అగ్ని మహా పురాణము

Table of Contents

స్తంభనాది మంత్రములు నిరూపణము

అగ్నిదేవుడు పలికెను:

ఇపుడు స్తంభనమోహన వశీకరణ, విద్వేషణ ఉచ్చాటన ప్రయోగములను విషవ్యాధి ఆరోగ్య మారణ శమన ప్రయోగములను చెప్పెదను. భూర్జ పత్రముపై ఆరు అంగుళముల కూర్మ చక్రమును తాడనముతో వ్రాయవలెను. దాని ముఖము నందును, పాదములందును మంత్ర న్యాసము చేయవలెను. పాదములందు క్రీం, ముఖము నందు ‘హ్రీం’, గర్భ స్థానమున త్వరితా విద్యను వ్రాసి పృష్ఠ భాగమున సాధ్య నామము వ్రాయవలెను. మాలా మంత్రములతో వేష్టితముచేసి ఆ యంత్రమును ఇటుకపై స్థాపించి దానిని కప్పి, కూర్మ పీఠము నందున్న కరాళ మంత్రముతో అభిమంత్రించవలెను. మహా కూర్మమును పూజించి శత్రువును ఉద్దేశించి చర్మోదకమును చిమ్మి, శత్రువును స్మరించుచు, వానిని ఏడు పర్యాయము ఎడమ పాదముతో తన్నవలెను. అపుడు శత్రువునకు ముఖ భాగ స్తంభనము కలుగును.

భైరవమూర్తి వ్రాసి దాని నలువైపుల ‘ఓం శత్రు ముఖ మొదలు, ‘స్వాహా’ వరకును వున్న మూలోక్త మంత్రమును వ్రాయవలెను. పిదప ఫట్ అనియు ప్రయోగోద్దేశ్యమును వ్రాసి ఆ మంత్రమును జపించుచు, భైరవుని వామహస్తమున సగమును దక్షిణ హస్తమున శూలమును వ్రాసి అఘోర మంత్రమును వ్రాయవలెను. దీనివలన యుద్ధమునందు శత్రువులు స్థంభింతులు ఆగుదురు. ‘ఓం నమో భగవత్యై మొదలు స్వాహా వరకును ఉన్న మూలోక్త మంత్రమును జపించుచు, గోరోజనాదికముతో తిలకము ధరించినచో మానవుడు సమస్త జగత్తును మోహింపచేయును. “ఓం, ఫేం’ మొదలు స్వాహావరకును వున్న మూలోక్త మంత్రముతో తిలకము ధరించినవాడు రాజాదులను వశము చేసుకొనును. గర్దభధూళి తీసుకుని శవముపై వేసిన పువ్వులు స్త్రీ రజోయుక్త వస్త్ర ఖండము తీసుకొని రాత్రి శత్రువు శయ్యాదులపై విసరినచో స్వజన విద్వేషము కలుగును. ఆవు డెక్క, కొమ్ము గుర్రపుడెక్క సర్పశిరస్సు వాటిని నూరి కలిపి శత్రువు ఇంటి పై వేసినచో వారి ఉచ్చాటనము కలుగును. పచ్చని కరవీరశిఫ, మారణ ప్రయోగమునందు ఉపయుక్తమైనది. సర్పము, రక్తము, చుంచురక్తము కరవీర బీజము, మారణ సాధకములు. చచ్చినతొండ, తుమ్మెద పీత, తేలు, వీటిని చూర్ణముచేసి తైలములో వేసి ఆ తైలమును శరీరమునకు పూసినచో కుష్టు రోగము కలుగును.

‘ఓం నవ గ్రహాయ’ మొదలు స్వాహా వరకును వున్న మూలోక్త మంత్రమును భూర్జ పక్షముపై కాని నవగ్రహ ప్రతిమపైగాని వ్రాసి నూరు జిల్లేడు పూవులతో పూజించి ఆ యంత్రమును శ్మశానమున పాతినచో గ్రహములు శత్రువును నశింపచేయును. ‘ఓం కుంజరీ’ మొదలు ‘గృహ్ణత’ వరకునువున్న మూలోక్తమంత్రమును భూర్జ పత్రముపై వ్రాసి శత్రుపద స్థానమున శత్రునామము వ్రాసి శ్మశానము నందు ఆ యంత్రమును పూజించినచో శత్రువు నశించును. (315)