అగ్ని మహా పురాణము

Table of Contents

స్వాయంభువ సర్గ కథనము

అగ్నిదేవుడు పలికెను-

వసిష్ఠా! ఇపుడు నేను భువనకోశము, పృథివి, ద్వీపములు మొదలగు వాటిని గూర్చి చెప్పెదను. ప్రియవ్రతునకు అగ్నీధ్ర, అగ్నిబాహు, వపుష్మత్, ద్యుతిమత్, మేధా, మేధాతిథి, భవ్య, సవన, క్షయులను పుత్రులుండిరి. పదవ కుమారుడైన జ్యోతిష్మంతుడు యథార్థ నామధేయము కలవాడు. ప్రియవ్రతుని కుమారులందరును జగద్విఖ్యాతులు. తండ్రి వారికి సప్తద్వీపముల నిచ్చెను. ఆగ్నీధ్రునకు జంబూద్వీపము, మేధాతిథికి ప్లక్ష ద్వీపము, వపుష్మంతునకు శాల్మలి ద్వీపము, జ్యోతిష్మంతునకు కుశద్వీపము, ద్యుతిమంతునకు క్రౌంచద్వీపము, భవ్యునకు శాకద్వీపము, సరసునకు పుష్కర ద్వీపము ఇచ్చెను. ఆగ్నీధ్రుడు-లక్షల కొలది యోజనముల విస్తీర్ణముగల జంబూ ద్వీపము తన కుమారులకు ఈ విధముగ విభజించి ఇచ్చెను. నాభికి హిమ వర్షమును (నేటి భారతవర్షమును) కింపు రుషునకు హేమకూట వర్షము, హరివర్షునకు నైషధవర్షము, ఇలావృతునకు మధ్య భాగమున మేరుపర్వతముతో గూడిన ఇలావృత వర్షమును రమ్యకునకు నీలాచలా శ్రితమగు రమ్యకవర్షమును, హిరణ్య వంతునకు శ్వేతవర్షమును, కురువుకు ఉత్తరకురు వర్షమును ఇచ్చెను. భద్రాశ్వునకు భద్రాశ్వ వర్షమును, కేతుమయునకు మేరు పర్వతమునకు పశ్చిమముగానున్న కేతుమాల వర్షమును ఇచ్చెను. ఈ విధముగ తన పుత్రులను ఆయా వర్షములకు అధిపతులుగ చేసి ప్రియవ్రతుడు వానప్రస్థుడై సాలగ్రామ క్షేత్రమునందు తపస్సుచేసి విష్ణు లోకమును పొందెను. ఓ ముని శ్రేష్ఠా! కింపురుషాధి వర్షములు ఎనిమిదింటి యందును సుఖము అధికము, అప్రయత్నము గనే భోగములన్నియు లభించును. అచట జరామృత్యు భయము గాని, ధర్మాధర్మములు గాని, ఉత్తమ, మధ్యమ, అధమాది భేదములుగాని లేవు. అచట యుగ పరివర్తనము కూడ ఉండదు. హిమ వర్షాధిపతియగు నాభికి, మేరుదేవియందు ఋషభదేవుడు పుత్రుడుగా జనించెను. ఋషభుని కుమారుడు భరతుడు, ఋషభ దేవుడు భరతునకు రాజ్యలక్ష్మిని ఇచ్చివేసి, శాలగ్రామ క్షేత్రమున శ్రీహరిని శరణుజొచ్చెను. ఈ భరతుని పేరుతో భరత వర్షము ప్రసిద్ధమైనది. భరతునకు సుమతి అను కుమారుడు జనించెను. ఆతనికి రాజ్య భారము సమర్పించి భరతుడు శాలగ్రామ క్షేత్రమునందు శ్రీహరిని శరణుజొచ్చెను. ఆ యోగిరాజు యోగాభ్యాస తత్పరుడై ప్రాణములను పరిత్యజించెను. ఈతని ఆ చరిత్రమును నీకు మరల చెప్పెదను. పిదప సుమతి వీర్యము వలన ఇంద్రద్యుమ్నుడు జనించెను. ఆతనికి పరమేష్ఠియు ఇతనికి ప్రతీ హారుడును, ఆతనికి ప్రతిహర్తయు ఆతనికి భవుడు, భవునకు ఉద్గీథుడు, ఆతనికి ప్రస్తారుడు, ఆతనికి విభుడు, ఆతనికి పృథువు, ఆతనికి నక్తుడు, ఆతనికి గయుడు, గయునకు నరుడు, నరునకు విరాట్టు, ఆతనికి మహావీర్యుడు, ఆతనికి ధీమంతుడు, ఆతనికి మహాంతుడు, అతనికి మనుష్యుడు, ఆతనికి త్వష్ట, ఆతనికి విరజుడు, అతనికి రజుడు జన్మించిరి. మహామునీ! రజుని పుత్రుడైన శతజిత్తునకు నూరుగురు పుత్రులు జనించిరి. వారిలో విశ్వజ్యోతి ముఖ్యుడు. వానివలన భారతవర్షము అభివృద్ధి చెందెను. కృత త్రేతాది క్రమమున ఇది స్వాయంభువ మనువంశముగా చెప్పబడినది. (107)