అగ్ని మహా పురాణము

Table of Contents

శకునములు-2

పుష్కరుడు పలికెను:

రాజు ఒకచోట నివాసము ఏర్పరచుకొన్నప్పుడుగాని, వెళ్ళునపుడు గాని, ప్రశ్న సమయమునందు గాని కనబడు శకునములు ఆ దేశమునందును, నగరమందును కలుగు శుభా శుభములను సూచించును.‘దీప్తములు’, ‘శాంతములు’ అని శకునములు రెండు విధములు. అన్ని దీప్త శకునముల ఫలితములు అశుభములగుననియు, శాంత శకునముల ఫలితములు శుభములగుననియు జ్యోతిః శాస్త్రజ్ఞులు చెప్పినారు. దీపశకునములు వేలాదీప్త, దిగ్దేప్త, దేశదీప్త, క్రియాదీప్త, రుతదీప్త, జాతి దీప్తములని ఆరు విధములు. వీటిలో పూర్వపూర్వములు ప్రబలతరములు. పగలు సంచరించవలసిన ప్రాణులు రాత్రి, రాత్రి సంచరించవలసినవి పగలు సంచరించినచో అది ‘వేలా దీప్తము’ నక్షత్ర, లగ్న, గ్రహాదులు క్రూరావస్థను పొందిన సమయము కూడ ‘వేలాదీప్తము’ సూర్యుడు ప్రయాణించు దిక్కు ‘ధూమిత’, ఉన్న దిక్కు ‘జ్వలిత’, విడవబడిన దిక్కు ‘అంగారిణి’, ఈ మూడు దిక్కులును దీప్తములు. మిగిలిన ఐదును శాంతములు. దీప దిక్కులందు కలుగు శకునములు దిగ్దీప్తములు. గ్రామములో అరణ్య జంతువులును, అరణ్యములో గ్రామ్య జంతువులును ఉన్నచో అది నిందితదేశము. నిందితములగు వృక్షములున్న దేశము గూడ నింద్యము-అశుభము. విప్రవరా! అశుభ దేశమునందు కనబడు శకునములు ‘దేశ దీప్తములు’; తన వర్ణ ధర్మమునకు విపరీతముగ ప్రవర్తించువాడు ‘క్రియాదీప్తుడు’; భయంకర ధ్వని వినబడుట ‘రుతదీప్తము’, మాంస భోజనము మాత్రము చేయు ప్రాణి ‘జాతి దీప్తము’, దీప్తావస్థకు విపరీతమైన శకునములు శాంతములు; వాటిలో కూడ పైన చెప్పిన భేదము లన్నియు గ్రహించవలెను. దీప్త-శాంతములు కలసినచో అవి మిశ్ర శకునములు, ఈ విధముగ పరిశీలించి వాటి ఫలాఫలములను చెప్పవలెను.

గోవు, గుఱ్ఱము, గాడిద, కుక్క, సారిక, బల్లి, చటకము, భాసము, తాబేలు-ఇవి గ్రామవాసి ప్రాణులు. మేక, తోడేలు, చిలుక, గజరాజము, సూకరము, గేదె, కాకి-ఇవి గ్రామారణ్య ఉభయవాసి ప్రాణులు. మిగిలిన ప్రాణులన్నియు ఆటవికములు. పిల్లి, కోడి కూడ ఉభయవాసులు, వీటి ఆకారములో భేదముండును గాన వీటిని గుర్తించవచ్చును. గోకర్ణము, నెమలి, చక్రవాకము, రాసభము, హారీతము, కాకి, కులాహము (ఒక విధమగు గుఱ్ఱము), కుక్కుభము, నక్కఖంజరీటము, వానరము, శతఘ్నము, చటకము, కోకిల, శ్యేనము, కపింజలము, తీతువు, శతపత్రము, పావురము, ఖంజనము, దాత్యూహము, శుకము, రాజీవము, కోడి, భరద్వాజము, సారంగము పగలు సంచరించు ప్రాణులు. హంస, లేడి, పిల్లి, ముంగిస, భల్లూకము, సర్పము, వృకారి, సింహము, వ్యాఘ్రము, ఒంటె, గ్రామ సూకరము, మనుష్యులు, శ్వావిదము, వృషభము, నక్క, తోడేలు, కోకిల, సారసము, గుఱ్ఱము, ముంగిస, కౌపీనధారి పురుషులు రాత్రి, పగలు కూడ సంచరించు ప్రాణులు.

యుద్ధమునందుగాని, యుద్ధమునకై యాత్ర చేయునపుడు గాని ఈ ప్రాణులు అన్నియు గుంపుగా ఎదుటకు వచ్చినచో విజయ ప్రదములు. వెనుక నుంచి వచ్చినచో మృత్యుకారకములు. నీలకంఠము తన గూడు నుండి బైటకు వచ్చి ధ్వని చేయుచు ఎదురైనచో అది రాజుకు అవమాన సూచకము. అది వామ భాగమునందు వచ్చినచో కలహ కారకము; భోజనమున బాధ కలిగించును. యాత్రా సమయమున దానిదర్శనము ఉత్తమము. దాని ఎడమ భాగము కనబడుట కూడ మంచిది. యాత్రా సమయమున నెమలి ఎక్కువ ధ్వని చేసినచో అది దొంగల ద్వారా ధనము కోల్పోవుటను సూచించును.

పరశురామా! ప్రస్థాన సమయమునందు లేడి ముందు ముందు నడచినచో అది మృత్యుప్రదము. భల్లూకము, ఎలుక, నక్క, పులి, సింహము, పిల్లి, గాడిద-ఇవి ప్రతికూల మగు దిక్కున వెళ్ళినను, గాడిద గట్టిగా ఓండ్ర పెట్టినను, కపింజలపక్షి ఎడమ ప్రక్కగాని, కుడి ప్రక్కగాని ఉన్నను ఇవన్నియు ఉత్తమ శకునములు. కాని కపింజల పక్షి వెనుక ప్రక్కన ఉన్నచో చెడ్డఫలము నిచ్చును. యాత్రా సమయమున తీతు కనబడకూడదు. లేడి, సూకరము, చిత్రవర్ణ హరిణము, ఎడమ నుండి కుడివైపు వచ్చినచో సర్వదా కార్య సాధకము. కుడినుండి ఎడమవైపు వెళ్లినచో మంచిది కాదు. ఎద్దు, గుఱ్ఱము, గ్రద్ద, పులి, సింహము, పిల్లి, గాడిద, మొదలైనవి కుడినుంచి ఎడమకు వెళ్ళినచో మనో వాంఛిత సిద్ధి ప్రదములు. శృగాలము, శ్యామముఖము, చుంచు, పింగల, బల్లి, సూకరి, కోకిల, పుంలింగ నామములు గల ప్రాణులు, భాసము, కారుషము, కోతి, శ్రీకర్ణము, ఛిత్వరము, కపి, పిప్పీకము, ఈరువు, శ్యేనము ఇవి కుడిప్రక్క నున్నను శుభము. యాత్రాకాలమున జాతికము, సర్పము, చెవులపిల్లి, సూకరము, ఉడుము-వీటి పేరు చెప్పుట గూడ శుభమని చెప్పబడినది.

భల్లూక-వానరములు విపరీత దిక్కునందు కనబడుట అనిష్టకారకము. ప్రస్థానము చేసిన తరువాత ఏ దినమున బలవత్తరమగు ఏశకునము కనబడునో అది ఆ దినమునకు మాత్రము ఫలమును ఇచ్చును. పరశురామా! పిచ్చివాడు, భోజనార్థి, బాలుడు, శత్రువు మొదలగు వారు గ్రామసీమ యందు గాని, నగరసీమ యందుగాని కనబడినచో దానికి ఫలమేమియు ఉండదని తెలుసుకొనవలెను. ఆడ నక్క ఒకసారిగాని, రెండుసార్లుగాని, మూడుసార్లుగాని, నాలుగుసార్లుగాని కూసినచో శుభము, ఐదు లేదా ఆరుసార్లు కూసినచో అశుభము. ఏడుసార్లు కూసినచో శుభము, అంతకుమించి కూసినచో ఫలమేమియు ఉండదు. మార్గ మధ్యమునందు సూర్యుని వైపు పైకి ఎగిసే జ్వాల కనబడి, అది చూడగానే రోమాంచకారిగాను, వాహనములు భయపడునట్లు గాను ఉన్నచో అది మహాభయ సూచకము. ముందుగనే ఏదైన ఒక ఉత్తమ ప్రదేశము నందు సారంగము కనబడినచో అది సంవత్సరము వరకును శుభసూచకము. దానిని చూచుటచే అశుభమునందు గూడ శుభమగును. అందుచే యాత్రా ప్రారంభ దినమున అట్టి సారంగమును జూచి ఒక సంవత్సరము పాటు శుభ ఫలప్రాప్తి కలుగునని గ్రహించవలెను. (231)