అగ్ని మహా పురాణము

Table of Contents

నృత్యాది అంగకర్మ నిరూపణము

అగ్నిదేవుడు పలికెను:

ఇపుడు చేష్టాది విశేషమును అంగప్రత్యంగములను వాటి కర్మలను చెప్పెదను. దానిని ఆంగిక కర్మ యందురు. ఇది సాధారణముగా స్త్రీ సంశ్రితము. లీలా, విలాస, విచ్ఛిత్తి, విభ్రమ, కిలికించిత, మోట్టాయిత, కుట్టమితా, బిబ్బోక, లలిత, విహృత, క్రీడిత, కేళులుయని అది పండ్రెండు విధములు. ఆవృత ప్రదేశమున ఇష్టజన చేష్టను అనుకరించుట లీల. కొంచెము విశేషమును చూపించునది విలాసము. హాసరోదనాదుల సంకరము కిలికించితము. వికారము బిబ్బోకము, సుకుమార చేష్ట లలితము. శిరస్సు, హస్తములు, వక్షము, పార్శ్వము, కటి, పాదము అని, ఇవి క్రమముగా అంగ ములు, కనుబొమలు మొదలగునవి ప్రత్యంగములు. అంగ, ప్రత్యంగములు, ప్రయత్న జనితమగు చేష్టలేకుండ ప్రయోగము ఎచ్చటను కలుగదు. కొన్నిచోట్ల ముఖ్యముగను కొన్ని చోట్ల వక్ర రూపమునకు అది సాధింపబడును. అకంపిత, కంపిత, ధూత, విధూత, పరివాహిత, ఆధూత, అవధూత, ఆచిత, నికుంచిత, పరావృత, ఉత్క్షిప్త, ఆధోగత లోలితములని శిరః కర్మ పదమూడు విధములు. కనుబొమ్మల చేష్ట ఏడువిధములు. వీటిలో భ్రుకుటీ మొదలగునవి ప్రధానములు. రస, స్థాయి, సంచారి భావముల, సంబంధమును బట్టి దృష్టి మూడు విధములు, దీనికి ముప్పది ఆరు భేదములు కూడ వుండును. అందు రసజ దృష్టి ఎనిమిది విధములు. భ్రమణ చాలనాదికమగు తారకా కర్మ తొమ్మిది విధములు, నాసికా కర్మ ఆరు విధములు. నిశ్వాసము తొమ్మిది విధములు; ఓష్టకర్మ ఆరు విధములు; పాదకర్మ ఆరు విధములు; చిబుక కర్మ ఏడు విధములు; గ్రీవా కర్మ తొమ్మిది విధములు; హస్తకర్మ సాధారణముగ అసంయుతము సంయుతము యని రెండు విధముల ఉండును. పతాక త్రిపతాక, కర్తరీ ముఖ అర్ధ చంద్ర ఉత్కరాళ, శుకతుండ, ముష్టి, శిఖర, కపిత్థ, కటకా ముఖ, సూచ్యాస్య, పద్మకోశ, శిర, మృగశీర్ష, కాంబోల, కాలపద్మ, చతుర, భ్రమర, హంసాస్య హంస పక్ష, సందంశ, ముకుళ, ఊర్శనాభ తామ్ర చూడములని అసంయుత హస్తమునకు ఇరువది నాలుగు భేదములు, అంజలి, కపోత, కర్కట, స్వస్తిక, కటక, వర్గమాన, అసంగ, నిషద, దోల, పుష్పపుట, మకర, గజదంత, బెస్తంభములు యని సంయుత హస్తమునకు పదమూడు భేదములు; సంయుత హస్తమునందు ఇంకను భేదము లుండవచ్చును. వక్షస్థల కర్మ ఆభుగ్న నర్తనాది భేదముచే ఐదు విధములు; ఉదర కర్మ దురతి క్షామ ఖండము, పూర్ణము అని మూడు విధములు; పార్శ్వకర్మలు ఐదు; జంఘా కర్మలు ఐదు; నాట్య నృత్యాదులందు పాదకర్మ అనేక విధములుగా నుండును. (341)