అగ్ని మహా పురాణము

Table of Contents

షోడశమహాదానాది వర్ణన

అగ్ని దేవుడు చెప్పెను:

ఇపుడు వివిధ దానములను గూర్చి చెప్పెదను. తులాపురుష దానము, హిరణ్య గర్భ దానము, బ్రహ్మాండ దానము, కల్పవృక్ష దానము, సహస్ర గోదానము, స్వర్ణమయ కామధేను దానము, స్వర్ణ నిర్మితాశ్వ దానము స్వర్ణ మయాశ్వయుక్త రథ దానము,స్వర్ణ రచిత హస్తిరథ దానము, హలపంచక దానము, భూదానము, విశ్వచక్ర దానము, కల్ప లతాదానము, ఉత్తమ సప్తసముద్ర దానము, రత్నధేను దానము, జలపూర్ణ కుంభ దానము-అనునవి పదునారు మహాదానములు. ఒక శుభదినమున మండల ఆకారమగు మండపమునందు దేవతాపూజ చేసి ఈ దానము బ్రాహ్మణులకు ఈయవలెను. మేరు దానము కూడ పుణ్యప్రదము. ‘మేరువులు’పది. ఒక వెయ్యి ద్రోణముల ధాన్యము ‘ధాన్య మేరువు’. ఇది ఉత్తమము. ఐదువందల ద్రోణముల ధాన్యము మధ్యమము. రెండువందల ఏబది ద్రోణముల ధాన్యము అధమము. పదునారు ద్రోణములతో నిర్మించిన ‘లవణా చలము’ ఉత్తమము. పది భారముల ‘గుడ పర్వతము’ ఉత్తమము; ఐదు భారములు మధ్యమము; రెండున్నర భారములు నికృష్టము. వేయిపలముల ‘స్వర్ణ మేరువు’ ఉత్తమము. ఐదు వందల పలములు మధ్యమము; రెండున్నర పలములు అధమము. ఇరువది భారముల ‘కార్పాస (దూది) పర్వతము’ ఉత్తమము. పది భారములు మధ్యమము. ఐదు భారములు నికృష్టము. ఇరువది ఘృత పూర్ణ కుంభముల ‘ఘృతాచలము’ ఉత్తమము. పదివేల పలముల ‘రజత పర్వతము’ ఉత్తమము. ఎనిమిది భారముల ‘శర్కరాచలము’ ఉత్తమము. నాల్గుభారములు మధ్యమము, రెండుభారములు మందము. ఇపుడు ‘దశధేనువులను గూర్చి చెప్పెదను. దీని దానముచే మనుష్యుడు భుక్తి ముక్తులను పొందును. గుడ ధేనువు, ఘృత ధేనువు, తిల ధేనువు, జల ధేనువు, క్షీర ధేనువు, మధు ధేనువు, శర్కరా ధేనువు, దధి ధేనువు, రస ధేనువు, కృష్ణాజిన ధేనువు అను ఈ దశ ధేనువుల దాన విధానము చెప్పబడుచున్నది. ద్రవపదార్థ రూప ధేనువులకు ప్రతినిధిగ ఘటములందు ఆ పదార్థములను నింపి కుంభ దానము చేయవలెను. ఇతర ధాత్వాది రూపములలో ఉన్న ధేనువులను ఆయా ద్రవ్యముల రాశులను చేసి దానము చేయవలెను.

గోమయముతో అలికిన భూమిపై దర్భలు పరచి వాటిపై నాలుగు హస్తముల ప్రమాణముగల కృష్ణాజినమును ఉంచవలెను. దాని కంఠము తూర్పువైపు ఉండవలెను. గోవత్సము నిమిత్తము చిన్న కృష్ణాజినము నుంచవలెను. వత్ససహితమగు ధేనువు ముఖము తూర్పు వైపునకును, పాదములు ఉత్తరమువైపునకును ఉన్నట్లు భావింపవలెను. నాలుగు భారముల గుడధేనువు సర్వదా ఉత్తమమని అంగీకరింపబడినది. ఒక భారము గుడముతో గోవత్సమును నిర్మింపవలెను. రెండు భారముల గోవు మధ్యమము. దానితో పాటు అర్ధ భారము లేగదూడ ఉండవలెను. ఒక భారము గోవు కనిష్ఠము. దాని చతుర్థాంశముతో దూడను నిర్మించి దీనితోపాటు ఈయవలెను. గుడ ధేనువును తాను సంగ్రహించుకొనిన గుడమును బట్టి నిర్మించవలెను. ఐదు గురివెందలు ఒక మాషము. 16 మాసములు ఒక సువర్ణము. నాలుగు సువర్ణములు ఒక పలము. 100 పలములు ఒక తుల. 20 తులలు ఒక భారము. నాలుగు ఆఢకములు ఒక ద్రోణము.

గుడ నిర్మితమగు ధేనువును, వత్సమును సూక్ష్మ వస్త్రముతో కప్పవలెను. వాటి చెవుల వద్ద శక్తులను, చరణ స్థానములందు చెరకుకఱ్ఱలను, నేత్ర స్థానములందు పవిత్రములగు ముత్యములను, అలక స్థానములందు శ్వేత సూత్రమును, గంగడోలు దగ్గర శ్వేత కంబలమును పృష్ఠభాగమున తామ్రమును, రోమ స్థానమున శ్వేత చర్మమును, కనుబొమ్మల వద్ద విద్రుమములను, స్తనములవద్ద నవనీతమును, పుచ్ఛ స్థానమునందు పట్టు వస్త్రమును, ఆక్షిగోలక స్థానములందు నీల మణులను శృంగ-శృంగాభరణ స్థానములందు సువర్ణమును, డెక్కల వద్ద వెండినుంచవలెను. దంత స్థానములందు వివిధ ఫలములను నాసికా స్థానమున సుగంధ ద్రవ్యమును ఉంచి కంచులోహ పాత్రనుకూడ ఉంచవలెను. ద్విజ శ్రేష్ఠా! ఈ విధముగ ధేనువును నిర్మించి. క్రింది విధముగ ప్రార్థించుచు పూజించవలెను-‘సకల ప్రాణుల లక్ష్మియు, సకల దేవతలలో నుండునదియు అగు ధేనురూపిణియైన దేవి నాకు శాంతిని ప్రసాదించుగాక! తన శరీరము నందు ఉండి ‘రుద్రాణి’ అను పేరుతో ప్రసిద్ధురాలును, శంకరుని ప్రియతమ పత్నియు, ధేనురూప ధారిణియు అగు దేవి నా పాపములను నశింపచేయుగాక! విష్ణు వక్షః స్థలమున లక్ష్మీ రూపముతో నుండు నదియు, అగ్ని యొక్క స్వాహారూపమునను, చంద్ర, సూర్య, నక్షత్ర దేవతా శక్తి రూపము నను ఉన్నదియు ధేను రూపిణియు అగు దేవి నాకు లక్ష్మినిచ్చు గాక! చతుర్ముఖుని సావిత్రియు, ధనాధీశుడగు కుబేరుని నిధియు లోకపాల లక్ష్మియునగు ధేనుదేవి నాకు అభీష్ట వస్తువులను ఇచ్చుగాక, దేవీ! నీవు పితృదేవతల స్వధవు. యజ్ఞభోక్తయగు అగ్నికి సంబంధించిన స్వాహాదేవివి నీవు. ధేనురూపమున నుండి సమస్త పాపములను తొలగించుచుందువు. అందుచే నాకు శాంతిని ఇమ్ము’. ఈ విధముగ (శ్లోకములను చదివి) అభిమంత్రింపబడిన ధేనువును బ్రాహ్మణునకు దానము చేయవలెను. దీనిచే మనుష్యుడు సకల యజ్ఞ ఫలములను పొంది, పాపరహితుడై భుక్తి ముక్తులను రెండింటిని పొందును.

సువర్ణ శృంగములతోను, రజత ఖురములతోను కూడిన పాలనిచ్చు ఆవును కాంస్య లోహపాత్రను, వస్త్ర దక్షిణలతో దానము చేయవలెను. ఇట్టి గోవును దానము చేసినవాడు ఆ గోవుకు ఎన్ని రోమములు ఉన్నవో అన్ని సంవత్సరములు స్వర్గములో నివసించును. కపిల గోవు దానము చేసినవాడు ఏడు తరముల వారిని ఉద్ధరించును. సువర్ణ శృంగములు, రజత మండిత ఖురములుగల కపిలగోవును, కాంస్య లోహపాత్రను, యథాశక్తి దక్షిణతో దానము చేసినవాడు భుక్తిముక్తులను పొందును. ఉభయతోముఖియగు గోవును దానము చేసినవాడు ఆవునకును, దాని దూడకును ఎన్ని రోమములు ఉండునో అన్ని యుగముల వరకును స్వర్గమున సుఖములు అనుభవించును. ఉభయతోముఖ గోదానము కూడ పైన చెప్పిన విధముననే చేయవలెను. మరణాసన్నుడగు మానవుడు వత్స సహితమగు గోవును పూర్వోక్త విధానముతో దానము చేయవలెను-‘అత్యంత భయంకరమగు యమలోక ప్రవేశ ద్వారమునందు తప్త జలముతో నిండిన వైతరణీనది ప్రవహించుచుండును. దానిని తరించుటకై నేను ఈ కృష్ణ వర్ణయగు వైతరణి గోవును దానము చేయుచున్నాను’. (210)