అగ్ని మహా పురాణము

Table of Contents

అధివాసన విధానము

అటు పిమ్మట పరమేశ్వరుడు ఇట్లు చెప్పెను: పురోహితుడు స్నానమాచరించి, ప్రాతఃకాల మధ్యాహ్నకాల కృత్యములు నెరవేర్చుకొని మూర్తిరక్షకులగు బ్రాహ్మణులతో కలిసి యజ్ఞమండపము చేరుకొనవలెను. వెనుకటి వలెనే శాంత్యాది ద్వార పూజక్రమముగా చేసి, ద్వారముల రెండు శాఖలందును, ప్రదక్షిణమున, ద్వారపాలపూజ చేయవలెను. పూర్వ దిక్కున ద్వారపాలులైన నందీ, మహాకాలులను, దక్షిణమున భృంగి, వినాయకులను, పశ్చిమమున వృషభస్కందులను, ఉత్తరమున దేవీ-చండులను పూజించవలెను. ద్వారశాఖా మూలములందు, పూర్వాది క్రమమున రెండేసి కలశములను పూజించవలెను. పూర్వదిక్కున ఉన్న కలశల పేర్లు ప్రశాంత-శిబిరములు, దక్షిణమున పర్జన్య-అశోకములు, పశ్చిమమున భూత సంజీవన-అమృతములు, ఉత్తరమున ధనద-శ్రీప్రదములు. ఈ రెండేసి కలశలను క్రమముగా పూజించు విధానము చెప్పబడినది. వీటి పేర్ల ప్రారంభము ఓంకారము, అంతమున ‘నమః’ చేర్చి చతుర్థ్యంతరూపము ఉంచవలెను. ఇవే దీని పూజా మంత్రములు. ఉదా: ‘ప్రశాన్త శిశిరాభ్యాం నమః’ మొదలగునవి యజ్ఞ మండపమునందలి ప్రత్యేక ద్వారమునందును రెండు లోకములు, రెండు గ్రహములు, ఇద్దరు వసువులు, ఇద్దరు ద్వారపాలురు, రెండు నదులు, ముగ్గురు సూర్యులు, ఒక యుగము, ఒక వేదము, లక్ష్మి, గణేశుడును ఉండును, విఘ్నములను తొలగించి యజ్ఞమును రక్షించుట వీరి కర్తవ్యము. పూర్వాది దిక్కులు పదింటి యందును వజ్ర, శక్తి, దండ, ఖడ్గ, పాశ, గదా, త్రిశూల, నక్ర, కమఠములను పూజించి, ఒక్కొక్క దిక్కునందును దిక్పాలక పతాక పూజ చేయవలెను. ‘ఓం హూం హః హూం ఫట్’ ‘ఓం హూం హః శక్తయే హూం ఫట్’ ఇత్యాదులు మంత్రములు కుముద, కుముదాక్ష, పుండరీక, వామన, శంకుకర్ణ, సర్వనేత్ర, సుముఖ, సుప్రతిష్ఠితులను ఎనమండుగురు ధ్వజ దేవతలను కోటికోటి భూతములతో పూజించవలెను. ‘ఓం కుం కుముదాయ నమః’ ఇత్యాదులు పూజామంత్రములు హేరుక, త్రిపురఘ్న, శక్తి, యమజిహ్వ, కాల, కరాలీ, ఏకాంఘ్రి, భీములను ఎనమండుగురు క్షేత్రపాలులను పూర్వాది దిక్కులందు బలి, పుష్ప, ధూపాదులతో పూజించి సంతుష్టులను చేయవలెను.

పిదప ఉత్తమ తృణములపైన లేదా వెదురు స్తంభములపై పృథ్వ్యాది పంచతత్త్వములను స్థాపించి, సద్యోజాతి మంత్ర పంచకముతో వాటిని పూజించవలెను. పతాకతోడను, శక్తితోడను యుక్తమగు సదాశివపద వ్యాపియైన మండపము శంకరుని స్థానము అని తాత్త్విక దృష్టితో చూడవలెను. వెనుకటివలె ద్యులోకాన్తరిక్ష లోక భూలోకము లలో ఉన్న విఘ్నములను తొలగించి పశ్చిమ ద్వారమున ప్రవేశించి ఇతర ద్వారముల దర్శనము చేయవలెను. ప్రదక్షిణ క్రమమున మండపములోనికి ప్రవేశించి, వేదీ దక్షిణభాగమున ఉత్తరాభిముఖముగ కూర్చుండి, వెనుకటివలె భూతశుద్ధి చేయవలెను. అంతర్యాగ-విశేషార్ఘ్య-మంత్ర ద్రవ్యాది శోధన-స్వాత్మ-పూజన పంచగవ్యాదికము వెనుకటివలె చేయవలెను. అచట ఆధారశక్తి ప్రతిష్ఠా పూర్వకముగ కలశస్థాపనము చేయవలెను. విశేషించి శివధ్యానము చేయవలెను. పిదప మూడు తత్త్వముల చింతనముచేసి, లలాటమున శివ తత్త్వమును, స్కంధ దేశమునందు విద్యాతత్త్వమును పాదాంత భాగమునందు ఆత్మతత్త్వమును భావన చేయవలెను. శివతత్త్వమునకు రుద్రుడు, విద్యాతత్త్వమునకు నారాయణుడు, ఆత్మతత్త్వమునకు బ్రహ్మయు దేవతలు వీరిని వారివారి నామ మంత్రములతో పూజించవలెను. వరుసగ ఈ తత్త్వముల ఆది బీజములు ‘ఓం ఈం అం’ అనునవి (ఓం హం హాం అనునవి). మూర్తులను మూర్తీశ్వరులను వెనుకటి వలెనే స్థాపించి, వాటిమీద వ్యాపక శివుని సాంగపూజ చేసి, శిరముపై శివహస్తమును ఉంచవలెను. బ్రహ్మ రంధ్రమునుండి ప్రవేశించి తేజస్సుచే తన లోపలను, బైటను ఉన్న అంధకార రాశి నష్టమైనట్లు భావనచేసి, ‘ఆత్మ స్వరూపమే సంపూర్ణ దిఙ్మండలమును ప్రకాశింప చేయుచున్నదని భావన చేయవలెను. మూర్తిపాలకులతో పాటు తననుగూడ వస్త్ర-ముకుటాదులతో అలంకరించుకొని, ‘నేనే శివుడను’ అని చింతించుచు బోధ ఖడ్గమును ఎత్తవలెను.

చతుష్పదాంత సంస్కారములతో యజ్ఞమండప సంస్కారముచేసి, చల్లవలసిన వస్తువులు నలుమూలల చల్లి కుశ కుంచితో వాటినన్నింటిని ప్రోగుచేయవలెను. వాటిని ఆసనముక్రింద ఉంచి, వర్ధనీ జలముతో వెనుకటివలె వాస్త్వాది పూజ చేయవలెను. శివ కుంభాస్త్రమును, వర్ధనిని సుస్థిరాసనమును కూడ పూజించవలెను. వారివారి కలశలపై నున్న ఇంద్రాది దిక్పాలకులను క్రమముగ ఆయుధ పరివారాది సహితముగ పూజించవలెను. తూర్పున ఐరావతము నెక్కి శిరముపై కిరీటమును, హస్తమున వజ్రమును ధరించిన సహస్రాక్షుడైన ఇంద్రుని ధ్యానించవలెను. ఆగ్నేయమున జ్వాలామయములగు ఏడు జిహ్వలు కలిగి, అక్షమాలా కమండలములు ధరించి, అజారూఢుడైన జ్వాలాపరి వృతుడైన అగ్నిదేవుని ధ్యానించవలెను. ఆతని హస్తమునందు శక్త్యాయుధము ఉండును. దక్షిణమున మహిషారూఢుడును, దండధారియు, కాలాగ్నివలె ప్రకాశించువాడును అగుయముని ధ్యానించవలెను. నైరృతియందు ఖరారూఢుడై, ఖడ్గము ధరించి, ఎఱ్ఱని నేత్రములు గల నైరృతిని ధ్యానించవలెను. పశ్చిమమున, మకరారూఢుడును, శ్వేతవర్ణుడును, నాగపాశధారియగు వరుణుని ధ్యానించవలెను. వాయవ్యమునందు లేడినెక్కిన, నీలవర్ణుడైన వాయువును, ఉత్తమునందు గొర్రెనెక్కిన కుబేరుని, ఈశాన్యమున త్రిశూలధారియు, వృషభారూఢుడును అగు ఈశానుని, నైరృతి-పశ్చిమముల మధ్య కచ్ఛపారూఢుడును చక్రధారియు అగు అనంతుని, ఈశాన-పూర్వ దిఙ్మధ్యములందు నాలుగు ముఖములు, నాలుగు భుజములునుగల హంసవాహనుడైన బ్రహ్మను ధ్యానించవలెను. స్తంభమూలము నందున్న కలశములందును, వేదియందును ధర్మాదులను పూజించవలెను. కొందరు అన్ని దిక్కులందునుఉన్న కలశలపై అనంతాదులను పూజింతురు. పిదప శివాజ్ఞ వినిపించి, కలశములను తన పృష్ఠభాగము వరకును త్రిప్పవలెను. పిదప, ముందుగ కలశను, తరువాత వర్ధనిని, వాటి స్థానములందు ఉంచవలెను. స్థిరాసనముగల శివుని కలశము నందును, శస్త్రము నిమిత్తమై ధ్రువాసనమును వెనుకటివలె పూజించి ఉద్భవముద్రతో స్పృశించవలెను. అప్పుడు-‘జగన్నాథా! నీ భక్తుల పై కృపతో ఈ నీ యజ్ఞమును రక్షించుము’ అని ప్రార్థించి కలశమునందు ఖడ్గస్థాపన చేయవలెను. దీక్షా స్థాపనా సమయములందు, కలశయందుగాని, వేదిపైగాని, మండలముపైగాని శివుని పూజించవలెను. మండలమునందు దేవేశ్వరుడగు శివుని పూజించి, కుండము దగ్గరకు వెళ్ళవలెను.

కుండనాభిని ముందు ఉంచుకొని కూర్చున్న మూర్తిధారులగు పురుషులు గురువు ఆజ్ఞను అనుసరించి తమతమ కుండలములను సంస్కరించుకొనవలెను. జపముచేయు బ్రాహ్మణులు, సంఖ్యా రహితముగ జపము చేయవలెను. ఇతరులు సంహితా పాఠము చేయవలెను. వేదపారం గతులగు బ్రాహ్మణులు తమతమ శాఖలను అనుసరించి శాంతి పాఠము చేయవలెను. ఋగ్వేదులగు బ్రాహ్మణులు తూర్పున శ్రీసూక్త, పావమానీఋక్, మైత్రీయ బ్రాహ్మణ, వృషాకపి మంత్రములను పఠించవలెను. సామవేదవేత్తలు దక్షిణమున దేవవ్రత, భారుండ, జ్యేష్ఠసామ, రథంతరసామ, పురుష గీతగానము చేయవలెను. యజుర్వేదులు, పశ్చిమమున, రుద్రసూక్త, పురుషసూక్త, శ్లోకాధ్యాయములను, ప్రధానముగ బ్రాహ్మణములను పఠించవలెను. అథర్వవేదులు, ఉత్తరమున, నీలరుద్ర, సూక్ష్మా సూక్ష్మ, అథర్వ శీర్షములను శ్రద్ధతో పఠించవలెను, ఆచార్యుడు అగ్నిని పుట్టించి, అన్ని కుండములందును స్థాపింపచేయవలెను. అగ్నికి పూర్వాది భాగములందు పూర్వకుండాది క్రమమున ధూప, దీప, చరువుల కొరకై అగ్న్యుద్ధారము చేయవలెను. మొదట చెప్పిన విధముగ పరమేశ్వరుని పూజించి, శివాగ్నియందు మంత్ర తర్పణము చేయవలెను. దేశ కాలాది సంపన్నత్వము కొరకును, దుర్నిమిత్త శాంతి కొరకును, మంత్రజ్ఞుడగు ఆచార్యుడు హోమముచేసి, మంగళకరమగు పూర్ణాహుతి ఇచ్చి, వెనుకటివలె చరువును వండి, దానిని ఒక్కొక్క కుండమునందును నివేదన చేయవలెను. యజమానునిచే వస్త్రభూషణాదులతో సత్కరింపబడిన మూర్తిపాలకులగు బ్రాహ్మణులు స్నాన మండపమునకు వెళ్ళి, శివ ప్రతిమను భద్రపీఠముపై స్థాపించి, తాడన, అవకుంఠన క్రియను చేయవలెను. పూర్వవేదిపై పూజచేసి, మట్టి, కషాయ జలము, గోమయము, గోమూత్రము-వీటితోను, మధ్య మధ్య జలముతోను భగవత్ప్రతిమకు స్నానము చేయించవలెను. పిదప భస్మముతోను, సుగంధి జలముతోను స్నానము చేయించవలెను. పిదప ఆచార్యుడు ‘అస్త్రాయ ఫట్’ అను మంత్రముతో అభిమంత్రించిన జలముతో మూర్తిపాలురతో పాటు తన హస్తములు కూడ కడిగికొని, కవచ మంత్రాభి మంత్రితమగు పీతాంబరముతో మూర్తిని ఆచ్ఛాదించి, శ్వేత పుష్పములతో పూజించవలెను. పిదప దానిని ఉత్తరవేది మీదకు తీసికొని వెళ్ళవలెను.

అచట ఆసనయుక్తమగు శయ్యపై పరుండబెట్టి కుంకుమరంగు పూసిన దారముతో అంగ విభాజనముచేసి, ఆచార్యుడు సువర్ణశలాకతో ప్రతిమయందు నేత్రములను గుర్తించవలెను. ఈ పని శస్త్రక్రియ ద్వారా జరుగవలెను. చిహ్నములు చేసిన గురువును ముందుగ నేత్ర చిహ్నమును అంజనాంకితము చేయగా, పిమ్మట, మూర్తి నిర్మాణము చేసిన శిల్పి శస్త్రముతో ఆనేత్ర చిహ్న స్థానమును చెక్కవలెను. ఆ మూర్తియందు, మూడు అంశములకంటే తక్కువగాగాని, నాల్గవవంతుగాని, అర్ధ భాగమునందు గాని సంపూర్ణ కామసిద్ధి కొరకై, శుభ చిహ్నములను ఉంచవలెను. శివలింగము పొడవును మూడుచే భాగించి, ఒక భాగము విడువగా ఎంత ప్రమాణము వచ్చునో అదే లింగము యొక్క లక్ష్మ దేహమునకు అన్ని వైపుల నుండి విస్తారము కావలెను. హస్తమాణమగు శిలయందు గీయు లక్ష్మరేఖల లోతు-వెడల్పులు యవయొక్క తొమ్మిది భాగములలో ఒక దానిని విడిచి ఎనిమిది గ్రహించినంత ఉండవలెను. ఇదేవిధముగ ఒకటిన్నర లేదా రెండు హస్తములు మొదట ప్రమాణముగల శివలింగము మొదలు, తొమ్మిది హస్తముల ప్రమాణము గల లింగము వరకును, క్రమముగ ఎనిమిదవ వంతు పెంచుచు చిహ్నరేఖలు గీయవలెను. ఈ విధముగ తొమ్మిది హస్తముల లింగమునందు ఎనిమిది యవలలోతు వెడల్పులుగల చిహ్నరేఖలు ఉండవలెను. పరస్పరాంతరముతో ఉత్తరోత్తరము పాదవృద్ధి గల శివ లింగమున లక్ష్మదేహ విస్తారము ఒక్కొక్క యవ పెరుగుతూ పోవలెను. లోతు-వెడల్పులు పెరుగుట ననుసరించి, రేఖ మూడవ వంతు పెరుగుచుండును. అన్ని శివ లింగములందును దానిపై భాగమే దాని సూక్ష్మ శిరము చిహ్న క్షేత్రమును ఎనిమిది భాగములు చేసి, రెండు భాగములు శిరస్సునందు ఉండునట్లు చేయవలెను. మిగిలిన ఆరు భాగములలో క్రింది రెండు భాగములను విడచి మధ్యయందు మిగిలిన భాగములందు మూడు రేఖలు గీసి, వాటిని పృష్ఠ దేశమునకు తీసికొని వెళ్ళి విడువవలెను. రత్నమయ లింగము లైనచో లక్షణోద్ధారము ఆవశ్యకము కాదు. భూమి నుండి స్వతః ఆవిర్భవించిన లింగములకు గాని, నర్మదాది నదులందు ఉద్భవించిన లింగములకుగాని, లక్ష్మోద్ధార మపేక్షితము కాదు. రత్నమయ లింగముల రత్నము లందున్న నిర్మల కాంతియే వాటి స్వరూపమునకు లక్షణము, ముఖ భాగము నందు నేత్రోన్మీలనము ఆవశ్యకము. అందు నిమిత్తమే ఈ చిహ్నము నిర్మింపబడుచున్నది.

లక్షణోద్ధార రేఖను మృత్యుంజయ మంత్రముతో, ఘృతమధువులతో పూజించి, శిల్పి దోష పరిహారార్థమై మృత్తికాది స్నానము చేయించి, లింగమును పూజించవలెను. పిదప దానమానాదులతో శిల్పిని సంతోషపెట్టి గురువునకు గోవును ఈయవలెను. సౌభాగ్యవతులగు స్త్రీలు ధూపదీపాదులతో లింగమునకు విశేష పూజలు చేసి మంగళ గీతములను గానము చేయవలెను. సవ్యాపసవ్య భావముతో కుశముతోగాని, సూత్రముతో గాని స్పర్శ పూర్వకముగ గోరోచనము సమర్పించవలెను. పిదప యజమానుడు బెల్లము, ఉప్పు, ధాన్యాకము (కొత్తుమ్మరి) మొదలగునవి ఇచ్చి ఆ స్త్రీలను పంపివేయ వలెను. పిమ్మట గురువు మూర్తి రక్షకులగు బ్రాహ్మణులతో కలిసి, ‘నమః’ లేదా ప్రణవ మంత్రముతో మట్టి, గోమయము, గోమూత్రము, భస్మము-వీటితో వేరువేరుగా స్నానము చేయించవలెను. ఒక్కొక్కదానితో స్నానము చేయించిన పిదప మధ్యయందు జలముతో స్నానము చేయించవలెను. పిదప పంచగవ్యములు, పంచామృతము, రూక్షత్వమును తొలగించు కషాయ ద్రవ్యములు, సర్వౌషది మిశ్రజలము, శ్వేత పుష్పములు, ఫలములు, సువర్ణము, రత్నములు, శృంగము, యవలు కలిపిన జలము, సహస్రధార, దివ్యౌషధముక్త జలము, తీర్థ జలము, గంగాజలము, చందన మిశ్ర జలము, క్షీర సాగరాది జలము, కలశ జలము, శివకలశ జలము వీటిచే స్నానము చేయించవలెను. రూక్షత్వమును తొలగించు విలేపనము, ఉత్తమ గంధము, చందనము మొదలగువాటితో పూజ చేసిన పిమ్మట బ్రహ్మ మంత్రముతో పుష్పములను, కవచ మంత్రముతో రక్త వస్త్రములను సమర్పించవలెను. అనేక విధములగు హారతి ఇచ్చి, రక్షా-తిలక పూర్వకముగ గీతవాద్యాదులతోను వివిధ ద్రవ్యములతోను, జయజయ ధ్వనులతోను, స్తుత్యాదులతోను, పరమేశ్వరుని సంతుష్టుని చేసి, పుష్పమంత్రములతో పూజచేయవలెను. హృదయ మంత్రముతో ఆచమనము చేసి, ‘ఓ ప్రభూ! లెమ్ము’ అని ఇష్ట దేవతతో చెప్పవలెను. పిదప ఇష్ట దేవతను బ్రహ్మ రథముపై కూర్చుండబెట్టి నాలుగు దిక్కులందును త్రిప్పి వివిధ ద్రవ్యములను వెదజల్లుచు, పశ్చిమ ద్వారమునకు తీసికొనిపోయి అచట దేవతను శయ్యపై కూర్చుండ బెట్టవలెను, ఆసనము ఆద్యంతములయందు శక్తి భావన చేయుచు ఆ శుభాసనముపై కూర్చుండబెట్టవలెను.

పశ్చిమాభిముఖమైన ప్రాసాదమునందు పశ్చిమము వైపున పిండిక స్థాపించి, దానిపై బ్రహ్మ శిల ఉంచవలెను. శివకోణము నందు నూరు అస్త్రమంత్రములతో అభిమంత్రించిన నిద్రాకలశమును, శివాసనమును కల్పించి, హృదయమంత్రముతో అర్ఘ్యమిచ్చి, దేవతలను లేవదీసి, శిరోమంత్రముతో, లింగమయాసనముపై, తూర్పువైపు శిరస్సు ఉండునట్లు ఉంచవలెను. పిదప చందన ధూపాదులు సమర్పించి దేవుని పూజించి కవచమంత్రముతో వస్త్రము సమర్పించి, గృహోపకరణాదులు అర్పించి, శక్త్యనుసారము నమస్కార పూర్వకముగ నైవేద్యము నివేదించవలెను. అభ్యంగము కొరకై, ఘృత-మధు యుక్తమగు పాత్రను దేవతాపాడ సమీపమున ఉంచవలెను. ఆచార్యుడు, శక్తి మొదలు భూమి వరకును ఉన్న ముప్పదియారు తత్త్వములను, తదధిపతి సహితముగ స్థాపించి, వాటిని పుష్పమాలలతో మూడు భాగములుగ విభజించవలెను. ఇది మాయ మొదలు శక్తి పర్యంతమైన భాగములు; మొదటిది చతుష్కోణము; రెండవది అష్టకోణము; మూడవది వర్తులాకారము. సృష్టి క్రమానుసారము ఈ భాగములకు బ్రహ్మ, విష్ణు, శివులు అధిపతులు. పిదప పూర్వాది క్రమమున మూర్తులను, మూర్తీశ్వరులను న్యాసము చేయవలెను. పృథివి, అగ్ని, యజమానుడు, సూర్యుడు, జలము, వాయువు, చంద్రుడు, ఆకాశము ఈ ఎనిమిది మూర్తి రూపములు. వీని న్యాసము చేసిన పిమ్మట అధిపతుల న్యాసము చేయవలెను. శర్వ, ఉగ్ర, రుద్ర, భవ, ఈశ్వర, మహాదేవ-భీములు అధిపతులు, లం, రం, శం, ఖం, చం, పం, సం, హం అనునవి వీరి మంత్రములు. త్రి మాత్రిక ప్రణవహాంలు గాని, హృదయ మంత్రము గాని, మూల మంత్రములు గాని వీరి పూజకై వినియోగింపబడును. లేదా పంచ కుండాత్మక యాగము నందు పృథ్వీ, జల తేజో, వాయు, ఆకాశములనెడు పంచమూర్తుల న్యాసము చేయవలెను. పిదప, మంత్రజ్ఞుడు, బ్రహ్మ-శేషుడు, రుద్రుడు, ఈశుడు, సదా శివుడు అనువారిని సృష్టి క్రమమున న్యాసము చేయవలెను. యజమానుడు ముముక్షు వైనచో పంచమూర్తులకు బదులు నివృత్త్యాది పంచకళలను, అజాతుడు మొదలగు తదధిపతులను న్యాసము చేయవలెను. లేదా సర్వత్ర వ్యాప్త రూపమగు కారణాత్మక త్రితత్త్వ న్యాసము చేయవలెను.

శుద్ధాధ్వయందు విద్యేశ్వరులను అశుద్ధాధ్వయందు లోకనాయకులను మూర్తి పతులనుగా చూడవలెను. భోగి (సర్పము) కూడ మంత్రేశ్వరుడు. క్రమముగ ముప్పదియైదు, ఎనిమిది, ఐదు, త్రిమూర్తి రూపములును చెప్పబడినది. ఇవే వీటి తత్త్వములు, ఏతత్తత్త్వాధిపతుల మంత్రములు దిగ్దర్శనము మాత్రము చేయబడుచున్నది. ‘ఓం హాం శక్తితత్త్వాయ నమః’ ఇత్యాదికము “ఓం హాం శక్తి తత్త్వాధిపాయ నమః’ ఇత్యాదికము ‘ఓం హాం క్ష్మామూర్తయే నమః’ ‘ఓం హాం క్ష్మామూర్త్యధిపతయే బ్రహ్మణే నమః ఇత్యాదికము ‘ఓం హాం శివతత్త్వాయ నమః’ ‘ఓం హాం శివతత్త్వాధిపతయే రుద్రాయ నమః’ ఇత్యాదికము నాభిమూలము నుండి ఉచ్చరింపబడుచు ఘంటా నాదమువలె నలువైపుల వ్యాపించు చున్నదియు, బ్రహ్మాది కారణత్యాగ పూర్వకముగ ద్వాదశాన్త స్థానమును పొందిన మనస్సు కంటె అభిన్నమును అగు మంత్రమును, నిష్కళుడును, ముప్పదియారు కళలతో కూడినవాడును, సహస్ర కిరణములతో ప్రకాశించుచున్నవాడును, సర్వశక్తి మయుడును, సాంగుడు అగు వ్యాపక శివుని ధ్యానించుచు, ఆ దేవుని ద్వాదశాంతము నుండి తీసికొని వచ్చి శివ లింగముపై స్థాపింపవలెను. శివలింగముపై చేయు జీవన్యాసము సకలపురుషార్థ సాధనముగ నుండవలెను. పిండికాది న్యాసవిధానము చెప్పబడుచున్నది. పిండికకు స్నానము చేయించి, చందనాదులు పూసి, సుందర వస్త్రములు కప్పి, దాని భగస్వరూపమగు ఛిద్రమునందు పంచరత్నాదులు వేసి, లింగమునకు ఉత్తరమున ఉంచవలెను. లింగమునందువలె దానియందు కూడ న్యాసముచేసి యథావిధిగా పూజించ వలెను. స్నానాది పూజా కార్యములు పూర్తిచేసి లింగమూల భాగమున శివుని న్యాసము చేయవలెను. పిదప శక్త్యంత వృషభమునకు కూడ స్నానాది సంస్కారములుచేసి స్థాపన చేయవలెను. పిదప మొదట ప్రణవమును, తరువాత హ్రాం హ్రూం హ్రీంలలో ఒక బీజాక్షరమును ఉచ్చరించుచు క్రియాశక్తి సహితమగు, ఆధార రూపిశిల (పిండిక)ను పూజించవలెను. భస్మ, కుశ, తిలలతో మూడు ప్రాకారములు నిర్మించి రక్షణార్థమై బైట ఆయుధములతో కూడిన లోకపాలులను నిలిపి, పూజించవలెను.

‘ఓం హ్రీం క్రియాశక్తయే నమః’ ‘ఓం హ్రీం మహాగౌరి రుద్రదయితే స్వాహా అనునవి పూజా మంత్రములు. ‘ఓం హ్రీం ఆధార శక్తయే నమః’ ‘ఓం హ్రాం వృషభాయ నమః’ అను మంత్రములతో పిండికను పూజించవలెను. ధారికా దీప్తా, అత్యుగ్రా, జ్యోత్స్నా, బలోత్కటా, ధాత్రీ, విధాత్రీలను పిండిపై న్యాసము చేయవలెను. లేదా వామా, జ్యేష్ఠా, క్రియా, జ్ఞానా, వేధా అను ఐదుగురు నాయికలను న్యాసము చేయవలెను. లేదా క్రియా, జ్ఞానా, ఇచ్ఛా అను ముగ్గురినే న్యాసము చేయవలెను. వెనుకటి వలెనే శాంతి మూర్తులలో తమీ, మోహా, క్షుధా, నిద్రా, మృత్యు, మాయా, జరా, భయలను న్యాసము చేయవలెను. లేదా తమా, మోహా, ఘోరా, రతి, అపక్వరా అను ఐదు గురన్యాసము చేయవలెను. లేదా క్రియా, జ్ఞానా, ఇచ్ఛా అను ముగ్గురు అధినాయికలను తీవ్రమూర్తి గల ఆత్మాదితత్త్వము త్రయముపై న్యాసము చేయవలెను. పిండికా, బ్రహ్మ శిలాదులపై, వెనుకటివలెనే గౌర్యాది మంత్రములతో సకల కార్యములు యథావిధిగా చేయవలెను. ఈ విధముగ న్యాస కర్మచేసి, కుండము దగ్గరకు వెళ్ళి దాని లోపల మహేశ్వరుని మేఖల యందు చతుర్భుజుని నాభియందు క్రియా శక్తిని న్యాసము చేయవలెను. కలశ, వేదీ, అగ్ని, శివులతో నాడీ సంధాన కర్మ చేయవలెను. తామరతూడులోని దారమువలె అతిసూక్ష్మమైన శక్తి ఊర్ధ్వగతమగు వాయువు సహాయముతో పైకి ఎగిరి, శూన్యమార్గమునుండి శివునిలో ప్రవేశించును. ఆ ఊర్ధ్వగతశక్తి అచటి నుండి బయలుదేరి వచ్చి శూన్యమార్గమునుండి తనలో ప్రవేశించుచున్నదని భావన చేయవలెను. ఈ విధముగనే మూర్తిపాలుల సంధానముకూడ చేయవలెను.

కుండమునందు ఆధారశక్తిని పూజించి, తర్పణము చేసిన పిదప క్రమముగా, తత్త్వ తత్త్వేశ్వర, మూర్తి, మూర్తీశ్వరులను ఘృతాదులతో పూజించి, తర్పణము చేయవలెను. పిదప వారిపై సంహితా మంత్రములతో నూరుగాని వెయ్యిగాని, ఐదు వందలుగాని హోమములుచేసి, పూర్ణాహుతి ఇవ్వవలెను, ఈ విధముగ తత్త్వతత్త్వేశ్వరులకును, మూర్తి మూర్తీశ్వరులకును, ఒండొరుల సాన్నిధ్యమున తర్పణములు చేసిన పిమ్మట మూర్తిపాలకులు గూడ వారికై హోమములు చేయవలెను. పిదప ద్రవ్యకాలాను సారము వేదములతోను, అంగములతోను తర్పణము చేసి, శాంతికలశ జలముతో ప్రోక్షించిన కుశమూలముతో లింగమూల భాగమును స్పృశించి, ఎన్ని హోమములో అంత జపము చేసి, హృదయ మంత్రముచే సన్నిధాపనమును కవచమంత్రముచే ఆచ్ఛాదనమును చేయవలెను. ఈ విధముగ సంశోధనముచేసి లింగోర్ధ్వ భాగమున బ్రహ్మను మూలభాగమున విష్ణువును పూజించి, శుద్ధి నిమిత్తమై వెనుకటి అన్ని కార్యములు పూర్తిచేసి, హోమసంఖ్యానుసారము జపాదులు చేయవలెను. కుశమధ్య భాగముచే లింగమధ్య భాగమును, కుశాగ్ర భాగముచే లింగాగ్ర భాగమును స్పృశించవలెను. ఏ మంత్రముచే ఏ విధముగ సంధానము చేయవలెనో చెప్పబడుచున్నది. ‘ఓం హాం హం ఓం ఓం ఏం ఓం భూం భూం బాహ్య మూర్తయే నమః, ఓం హాం వాం ఆం ఓం ఆం షాం ఓం భూం భూం వాం వహ్ని మూర్తయే నమః, యజమానాది మూర్త్యభి సంధానము కూడా ఇట్లే చేయవలెను. పంచమూర్మ్తాత్మక శివుని సంధాన కర్మకూడ హృదయాది మంత్రములతో ఈ విధముగనే చేయవలెను. త్రితత్త్వాత్మక స్వరూపమునందు సంధానకర్మ మూల మంత్రముతో గాని, స్వస్వ బీజమంత్రములతో గాని చేయవలెనని గ్రహించవలెను, శిలా, పిండికా, వృషభములకు కూడ సంధానము ఈవిధముగనే చేయవలెను. ఒక్కొక్క భాగము శుద్ధి కొరకై, దాని మంత్రములతో శతాది హోమము చేయవలెను. న్యూనతాది దోష పరిహారార్థమై శివ మంత్రముతో నూట ఎనిమిది హోమములు చేసి, చేసిన కర్మను గూర్చి శివునకు చెవిలో చెప్పవలెను.

‘ప్రభూ! నేనీ కార్యమును నీ శక్తిచేతనే చేయగలిగితిని. భగవంతుడగు రుద్రునకు నమస్కారము. రుద్రదేవా! నీకు నమస్కారము, కర్మ విధి పూర్ణమైనను కాకపోయినను, నీవు నీ శక్తి చేతనే దీనిని పూర్ణము చేసి గ్రహించుము.” ‘ఓం శాంకరి పూరయస్వాహా’ అని చెప్పి పిండికపై న్యాసము చేయవలెను. పిదప జ్ఞానియగు పురుషుడు లింగమున క్రియాశక్తిని, పీఠ విగ్రహమునందు, బ్రహ్మ శిలపైన ఆధారరూపిణి యగు శక్తిని న్యాసము చేయవలెను. ఏడు రాత్రులు, ఐదు రాద్రులు, లేదా ఒక రాత్రి దానిని నిరోధించి వెంటనే అధివాసము చేయవలెను. అధివాసము లేకుండగ చేసిన యాగము ఫలదాయకము కాదుగాన అధివాసము తప్పక చేయవలెను. అధివాస కాలమున ప్రతి దినమునను, దేవతలకు వారివారి మంత్రములతో వందేసి హోమములుచేసి, శివకలశాది పూజచేసి, దిక్కులందు బలి సమర్పించవలెను. గుర్వాదులతో రాత్రినియమ పూర్వకముగ నివసించుట అధివాసము; అధిపూర్వక వన్ ధాతువునకు భావార్థమున ఘఞ్ ప్రత్యయము చేర్చుటచే అధివాస శబ్దము నిష్పన్నమైనది. (96)