అగ్ని మహా పురాణము

Table of Contents

నాటక లక్షణ నిరూపణము

అగ్నిదేవుడు పలికెను:

నాటకము, ప్రకరణము, డిమము, ఈహామృగము, సమకారము, ప్రహసనము, వ్యాయోగము, భాణము, వీథి, అంకము, త్రోటకము, నాటికా, సట్టకము, శిల్పకము, కర్ణ, దుర్మల్లికా, ప్రస్థానము, భాళిక, భాణి, గోష్ఠి, హల్లీశకము, కావ్యము, శ్రీ గదితము, నాట్య రాసకము, ఉల్లాప్యము, ప్రేంఖణము యని రూపకములు ఇరువది ఏడు విధములు. లక్షణము సామాన్యము విశేషము అని రెండు విధములు. అన్ని రూపకములకు వర్తించునది సామాన్య లక్షణము. ఏదో ఒక దానికి వర్తించునది విశేషలక్షణము. అన్ని రూపకములందును పూర్వ రంగము జరిగిన పిమ్మట దేశ కాలములు రస భావ విభావ, అనుభావ, అభినయ, అంకస్థితులు సామాన్య లక్షణము. విశేష లక్షణము సమయానుసారముగా చెప్పబడును. ఇప్పుడు సామాన్య లక్షణము చెప్పబడుచున్నది. ధర్మార్థ కామములను నాటకము సాధింపవలెను. ముందుగా పూర్వరంగమును యథావిధిగా జరుపవలెను. దీనికి నాంది మొదలగు ఇరువది రెండు అంగములున్నవి. దేవతా నమస్కారము. గురుస్తుతి గో బ్రాహ్మణ రాజాద్యాశీర్వాదము చేయబడును. నాంది తరువాత ‘నాంద్యన్తే సూత్రధారః’ యని రూపకములలో వ్రాయబడును. కవియొక్క గురు పరంపర వంశ ప్రశంస, పౌరుషము కావ్యము యొక్క సంబంధ ప్రయోజనములు ఈ ఐదింటిని సూత్రధారుడు చెప్పవలెను. నటిగాని విదూషకుడు గాని పారి పార్మ్వకుడుగాని, సూత్రధారునితో కలిపి స్వకార్యముతో సంబంధించినవి ప్రస్తుత విషయమును చెప్పనివి అగు చిత్రమైన వాక్యములతో సంభాషణము చేసినచో దానికి ఆముఖమని పేరు. దీనికి ప్రస్తావనయని కూడ పేరు. ప్రవృత్తకము కథోద్ఘాతము ప్రయోగాతిశయము యని ఆముఖము మూడు విధములు. సూత్రధారుడు వచ్చిన కాలమును గూర్చి వర్ణించినపుడు ఆ వర్ణనను ఆశ్రయించి పాత్ర ప్రవేశించినచో దానికి ప్రవృత్తకమని పేరు. ఇది బీజాంశములందే ఆవిర్భవించును. సూత్రధారుని వాక్యము గాని వాక్యార్థములుగాని గ్రహించి పాత్ర ప్రవేశించినచో అది కథోద్ఘాతము. సూత్రధారుడు ఒక ప్రయోగమున మరియొకప్రయోగమును వర్ణించగా ఆ సమయమున పాత్ర ప్రవేశించినచో అది ప్రయోగాతిశయము నాటకాదులకు ఇతివృత్తము శరీరము. సిద్ధము ఉత్ర్పేక్షితము అని అది రెండు విధములు. ప్రసిద్ధమైని సిద్ధము; కవి కల్పించినది ఉత్ప్రేక్షితము. బీజము, బిందువు, పతాక, ప్రకరి, కార్యము అని ఐదుఅర్థ ప్రకృతులు, చేష్టలు కూడ ప్రారంభము ప్రయత్నము ప్రాప్తి సద్భావము నియతఫల ప్రాప్తి ఫలయోగము యని ఐదు అర్థ ప్రకృతులు. చేష్టలు కూడ ప్రారంభము ప్రయత్నము ప్రాప్తి సద్భావము నియత ఫల ప్రాప్తి ఫలయోగము అని ఐదు. ముఖము ప్రతి ముఖము గర్భము విమర్శము నిర్వహణము అని క్రమముగా ఐదు సంధులు. అల్పముగా వర్ణితమై బహుధా విస్తరించి ఫలమును కల్గించునది బీజము. నానార్థ రస సంభవమగు బీజోత్పత్తి కావ్యము నందు కలిగిన సంధికి ముఖము అని పేరు. ఇష్టమైన అర్థము యొక్క రచన, కథాంశము అఖండముగా నుండుట ప్రయోగమునందు అనురాగము గోపనీయ విషయముల గోపనము అద్భుత విషయముల వర్ణనము ప్రకాశింపదగిన విషయములను ప్రకాశింప చేయుట ఇవి కావ్యాంగముల ఆరుఫలములు. అంగహీనుడగు మనుష్యునివలె అంగహీనమగు కావ్యము కూడ శ్రేష్ఠము కాజాలదు, దేశ కాలములు లేకుండగ ఇతివృత్తమేదియు ప్రవర్తించదు. అందుచే వాటిని నియమ పూర్వకముగా స్వీకరించుటకు పదము అని పేరు. దేశములలో భారత వర్షమున, కాలమున, కృతాది యుగత్రయమును గ్రహించ వలెను. దేశకాలములు లేకుండ ప్రాణులకు ఎచ్చటను సుఖ దుఃఖోదయము కలుగదు. సృష్ట్యాది వార్త ప్రసంగ వశమున వర్ణింపవలసి వచ్చినను దోషము లేదు. (338)