అగ్ని మహా పురాణము
సంధ్యా విధి వర్ణనము
అగ్నిదేవుడు చెప్పెను:
ఓంకారమును ఎరిగినవాడే యోగి. అతడే విష్ణు స్వరూపుడు. అందువలన సకల మంత్ర సారభూతము, సర్వప్రదమగు ఓంకారమును అభ్యసించవలెను. సమస్త మంత్ర ప్రయోగ ప్రారంభమునందు కూడా ఓంకారము ఉచ్చరింపబడును. ఓంకార యుక్తమగు కర్మయే పరిపూర్ణము; అది లేనిది పూర్ణము కాజాలదు. మొదట ఓంకారము తోడను, మూడు శాశ్వత వ్యాహుృతుల తోడను కూడిన మూడు పదముల గాయత్రి వేదమునకు ముఖము. మూడు సంవత్సరములపాటు నిత్యము గాయత్రీ జపము చేయువాడు వాయువై, ఆకాశ స్వరూపుడై, పరబ్రహ్మను పొందును. ఏకాక్షరమగు ఓంకారమే పరబ్రహ్మము. ప్రాణాయామమే పరమతపస్సు. గాయత్రిని మించినది ఏదియు లేదు. మౌనముగా ఉండుట కంటె సత్యభాషణము శ్రేష్ఠము. ఏడు పర్యాయములు గాయత్రి ఆవృత్తి చేసినచో సర్వ పాపములును తొలగును. పదిఆవృత్తులు చేయువాడు స్వర్గము పొందును. ఇరువది ఆవృత్తులు చేయువానిని గాయత్రి స్వయముగా ఈశ్వర లోకమునకు తీసికొనిపోవును. నూట ఎనిమిది పర్యాయములు గాయత్రీ జపము చేసినవాడు సంసార సాగరమును తరించును. రుద్రమంత్ర జపముకంటెను, కూష్మాండ మంత్రజపముకంటెను గాయత్రీ మంత్ర జపము శ్రేష్ఠము. గాయత్రి కంటె శ్రేష్టమైన జపించదగిన మంత్రము ఏదియును లేదు. వ్యాహృతి హోమ తుల్యమగు హోమమేమియును లేదు. గాయత్రీ మంత్రములోని ఒక పాదమునుగాని, సగము పాదమునుగాని, సంపూర్ణ ఋక్కునుగాని, సగము ఋక్కునుగాని జపించినంత మాత్రమున గాయత్రి బ్రహ్మహత్యా, సురాపాన, సువర్ణస్తేయ, గురుపత్నీ గమనాది మహాపాతకముల నుండి విముక్తుని చేయును.
ఏ పాపమునకైనను తిలహోమము, గాయత్రి జపము ప్రాయశ్చిత్తములు. ఉపవాస పూర్వకముగ సహస్ర గాయత్రీ జపము చేయువాడు తన పాపములను నశింపచేసుకొనును. గోవధ, పితృవధ, మాతృవధ, బ్రహ్మహత్యా, గురుపత్నీగమన, బ్రాహ్మణ జీవితాపహరణ, సువర్ణస్తేయ, సురాపానాది మహాపాపములు చేసినవాడు కూడ ఒక లక్ష గాయత్రీజపము చేయుటచే శుద్ధుడగును. లేదా స్నానానంతరము నీటిలో ఉండి నూరు పర్యాయములు గాయత్రీ జపము చేయవలెను. పిదప గాయత్ర్యభిమంత్రితమగు జలముతో నూరు ఆచమనములు చేయవలెను. అట్లు చేసినవాడు కూడ పాపరహితుడగును. నూరు పర్యాయములు గాయత్రీ జపము సమస్త పాపములను శమింపచేయును. సహస్ర జపము ఉప పాతకములను కూడ సశింపచేయును. కోటి జపము చేసినవానికి గాయత్రీదేవి అభీష్ట ఫలమును ఒసగును. జపము చేయువాడు దేవత్వమును, దేవరాజత్వమును కూడ పొందును. మొదట ‘ఓం’ కారమును, పిదప ‘భూర్భువః స్వః’ను ఉచ్చరించి పిదప గాయత్రి ఉచ్చరించి, చివర ‘ఓం’ చేర్చవలెను. జపమున ఈ విధముగ గాయత్రీ మంత్రము విహితమైనది. గాయత్రికి ఋషి విశ్వామిత్రుడు. గాయత్రి ఛందస్సు. దేవత సవిత. ఉపనయన, జప, హోమములందు దీనిని వినియోగించవలెను. గాయత్రీ మంత్రమునందలి ఇరువది నాలుగు అక్షరములకు వరుసగా అగ్ని, వాయువు, రవి, విద్యుత్, యమ, జల పతి, గురు, పర్జన్య, ఇంద్ర, గంధర్వ, పూషన్, మిత్ర, వరుణ, త్వష్టృ, వసుగణ, మరుద్గణ, చంద్ర, అంగిరస్, విశ్వేదేవ, అశ్వినీ కుమార, ప్రజాపతి సహిత సమస్త దేవగణ, రుద్ర, బ్రహ్మ విష్ణువులు అధిష్ఠాతృ దేవతలు. గాయత్రీ జపసమయమున పై దేవతలను ఉచ్చరించినచో వారు జపము చేయువాని పాపములను తొలగింతురు.
గాయత్రీ మంత్రమునందలి ఒక్కొక్క అక్షరమును క్రింద చెప్పిన అవయవములపై వరుసగా న్యాసము చేయవలెను-రెండు పాదాంగుష్ఠములు, రెండు మడమలు, రెండు పిక్కలు, మోకాళ్లు, తొడలు, ఉపస్థ, వృషణములు, కటిభాగము, నాభి, ఉదరము, స్తన మండలము, హృదయము, కంఠము, అధరోష్ఠము, తాలు, నాసిక, నేత్రములు, కను బొమ్మల మధ్య భాగము, లలాటము, ఉత్తరోష్ఠము, దక్షిణ పార్శ్వము, ఉత్తర పార్శ్వము, శిరస్సు, సంపూర్ణ ముఖమండలము. ఇరువది నాలుగు గాయత్ర్యక్షరముల రంగులు వరుసగా పీత, శ్యామ, కపిల, మరకత మణి సదృశ, అగ్నితుల్య, స్వర్ణతుల్య, విద్యుత్ప్రభ, ధూమ్ర, కృష్ణ, రక్త, గౌర, ఇంద్రనీల మణిసదృశ, స్ఫటిక మణితుల్య, స్వర్ణతుల్య, పాండు, పుష్పరాగ తుల్య, అఖిలద్యుతి, హేమాభధూమ్ర, రక్తనీల, రక్త కృష్ణ, సువర్ణాభ, శుక్ల, కృష్ణ, పలాశ వర్ణములై యుండును. గాయత్రిని ధ్యానము చేసినచో ఆ దేవి ధ్యానించువాని పాపములను తొలగించును. హోమము చేసినచో అభీష్టములను ఇచ్చును. గాయత్రీ మంత్రముతో తిలహోమము చేసినచో సకల పాపములు నశించును. శాంతి కోరువాడు యవలను, దీర్ఘాయుర్దాయము కోరువాడు ఘృతమును హోమము చేయవలెను. కర్మసిద్ధి కోరువాడు ఆవాలను, బ్రహ్మ తేజస్సు కోరువాడు క్షీరమును, పుత్రులను కోరువాడు పెరుగును, అధిక ధాన్యము కోరువాడు శాలితండులములు హోమము చేయవలెను. గ్రహపీడా శాంతికై ఖదిరవృక్ష సమిధలను, ధనముకొరకు బిల్వపత్రములను, లక్ష్మి కొరకు కమలములను, ఆరోగ్యము కొరకు మహోత్పాత శాంతి కొరకు దూర్వలను, సౌభాగ్యము కొరకు గుగ్గులను, విద్య కొరకు పాయసమును హోమము చేయవలెను. పదివేల హోమములచే పూర్వోక్త ఫలములు లభించును. ఒక లక్ష హోమములచే మనోభిలషితములగు వస్తువులు అన్నియు లభించును. ఒకకోటి ఆహుతులు చేసినవాడు బ్రహ్మహత్యాపాప విముక్తుడై, తనకులమును ఉద్ధరించి, శ్రీమహావిష్ణు స్వరూపుడు అగును. గ్రహశాంతికై చేయు యజ్ఞములలో కూడ గాయత్రీ మంత్రముచే పదివేల హోమములు చేసినచో అభీష్టసిద్ధి కలుగును.
గాయత్రిని ఆవాహనము చేసి ఓంకారమును ఉచ్చరించవలెను. గాయత్రీ మంత్ర సహితమగు ఓంకారము ఉచ్చరించుచు శిఖను బంధించి, ఆచమనము చేసి హృదయ, నాభి, భుజద్వయములను స్పృశించవలెను. ప్రణవమునకు ఋషి బ్రహ్మ. గాయత్రి ఛందస్సు. అగ్ని లేదా పరమాత్మ దేవత. సర్వకర్మ ప్రారంభమునందును దీనిని ప్రయోగించవలెను. ‘శుక్లా-శుభా’ అను (మూలోక) మంత్రముచే గాయత్రిని ధ్యానించి-ఓం తేజోఽసి...... తతః స్మృతా’ అను (మూలోక) మంత్రముచే ఆవాహన చేయవలెను. సమస్త వ్యాహృతులకును ఋషి ప్రజాపతి. అవన్నియు వ్యష్టిసమిష్టి రూపములతో పరబ్రహ్మ రూపమగు ఓంకారములో ఉన్నవి. సప్తవ్యాహృతులకు వరుసగా-విశ్వామిత్ర, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, అత్రి, వసిష్ఠ, కశ్యపులు ఋషులు. అగ్ని, వాయువు, సూర్య, బృహస్పతి, వరుణ, ఇంద్ర, విశ్వదేవులు దేవతలు. గాయత్రీ, ఉష్ణిక్, అనుష్టుప్, బృహతీ, పంక్తి త్రిష్టుప్, జగతీ అనునవి ఛందస్సులు. ఈ వ్యాహృతులు ప్రాణాయామ హోమములందు వినియోగింపబడును. ‘ఆపోహిష్ఠోమయో భువః.....జనయథాచనః’ అనుమూడు ఋక్కులను, ‘ద్రుప దాదివ..... ముముచానః’ ‘హిరణ్యవర్ణాః శుచయః’ ఇత్యాది పవమాన ఋక్కులను పఠించుచు ఎనిమిది పర్యాయములు జలమును మీద చల్లుకొనవలెను. నీటిలోపల నిలచి ‘ఋతంచ’ ఇత్యాది అఘమర్షణ మంత్రమును మూడు పర్యాయములు జపించవలెను. ‘ఆపోహిష్ఠా’ ఇత్యాది ఋక్త్రయమునకు ఋషి సింధుద్వీపుడు. ఛందస్సు గాయత్రి, దేవత జలము. బ్రహ్మస్నానమునకై మార్జనమునందు ఇది వినియోగింపబడును. అఘమర్షణ సూక్తమునకు ఋషి అఘమర్షణుడు. ఛందస్సు అనుష్టుప్. దేవతాభావ వృత్తుడు. పాప నిస్సారణము నందు వినియోగము. ‘ఓం ఆపోజ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువః సువరోమ్’-ఇది గాయత్రీ మంత్ర శిరోభాగము. దాని ఋషి ప్రజాపతి. ఇది ఛందోరహితమైన యజుర్వేద మంత్రము. ఏలననగా యజుర్వేదము ఛందోబద్ధము కాదు. శిరో మంత్రమునకు దేవతలు బ్రహ్మ, అగ్ని, వాయువు, సూర్యులు. ప్రాణాయామము నుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్నినుండి జలము ఉత్పన్నమైనవి. ఈ జలము వలన శుద్ధి కలుగును. అందుచే ‘అన్తశ్చరసిభూతేషు......రసోఽమృతమ్’ అను (మూలోక్త) మంత్రముతో ఆచమనము చేయవలెను. ‘ఉదుత్యం జాతవేదసమ్’ అను మంత్రమునకు ప్రస్కణ్వ ఋషి. ఛందస్సు గాయత్రి. దేవత సూర్యుడు. దీనికి అతిరాత్ర-అగ్నిష్టోమములందు వినియోగము. ‘చిత్రందేవానామ్’ అను మంత్రమునకు ఋషి కౌత్సుడు. ఛందస్సు త్రిష్టుప్. దేవత సూర్యుడు. సూర్యోపస్థానమునందు వినియోగము. (215)
