అగ్ని మహా పురాణము
నానాదాన వర్ణనము
అగ్ని దేవుడు చెప్పెను:
వశిష్ఠా! పది గోవులున్నవాడు ఒక గోవును, నూరు గోవులున్నవాడు పది గోవులను, వెయ్యి గోవులున్న వాడు నూరు గోవులను దానము చేయగా వారికి లభించు ఫలము సమముగనే ఉండును. కుబేరుని రాజధానియగు అలకాపురి యందు ఉన్న సువర్ణ నిర్మిత భవనమున గంధర్వులును, అప్సరసలును విహరించుచుందురు. సహస్ర గోదానము చేసినవాడు అచటికి వెళ్లును. శత గోదానములు చేసినవాడు నరక సముద్రము నుండి విముక్తుడగును. వత్సదానము చేసినవాడు స్వర్గమున పూజింపబడును. గోదానము చేయుటచే దీర్ఘాయురారోగ్య సౌభాగ్యములు లభించును. స్వర్గము ప్రాప్తించును. ఈ క్రింది మంత్రము చదువుచు మహిషీ దానము చేయుటచే సౌభాగ్యము లభించును. ‘ఇంద్రాది లోకపాలుల మంగళమయ రాజమహిషియైన దేవి ఈ మహిషీదానము చేసిన పుణ్యముచే నాకు సకలాభీష్ట వస్తువులను ఇచ్చుగాక. ఏ మహిషి పుత్రుడు యమధర్మ రాజునకు సహాయుడుగ నియుక్తుడైనాడో, ఏ మహిషి మహిషాసురుని తల్లియో ఆ దేవి నాకు వరములను ఒసంగు గాక! వృషభ దానముచే మనుష్యుడు స్వర్గమును పొందును.
‘సంయుక్త హల పంక్తి’ అను దానము సమస్త ఫలప్రదము. కఱ్ఱతో తయారుచేసిన పది నాగళ్ళ పంక్తిని సువర్ణమయమగు పట్టికతో ఒకదానితో ఒకటి కట్టవలెను. ఒక్కొక్క హలముతో ఆవశ్యక సంఖ్యలో వృషభములు ఉండవలెను. వాటి దానము ‘సంయుక్త హలపంక్తి దానము’. ఈ దానము చేసినవాడు స్వర్గమున పూజించబడును. జ్యేష్ట పుష్కర తీర్థమునందు పది కపిలగోవుల దానము చేసినచో దాని ఫలము అక్షయము. వృషోత్సర్గము చేతగూడ అక్షయఫలము లభించును. ఆబోతుకు చక్ర, త్రిశూల ముద్రలు వేసి-‘దేవేశ్వరా! నీవు సాక్షాత్తు నాలుగు పాదములు గల ధర్మ దేవతవు. ఈ నాలుగు నీ ప్రియతములు. పితృ, మనుష్య, ఋషులను పోషించు ఓ వేదమూర్తియైన వృషభమా! నిన్ను విడచుటచే నాకు అమృతమయములగు శాశ్వతలోకములు ప్రాప్తించుగాక. దేవ, భూత, పితృ, ఋణముల నుండి విముక్తుడనగుదును గాక. నీవు సాక్షాత్తు ధర్మము, నిన్ను ఆశ్రయించు వారికి కలుగుగతి నాకు ప్రాప్తించు గాక’ అని పఠించుచు విడువవలెను. మృతుని ఏకా దశ, షాణ్మాసిక, వార్షిక శ్రాద్ధములలో ఒక దానియందు వృషోత్సర్గము చేసినచో అతడు ప్రేతలోకము నుండి విముక్తుడగును. పది హస్తముల దండములు మొదలు ముప్పది హస్తముల దండములకు సమానమైన భూమి ‘నివర్తనము ; పది నివర్తనముల భూమి ‘గోచర్మము’. అంతభూమి దానము చేసినవాడు తన సమస్త పాపములను నశింపచేసి కొనును. గో, భూ, సువర్ణ యుక్త కృష్ణ మృగ చర్మమును దానము చేసినవాడు ఎన్ని పాపములు చేసినవాడైనను, బ్రహ్మసాయుజ్యమును పొందును. తిలలతోను, మధువుతోను నింపిన పాత్రను, మగధ దేశీయ మానానుసారము ఒక ప్రస్థము కృష్ణ తిలలను దానము చేయవలెను. దీనితోపాటు ఉత్తమమగు శయ్యను కూడ దానము చేయుటచే దాత భుక్తిముక్తులను పొందును.
స్వర్ణముతో తన ప్రతిమ చేయించి దానము చేయువాడు స్వర్గమును పొందును. విశాలమగు ఇల్లు కట్టించి దానముచేయువాడు భోగమోక్షములను పొందును. గృహమును, మఠమును, ధర్మశాలను, ఆవాస స్థానమును దానము చేసినవాడు స్వర్గమున సుఖములను అనుభవించును. గోశాల నిర్మించి దానము చేయువాడు పాపరహితుడై స్వరము పొందును. యమునికి సంబంధించిన మహిషమును దానము చేసినవాడు పాపరహితుడై స్వర్గము పొందును. దేవతా సహితులగు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మధ్య పాశధారియగు యమదూత మూర్తి స్థాపించి ఆ యమదూత శిరస్సు ఖండించి ఆ మూర్తితో కూడిన మండలమును బ్రాహ్మణునకు దానము చేయవలెను. ఇట్లు చేయుటచే దాత స్వర్గమునకు వెళ్లును గాని, ఆ ‘త్రిముఖ’ మను దానము పట్టిన బ్రాహ్మణునకు పాపము సంక్రమించును. వెండి చక్రమొకటి చేయించి, దానిని నీటిలో నుంచి దాని నిమిత్తము హోమములు చేసి, దానిని బ్రాహ్మణునకు దానముచేసినచో అది ‘కాలచక్ర దానము’. తన బరువుతో సమానమైన బరువుగల ఇనుము దానము చేయువాడు నరకమున పడడు. ఏబది పలముల లోహదండమును వస్త్రము చుట్టి దానము చేయువానికి యమదండ భయముండదు. దీర్ఘాయువును కోరువాడు మృత్యుంజయుని ఉద్దేశించి ఫలములు, మూలములు, ద్రవ్యము అన్నింటిని ఒక్కసారిగాని, వేరువేరుగా గాని దానము చేయవలెను. కృష్ణతిలలతో పురుషుని చేసి వెండి దంతములు, బంగారు కళ్లు అమర్చవలెను. మాలను ధరించి దీర్ఘాకారముతో నున్న ఆ పురుషుని కుడిచేతిలో ఎత్తిన ఖడ్గ ముండవలెను. ఎఱ్ఱని వస్త్రములు, జపాపుష్పములు, శంఖమాల ధరించి యుండవలెను. రెండు పాదములందు పాదుకలు, పార్వ్శమున నల్లని కంబళి ఉండవలెను. ఎడమ చేతిలో మాంసపిండము ఉండవలెను. ఈ విధముగ కాలపురుషుని నిర్మించి గంధాది ద్రవ్యములచే పూజించి, బ్రాహ్మణునకు దానము ఈయవలెను. ఇట్లు చేసిన దాత వ్యాధి మృత్యురహితుడై రాజరాజేశ్వరుడగును. బ్రాహ్మణునకు రెండు ఎద్దులు దానము చేసినవాడు భుక్తి ముక్తులను పొందును.
సువర్ణ దానమును చేయువానికి అభీష్టవస్తు సిద్ధి యగును. సువర్ణ దానము సఫలమగుటకు వెండి దక్షిణగా ఇవ్వవలెను. అన్యదానముల సాద్గుణ్యము నిమిత్తము సువర్ణ దక్షిణ మంచిది. సువర్ణమే కాక రజతము, తామ్రము, తండులములు ధాన్యములు కూడ దక్షిణకు తగినవి. నిత్య శ్రాద్ధ నిత్య దేవపూజాదు లందు దక్షిణ ఇవ్వవలసిన పనిలేదు. పితృకార్యమునందు రజత దక్షిణ ధర్మార్థకామప్రదము. భూమి దానము చేసిన శాంతచిత్తుడు పితృలోకములో నున్న పితృ దేవతలను, దేవలోకములో నున్న దేవతలను గూడ పూర్తిగా సంతృప్తిపరచును. సస్యములతో నిండియున్న చిన్నపల్లె, గ్రామము, ఖర్వటము, నూరు నివర్తనముల ప్రమాణము లేదా దానిలో సగము ప్రమాణ మున నిర్మించిన గృహాదికము గోచర్శ ప్రమాణముగల (పది నివర్తనములు) భూమి దానము చేసినవాడు అన్నియు పొందును. తైల బిందువు నీటిపైగాని, భూమిపైగానిపడి వ్యాపించి నట్లు అన్ని దానముల ఫలము ఒక జన్మవరకును ఉండును. స్వర్గ, భూ, గౌరీకన్యా దాన ఫలము ఏడు జన్మల వరకును స్థిరముగా నుండును. కన్యాదానము చేసినవాడు ఇరువది యొక్క తరములను నరకము నుండి ఉద్ధరించి, బ్రహ్మ లోకమును పొందును. దక్షిణా సహితముగ గజదానము చేసినవాడు పాపరహితుడై స్వర్గమును చేరును. అశ్వదానము చేయుటచే దీర్ఘాయురారోగ్య సౌభాగ్య, స్వర్గములను పొందును. శ్రేష్ఠ బ్రాహ్మణులకు దాసీదానము చేయువాడు అప్సర స్త్రీలలోకమున సుఖములు అనుభవించును. ఐదువందల పలములు లేదా రెండు వందల ఏబది పలములు, నూట ఇరువదియైదు పలములు లేదా వాటిలో సగము పలములు బరువుగల తామ్రపాత్రను దానము చేసినవాడు భుక్తి ముక్తులను పొందును.
వృషభ సహిత శకట దానము చేసినవాడు విమానముపై స్వర్గమునకు వెళ్లును. వస్త్రదానముచే ఆయురారోగ్యములు, అక్షయ స్వర్గ ప్రాప్తి కలుగును. ధాన్యము, గోధుమలు, అగ్రహాయణీ తండులములు, జొన్నలు మొదలగునవి దానము చేయువాడు స్వర్గము పొందును. ఆసనము, ధాతు నిర్మిత పాత్రను, లవణము, సుగంధి చందనము, ధూపదీప ములు, తాంబూలము, ఇనుము, వెండి, రత్నములు, వివిధ, దివ్య పదార్థములు దానము చేయువాడు భుక్తి ముక్తులను పొందును. తిలలను-తిలపాత్రను దానము చేసినవాడు స్వర్గసుఖము పొందును. అన్నదానమును మించిన దానమేదియు లేదు, ఉండబోదు. గజ, అశ్వ, రథ, దాసదాసీ, గృహాదుల దానము అన్నదానము యొక్క పదహారవ కళకు కూడ సరితూగవు. మహాపాపములు చేసినవాడు కూడ అన్నదానము చేసినచో ఆ పాపములు అన్నింటి నుండియు విముక్తుడై అక్షయ లోకములను పొందును. జలమును, పానపాత్రను దానముచేసినవాడు భుక్తి ముక్తులను పొందును. శీతకాలమునందు మార్గ మధ్యాదులందు అగ్నిని, కట్టెలను ఇచ్చువాడు తేజోయుక్తుడై స్వర్గమునందు దేవతా, గంధర్వాప్సరాదులచే సేవింపబడును. ఘృతతైల లవణదానము చేసిన వానికి అన్నియు లభించును. ఛత్ర, పాదుకా, కాష్ఠాదులను దానము చేసినవాడు స్వర్గములో సుఖముగ నివసించును. ప్రతిపదాది పుణ్య తిథులందును, విష్కంభాది యోగములందును, చైత్రాది మాసములందును, సంవత్సర ఆరంభము నందును, అశ్వన్యాది నక్షత్రములందును, విష్ణు, శివ, బ్రహ్మ లోకపాలాదులను అర్చించి చేసిన దానము మహా ఫలప్రదము. వృక్ష, ఉద్యాన, భోజన, వాహనాదులను, పాదములకు మర్దించుటకై తైలాదికమును ఇచ్చిన మానవుడు భుక్తి ముక్తులను పొందును.
గోదాన, విద్యాదాన, భూ దానములు మూడును సమాన ఫలములు. వేదవిద్యా దానము చేసినవాడు పాపరహితుడై బ్రహ్మలోకమునందు నివసించును. యోగ్యుడై శిష్యునకు బ్రహ్మజ్ఞానము ఇచ్చినవాడు సప్తద్వీప సమన్వితయగు భూమిని దానము చేసినట్లే. సకల ప్రాణులకును అభయ దానము చేసినవాడు సర్వమును పొందగల్గును. పురాణమునుగాని, మహాభారతమును గాని, రామాయణమునుగాని వ్రాసి ఆ పుస్తకము దానము చేసినవాడు భుక్తి ముక్తులను పొందును. వేదాదికములను నృత్యగీతములను నేర్పిన వాడు స్వర్గము పొందును. ఉపాధ్యాయునకు వృత్తిని, విద్యార్థులకు భోజనమును ఏర్పరిచిన వాడు ధర్మకామాది పురుషార్థముల రహస్యము తెలిసినవాడు; అతడు చేయని దానము ఏమున్నది? విద్యా దానము చేసినవాడు సహస్ర వాజపేయములను విధి పూర్వకముగ దానము చేయుటచే ఎట్టి ఫలము లభించునో అంత ఫలమును పూర్తిగ పొందును. సందేహమేమాత్రములేదు. శివ, విష్ణు, సూర్య దేవాలయములలో గ్రంథ ప్రవచనము చేయు వానికి సకల దానఫలములు లభించును.
త్రిలోకములలో ఉన్న బ్రాహ్మణాది వర్ణములును, బ్రహ్మచర్యాది ఆశ్రమములును, బ్రహ్మాది దేవగణములును విద్యాదానమునందు ప్రతిష్ఠితములై యున్నవి. విద్యయే కామధేనువు; విద్యయే నేత్రము; గాంధర్వాద్యుప వేదములు దానము చేసినవాడు గంధర్వులతో కలిసి ఆనందించును. వేదాంగముల దానముచే స్వర్గమును పొందును. ధర్మశాస్త్ర దానముచే ధర్మ సన్నిధి చేరి ఆనందించును. సిద్ధాంతముల దానము చేసినవాడు నిస్సంశయముగ మోక్షమును పొందును. పుస్తక దానముచే విద్యాదానఫలము లభించును. అందుచే శాస్త్రపురాణముల దానము చేసినవాడు సర్వమును పొందును. శిష్యులకు శిక్షాదానము చేసినవాడు పౌండరీక యాగము చేసిన ఫలము పొందును.
జీవికా దానఫలము అనంతము. పితరులకు అక్షయ లోకావాప్తి కోరువాడు, ఈ లోకమునందు సర్వ శ్రేష్ఠములైన వస్తువులను, తనకు ప్రియమగు సకల పదార్థములను పితరులను ఉద్దేశించి దానము చేయవలెను. బ్రహ్మ, విష్ణు, శివ, దేవీ, గణేశాదుల పూజచేసి ఆ పూజా ద్రవ్యములన్నింటిని బ్రాహ్మణునకు దానముచేయువాడు సర్వమును పొందగలడు. దేవాలయములను కట్టించువారును, దేవప్రతిమలు నిర్మించువారును సమస్తమైన అభిలషిత వస్తువులను పొందగలరు. దేవాలయములలో తుడిచి కడుగువాడు పాపరహితుడగును. దేవప్రతిమకు ఎదురుగ వివిధ మండలముల నిర్మాణము చేయువాడు మండలాధిపతి యగును. దేవతలకు గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్య, ప్రదక్షిణ, ఘంటా, ధ్వజ, వస్త్రాదులను సమర్పించుట చేతను, దేవతా దర్శనము చేతను, దేవతా సమక్షమున నాట్య గానములు చేయుటచేతను మనుష్యుడు భుక్తిని ముక్తిని కూడ పొందును. భగవంతునకు కస్తూరి, సింహళదేశీయ చందనము, ఆగురు, కర్పూరము, ముస్తాది సుగంధ ద్రవ్యములు, విజయ గుగ్గులు సమర్పించవలెను. సంక్రాంత్యాది దినములందు ఒక ప్రస్థము నేతితో స్నానము చేయించు వాడు అన్నియు పొందును. నూరు పలములతో స్నానము, ఇరువది యైదు పలములతో అభ్యంగము, వేయి పలములతో మహాస్నానము చేయించవలెను. భగవంతునకు జలస్నానము చేయించుటచే పది అపరాధములు, దుగ్ధ-దధులతో స్నానము చేయించుటచే సహస్ర అపరాధములు, ఘృత స్నానము చేయించినచో వెయ్యి అపరాధములు వినష్టములగును. దేవతలను ఉద్దేశించి దాసదాసులను, అలంకారములను, భూమిని, గజాశ్వములను, సౌభాగ్య ద్రవ్యములను సమర్పించు వాడు దీర్ఘాయుర్యుక్తుడై స్వర్గలోకమును పొందును. (211)
