అగ్ని మహా పురాణము

Table of Contents

నరక స్వరూపము

అగ్ని దేవుడు పలికెను: వసిష్ఠా! ఇపుడు నరకములను గూర్చి చెప్పెదను. పుష్పాద్యుప చారములతో శ్రీమహా విష్ణువును పూజించువారికి నరకప్రాప్తి ఉండదు. ఆయుర్దాయము పూర్తియైన పిమ్మట వలదన్నను మానవుడు మరణించి తీరును. దేహధారియైన జీవుడు అగ్ని, జలము, విషము, శస్త్రఘాతము, ఆకలి, వ్యాధి, పర్వతమునుండి పడుట మొదలైన ఏదియో ఒక నిమిత్తముచే ప్రాణములు విడచును. స్వ కర్మానుసారముగ యాతనలు అనుభవించుటకై మరొక శరీరమును గ్రహించును. పాపకర్మ చేసినవాడు దుఃఖమును అనుభవించును. పుణ్యకర్మ చేసినవాడు సుఖము అనుభవించును. మరణానంతరము యమదూతలు వచ్చి పాపాత్ముని దుర్గమ మార్గము ద్వారా యమపురిలోనికి దక్షిణ మార్గము ద్వారా తీసికొనిపోయి యమధర్మరాజు ఎదుట నిలుపుదురు. ఆ యమదూతలు చాల భయంకరముగ నుందురు. ధర్మాత్ములను మాత్రము పశ్చిమాది ద్వారముల ద్వారా తీసికొని పోవుదురు. యముని ఆజ్ఞ ప్రకారము పాపాత్ములు నరకమునందు పడవేయ బడుదురు. వశిష్ఠాది ఋషులు బోధించిన ధర్మమును ఆచరించువారిని స్వర్గమునకు తీసికొని పోవుదురు. గోహత్య చేసిన వాడు ‘మహావీచి’ నరకమునందు ఒక లక్ష సంవత్సరములు బాధలను అనుభవించును. బ్రహ్మహత్య చేసినవారు చాల ఉష్ణమైన ‘తామ్రకుంభ’ నరకమునందు పడద్రోయ బడుదురు. భూమిని అపహరించిన పాపాత్మునకు రౌరవాది నరకమునందు మహా ప్రళయము వరకును మెల్లమెల్లగ దుస్సహమైన పీడ కల్గింపబడును. స్త్రీ, బాల, వృద్ధులను చంపిన పాపాత్ములు పదునలుగురు ఇంద్రుల రాజ్యము పూర్తి అగునంత కాలము మహా రౌరవమను రౌద్రమైన నరకము నందు బాధ అనుభవింతురు. ఇతరుల ఇళ్లను, పొలములను తగులబెట్టిన వారిని ఒక కల్పమువరకు మహారౌరవ నరకమునందు కాల్చివేయుదురు. దొంగతనము చేయువారు తామిస్రమను నరకము నందు బాధలను అనుభవింతురు. పిదప యముని అనుచరులు వానిని బల్లెములతో పొడుచు చుందురు, ‘మహాతామిస్ర’నరకమున సర్పముల చేతను జలగలచేతను పీడింతురు. మాతృహత్యాది పాపములు చేసినవారిని అసిపత్ర వనమను నరకమునందు పడవేయుదురు. అచట వాని అవయవములను కత్తులతో, ఈ భూమి ఉన్నంతవరకును, ఛేదించు చుందురు. ఈ లోకమునందలి ఇతర ప్రాణుల హృదయములు కాల్చినవారిని అనేక కల్పముల వరకును ‘కరంభవాలుక’ అను నరకమునందు వేడిగానున్న ఇసుకపై వేయించెదరు. ఇతరులకు పెట్టకుండ మృష్టాన్నమును తిన్నవాడు ‘కాకోల’మను నరకము నందు పురుగులను, రెట్టలను తినుచుండును. పంచ మహా యజ్ఞములను, నిత్య కర్మలను త్యజించువాడు కుట్టలమను నరకము నందు మూత్రమును, రక్తమును త్రాగుచుండును. అభక్ష్య వస్తువులు భక్షించువాడు మహాదుర్గంధ మయమగు నరకములో పడి రక్తమును ఆహారముగ గొనును.

ఇతరులకు కష్టము కలిగించువాడు తైలపాక నరకమునందు తిలలవలె నలుగగొట్టబడును. శరణాగతుని చంపినవాడుగూడ తైలపాక నరకమునందు పక్వము చేయబడును. యజ్ఞమునకై ఏదైన ఒక వస్తువు నిచ్చెదనని చెప్పి, ఇవ్వనివాడు ‘నిరుచ్ఛ్వాస’ నరకమును పొందును. రస విక్రయము చేయువాడు ‘వజ్రకటాహ నరకమునందును, అసత్యములు ఆడువాడు ‘మహాపాత’ నరకమునందును పడవేయబడును,

పాపాత్ముడు ‘మహాజ్వాల’ నరకమునందును, అగమ్యాగమనము చేసినవాడు. ‘క్రకచము’ నందును, వర్ణసంకర సంతానోత్పత్తి చేసినవాడు ‘గుడపాకము’ నందును, ఇతరుల మర్మ స్థానములందు బాధకలిగించినవాడు ‘ప్రతుదము’ నందును, ప్రాణిహింస చేయువాడు క్షారహ్రదము’ నందును, భూమి అపహరించినవాడు ‘క్షురధారా’ నరకము నందును, గో స్వర్ణాపహారి ‘అంబరీషము’ నందును, వృక్షములను ఛేదించువాడు ‘వజ్రశస్త్రము’ నందును, మధువు దొంగిలించినవాడు  పరీతాపము’ నందును, ఇతరుల సొత్తు అపహరించినవాడు ‘కాలసూత్రము’ నందును, అధికముగా మాంసమును తినువాడు ‘కశ్మలము’ నందును, పితరులకు పిండ ప్రదానము చేయనివాడు ‘ఉగ్రగంధము’ నందును యమభటులచే పడద్రోయబడును. లంచము తీసికొనువాడు ‘దుర్ధర నరకమునందును, నిరపరాధులను బంధించిన వానిని ‘లోహమయ మంజూష’ అను నరకమందును వేద నిందకుని ‘అప్రతిష్ఠము’ నందును అబద్ధపు సాక్ష్య మిచ్చువానిని ‘పూతివక్త్రము’ నందును, ధనము అపహరించినవానిని ‘పరిలుంఠము’ నందును, బాలస్త్రీ, వృద్ధులను చంపిన వానిని, బ్రాహ్మణ పీడకుని ‘కరాలము’ నందును, మద్యపానము చేయు బ్రాహ్మణుని ‘విలేపము’ నందును, మిత్రులందు భేదభావము కలిగించు వానిని ‘మహా ప్రేతము’ నందును పడద్రోయుదురు. పరస్త్రీగామియగు పురుషుడును, అనేక పురుషగామినియగు స్త్రీయు ‘శాల్మలము’ అను నారకమునందు కాలుచున్న లోహము ఆకారములో ఉన్న ఆ ప్రియురాలిని, లేదా ప్రియుని ఆలింగనము చేసికొనవలసి వచ్చును. పరస్త్రీలను కుదృష్టితో చూచిన వాని కండ్లు పీకివేయుదురు. మాతా, పుత్రీగామిని కణకణలాడుచున్న నిప్పులపై పడద్రోయుదురు. చోరులను ఛురికతో భేదింతురు. మాంస భక్షణము చేయు నరపిశాచులకు వారి మాంసమే కోసి తినిపింతురు. మాసోపవాసము గాని, ఏకాదశీ వ్రతముగాని, భీష్మ పంచక వ్రతము గాని చేయువాడు నరకములకు వెళ్ళడు. (203)