అగ్ని మహా పురాణము

Table of Contents

ఛందస్సారము  - 2

అగ్నిదేవుడు పలికెను:

‘ఛందస్’ అను శబ్దము ఈ ప్రకరణములో అనువృత్తి చెందుచుండును. దైవి గాయత్రి ఏకాక్షరి, ఆసురిపంచదశాక్షరి, ప్రాజాపత్య అష్టాక్షరి, యాజుషి షడక్షరి, సామ్నీ గాయత్రి ద్వాదశాక్షరి, ఆర్చి అష్టాదశాక్షరి, సామ్ని గాయత్రిలో క్రమముగా రెండేసి అక్షరములు పెంచుచు ఆరుకోష్ఠములలో వ్రాయవలెను. ఆర్చి గాయత్రిలో మూడేసి ప్రాజాపత్య గాయత్రిలో నాలుగేసి ఇతర గాయత్రులలో ఒక్కొక్కటి అక్షరము పెంచవలెను. ఆసురి గాయత్రియొక్క ఒక్కొక్క అక్షరము క్రమముగ ఆరు కోష్ఠములలో తగ్గినచో వాటిని సామ్న్యాది భేద సహితముగా ఉష్ణిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతీ ఛందస్సులుగా తెలుసుకొనవలెను. యాజుషి సామ్ని ఆర్చి గాయత్రుల అక్షరములను వేరు వేరుగా కూర్చుటచే బ్రాహ్మీ గాయత్రి, బ్రాహ్మి ఉష్ణిక్ మొదలగునవి ఏర్పడును. యాజుషికి ముందున్న మూడు గాయత్రుల అక్షరములను వేరువేరుగా ఆరుకోష్ఠములలో చేర్చుటచే ఎన్ని అక్షరములగునో అవి ఆర్షీ గాయత్రి, ఆర్షి ఉష్ణిక్ ఇత్యాది భేదములుగా ఏర్పడును. వీటిని అరువది నాలుగు గోష్ఠములలో వ్రాయవలెను. (329)