అగ్ని మహా పురాణము

Table of Contents

పంచ పంచాశద్విష్ణునామ కథనము

అగ్నిదేవుడు పలికెను:

శ్రీమహావిష్ణువు యొక్క ఏబది ఐదు నామములు ఎవడు జపించునో ఆతడు మంత్ర జపాది ఫలమును తీర్థ పూజనాదుల అక్షయ పుణ్యమును పొందును. పుష్కరమున పుండరీకాక్షుని గయ యందు గదాధరుని, చిత్రకూటము నందు రాఘవుని, ప్రభాసమునందు దైత్యసూదనుని, జయంతి యందు జముని, హస్తినాపురమున జయంతుని, వర్ధమానమున వారాహుని, కాశ్మీరమున చక్రపాణిని కుబ్జామ్రమున జనార్దనుని మధుర యందు కేశవుని కుబ్జాక్రమకమున హృషీకేశుని గంగాద్వారమున జటాధరుని, శాలగ్రామమున మహాయోగుని గోవర్ధనాచలమున హరిని పిండారకమున చతుర్బాహువును శంఖోద్ధారమునందు శంఖిని, కురుక్షేత్రమున వామనుని, యమునయందు త్రివిక్రముని శోణమున విశ్వేశ్వరుని పూర్వ సాగరమున కపిలుని మహోదధియందు విష్ణువును గంగా సాగర సంగమమున వనమాలుని, కిష్కింధయందు రైవతకుని, కాశీ తటమున మహాయోగుని విరజయందు రిపుంజయుని, విశాఖ యూపమున అజితుని నేపాలమున లోకభావనుని, ద్వారకలో కృష్ణుని మందరమున మధుసూదనుని, లోకాకులమున రిపుహరుని, శాలగ్రామమున హరిని స్మరించవలెను. పురుష వటమున పురుషుని విమలమున జగత్ప్రభువును, సైంధవారణ్యమున అనంతుని, దండక యందు శార్ఙ్గధారిని ఉత్పలా వర్తకమున శౌరిని, నర్మదయందు శ్రీపతిని, రైవతకమున దామోదరుని నందయందు జలశాయిని, సింధు సముద్రమున గోపీశ్వరుని, మహేంద్ర తీర్థమున అచ్యుతుని, సహ్యాద్రిపై దేవదేవేశుని మాగధ వనమున వైకుంఠుని వింధ్యముపై సర్వపాపహరిని ఓఢ్ర దేశమున పురుషోత్తముని హృదయమున ఆత్మను స్మరించవలెను. ఈ ఆత్మ జపించువారికి భుక్తి ముక్తులను ఇచ్చును. ప్రతి పటమునందు వైశ్రవణుని, ప్రతి చత్వరమునందు శివుని, ప్రతి పర్వతమునందు రాముని సర్వత్ర మధుసూదనుని భూమ్యాకాశములందు నరుని వశిష్ట తీర్థమున గరుడధ్వజుని సర్వత్ర వాసుదేవుని స్మరించువాడు భుక్తి ముక్తులను పొందును. ఈ విష్ణు నామములను జపించువాడు సర్వమును పొందును. ఈ క్షేత్రములలో చేసిన శ్రాద్ధము, దానము, జపము, తర్పణము అంతయు కోటి గుణితమగును. అట్లు చేసినవాడు మరణానంతరము బ్రహ్మమయుడగును. ఇది చదివిన వాడును, విన్నవాడును పాపరహితుడై స్వర్గము పొందును. (305)