశలు, వాటి అగ్రములు తూర్పు వైపున కుండునట్లు భూమిపై పరవబడెను. అందుచే పూజ్యుడైన ఆ ప్రజాపతికి “ప్రాచీన బర్హిస్సు” అను పేరు వచ్చెను. సముద్రుని కుమార్తెయైన సవర్న ప్రాచీన బర్హిస్సు వలన పది మంది కుమారులను కనెను. వారందరికిని ప్రచేతసులనియే పేరు. వారందరును ధనుర్వేదమునందు పరిపూర్ణ ప్రజ్ఞ కలవారు.

ఒకే విధముగా ధర్మము నాచరించుచున్న వారందరును సముద్ర జలమున నివసించి పదివేల సంవత్సరములు గొప్ప తపస్సు చేసిరి. వారు విష్ణువు నుండి ప్రజాపతిత్వమును పొంది, సంతసించినవారై సముద్ర జలము నుండి లేచిరి. అపుడు భూమ్యాకాశములు వృక్షములచే వ్యాప్తములై యుండెను. వారు తమ ముఖము నుండి పుట్టిన అగ్ని వాయువులచే ఆ వృక్షములను దహింపచేయ మొదలిడిరి. అపుడు రాజైన సోముడు ప్రజాపతుల దగ్గరికి వెళ్లి-“కోపమును ఉపసంహరింపుడు, భవిష్యత్తును గూర్చి తెలిసిన నేను తపశ్శాలియగు కండుముని కుమార్తెయైన ప్రమ్లోచయందు ఉత్తమురాలగు మారీష అను కన్యను జనింపచేసితిని. ఆమెను మీకు ఇచ్చెదరు. ఆమె మీ వంశమును వృద్ధి పొందించు భార్యయగుగాక. ఆమెయందు పుట్టిన దక్షుడు ప్రజలను వృద్ధిపొందించును అని పల్కెను.

ప్రచేతసులు ఆమెను స్వీకరించిరి. ఆమెకు దక్షుడను కుమారుడు జనించెను. అతడు మనస్సుచే స్థావర జంగమములకు, ద్విపాత్తులను (మనుష్యులు మొదలగువారిని) చతుష్పాత్తులను (నాలుగు కాళ్ళుగల పశ్వాదులను) సృజించి పిమ్మట స్త్రీలను సృజించెను. వారిలో పదిమంది యమధర్మరాజునకును, పదముగ్గురిని కశ్యపునకును, సోమునకు ఇరువది యేడుగురిని, అరిష్టనేమికి నలుగురిని, బహుపుత్రునకు ఇద్దరిని, అంగిరసునకు ఇద్దరిని ఇచ్చెను. పూర్వము వారియందు మానస మైథునముచే దేవతలును నాగాదులును జనించిరి.

యమధర్మరాజునకు తన పదిమంది భార్యలవలన కలిగిన సంతానమును గూర్చి చెప్పెదను, విశ్వకు విశ్వేదేవతలు, సాధ్యకు సాధ్యులు, మరుత్వలకు ఇద్దరు మరుత్వంతులు, వసువునకు వసువులు, భానువుకు భానులు, ముహూర్తకు ముహూర్తులు, లంబకు ఘోషుడు, యామికి నాగవీధి, మరుత్వతికి పృథివికి సంబంధించిన సకల వస్తుజాతము, సంకల్పకు సంకల్పులు జనించిరి. చంద్రునకు నక్షత్రముల వలన ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అను ఎనమండుగురు వసువులును జనించిరి.

ఆపుని కుమారులు వైతండ్యుడు, శ్రముడు, శాంతుడు, ముని అనువారు. లోకాంతుడైన కాలుడు ధ్రువుని కుమారుడు. వర్చసుడు సోముని కుమారుడు. ద్రవిణుడు, హుత హవ్యవహుడు శిశిరుడు, ప్రాణుడు, రమణుడు అనువారు ధరునికి, మనోహరయందు కుమారులుగా జనించిరి. అనిలుని కుమారుడు పురోజవుడు. అనిలుని కుమారుడు అవిజ్ఞాతుడు. కుమారుడు అగ్నిపుత్రుడుగా శరస్థంభమునందు జనించెను. ఆతని తరువాత శాఖుడు, విశాఖుడు, నైగమేయుడును పుట్టిరి. కృత్తిక నుండి కార్తికేయుడును, యతియైన సనత్కుమారుడును పుట్టిరి.

వేలకొలది శిల్పములను చేయువాడును, దేవతల వడ్రంగియు, కాంతిమంతుడును అగు విశ్వకర్మ అను దేవలుడు ప్రత్యూషుని నుండి జనించెను. మనుష్యులు భూషణాది శిల్పములను జీవనాధారముగా చేసికొనుచుందురు.

సురభి తపస్సుచే పవిత్రీకృతురాలై, మహాదేవుని ప్రసాదముచే ఏకాదశ రుద్రులను కనెను. మేక పాదము వంటి ఒక పాదముగల అహిర్భుధ్న్యుడు, త్వష్టయను రుద్రుడు, బహురూపుడు, హరుడు, పరాజితుడుకాని త్ర్యంబకుడు, వృషాకమియు, కపర్ధ (జటా) ధారియగు శంభువు, రైవతుడు, మృగవ్యాధుడు, సర్పుడు, పదకొండవవాడైన కపాలియు, చరాచర జగత్తును వ్యాపించిన కోట్లకొలది రుద్రులు జన్మించిరి. శ్రీమంతుడును, మహా యశఃశాలియు అగు విశ్వరూపుడు త్వష్ట కుమారుడు. (18)