అగ్ని మహా పురాణము

Table of Contents

ప్రతిపత్ వ్రతములు (పాడ్యమి వ్రతములు)

అన్ని కోరికలను తీర్చు ప్రతిపదాదివ్రతములను గూర్చి నీకు చెప్పెదను. కార్తిక, ఆశ్వయుజ, చైత్ర మాసములందలి ప్రతిపత్తు బ్రహ్మ ప్రీతికరమగు తిథి. పూర్ణిమయందు ఉపవాసముచేసి ప్రతిపత్తు నందు ఓం తత్సద్బ్రహ్మణే నమః అను మంత్రముతో బ్రహ్మను పూజించవలెను. లేదా ఒక సంవత్సరము పాటు గాయత్రీ మంత్రముతో కుడి చేతులలో అక్షమాలను, స్రువమును, ఎడమ చేతులలో సుక్కును, కమండలమును ధరించుచున్న వాడును, దీర్ఘమైన గడ్డముగలవాడును, జటాధారియు, సువర్ణ వర్ణము గలవాడును అగు బ్రహ్మను పూజించవలెను. నా విషయమున బ్రహ్మ అనుగ్రహించు గాక! అని పలుకుచు శక్త్యానుసారముగా క్షీరమును సమర్పించవలెను. ఈ విధముగ చేసిన విప్రుడు పాపవిముక్తుడై భూమి యందు ధనవంతుడై, స్వర్గమునందు భోగములను అనుభవించును. ఇపుడు ధన్యవ్రతమును గూర్చి చెప్పెదను. దానిని చేయుటచే అధన్యుడు ధన్యుడగును. మార్గ శీర్ష ప్రతిపత్తు నందు రాత్రి హోమము చేసి ఉపవాసము ఉన్నవాడై, అగ్నయే నమః అను మంత్రముచే ఒక సంవత్సరము అగ్నిని పూజించి, సర్వ కామములను పొందును. ప్రతిపత్తునందు ఒక్క పర్యాయమే భుజించుచు, సమాప్తమైన పిదప కపిల గోవును దానము చేసినవాడు వైశ్వానరుని స్థానమును చేరును. ఇది శిఖి వ్రతము.(176)