అగ్ని మహా పురాణము

Table of Contents

భారతాఖ్యానము

కృష్ణుని మాహాత్మ్యమునకు లక్షణమైన భారతము చెప్పెదను. విష్ణువు పాండవులను నిమిత్తముగ చేసికొని భూ భారమును హరించెను.

విష్ణువు నాభి కమలమునుండి బ్రహ్మ పుట్టెను. ఆతని పుత్రుడు అత్రి. అత్రికి చంద్రుడు, ఆతనికి బుధుడు, ఆతనికి ఐలుడు, ఆతనికి పురూరవుడు, ఆతనికి ఆయువు, ఆతనికి నహుషుడు, ఆతనికి యయాతి, ఆతనికి పూరువు పుట్టెను. ఆతని వంశమునందు భరతుడు, పిమ్మట కురువును పుట్టిరి. ఆతని వంశమునందు శంతనువు జన్మించెను. ఆతనికి గంగా పుత్రుడైన భీష్ముడు జనించెను. శంతనునకు సత్యవతియందు, భీష్ముని తమ్ములుగా చిత్రాంగద, విచిత్రులు పుట్టిరి.

శంతనుడు స్వర్గస్థుడైన పిమ్మట, భీష్ముడు బ్రహ్మచారిగనే ఉండి సోదరుల రాజ్యము పాలించెను. చిన్నవాడైన చిత్రాంగదుని, చిత్రాంగదుడు అనెడు గంధర్వుడు సంహరించెను. భీష్ముడు శత్రువులను జయించి కాశీరాజు కుమార్తెలైన అంబిక అంబాలికలను తీసికొనివచ్చి విచిత్రవీర్యుని భార్యలుగా చేసెను. విచిత్రవీర్యుడు రాజయక్ష్మ (క్షయ) అను వ్యాధిచే స్వర్గస్థుడయ్యెను.

సత్యవతి అనుమతిచే వ్యాసునివలన అంబికయందు రాజైన ధృతరాష్ట్రుడును అంబాలిక యందు పాండురాజును జనించిరి. ధృతరాష్ట్రుని వలన గాంధారి యందు దుర్యోధనుడు మొదలగు నూర్గురు కుమారులు జనించిరి. పాండురాజు భార్యయైన కుంతి యందు యమధర్మరాజు వలన యుధిష్ఠిరుడును, వాయుదేవుని వలన భీముడును, దేవేంద్రుని వలన అర్జునుడును జనించెను. అశ్వినీ దేవతల వలన మాద్రియందు నకుల, సహదేవులు పుట్టిరి. శతశృంగ ఆశ్రమమునందు ఋషి శాపము పొందిన పాండురాజు, మాద్రీ సంగము చేయుటవలన మరణించెను. మాద్రి సతీ సహగమనముల ద్వారమున ఆతనిని అనుగమించెను. కుంతి అవివాహితయై ఉండగా జనించిన కర్ణుడు దుర్యోధనుని ఆశ్రయించెను.

దైవవశముచే కురుపాండవుల మధ్య వైరము ఏర్పడెను. దుష్టబుద్ధియైన దుర్యోధనుడు లక్క ఇంటిలో పాండవులను కాల్చెను. కాని తల్లితో కూడిన పంచపాండవులు కాలిపోయిన ఇంటి నుండి తప్పించుకొని వెళ్ళిపోయిరి.

పిమ్మట ఆ పాండవులు ఏకచక్ర నగరమునందు మునివేషధారులై ఒక బ్రాహ్మణుని ఇంట నివసించిరి. అచట వారు బకరాక్షసుని చంపిరి.

వారు ద్రౌపదీ స్వయంవర నిమిత్తమై పాంచాలదేశమునకు వెళ్లిరి. అచట వివిధ అలంకార భూషితయైన ద్రౌపదిని పాండవులు అయిదుగురును భార్యగా పొందిరి.

దుర్యోధనాదులచే గుర్తింపబడిన ఆ పాండవులు అర్ధరాజ్యమును పొందిరి. అర్జునుడు, అగ్నిదేవుని నుండి గాండీవమను దివ్యధనస్సును, ఉత్తమమైన రథమును, అక్షయమైన బాణములుగల అమ్ములపొదులను పొందెను. ద్రోణుని వలన బ్రహ్మాది అస్త్రములను పొందెను. కృష్ణుని యుద్ధ సమయమున సారథిగా పొందెను. వారందరును శస్త్రాస్త్రములందు సమర్థులైరి.

పాండు కుమారుడైన అర్జునుడు తన శరవర్షముచే, ఇంద్రుడు కురిపించిన వర్షమును అడ్డగించి, కృష్ణ సహాయముతో, ఖాండవ వనమునందు అగ్నిని సంతృప్తుని చేసెను. పాండవులు నలుదిక్కులను జయించిరి. యుధిష్ఠిరుడు రాజ్యము చేసెను. అధికమగు సువర్ణ దానముగల రాజసూయ యాగమును చేసెను. దుర్యోధనుడు దీనినంతను సహింపలేకపోయెను.

సోదరుడైన దుఃశాసనుడును, ఐశ్వర్యము లభించిన కర్ణుడును, శకునియు చెప్పగా యుధిష్ఠిరుని ద్యూత(జూద)మునకై ఆహ్వానించి, ఆ ద్యూతశాలలో యుధిష్ఠిరుని మోసము చేసి నవ్వుచు, అతని రాజ్యమును హరించెను.

ద్యూతమునందు ఓడిపోయిన యుధిష్ఠిరుడు సోదరులతోడను, ద్రౌపదితోడను, ధౌమ్యునితోడను అరణ్యమునకు వెళ్లి ప్రతిజ్ఞచేసిన విధముగ అచట పండ్రెండు సంవత్సరములు గడపెను. అచట పూర్వమునందువలె, ప్రతిదివసమునందును, ఎనుబది ఎనిమిది వేల మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టుచుండెను. పిమ్మట వారందరును విరాటుని చేరిరి. యుధిష్ఠిరుడు కంకుడనెడు బ్రాహ్మణుడుగను, భీముడు వలలుడను పేర వంటవాడుగను, అర్జునుడు బృహన్నలగను అయి ఇతరులకు తెలియకుండా ఉండునట్లు అచట నివసించిరి. నకుల, సహదేవులు వేరు పేర్లతో ఉండిరి. ద్రౌపదిని హరింప అభిలషించిన కీచకుని భీమసేనుడు రాత్రివేళ సంహరించెను. గోగ్రహణాదికమును చేయవచ్చిన కౌరవులను అర్జునుడు జయించెను. అప్పుడు ఆ కౌరవులు వారు పాండవులని గుర్తించిరి.

కృష్ణుని సోదరియైన సుభద్రకు అర్జునుని వలన అభిమన్యుడను కుమారుడు కలిగెను. విరాటుడు అతనికి తన కుమార్తెయైన ఉత్తరను ఇచ్చెను.

ధర్మరాజు యుద్ధమునకై ఏడు అక్షౌహిణుల సైన్యమును సన్నద్ధము చేసికొనెను. కృష్ణుడు అమర్ష పూర్ణుడును, పదకొండు అక్షౌహిణులకు అధిపతియు అగు దుర్యోధనుని వద్దకు దూతగా వెళ్లి “యుధిష్ఠిరునకు సగము రాజ్యము నిమ్ము. లేదా ఐదు గ్రామాలనైన ఇమ్ము. అట్లు కానిచో యుద్ధము చేయుము” అని చెప్పెను. ఆ మాటలు విని సుయోధనుడు శ్రీకృష్ణునితో సుయోధనుడు: “సూది మోపినంత నేలనైనను ఇవ్వను. యుద్ధము చేసెదను. యుద్ధమునకై సిద్ధముగా ఉన్నాను” అని పలికెను. అంత శ్రీకృష్ణుడు ఎదిరింప శక్యముకాని విశ్వరూపము చూపి, విదురునిచేత పూజింపబడినవాడై, యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్లి, “ఆ సుయోధనునితో యుద్ధము చేయుము” అని చెప్పెను. (13)