అగ్ని మహా పురాణము

Table of Contents

గౌరీప్రతిష్ఠా విధానము

పరమేశ్వరుడు చెప్పెను: స్కందా! ఇపుడు పూజాసహితముగ గౌరీ ప్రతిష్ఠావిధి చెప్పెదను వినుము. వెనుక చెప్పిన విధముననే మండపాది రచనచేసి, దేవీస్థాపన, శయ్యాధివాసము చేయవలెను. పూర్వముచెప్పిన మంత్ర, మూర్త్యాదుల న్యాసముచేసి ఆత్మతత్త్వ, విద్యాతత్త్వ, శివతత్త్వములను పరమేశ్వరుని యందు స్థాపించవలెను. పిదప పరాశక్తిన్యాసము, హోమ జపాదులును వెనుకటివలె చేసి క్రియాశక్తి రూపిణియగు పిండిని సంధానము చేయవలెను. సర్వవ్యాపినియగు పిండిని ధ్యానించి, అచట రత్నాది న్యాసము చేయవలెను. ఈ విధముగ పిండి స్థాపనచేసి దానిపై దేవీస్థాపన చేయవలెను. ఈ దేవి పరాశక్తి స్వరూపిణి. ఆ దేవీ మంత్రముతోడనే సృష్టి న్యాసపూర్వకమగు దేవీస్థాపన చేయవలెను. పిదప పీఠముపై క్రియా శక్తిని, దేవీ విగ్రహమందు జ్ఞానశక్తిని స్థాపించవలెను. పిదప సర్వవ్యాపినియగు శక్తిని ఆవాహనముచేసి దేవీప్రతిమపై ఆ శక్తిని చేర్చవలెను, ‘శివా’ యను పేరుగల అంబికా దేవిని స్పృశించి పూజించవలెను. పూజా మంత్రములు ఈ విధముగ నుండును. ‘ఓం ఆం ఆధారశక్తయే నమః, కూర్మాయ నమః, ఓం కన్దాయ నమః, ఓం హ్రీం నారాయణాయ నమః, ఓం ఐశ్వర్యాయ నమః, ఓం అధశ్ఛదనాయ నమః, ఓం పద్మాసనాయ నమః. పిదప కేసరములను పూజించవలెను. పిదప ఓం హ్రీం కర్ణికాయై నమః, ఓం క్షం పుష్కరాక్షేభ్యో నమః, అను మంత్రములతో కర్ణికా, కమలాక్షములను పూజించవలెను. పిదప ‘ఓం హాం పుష్ట్యై నమః, ఓం హ్రీం జ్ఞానాయై నమః, ఓం హ్రూం క్రియాయై నమః అను మంత్రములతో పుష్టి, జ్ఞానా క్రియా శక్తులను పూజించవలెను. ‘ఓం నాలాయ నమః, ఓం రుం ధర్మాయ నమః, ఓం రుం జ్ఞానాయ నమః, ఓం వైరాగ్యాయ నమః, ఓం అధర్మాయ నమః, ఓం రుం అజ్ఞానాయ నమః, ఓం అవైరా గ్యాయ నమః, ఓం అనైశ్వర్యాయ నమః’ అను మంత్రములతో నాలాదులను పూజించవలెను. ‘ఓం హుం వాచే నమః, ఓం హుం రాగిణ్యై నమః, ఓం హుం జ్వాలిన్యై నమః, ఓం హ్రౌం శమాయై నమః, ఓం హ్రూం జ్యేష్ఠాయై నమః, ఓం హ్రీం రౌం క్రౌం నవశక్త్యై నమః అను మంత్రములతో వాగాది శక్తులను పూజించవలెను. ‘ఓం గౌం గౌర్యాసనాయ నమః, ఓం గౌం గౌరీమూర్తయే నమః’ ఇప్పుడు గౌరీమూలమంత్రము చెప్పబడుచున్నది ‘ఓం హ్రీం సః మహాగౌరి రుద్రదయితే స్వాహా గౌర్యై నమః, ఓం గాం హృదయాయ నమః, ఓం గీం శిరసేస్వాహా, ఓం గూం శిఖాయై వషట్, ఓం గైం కవచాయ హుం, ఓం గౌం నేత్ర త్రయాయ వౌషట్, ఓం గః అస్తాయ ఫట్, ఓం గౌం విజ్ఞాన శక్తయే నమః ఈ మంత్రములతో శిఖాదులను పూజించవలెను. ‘ఓం గూం క్రియాశక్తయే నమః’ అను మంత్రముతో క్రియాశక్తిని పూజించవలెను. పూర్వాది దిక్కులందు ఇంద్రాదులను పూజించవలెను. ఈ మంత్రములు వెనుక చెప్పబడినవి. ‘ఓం సుం సుభాగాయై నమః’ అను మంత్రముతో సుభగను ‘ఓం హ్రీం లలితాయై నమః’ అను మంత్రముచే లలితను పూజించవలెను. ‘ఓం హ్రీం కామిన్యై నమః, ఓం హ్రుం కామ మాలిన్యై నమః’ అను మంత్రములతో గౌరీప్రతిష్ఠా, పూజా, జపములు చేయుటచే ఉపాసకుడు అన్నియు పొందగల్గును. (98)