అగ్ని మహా పురాణము
గీతాసారము
అగ్నిదేవుడు పలికెనుః సర్వ గీతలలో ఉత్తమోత్తమమగు గీతాసారమును చెప్పెదను. పూర్వము శ్రీకృష్ణుడు భుక్తి ముక్తి ప్రదమగు ఈ గీతను అర్జునునకు బోధించెను. శ్రీ భగవానుడు చెప్పెను. జీవుడు జన్మ రహితుడు కావున మరణించినవానిని గూర్చిగాని, జీవించియున్న వానిని గూర్చిగాని శోకము చెందరాడు. ఆత్మజర, మరణములు లేనిది, భేద్యము కానిది. అందువలన శోకాదికమును విడువవలెను. విషయములను గూర్చి ఆలోచించువానికి వాటిపై సంగమేర్పడును. సంగమువలన కామము, దానివలన క్రోధము, దానివలన సమ్మోహము, దాని వలన స్మృతి భ్రంశము, దానివలన బుద్ధినాశము కలుగును. బుద్ధి నాశము వలన మానవుడు నశించును. సత్సంగము వలన దుస్సంగ హానియు కలుగును. మోక్షమందు కోరిక కలవాడు ఇతర కామములను తొలగించుకొనును. కామము త్యజించినవాడు ఆత్మ నిష్టుడగును. అపుడాతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. సర్వ భూతములకు యేది నిశయో దానిలో యోగి మేల్కొనియుండును. చూచుచున్న మునికి ఏది రాత్రియో దాని యందు ఇతర భూతములు మేల్కొని యుండును. ఆత్మ సంతుష్టుడైన వానికి మరి కర్తవ్యము లేమియు ఉండవు. కర్మ చేసినను చేయకున్నను ఆతనికి ప్రయోజనమేమియు లేదు. ఓ మహాబాహు! గుణ కర్మ విపాక తత్త్వము తెలిసినవాడు గుణములు, గుణములందు ప్రవర్తించుచున్నవని తెలిసికొని వాటిపై సక్తుడుకాడు. పాపమునంతను జ్ఞాన మనెడు నావతో దాటగలవు. అర్జునా! జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మము చేయును. సంగము విడిచి కర్మలను బ్రహ్మార్పణ బుద్ధితో చేయువాడు పద్మ పత్రము, జలముచేత వలె పాపము చేతలిపుడు కాడు. యోగ యుక్తాత్ముడగు యోగి అంతటను సమ ముగా చూచుచు సర్వ భూతముల యందు తనను తనలో సర్వ భూతములను చూడగలుగును. యోగ భ్రష్టుడు పవిత్రులగు శ్రీమంతుల గృహమునందు జనించును. కల్యాణ కార్యము చేసిన వాడెవ్వడును దుర్గతి పొందడు.
గుణమయమైనదియు, దివ్యమైనదియు అగునా మాయ లంఘింప శక్యముకానిది. నన్ను ఎవరు ఆశ్రయించరో వారు ఈ మాయను దాటలేరు, ఓ భరత వంశశ్రేష్టా! కష్టములలో ఉన్నవాడు, జిజ్ఞాసువు, ప్రయోజనాపేక్ష కలవాడు, అద్వైత దృష్టిగల జ్ఞాని ఈ నాలుగు విధములగు వారు నన్ను సేవింతురు. అక్షరమైన బ్రహ్మ అత్యుత్తమము. స్వభావము భూతము పురుషుడు అధి దైవతము, ఈ దేహములో నేనే అధి యజ్ఞమును. మరణ కాలమున నన్ను స్మరించువాడు నన్నే పొందును. సంశయము లేదు. అంతమున ఏయే భావమును స్మరించుచు దేహము విడుచునో దానినే పొందును. అంతమున ప్రాణమును భ్రూమధ్యము నందుంచి, పరమాత్ముడనగు నన్ను పొందును. ‘ఓం’ అను ఏకాక్షర రూపమగు బ్రహ్మను ఉచ్చరించుచు, దేహము త్యజించువాడు నన్నే పొందును. బ్రహ్మ మొదలు స్తంభమువరకు ఉన్న అన్నియునా విభూతులే. శ్రీమంతములు తేజోవంతము లగు ప్రాణులు అన్నియును నా అంశములే. నేనే విశ్వ రూపుడను. ఈ విధముగ తెలుసు కొనినవాడు ముక్తుడగును.
క్షేత్రమను పేరుగల ఈ శరీరమును తెలుసుకొనువాడు క్షేత్రజ్ఞుడు. క్షేత్ర క్షేత్రజ్ఞుల జ్ఞానము నా జ్ఞానమే. మహాభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, ఏకాదశ ఇంద్రియములు, పంచ ఇంద్రియ విషయములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూలశరీరము, చేతనా, ధృతి ఇవి సంక్షిప్తముగ వికార సహితమగు క్షేత్రము. అభిమానము లేకుండుట, దంభము లేకుండుట, అహింసా, ఓర్పు, ఆర్జవము, ఆచార్యోపాసనము, శౌచము, స్థైర్యము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియార్థములందు వైరాగ్యము, అహంకారము లేకుండుట, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ రూపములగు దోషముల పరిశీలనము, అనాసక్తి, పుత్రదార గృహాదులందు మమకారము లేకుండుట, ఇష్టా నిష్టములు కలిగినపుడు నిత్యము సముచిత్తుడై ఉండుట, ఇతర సంబంధము లేక నాపై చలించని భక్తి, నిర్జన ప్రదేశమును సేవించుట, జన సమూహమునందు అనాసక్తి, అధ్యాత్మ జ్ఞానములందు స్థిరత్వము తత్త్వజ్ఞాన దర్శనము. ఇది యంతయు జ్ఞానమని చెప్పబడును. దీనికి విరుద్ధమైనది అజ్ఞానము.
దేనిని తెలుసుకొనుటచే మానవుడు అమృతత్త్వమును పొందునో దానిని గురించి చెప్పెదను. పరబ్రహ్మ అనాది. సత్త్వ స్వరూపము. అది అంతటను పాణి పాదములుకలది. అన్ని వైపులను నేత్ర, శిరో, ముఖములు కలది. అన్ని వైపులను కర్ణములు కలది. సర్వమును ఆవరించియుండును. సకలేంద్రియ గుణములను భాసింపచేయునది. సకలేంద్రియ శూన్యము. అది సంగ రహితము, సర్వమును భరించునది. నిర్గుణము, గుణములను అనుభవించునది. భూతముల బయటను, లోపలను వున్నది. ఇది అచరము. చరముకూడ. సూక్ష్మమగుటచే ఇది అవిథేయము. ఇది దూరమునందు ఉన్నది. సమీపమునందును ఉన్నది, భూతములందు అవిభక్తమైనను విభక్తమువలె ఉండునది. భూతములను భరించునది, వాటిని మ్రింగివేయునది. ఇది జ్యోతిస్సులకు జ్యోతిస్సు. తమోఽతీతము. జ్ఞాన, జ్ఞేయ స్వరూపము, జ్ఞాన గమ్యము. అందరి హృదయములందు ఉన్నది. కొందరు ఈ ఆత్మను ధ్యానముచే తమ అంతఃకరణమునందే చూచెదరు. కొందరు సాంఖ్య యోగము చేతను, కొందరు కర్మయోగము చేతను చూచెదరు. ఈ విధముగా తెలియజాలని వారు ఇతరుల నుండి విని ఉపాసింతురు. శ్రుతి పరాయణులగు వారు కూడ మృత్యువును తప్పక తరింతురు.
సత్త్వము వలన జ్ఞానము, రజస్సు వలన లోభము, తమస్సు వలన ప్రమాదమోహ అజ్ఞానములు పుట్టును. గుణములు వాటివాటి పనులను చేయుచున్నవి అని తెలుసుకొని జ్ఞాని తాను చలించడు. మాన అవమాన మిత్ర శత్రువుల విషయమున తుల్యముగ ఉండు ఆ త్యాగి గుణాతీతుడు. ఈ అశ్వత్థము ఊర్ధ్వ మూలము, అధశ్శాఖము, వినాశ రహితము. దీనికి ఛందస్సులు వర్ణములు అని ఎవ్వడు తెలుసుకొనునో అతడే వేదవేత్త. ఈ లోకమున దైవము, ఆసురము అని రెండు భూత సర్గములు ఉన్నవి. దైవీ సంపత్తి వలన మానవులకు అహింసా, క్షమా మొదలగునవి ఉండును. అసురీ సంపద వలన శౌచము కాని, ఆచారము కాని వుండదు. క్రోధ లోభ కామములే నరకము. అందుచే ఆత్రయమును త్యజింపవలెను సత్వాది గుణములను బట్టి యజ్ఞతపోదానాదులు త్రివిధములుగా వుండును.
ఆయుఃసత్త్వ, బల, ఆరోగ్య, సుఖకరమగు, అన్నము సాత్త్వికము. దుఃఖము, శోకము, ఆమయము కల్గించు తీక్ష్ణరూక్షాన్నము రాజసము. అమేధ్యము ఉచ్ఛిష్ట, పూతి, నీరసమగు అన్నము, తామసము, నిష్కామముగా విధి పూర్వకముగా చేయు యజ్ఞము సాత్త్వికము. ఫలాపేక్షచే దంభమున చేయు యజ్ఞము రాజసము. శ్రద్ధా మంత్రాదివిధి పూర్వకముగ చేయు తపస్సు శారీరము. దేవపూజా, అహింసాదికము, వాఙ్మయ తపస్సు. ఇతరులకు బాధను కల్గించనిది సత్యము ఐన వాక్యము. స్వాధ్యాయము జపము. ఇది కూడ వాఙ్మయ తపస్సు. చిత్త సంశుద్ధి కొరకై మౌనమును అవలం బించుట మానస తపస్సు. దీనికే ఆత్మ వినిగ్రహమని పేరు. ఫలాపేక్ష లేని తపస్సు సాత్త్వికము. ఫలాదులకై చేయునది రాజసము. పరపీడకై చేయునది తామసము. యుక్త దేశాదులందు చేయు దానము సాత్త్వికము. ప్రయోజనమును ఉద్దేశించు దానము రాజసము. అయుక్త దేశాధులందు అనాదర పూర్వకముగా చేయు దానము తామసము.
బ్రహ్మ యొక్క నిర్దేశము, ఓం, తత్, సత్ అని త్రివిధము. మానవులకు యజ్ఞ దానాది కర్మలు భుక్తి ముక్తి ప్రదములు. అనిష్టము, ఇష్టము, మిశ్రము అని త్రివిధమగు కర్మ ఫలము, త్యాగ రహితులకే మరణానంతరము కలుగును. సన్యాసులకు ఎన్నడును కలుగదు. కర్మ సంయోగము, మోహము, క్లేశము, భయము మొదలగు దానివలన చేయు నది తామసకర్మ. కామము లేకుండా చేయునది సాత్త్విక కర్మ, తద్భిన్నము రాజసము, అధిష్ఠానము, కర్త వివిధ కరణ జీతము, వివిధ చేష్టలు, దైవము. ఈ ఐదును కర్మ హేతువులు. ఏకత్వ జ్ఞానము సాత్వికము. భేదజ్ఞానము రాజసము. అతాత్త్విక జ్ఞానము, తామసము. అకామ కర్మ సాత్వికము, సకామ కర్మ రాజసము. మోహకృతమగు కర్మ తామసము, సిద్ధ్యసిద్ధులయందు సమముగా ఉండు కర్త సాత్త్వికుడు, తద్భిన్నుడు రాజసుడు. శరుడు అలసుడు అయినవాడు తామసుడు. కార్యాది నిశ్చయము సాత్త్వికము కార్యార్థమైన నిశ్చయము రాజసము. తద్విపరీతము తామసము. మనః స్థైర్యము సాత్త్వికము. ప్రీతి కామము రాజసము. దుఃఖాదికము తామసము. ప్రారంభమున దుఃఖముగ ఉన్నను, చివర సుఖము నిచ్చునది సాత్వికము. ప్రారంభమున సుఖము, అంతమున దుఃఖము అయినది రాజసము. ప్రారంభము నందు అంతమునందు దుఃఖ హేతువైనది తామసము. ఏ విష్ణువు ఈ ప్రపంచమునంతను వ్యాపించి ఉన్నాడో, ఆతడే ఈ భూతముల ప్రవృత్తికి హేతువు. అట్టి విష్ణువును స్వకర్మచే అర్చించి సిద్ధిని పొందును. సర్వావస్థలయందును సర్వకాలములందును మనోవాక్కాయ కర్మలచే బ్రహ్మాది స్తంబ పర్యంతమగు ఈ జగత్తు విష్ణు స్వరూపము అని భావనచేయు భవద్భక్తుడగు భాగవతుడు తప్పక సిద్ధిని పొందును. (381)
